శశికళపై తమిళ ప్రజలకు కోపం?
శశికళ మీద సగటు తమిళ ప్రజలు నిజంగానే కోపంతో ఉన్నారా? జయలలిత మరణం తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలు, ముఖ్యమంత్రి పదవి నుంచి పన్నీర్ సెల్వాన్ని దించేయడం, ఆ తర్వాత ఆయన మళ్లీ తిరుగుబాటు చేయడం లాంటి పరిస్థితుల తర్వాత చూస్తే జనాగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎవరికీ అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ కామెంట్లు చేయని వర్గాల నుంచి కూడా శశికళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టింగులు, ట్వీట్లు రావడం చూశాం. ఇప్పుడు అన్నాడీఎంకేలో వ్యవస్థాపక సభ్యులు, నాయకులుగా ఉన్నవాళ్ల దగ్గర నుంచి సామాన్యుల వరకు చాలామంది అదే చెబుతున్నారు.
జయలలిత అనారోగ్యం పాలు కావడానికి ప్రధాన కారణం కూడా శశికళేనని, పైగా దాదాపు 75 రోజుల పాటు అమ్మ ఆస్పత్రిలో ఉన్నా.. ఏ ఒక్కరికీ ఆమెను చూసే అవకాశం కల్పించకుండా రహస్యంగా ఉంచింది కూడా శశికళేనని అంటున్నారు. జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్రంలో మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ఆస్పత్రికి అయితే వెళ్లారు గానీ, కేవలం అక్కడి వైద్యులతో మాట్లాడి వచ్చేయాల్సి వచ్చింది తప్ప అమ్మను మాత్రం చూడలేకపోయారు. దీనికి కారణం శశికళ విధించిన ఆంక్షలేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అమ్మకు ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులకు అనుమానం ఉంటే.. శశికళను మాత్రం అప్పట్లో ఆమె మంచం పక్కనే ఎందుకు ఉండనిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఫిజియోథెరపీ చేయడానికి నర్సులు లేదా వైద్యులు జయలలితను ముట్టుకుంటే ఎక్కడ వాళ్ల నుంచి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందోనని రోబోలను కూడా నియమించినప్పుడు, శశికళను మాత్రం అసలు ఎలా అనుమతించారని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా శశికళ... మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి మీద మూడుసార్లు చేత్తో కొట్టి ఏదో శపథం చేస్తున్నట్లుగా చేశారని, అమ్మ సమాధి వద్ద కావాలంటే నమస్కారం చేసుకోవచ్చు గానీ అలా కొట్టడం ఏంటని అడుగుతున్నారు.
తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి..