సీబీఐకి ‘అగస్టా’ పరీక్ష!
దాదాపు మూడున్నరేళ్లుగా దర్యాప్తు పేరుతో సాగుతూనే ఉన్న అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఎస్‌పీ త్యాగి అరెస్టుతో కొత్త మలుపు తిరిగింది. కుంభకోణాలకు యూపీఏ ప్రభుత్వం కొత్త కాకపోయినా తొలిసారి ఇది బయటపడినప్పుడు మాత్రం అందరూ విస్మయం వ్యక్తం చేశారు. సచ్చీలుడిగా ముద్రపడిన ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్న కాలంలో ఇది జరగడమే అందుకు కారణం. వాస్తవానికి అగస్టా ఒప్పందం ఆద్యంతమూ అనుమానాలు రేకెత్తించేదిగానే ఉంది.
ఎయిర్‌బస్ విమానాలకు గగనతలంలోనే ఇంధనం నింపేందుకు అనువైన విమానాలు అవసరమని చెప్పిన వైమానిక దళం హఠాత్తుగా ఆ ఆలోచన విరమిం చుకుని 19,685 అడుగుల ఎత్తులో ఎగరగల వీవీఐపీ హెలికాప్టర్ల కోసం 1999లో ప్రతిపాదనలు పెట్టింది. తీరా టెండర్ రూపొందిన 2005 నాటికి ఆ ఎత్తు కాస్తా 15,000కు తగ్గింది. దీన్ని మార్చిందెవరో, ఏం ఆశించి ఆ మార్పు చేశారో అనూహ్యం. కానీ మిగిలిన పోటీదారులందరినీ అవతలికి నెట్టి అగస్టా వెస్ట్‌లాండ్‌కు ఆ మార్పు ఉపయోగపడింది. దళారులు దీన్నంతా చాలా తెలివిగా చేశారు. తొలుత రూ. 4,860 కోట్లకు హెలికాప్టర్లు అందజేస్తామంటూ అగస్టా సంస్థ నుంచి ప్రతిపాదనలొచ్చాయి. తర్వాత దాన్ని రూ. 3,966 కోట్లకు అమ్ముతానని ప్రతిపాదించి చివరకు ఒప్పందం సమయానికి దాన్ని కాస్తా రూ. 3,660 కోట్లకు తగ్గించేందుకు ఆ సంస్థ అంగీ కరించింది.
ఆ విధంగా రూ. 1,200 కోట్లకు పైగా డబ్బు ఆదా చేసినట్టు కనబడిన ఈ వ్యవహారంలో తెరవెనుక చాలా తతంగమే నడిచింది. హెలికాప్టర్ల సామర్ధ్యానికి సంబంధించిన ఎంపిక ప్రమాణాలన్నీ తారుమారయ్యాయి. ఆ పెట్టిన ప్రమాణాలకు తగ్గట్టుగానైనా ఉందో లేదో తేల్చడానికి అసలు అగస్టా హెలికాప్టర్ ఇంకా రూపొందనే లేదు. తామే ఉత్పత్తి చేసిన మరో హెలికాప్టర్‌ను చూపించి, కొత్తగా తయారు చేయబోయేది మరింత మెరుగ్గా ఉంటుందని చెప్పి ఆ సంస్థ చేతులు దులుపుకుంది. ఒక నిర్ణయం టెండర్‌గా మారి చివరకు ఎంపిక దశకు వచ్చినప్పుడు పోటీదారులుగా ఉన్నవారం దరికీ సమాన అవకాశం ఇవ్వడం ధర్మం. కానీ దేశ రక్షణకు సంబంధించిన కీలక అంశమని కూడా చూడకుండా ఒక సంస్థకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిం చాల్సివచ్చిందో తెలియదు. ఆంటోనీకి ఇవన్నీ తెలియవనుకోవాలో, ఆయన తెలుసు కోదల్చుకోలేదో ఎవరికీ అర్ధంకాని విషయం.
ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకే ఒప్పందంలో మార్పులు జరిగాయని అరెస్టయిన త్యాగి చెబుతున్నారు. త్రివిధ దళాల్లో ఒక విభాగానికి అధిపతిగా పని చేయడం మాత్రమే కాదు... పాకిస్తాన్‌తో జరిగిన రెండు యుద్ధాల్లో స్వయంగా పాల్గొన్న చరిత్ర త్యాగిది. ఆ స్థాయి వ్యక్తి కటకటాల వెనక్కు వెళ్లడం విచారకర మనుకుంటే... ఆ ఒప్పందంలో తాను నిమిత్తమాత్రుణ్ణనడం మరింత విస్మయకరం. వైమానిక దళ చీఫ్ స్థానంలో ఉన్నవారు తమ విభాగానికి కావలసిందేమిటో నిర్ణ యించే స్థితిలో లేకపోవడం కన్నా దౌర్భాగ్యం ఉంటుందా? త్యాగి మాత్రమే కాదు, ఏకే ఆంటోనీ కూడా ఈ నిర్ణయానికి బాధ్యత తీసుకోలేకపోయారు. గగనతలంలో ఇంధనం నింపడానికి విమానాలు కావాలన్న నిర్ణయం చివరకు వీవీఐపీ హెలికాప్టర్లు కొనాలన్న నిర్ణయంగా ఎలా మారిందని 2010లో ఆంటోనీని అడిగి నప్పుడు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అందుకు కారణమని చెప్పారు. ఇలా ఎవరికి వారు చేతులు దులుపుకుంటే మరి బాధ్యులెవరు? చూడటానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ మొదలుకొని పీఎంఓ, ఆనాటి జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి, ప్రస్తుత కాగ్ అధిపతి శశికాంత్ శర్మ వరకూ పలువురి ప్రమేయం ఇందులో ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఎవరూ బాధ్యత వహించరు! ఎంత చిత్రం!!
నిజానికి ఈ కుంభకోణాన్ని 2012లో ఇటలీ మీడియా వెల్లడించినప్పుడు యూపీఏ ప్రభుత్వం పట్టనట్టు ఉండిపోయింది. అక్కడి ప్రభుత్వం వెనువెంటనే రంగంలోకి దిగి దర్యాప్తునకు ఆదేశించడమే కాదు... ఏడాది తిరక్కుండా అగస్టా వెస్ట్‌లాండ్ మాతృ సంస్థ ఫిన్ మెకానికా చైర్మన్ గిసెప్పీ ఓర్సీని, ఆ సంస్థ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీని అరెస్టు చేసింది. అప్పుడిక తప్పనిసరై యూపీఏ సర్కారు కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఒప్పందాన్ని తాత్కాలికంగా స్తంభింప జేస్తున్నా మని చెప్పింది. ఎవరూ అడగకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ద్వారా చిత్తశుద్ధిని చాటుకున్నామని గప్పాలు కొట్టుకోవడమే తప్ప అది చురుగ్గా ముందు కెళ్లేలా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఆ సంస్థ నుంచి పరిహారం రాబడుతున్నామని చెప్పేనాటికైనా దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలన్న ధ్యాస యూపీఏ సర్కారుకు లేకపోయింది. ఈ వ్యవహారంలో సోనియాగాంధీ సలహాదారు అహ్మద్ పటేల్, మన్మోహన్‌సింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరుల్ని ప్రశ్నించాలని ఇటలీకి చెందిన రక్షణ కొనుగోళ్ల దళారీ క్రిస్టియన్ మైఖేల్ ఒక దశలో చెప్పాడు. దానికితోడు ‘ఎ.పి.’కి,‘ఎ.ఎఫ్’ కు ఫలానా మొత్తంలో డబ్బు చెల్లించామని చెప్పే పత్రాలు బయటికొచ్చాయి. ఇవన్నీ గమనిస్తే ఇందులో ఎన్నో అనుమానాలు రేగుతాయి.
తమ హయాంలో దర్యాప్తు ఎందుకు మందకొడిగా సాగిందో, తమ సచ్చీల తను నిరూపించుకోవడానికి ఎందుకు సిద్ధపడలేదో యూపీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పెద్దలు చెప్పాలి. గతంలో నావికాదళ చీఫ్‌గా పనిచేసిన అడ్మిరల్ ఎస్‌ఎం నందాపై సైతం రిటైరయ్యాక రక్షణ కొనుగోళ్లలో దళారీగా వ్యవహరించి నట్టు ఆరో పణలు వచ్చాయి. కానీ సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో దర్యాప్తు దశలోనే ఆ కేసు మూతబడింది. అది మాత్రమే కాదు... రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన ఏ కేసులోనూ ఇంతవరకూ సీబీఐ దోçష నిర్ధారణ చేయలేకపోయింది. ఇప్పుడు అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం కూడా ఆ దారిలోనే పోతుందా... లేక నిజా నిజాలు నిగ్గుదేలుతాయా అన్నది చూడాల్సి ఉంది. కనీసం రక్షణ కొనుగోళ్లయినా కుంభకోణా లకు అతీతంగా ఉండాలనుకుంటే ఈ కేసు దర్యాప్తు పకడ్బందీగా, చురుగ్గా సాగాలి. నిజమైన దోషులు పట్టుబడాలి. సీబీఐ ఆ పని చేస్తుందా?