ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే
భారీ మెజారిటీతో ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ (44) పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం గోరఖ్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గతంలో పలు సందర్భాల్లో ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 324 స్థానాలు బీజేపీ, దాని మిత్రపక్షాలైన చిన్న పార్టీలకు దక్కాయి. నాలుగింట మూడొంతులకు మించిన మెజారిటీ సాధించిన బీజేపీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడానికి మాత్రం కాస్త ఆలస్యమైంది. గత శనివారమే ఎన్నికల ఫలితాలు వెలువడగా వారం రోజుల తర్వాత మళ్లీ శనివారం రోజున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేశారు. ప్రస్తుత ఉత్తరాఖండ్‌లో జన్మించిన యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్. ఈయన ఇప్పటికి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు.
జనాభా పరంగా అతిపెద్దదైన యూపీ ముఖ్యమంత్రి బాధ్యతలను ఎవరికి అప్పగించాలో నిర్ణయించడానికి ముందు పార్టీ అధిష్ఠానం పెద్ద కసరత్తునే చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ నాయకుడు భూపేంద్ర యాదవ్ పరిశీలకులుగా లక్నో వెళ్లారు. ముందుగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోజ్ సిన్హాలతో పాటు.. యోగి ఆదిత్యనాథ్ పేరు వినిపించింది. చివరకు ఆయన పేరే ఖరారు చేశారు. ఎమ్మెల్యేల సమావేశానికి కొద్ది ముందుగానే అగ్రనేతలు విడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత సమావేశమైన శాసనసభాపక్షం చాలా కొద్ది సమయంలోనే యోగి ఆదిత్యనాథ్‌ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దాంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయనకు వచ్చింది.
పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును కూడా చివరి నిమిషంలో నిర్ణయించారు. శనివారం ప్రమాణస్వీకరం అనగా శుక్రవారం సాయంత్రానికి పేరు ఖరారైంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోనూ ఆదివారం ప్రమాణస్వీకారం ఉండటంతో శనివారం నాడు ముఖ్యమంత్రిని ఖరారు చేయడం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మంచి మెజారిటీ సాధించింది. అసలు తమకు సొంతంగా మెజారిటీయే లేని గోవా, మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులను చకచకా ఎంపికచేసి, వాళ్లతో ప్రమాణ స్వీకారాలు కూడా చేయించేసిన కమలనాథులు.. ఈ రెండు రాష్ట్రాల విషయంలో మాత్రం కాస్తంత ఎక్కువగానే శ్రమించాల్సి వచ్చింది.