పెను సవాల్‌: 'బ్లూ వేల్‌'ను ఆపడం సాధ్యమేనా? | Why Blue Whale game can't be banned | Sakshi
Sakshi News home page

పెను సవాల్‌: 'బ్లూ వేల్‌'ను ఆపడం సాధ్యమేనా?

Published Thu, Aug 3 2017 11:04 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

పెను సవాల్‌: 'బ్లూ వేల్‌'ను ఆపడం సాధ్యమేనా? - Sakshi

పెను సవాల్‌: 'బ్లూ వేల్‌'ను ఆపడం సాధ్యమేనా?

ప్రాణాంతక ఆన్‌లైన్‌ గేమ్‌ 'బ్లూ వేల్‌ చాలెంజ్‌'ను నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ గేమ్‌లో భాగంగా ముంబైకి చెందిన టీనేజర్‌ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ మంగళవారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. గేమ్‌ సర్వర్లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని ఆయన తెలిపారు.

అయితే, సైబర్‌ భద్రతా నిపుణులు మాత్రం ఈ గేమ్‌ను నిషేధించడం లేదా బ్లాక్‌ చేయడం ప్రభుత్వానికి సైతం పెద్ద సవాలేనని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అత్యంత సంక్లిష్టమైన, మిస్టరీతో కూడిన ఈ గేమ్‌ ఒక యాప్‌ కాదు. ఈ గేమ్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌లోగానీ, ఇతర యాప్‌ స్టోర్లలోగానీ సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం కుదరదు. ఇదొక కమ్యూనిటీ. అంతర్జాతీయంగా సోషల్‌ మీడియా వెబ్‌సైట్లను వేదికగా చేసుకొని టీనేజర్లు ఆత్మహత్య చేసుకొనేలా పురికొల్పుతుంది. ఈ చాలెంజ్‌ను నియంత్రించేవారు వివిధ చాట్‌రూమ్స్‌ వేదికగా ఒకరినొకరు సంప్రదించుకుంటారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యేకమైన అభిరుచులు గల టీనేజర్లను గుర్తించి.. వారు ఈ గేమ్‌ ఆడేలా ఎర వేస్తారు.

'పలు సోషల్‌ మీడియా యాప్స్‌ వేదికగా చేసుకొని ఈ కమ్యూనిటీ సంప్రదింపులు  జరుపుతున్నట్టు రష్యా టీనేజర్‌ ఆత్మహత్య కేసులో తేలింది. ఈ చాలెంజ్‌ను నిషేధించి.. దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోవాలంటే.. యువత అధికంగా ఫాలో అయ్యే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నియంత్రించాల్సి ఉంటుంది. ఐఎస్‌పీల ఆధారంగా సెర్చ్‌లన్నింటినీపై కన్ను వేయాలి.  ఈ చాలెంజ్‌కు దారితీసే వెబ్‌సైట్లు, లింకులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే బ్లాక్ చేయాలి. ప్రభుత్వం ఇవన్నీ చేయగలదు. అదేసమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది' అని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు.

నిజానికి ఇది ఆన్‌లైన్‌ గేమ్‌ కూడా కాదు. కానీ ఈ చాలెంజ్‌ నిర్వాహకుడు లేదా కంట్రోలర్‌ సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైన టీనేజర్‌కు పలు టాస్క్‌లు (సాహస కార్యాలు) అప్పజెప్తాడు. దీని గురించి మరో నిపుణుడు స్పందిస్తూ.. 'గత ఆరు నెలలుగా బ్లూవేల్‌ చాలెంజ్‌ గురించి నేను చదువుతున్నాను. రష్యాలో పలువురు టీనేజర్లు దీనిబారిన పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గేమ్‌కు ఇతర పేర్లు కూడా ఉన్నాయని తెలుసుకున్నాను. డార్క్‌ రూమ్‌, వేక్‌ మి అప్‌ ఎట్‌ 4.20 ఏఎం వంటి పేర్లు చెలామణిలో ఉన్నాయి. ఈ చాలెంజ్‌ను ఒకరు స్వీకరిస్తే.. సొంతంగా హింసించుకుంటూ చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింకులు, కమ్యూనిటీ పేజీలన్నింటినీ గుర్తించి టీనేజర్లకు ఇవి చేరకుండా బ్లాక్‌ చేయాలి. ఇది కష్టమైన పని. ఎందుకంటే ఏ సోషల్‌ మీడియా పేజీ దీనిని నిర్వహిస్తుందో మనకు తెలియదు' అని చెప్పారు. 'ఈ చాలెంజ్‌ను పూర్తిగా నిషేధించడం అసాధ్యం. కానీ దీని మూలాలను గుర్తించడం ద్వారా నియంత్రించవచ్చు. దీనికి సంబంధించిన గేట్‌వే లేదా ఐఎస్‌పీలను గుర్తిస్తే బ్లాక్‌ చేయడం సాధ్యమే. ఈ చాలెంజ్‌ రష్యాలో మొదలైనట్టు తెలుస్తోంది. దీని మూలాలను గుర్తించి మరింత విస్తరించకుండా దేశాల మధ్య సమాచారాన్ని అందించుకోవడం ద్వారా దీనిని అరికట్టవచ్చు. ఇది కష్టసాధ్యమైనా ప్రభుత్వాలకు అసాధ్యమైతే కాదు' అని మరో నిపుణుడు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement