NRI News
-
జపాన్‌లో ‘తాజ్’ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు
పుణ్య కార్తీకమాసం సందర్భంగా వనభోజనాల కార్యక్రమాన్ని జపాన్‌లోని తెలుగు అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. జపాన్‌లో నవంబర్ 24, ఆదివారం, తాజ్ (Telugu Association of Japan) అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ వేడుక ఆద్యంతం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం పిల్లలు, పెద్దలు విందు భోజనాన్ని ఆరగించారు. -
దుబాయ్‌లో ఘనంగా కార్తీక వనభోజన మహూత్సవం
క్రోధి నామ సంవత్సర బ్రాహ్మణ కార్తిక వనసమారాధనన కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరమ్ న చ వేద సమం శాస్త్రం, న తీర్థం గంగాయాన్సమమ్మాసాలన్నిటిలో మహిమాన్వితమైనది కార్తీకమాసం. హరిహరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది ఈ మాసం. ఇటువంటి పవిత్ర కార్తీక మాసంలో, శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి, రావి, తులసి, జమ్మి వంటి దేవతా వృక్షాల చెంత వనభోజనాలు, ఉసిరి కాయలతో దీపారాధన వంటివి భారతావనిలో సర్వసాధారణం. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అన్ని ఎమిరేట్స్ నుంచి వందలమంది ఉభయ రాష్ట్రాల తెలుగు బ్రాహ్మణులు అందరూ కలసి దుబాయిలోని అల్ మంజార్ బీచ్ పార్క్‌లో కార్తీక వనసమారాధనను నవంబర్ 17, ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.గాయత్రి మహిళల భక్తి గీతాలు, దీపాధనలతో ప్రారంభం అయిన కార్యక్రమాలు పిల్లలు పెద్దల ఆత్మీయ పలకరింపులు, పాటలు, కేరింతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. సంప్రదాయ తెలుగు రుచుల కార్తిక వనభోజనాల సందర్భంగా జరిగిన ధార్మిక ప్రశ్నావళి, ఆటలు, తంబోల, కామేశ్వరరావు హాస్యభరిత సందేశ కార్య్రాక్రమం, ఆదిభట్ల కామేశ్వరశర్మ ఉపదేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలకు ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలను బాహూకరించారు. యుఎఈలో సనాతనం, సంఘటితం, సత్సంగం, సహకారం, సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా ఏర్పడిన గాయత్రీ కుటుంబం (తెలుగు బ్రాహ్మణ సంఘం) ఆధ్వర్యంలో వనసమారాధన ఆధ్యంతం కన్నులపండువగా జరిగింది. కుటుంబ సభ్యులు కల్లేపల్లి కుమార్ చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల సభ్యులు అందరూ ప్రగాఢ సహానుభూతి ప్రకటించి నివాళులు అర్పించారు. -
కారు డిక్కీలో శవమై తేలిన యువతి : పరారీలో భర్త!
భారత సంతతికి చెందిన మహిళ లండన్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. లండన్‌లోని కారు ట్రంక్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం హత్యగా అనుమానిస్తున్న నార్తాంప్టన్‌షైర్ పోలీసులు హర్షిత భర్త పంకజ్ లాంబా కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అతగాడు దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు.హర్షిత బ్రెల్లా (24) మృతదేహాన్ని తూర్పు లండన్‌లోని ఇల్ఫోర్డ్లోని బ్రిస్బేన్ రోడ్లో గురువారం తెల్లవారు జామున వాలెంటైన్స్ పార్క్ ప్రవేశానికి సమీపంలో, ఒక కారు డిక్కీలో గుర్తించారు. ఆమెను భర్తే హత్య చేశాడని అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం హర్షిత గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇరుగుపొరుగువారు అందించిన సమాచారం ప్రకారం గత రెండు రోజులుగా హర్షిత ఆందోళనగా కనిపించింది. చనిపోవడానికి ముందు ఇద్దరి మద్యా వాగ్వాదం జరిగిందని, అయితే భార్యాభర్తల వ్యవహారం కాబట్టి తాను పట్టించుకోలేదని ఒక మహిళ వెల్లడించింది. వరుసగా ఇలాంటి ఘర్షణలను తాను గమనించినా కల్పించుకోలేదని, ఇపుడు ఆ బిడ్డ ప్రాణాలే కోల్పోవడం తనకు చాలా బాధగా ఉందని, అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను అంటూ హర్షితకు పొరుగున ఉండే కెల్లీ ఫిలిప్ ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు శుక్రవారం నాడు జరిగిన ఫోరెన్సిక్ పోస్టుమార్టం అనంతరం హత్యకు గురైనట్టు నార్త్మ్ప్టన్షైర్ పోలీస్ చీఫ్ ఇన్స్పెక్టర్ పాల్ క్యాష్ ఆదివారం ధృవీకరించారు. హర్షిత మృతదేహాన్ని నార్తాంప్టన్‌షైర్ నుండి ఇల్‌ఫోర్డ్‌కు కారులో తరలించినట్లు అనుమానిస్తున్నామన్నారు. నిందితుడు దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నాం. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షునిగా గడప రమేష్ బాబు ఎన్నిక
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి గడపా రమేష్ బాబు ఎంపికయ్యారు. నవంబర్ 17వ తేదీన జరిగిన పదకొండో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సభ ప్రారంభంలో సభ్యులందరు గోనె నరేందర్ రెడ్డి సొసైటీకి చేసిన సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం 2023-2024 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చు వివరాలకు సభ ఆమోదం తెలిపింది.2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లు గార్లపాటి లక్ష్మా రెడ్డి, బండారు శ్రీధర్‌కు సభ్యులు కృతజ్ణతలు తెలిపారు. అలాగే రెండోసారి అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన గడప రమేశ్ బాబు, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి దోర్నాల చంద్ర శేఖర్ ప్రకటించారు. తనకు రెండోసారి సేవచేసే అవకాశం ఇచ్చినందుకు గడప రమేష్ అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కార్య, కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీనితో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా కిరణ్ కైలాసపు , తెల్లదేవరపల్లి వెంకట కిషన్ రావును కొత్త ఆడిటర్లుగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో ముఖ్యమైన మార్పులు గత 8 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన బసిక ప్రశాంత్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా, ప్రాంతీయ కార్యదర్శులుగా సేవలు అందించిన బొందుగుల రాము, నంగునూరు వెంకట రమణ ఈ సారి ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారిగా, కోశాధికారిగా సేవలు అందించిన జూలూరి సంతోష్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా సేవలు అందించబోతున్నారు. దీంతో నూతన కార్యవర్గం మరియు కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, దుర్గ ప్రసాద్ ఎం, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు, శశిధర్ రెడ్డి, బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, సంతోష్ వర్మ మాదారపు మరియు రవి కృష్ణ విజ్జాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, శివ ప్రసాద్ ఆవుల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రవి చైతణ్య మైసా, చల్లా క్రిష్ణ మరియు సుగుణాకర్ రెడ్డి మొదలగు వారు ఉన్నట్టు తెలిపారు. సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యవర్గ సభ్యులు గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, గింజల సురేందర్ రెడ్డి, ఆరూరి కవిత సంతోష్ రెడ్డి, నగమడ్ల దీప, కిరణ్ కుమార్ వీరమల్లు & రంగా పట్నాల గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘మా అల్లుడు వెరీగుడ్’: సుధా మూర్తి
తన అల్లుడు ఎంతో మంచివాడని, ఆయన్ని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉందని అంటున్నారు ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి. లండన్ విద్యాభవన్‌లో జరిగిన దీవాళి గళా కార్యక్రమంలో ఆమె భారతీయ విలువలు, సంస్కృతి మీద మాట్లాడుతూ..మనిషికి మంచి చదువే కాదు.. సంప్రదాయ మూలాలు కూడా ముఖ్యమేనని అంటున్నారు సుధా మూర్తి. శనివారం లండన్‌లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్లో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూతురు అక్షతా మూర్తి, ఆమె భర్త..బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌లు హాజరయ్యారు.మంచి విద్య మీకు పైకి ఎగరడానికి(ఎదగడానికి) రెక్కలను ఇస్తుంది, కానీ గొప్ప సంస్కృతి మిమ్మల్ని మీ మూలాల్లో నిలబెట్టేలా చేస్తుంది. ఉషా సునాక్(రిషి తల్లి) ఆయన్ని(రిషి) అద్భుతంగా పెంచారు. ఆ పెంపక పునాదుల్లో.. బలమైన భారతీయ సంస్కృతి ఉంది. సునాక్ బ్రిటిష్ జాతి గర్వించదగ్గ వ్యక్తి. అదే సమయంలో.. ఆయన భారతీయ వారసత్వంలో విలువలు కూడా కనిపిస్తాయి అంటూ అల్లుడిని ఆకాశానికెత్తారామె.ఈ సందర్భంగా.. భారతీయ కళను, సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు భారతీయ విద్యాభవన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. భారతీయ సంప్రదాయాల్ని నేర్చుకునేందుకు మీ పిల్లలను ఇక్కడికి(విద్యాభవన్)కు పంపండి. మనం ఒక వయసుకి వచ్చాక.. మన మూలాలను తాకాల్సి ఉంటుంది అంటూ ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్లు సైతం హాజరయ్యారు. విద్యాభవన్ నిర్వాహకులకు రిషి, అక్షతలు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్,అంతకు ముందు.. భవన్ యూకే చైర్మన్ సుభాను సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎన్ నందకుమారలు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే.. భారత కళలను ఎలా ప్రదర్శిస్తున్న తీరును, ఆ సెంటర్ సాధించిన విజయాల్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. రామాయణం, కలిపూజ వంటి అంశాలను ప్రస్తావించారు. పలువురు కళాకారులు భారతీయ నృత్య కళలు ప్రదర్శించారు. -
ట్రంప్ 2.0 అమెరికాలో భారతీయ విద్యార్థుల భవిష్యత్ ఏంటి?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ రెండోసారి ఎంపికయ్యాడు. గతంలో ట్రంప్ విదేశీ వలసలు, గ్రీన్ కార్డులు, వీసాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అమెరికా డాలర్‌డ్రీమ్స్ కంటున్న విద్యార్థుల భవిష్యత్ ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలను చూద్దాం.ట్రంప్ 2.0లో ప్రభావితమయ్యే మరో అంశం స్టూడెంట్స్ వీసాలు, ఉద్యోగాలు. ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేకించి H1B వీసాలు కఠినతరం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారనున్నాయి. వర్క్ వీసాలు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్ చదివి.. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే.. అయితే ఎడ్యుకేషన్ వీసాల పట్ల ట్రంప్ సానుకూలంగానే ఉండే అవకాశం ఉంది.లే ఆఫ్.. ఆర్థిక మాంద్యం.. ఆంక్షలు, నిరుద్యోగం వంటి సమస్యలు అమెరికాలో భారతీయ విద్యార్థులను వెంటాడే సమస్యలు. అమెరికాలో నైపుణ్యం గల యువతలో భారతీయులే అధికం. దీంతో పాటు ఫ్రెషర్స్‌కు భారత్ పోల్చితే అమెరికాలో వేతనాలెక్కువ. డాలర్ ప్రభావం కూడా అధికం. అమెరికాలో 4500కు పైగా యూనివర్సిటీలు, 8 వేలకు పైగా కాలేజీలున్నాయి. విదేశీయులు జాయిన్ అయితేనే అమెరికాలో వర్సిటీలు, కాలేజీల్లో సీట్లు నిండుతాయి. దీంతో స్టూడెంట్ వీసాలకు ఢోకా ఉండదనే చెప్పాలి. ఇక అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? మరి ఇది అమలవుతుందా? లేదా? కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నది భవిష్యత్తులో తేలనుంది. ఉద్యోగ అవకాలు పెరుగుతాయా.. ?ట్రంప్ విధానాల కారణంగా అమెరికా సిటిజన్స్, గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే అధిక నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అమెరికాలో వర్క్ ఫోర్స్‌కు డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో హెచ్1 వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది.అయితే గతంతో పోల్చితే భారతీయ వృత్తి నిపుణుల విషయంలో ఆయన కొంత సానుకూల వైఖరి కనబరుస్తున్నారు. దీంతో H1B,OPT వారికి కూడా జాబ్స్ పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. లీగల్ గా వర్క్ చేసే వారికి ట్రంప్ పాలనలో మంచి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ఇల్లీగల్ గా అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి గడ్డు పరిస్థితులే ఎదురుకోవాల్సి ఉంటుంది. అక్రమ వలసదారులు పట్ల ట్రంప్ వైఖరిఇక అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి.ట్రంప్ విధానాలు వలసవచ్చిన వారికి గతంలో చాలా సమస్యలు సృష్టించాయి. భారత ఉద్యోగులు, టెక్నాలజీ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ట్రంప్ వలసల విషయంపై చాలాసార్లు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఇది ముఖ్యమైన అంశం. అక్రమ వలసదారులు అమెరికా ప్రజల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారని, వారిని వెనక్కు పంపుతానని ట్రంప్ వాగ్దానం చేశారు. ఒకవేళ ఇదే విధానం కొనసాగితే, అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. భారత టెక్ కంపెనీలు సైతం అమెరికా కాకుండా మిగిలిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి. ఇదీ చదవండి : ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక ఎదురు దెబ్బనా?ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి..అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి.- సింహబలుడు హనుమంతు -
కాష్ పటేల్‌ను వదులుకోని ట్రంప్
సీఐఏ.. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నిఘా సంస్థ. అలాంటి ఏజెన్సీకి డైరెక్టర్ రేసులో.. ఓ భారతీయ మూలాలున్న వ్యక్తిని నియమించవచ్చనే ప్రచారం హాట్ టాపిక్ అయ్యింది. అయితే తృటిలో ఆ అవకాశం చేజార్చుకున్నారు కశ్యప్ పటేల్ అలియాస్ కాష్. అలాగని ట్రంప్ ఆయన్ని వదులుకోలేదు. ఇప్పుడు మరో కీలకమైన విభాగానికి కాష్ పటేల్‌ను డైరెక్టర్‌గా నియమించబోతున్నారు.జనవరి 20వ తేదీ తర్వాత ప్రస్తుతం ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టోఫర్ వ్రేను.. ట్రంప్ తప్పిస్తారని, ఆ స్థానంలో 44 ఏళ్ల వయసున్న కాష్ పటేల్‌ను కూర్చోబెడతారని వైట్‌హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బానోన్ ప్రకటించారు. అయితే వ్రేను 2017లో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించింది ట్రంపే. పదేళ్ల కాలపరిమితితో ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే.. తర్వాతి కాలంలో ట్రంపే ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో వ్రే జోక్యం ఎక్కువైందని మండిపడుతూ వచ్చారు. అంతేకాదు.. ఈ ఏడాది జులైలో వ్రేను రాజీనామా చేయాల్సిందేనని ట్రంప్ గట్టిగా డిమాండ్ చేశారు కూడా. అయితే వ్రే మాత్రం తాను ఎఫ్‌బీఐలో పూర్తి కాలం కొనసాగుతానని చెబుతూ వచ్చారు.ఎవరీ కాష్ పటేల్ ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్ పటేల్‌కు పేరుంది. ఈయన కుటుంబమూలాలు గుజరాత్లో ఉన్నాయి. ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అతడి తండ్రి, ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. కాష్ పటేల్ పూర్తి పేరు.. కశ్యప్ ప్రమోష్ వినోద్ పటేల్. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్లో చేరారు. కాష్ పటేల్‌ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్‌కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో అతడి పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు కూడా. ట్రంప్ రహస్య పత్రాల వ్యవహారం విచారణ సమయంలోనూ ఈయన పేరు ప్రముఖంగానే వినిపించింది. అయితే..ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక.. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి కొత్త చీఫ్ ఎవరవుతారనే చర్చ నడిచింది. ఆ సమయంలో రేసులో కాష్ పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అమెరికా మాజీ గూఢచారి జాన్ రాట్క్లిఫ్ ఆ అవకాశం దక్కించుకున్నారు. వ్యక్తిగత జీవితంకాష్ పటేల్ ప్రస్తుతం కొలంబియాలో నివసిస్తున్నారు. ఐస్ హాకీ అంటే ఆయన మక్కువ ఎక్కువ. ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. -
ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి కలిగి ఉన్న అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇమ్మిగ్రేషన్, H1B, F1 వీసాలపై ట్రంప్ 2.O ప్రభావం ఎలా ఉంటుంది? అమెరికాలో విదేశీయుల విద్యకు ట్రంప్ విజయం అనుకూలమా? వ్యతిరేకమా? మరి అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? అమలు చేస్తాడా? లేదా ? అందరి మదిలో ఇదే ప్రశ్న.. మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెడుతున్న ట్రంప్ అమెరికా విదేశాంగ విధానం రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంది. స్పష్టమైన వివరాలు చెప్పకపోయినప్పటికీ, విదేశాంగ విధానంపై ఎన్నికల సమయంలో ట్రంప్ అనేక హామీలు ఇచ్చారు.ఇమ్మిగ్రేషన్ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇమ్మిగ్రేషన్. భారత్ నుంచి అమెరికాకు స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల కోసం వేలమంది H1B వీసాలపై వెళుతుంటారు. దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దేశ జనాభాలో 60% వరకు ఉన్న స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై నెలకొన్న అసహనం.. ట్రంప్ విజయానికి ఒక కారణం.గ్రీన్ కార్డు నిబంధనలు : మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ కార్డు నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనుంది.అమెరికా పౌరసత్వం ఎవరికి వస్తుంది..? ఇప్పటివరకు అమెరికా నిబంధనల ప్రకారం.. వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లైతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. ఇది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారత అమెరికన్లు ఉన్నారు. వారిలో 34 శాతం మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది.అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి. కాగా ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి.. అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి. -
ఫిలిప్పీన్స్‌లో తెలుగు యువతి అనుమానాస్పద మృతి
డాక్టర్ అన్న కోరికతో విదేశాలకు వెళ్లిన 20 ఏళ్ల యువతి అనూహ్య మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణకు కెందిన స్నిగ్ధ వైద్య విద్య అభ్యసించ డానికి ఫిలిప్పీన్స్ వెళ్లింది. పుట్టినరోజు నాడే అనుమానాస్పదంగా మృతి చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయింది.పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో పంచాయతీ పరిధిలో నివాస ముంటున్నారు చింత అమృత్ రావు. మెదక్‌లోని ట్రాన్స్‌కో డీఈ అమృతరావు కుమార్తె స్నిగ్ధ రెండేళ్ల క్రితం ఎంబీబీఎస్ చేసేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లింది. పర్ఫెచువల్ హెల్ప్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఏం జరిగిందో తెలియదు కానీ పుట్టిన రోజు విషెస్ చెబుతామని ఫోన్ చేస్తే అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికి కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఏం జరిగిందో అర్థంకావడం లేదని, తమ పాప చాలా ధైర్యవంతురాలని స్నిగ్ద తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని, తమ బిడ్డ మృతదేహాన్ని ఇంటికి చేర్చేందుకు సాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఫిలిప్పీన్స్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన అధికారులు ఆమె మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్నిగ్ధ మరణానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్
అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో నవంబర్ 3న జరిగిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ విజయవంతమైంది. ఈ ప్రాంతంలో మొదటి తెలుగు కాన్సర్ట్‌గా నిలిచిన ఈ ఈవెంట్ సుమారు 120,000 డాలర్ల విరాళాలను సమీకరించింది, ఇందులో ఆరు MESU దాతల విరాళాలు కూడా ఉన్నాయి.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఎస్. బద్రినాథ్, రతన్ టాటా గారిని స్మరించుకొని, వారి సేవలను కొనియాడారు. శంకర నేత్రాలయ USA పయనాన్ని, సంస్థ స్థాపన నుండి నేటి ప్రస్తుత కార్యక్రమాలను వివరించారు. అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు ఎమిరేటస్ ఎస్.వి. ఆచార్య , ప్రస్తుత అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర దృష్టి సంరక్షణను అందించే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) కార్యక్రమం ద్వారా. చెన్నై, హైదరాబాద్, జార్ఖండ్ కేంద్రాలతో పాటు, పుట్టపర్తి , విశాఖపట్నం కేంద్రాల కోసం ప్రణాళికలను తెలియజేసింది.ఈ కార్యక్రమంలోమణి శర్మ సంగీత ప్రదర్శన, ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. కొంతమంది దాతలను సత్కరించారు. అలాగే మరో ఆరు MESU యూనిట్ల కోసం, తమిళనాడుకు నాలుగు , ఆంధ్రప్రదేశ్‌కు రెండు దాతలు ముందుకు వచ్చారు.కాన్సర్ట్ తర్వాత, చాండ్లర్‌లోని ఫిరంగీ రెస్టారెంట్లో ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటుచేశారు, అక్కడ మణి శర్మ గారి సంతకంతో ఉన్న ఫోటోలను వేలం వేశారు. అలాగే, గురువారం రాత్రి పియోరియాలో మణి శర్మ గారి మరియు వారి బృందానికి ప్రత్యేక సాయంకాలపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు వేలంపాటల ద్వారా మొత్తం $4,875 సేకరించాము, ఇది శంకర నేత్రాలయ MESU కార్యక్రమం ద్వారా 75 కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు నిధులను అందించింది.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మూర్తి రేఖపల్లి, శ్యాం అప్పలికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వంశీ కృష్ణ ఇరువారం (జాయింట్ సెక్రటరీ),ఆది మొర్రెడ్డి,, రేఖ వెమాల , ధీరజ్ పోలా , శరవణన్, శ్రీధర్ చెమిడ్తి, సాకేత్, సీత గంట, గార్లు టెర్రీ కింగ్, సరిత గరుడ, రాజ్ బండి, శోభ వడ్డిరెడ్డి, లక్ష్మి బొగ్గరపు , రూప మిధే, మణు నాయర్, చెన్నా రెడ్డి మద్దూరి, కాశీ, మూర్తి వెంకటేశన్, మంజునాథ్, దేవా, జయప్రకాశ్, మహిత్ కృషిని అభినందించారు. శంకర నేత్రాలయ మిషన్‌కు అండగా ఉన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది శంకర నేత్రాలయ.ఈ కార్యక్రమం పట్ల హాజరైన వారందరూ ప్రశంసలు వ్యక్తం చేయగా, ఫీనిక్స్ శాఖలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. షైనింగ్ స్ప్రౌట్స్ మరియు లవింగ్ కైండ్‌నెస్ బృందాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సంస్థ, శంకర నేత్రాలయ మిషన్‌ను ప్రోత్సహించడంపై ఉన్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడింది. -
ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకో శాఖ..సారథులుగా మస్క్, వివేక్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత మూలాలున్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. యంత్రాంగంలో సమూల ప్రక్షాళన కోసం వారి సారథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ఏర్పాటును ప్రకటించారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన, మితిమీరిన నిబంధనలకు కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్ వ్యవస్థీకరణ తదితరాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. ఇందుకు ‘ది గ్రేట్’ మస్క్, ‘అమెరికా దేశభక్తుడు’ వివేక్ నాయకత్వం వహిస్తారు. తమ అమూల్య సలహాలతో సేవ్ అమెరికా ఉద్యమానికి మార్గదర్శనం చేస్తారు’’ అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 ఏళ్లు నిండే 2026 జూలై 4వ తేదీకల్లా ప్రక్షాళన ప్రక్రియను పూర్తి చేయాలని మస్క్, వివేక్‌లకు డెడ్‌లైన్ విధించారు. ‘డోజ్’ను ఈ కాలపు మన్హాటన్ ప్రాజెక్టుగా ట్రంప్ అభివరి్ణంచారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబుల నిర్మాణానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘మన్హాటన్’. డోజ్ పనితీరుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఫెడరల్ అడ్వైజరీ కమిటీ చట్టం పరిధిలోకి రావచ్చంటున్నారు. ప్రభుత్వోద్యోగులు ఆస్తులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే మస్క్, రామస్వామి ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచే పనిచేస్తారని ట్రంప్ చెప్పడంతో ఆ నిబంధన వారికి వర్తించే అవకాశం లేదు. గతంలోనూ అమెరికా అధ్యక్షులు ఇలా ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. రిపబ్లికన్ పార్టీకే చెందిన రొనాల్డ్ రీగన్ 1981–1989 మధ్య ‘గ్రేస్ కమిషన్’ను స్థాపించారు. ఇక ప్రకంపనలే: మస్క్ డోజ్ ఏర్పాటును మస్క్ స్వాగతించారు. ఇది ప్రభుత్వ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావచ్చన్నారు. పారదర్శకత కోసం డోజ్ చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రజా ధనం వృ«థాను అరికట్టేందుకు లీడర్ బోర్డ్ ఏర్పాటవుతుందని తెలిపారు. ట్రంప్ టీమ్‌లో తొలి భారత అమెరికన్ ట్రంప్ 2.0 టీమ్‌లో చోటు సంపాదించిన తొలి భారత అమెరికన్‌గా 39 ఏళ్ల వివేక్ నిలిచారు. డోజ్ ఏర్పాటుపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనలో సున్నితంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. కాలం చెల్లిన పలు ఫెడరల్ ఏజెన్సీలను తొలగించాలంటూ ప్రచార పర్వంలో రిపబ్లికన్లు తరచూ ఉపయోగించిన నినాదం ‘షట్ ఇట్ డౌన్’ను ఈ సందర్భంగా రీ పోస్ట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు వివేక్ పూర్తిస్థాయిలో మద్దతివ్వడం తెలిసిందే. ట్రంప్ విజయానంతరం పలు టీవీ షోల్లో మాట్లాడుతూ ఆయన్ను ఆకాశానికెత్తారు. వివేక్ 1985 ఆగస్టు 9న ఒహాయోలోని సిన్సినాటిలో జని్మంచారు. ఆయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన కేరళ బ్రాహ్మణులు. ఆయన ఒహాయోలోని రోమన్ కాథలిక్ స్కూల్లో చదివారు. హార్వర్డ్ నుంచి జీవశాస్త్రంలో పట్టా పొందారు. యేల్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. హెడ్జ్ ఫండ్ ఇన్వెస్టర్‌గా చేశారు. యేల్లో డిగ్రీ పూర్తవకముందే మిలియన్ల కొద్దీ సంపాదించానని చెప్పుకుంటారు. 2014లో ఓ బయోటెక్ కంపెనీని స్థాపించారు. 2023 నాటికే వివేక్ సంపద ఏకంగా 63 కోట్ల డాలర్లని ఫోర్బ్స్ అంచనా వేసింది. 18 ఏళ్లకే అద్భుత ప్రసంగం హైసూ్కల్ విద్యారి్థగా సెయింట్ 18 ఏళ్ల వయసులో జేవియర్ స్కూల్లో వివేక్ చేసిన ప్రసంగ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రసంగం పొడవునా ఆయన కనబరిచిన ఆత్మవిశ్వాసం, భవిష్యత్తును గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Congratulations to @elonmusk and @VivekGRamaswamy on this historic achievement! $DOGE #DonaldJTrump #ElonMusk #MAGA #TrumpVance2024 #VivekRamaswamy pic.twitter.com/6b98v4hyyO— Brock W. Mitchell (@BrockWMitchell) November 13, 2024 -
Canada: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు
ఒట్టావా: కెనడాలోని హిందూ దేవాలయంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా బ్రాంప్టన్ త్రివేణి కమ్యూనిటీ సెంటర్ నవంబర్ 17న ఇండియన్ కాన్సులేట్ నిర్వహించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఖలిస్థానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కమ్యూనిటీ సెంటర్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సంతతికి చెందిన హిందువులు, సిక్కులకు లైఫ్ సర్టిఫికేట్ పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.బ్రాంప్టన్ త్రివేణి ఆలయానికి బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని, హిందూ సమాజానికి భద్రత కల్పించాలని కమ్యూనిటీ సెంటర్ పీల్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రద్దు చేసినందుకు సభ్యులకు క్షమాపణలు చెబుతున్నామని, కెనడియన్లు ఇక్కడి దేవాలయాలను సందర్శించడం అసురక్షితమని భావిస్తున్నామని పేర్కొన్నారు. కెనడాలోని హిందువులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. Chief of Police with the Peel Regional Police in Canada, Nishan Duraiappah writes to Brampton Triveni Mandir & Community Centre, requesting them to consider rescheduling the upcoming Consular Camp at the Brampton Triveni Mandir & Community Centre on November 17, 2024."We…— ANI (@ANI) November 12, 2024నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలోని కాన్సులర్ క్యాంపుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఇది హింసకు దారితీసింది. ఈ ఉదంతంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కెనడా అధికారులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించిన దరిమిలా గత ఏడాది రెండు దేశాల సంబంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు -
ఖమ్మం మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం బుచ్చిరెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె రామసహాయం రాధిక అమెరికాలోని కొలంబస్లో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కాగా, రాధికను అమెరికాలో ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ అడ్వయిజరీ బోర్డు సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారని ఆమె తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు.రాధికకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన రఘురాంరెడ్డితో 2006లో వివాహం జరగగా, ఆయనతోపాటు అమెరికా వెళ్లారు. అక్కడ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరి అంచెలంచలుగా కంపెనీలో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. 2009 నుంచి వివిధ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో రాధికకు ఈ అవకాశం వచ్చిందని బుచ్చిరెడ్డి తెలిపారు. 2026 వరకు అమె ఈ పదవిలో కొనసాగుతారని చెప్పారు. -
లండన్‌లో ఘోర ప్రమాదం, చావు బతుకుల మధ్య హైదరాబాద్ యువతి
ఉపాధికోసం విదేశాలకు వెళ్లిన యువతిని దురదృష్టం వెంటాడింది. హైదరాబాద్‌కు చెందిన బాధిత యువతి ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనలో పడిపోయారు.హైదరాబాద్ దిల్ సుఖ్‌నగర్ సమీపంలోని మారుతి నగర్‌కు చెందిన హిమ బిందు ఉద్యోగం కోసం లండన్ వెళ్లింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్ హిమ బిందును డీకొట్టింది దీంతో ఆమెకు తీవ్ర గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిమ బిందు ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ యాక్సిండెట్ గురించి అధికారులు బిందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం దశమ వార్షికోత్సవం
-
గాటా దీపావళి వేడుకలు.. పోతిరెడ్డి నాగార్జున రెడ్డికి సన్మానం
-
లండన్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్
నవంబర్ 5-7 వరకు లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో భారతదేశం పాల్గొంటుంది.ఇన్‌బౌండ్ టూరిజంను మెరుగుపరచడం , దేశాన్ని ప్రధాన ప్రపంచ ప్రయాణ గమ్యస్థానంగా ఉంచడం లక్ష్యంగా ఇందులో పాల్గొంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , భారతీయ టూరిస్ట్ పరిశ్రమకు చెందిన హోటళ్లతో సహా దాదాపు 50 మంది వాటాదారుల ప్రతినిధి బృందంతో WTMలో పాల్గొంటున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఇందులో భాగంగానే ఇన్క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకేలో భారత హై కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి తెలంగాణా ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ తో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు, హైదరాబాద్ లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్, లండన్ ఐ తరహాలో ఐకానిక్ జాయింట్ వీల్ ఏర్పాటుపై చర్చించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీ కృష్ణ, డా. రాజేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఘనంగా సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం దశవర్ష వార్షికోత్సవం
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినో భవంతు అనే భావనతో పదేళ్ల క్రితం ప్రారంమైన సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం 2 నవంబర్, 2024 నాడు దశ వర్ష వార్షికోత్సవము ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా దాదాపుగా 50 మంది తెలుగు బ్రాహ్మణ రుత్వికుల ఆధ్వర్యంలో శ్రీ మహా త్రిపురసుందరీ సమేత శ్రీ ఉమా సహస్ర లింగార్చన పూర్వక హరిద్రా కుంకుమార్చన సహిత లక్ష బిల్వార్చన కార్యక్రమంలో స్వామి వారిని అర్చనకార్యక్రమాన్ని నిర్వహించారు.కార్తీక మాసం మొదటి రోజున చేపట్టిన ఈ కార్యక్రమము లిటిల్ ఇండియాలో, ఆర్య సమాజ్ వారి ప్రాంగణములో 12 గంటలు పైగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనం తో మొదలుకొని మృత్తికా శోధన కార్యక్రమంతో మహాన్యాసా పూర్వకము గా భారతదేశం నుంచి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో 1136 మహా పరమశివ లింగములు చేసి వాటిని సమంత్ర పూర్వకము గా మూల మంత్రము తో ఆవరణ అర్చన చేసి ఆ తరువాత అరుణపారాయణం చేసిన పిదప ఏకాదశ వార రుద్రాభిషేకం శ్రీ రుద్ర పూర్వకము గా చేసిన అనంతరం సూక్తముల పారాయణా సహితము గా వేదోక్త శాంతులయిన దశశాంతులు తో శ్రీ సహస్ర లింగేశ్వరుని సామ్రాజ్య పట్టాభిషేకం కావించుకుని, చిన్న విరామం అనంతరం 50 మంది దంపతులు కలసి లలిత సహస్రనామములతో హరిద్రాకుంకుమార్చన చేసి, అటుపిమ్మట శివ సహస్రనామ పూర్వక లక్ష బిల్వార్చనా అంతర్గత రుద్రాక్రమార్చన పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.చివరగా షోడశ ఉపచారా పూజ, దర్భార్ సేవతో ప్రదోష వ్రతం కార్యక్రమమును ఘనంగా ముగించారు.ఈ కార్యక్రమమును సింగపూర్ బ్రాహ్మణ సమాజ బ్రహ్మలు ప్రసాద్ కప్పగంతుల, నేమాని సత్య రమేష్ మరియు రాజేష్ శ్రీధర ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించగా, భారతదేశం నుంచి వచ్చిన సలక్షణ ఘనాపాటి వంశీ(రాధే) పాల్గొని కార్యక్రమానికి సహకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని సింగపూర్‌లో తొలిసారిగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమానికి సహకరిచిన వర్కింగ్ టీం సభ్యులు గణపతి శాస్త్రి ఆకెళ్ళ, సూర్య పవన్ యనమండ్ర, వంశి కృష్ణ శిష్ట్లా , ముఖ్యదాతలు రంగనాథ్ వల్లభజోస్యుల, ఆదిత్య కర్రా , రామన్, భాను ఆకుండి, సంపూర్ణ స్వదేశ్, వీర ఫ్లవర్స్, వేద ఫ్లవర్స్ వాలంటీర్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే అడగగానే హాల్ ని సమకూర్చిన ఆర్యసమాజ్ వారికీ ప్రత్యేక ధన్యవాదాలా తెలిపారు. కార్యక్రమములో పాల్గొన్న రిత్విక్ లకు, భక్తులకు పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాద వితరణ చేసారు.ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతిఒక్కరికి నిర్వాహకులు శ్రీప్రదాయ చల్లా, రాజేష్ యనమండ్ర, వేణు మాధవ్ మల్లవరపు, రత్నకుమార్ కవుటూరు పేరు పేరున ధన్యవాదములు తెలియచేసారు. -
తెలుగోడు.. టెక్సాస్ మేయర్ ఎన్నికల బరిలో!
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులూ.. అక్కడి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం చూస్తున్నాం. చిన్న పదవుల మొదలుకుని జడ్జిలు, చట్ట సభలు, దేశ ప్రధానుల్లాంటి ఉన్నత పదవులనూ అధిరోహిస్తున్నారు. తాజాగా.. ఓ తెలుగోడు టెక్సాస్ స్టేట్‌లో మేయర్ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ట్రాన్స్పరెన్సీ(పారదర్శకత) ఈజ్ ద గేమ్.. కార్తీక్ ఈజ్ ది నేమ్ అంటూ.. 35 ఏళ్ల యువకుడు ట్రావిస్ కౌంటీలోని ది హిల్స్ మేయర్ ఎన్నికల ప్రచారంతో హాట్ టాపిక్‌గా మారాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు(ప్రస్తుతం బాపట్ల) చెందిన కార్తీక్ నరాలశెట్టి Karthik Naralasetty.. ది హిల్స్ మేయర్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కార్తీక్.. న్యూజెర్సీ రట్టర్స్ యూనివర్సిటీలో కంప్యూటర్‌సైన్స్ డిపార్ట్మెంట్లో చేరాడు. ఆపై చదువు ఆపేసి ఇండియాకు తిరిగొచ్చి సోషల్‌బ్లడ్ పేరుతో ఓ ఎన్జీవో ఏర్పాటు చేసి.. క్రమక్రమంగా వ్యాపారవేత్తగా ఎదిగాడు. అదే టైంలో పెంపుడు జంతువులకు సంబంధించిన మరో కంపెనీ స్థాపించాడు.అమెరికాలో ఉన్న తొలినాళ్లలోనే అధితితో పరిచయం.. ఆపై వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ‘ది హిల్స్’ మేయర్ ఎన్నికలపై దృష్టి సారించాడు కార్తీక్. ఆగస్టు నుంచే ప్రచారం మొదలుపెట్టిన కార్తీక్.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన అనుభవంతో ది హిల్స్ అభివృద్ధికి దోహదపడతానని ప్రచారం చేశాడు కూడా. ది హిల్స్‌లో 2,000 జనాభా ఉంది. కేవలం ఐదు భారతీయ కుటుంబాలు మాత్రమే అక్కడ స్థిరపడ్డాయి. అయితే న్యూజెర్సీలో ఉన్న బంధువుల సహకారంతో ప్రచారం ఉధృతం చేశాడు కార్తీక్. నవంబర్ 5న ఇక్కడ మేయర్ ఎన్నిక జరగనుంది. ఒకవేళ.. కార్తీక్ ఈ ఎన్నికల్లో గెలిస్తే గనుక.. ‘ది హిల్స్’ మేయర్ పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా, తొలి భారతీయ వ్యక్తిగా నిలుస్తాడు. -
NRI: శతవసంతాల సాహితీవేత్తలకు శతకోటి వందనాలు
డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 73వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శతజయంతులు జరుపుకుంటున్న కొంతమంది రచయితలకు నివాళులర్పిస్తూ - “శతవసంతాల సాహితీవేత్తలకు శతకోటి వందనాలు” అనే కార్యక్రమం చాలా ఆసక్తి దాయకంగా జరిగింది. తానాఅధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం అవిరళ కృషి చేసి, అమూల్యమైన జ్ఞానసంపదను మనకోసం వదిలి వెళ్ళిన, ఇటీవలే శతజయంతి సంవత్సరంలో కి అడుగుపెట్టిన, అడుగుపెట్టబోతున్న కొంతమంది సాహితీమూర్తుల జీవితవిశేషాలను స్మరించుకుని, వారికి ఘన నివాళులర్పించడం మన కనీస ధర్మం అని, వారి రచనలను చదవడం ద్వారా అలనాటి కాలమాన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు తేటతెల్లంగా తెలుస్తాయి అన్నారు”. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతమంది కవులను, పండితులను ఒకేసారి ఒకేవేదిక మీద స్మరించుకుని, భావితరాల కోసం వారు వదిలి వెళ్ళిన ఈ గొప్పసంపదను ఒకసారి తడిమి చూసుకోవడం ఒక్క తానా ప్రపంచసాహిత్యవేదికకే చెల్లింది అన్నారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి, స్వయంగా సాహితీవేత్త అయిన ఆచార్య డా. వెలుదండ నిత్యానంద రావు మాట్లాడుతూ ఇదొక అపూర్వ సమ్మేళనం అని, ఈ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సాహితీమూర్తులలో కొంతమందితో తనకు ప్రత్యక్ష సాహిత్యానుబంధం కల్గిఉండడం తన అదృష్టమని, వారి సాహిత్య కృషి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని, వారందరికీ ఘన పుష్పాంజలి, గత 5 సంవత్సరాలగా వివిధ సాహిత్య అంశాలపై ప్రతి నెలా ఆఖరి ఆదివారం క్రమం తప్పకుండా నిభద్దతతో కార్యక్రమాలు చేస్తున్న తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు అన్నారు”. శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సాహితీ మూర్తుల జీవితాలగురించి, వారి సాహిత్యకృషి గురించి ఈ క్రింద పేర్కొన్న విశిష్టఅతిథులు సోదాహరణంగా వివరించారు: శ్రీ గండూరి (జి.) కృష్ణ (1924-2001), ప్రముఖ పాత్రికేయులు, రచయిత గురించి - శ్రీమతి గండూరి (యామిజాల) రాజీవ, జి. కృష్ణ గారి కుమార్తె, ప్రముఖ పాత్రికేయురాలు; శ్రీ కె. ఎల్. నరసింహారావు (1924-2003), ప్రముఖ నాటకరచయిత, నటులు గురించి - శ్రీ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వాధ్యక్షులు; డా. ఆవంత్స సోమసుందర్ (1924-2016), అభ్యుదయవాద కవి, విమర్శకులు, రచయిత గురించి - ఆచార్య డా. యస్వీ సత్యనారాయణ, అభ్యుదయ రచయిత, పూర్వ ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; శ్రీ “శారద” (ఎస్. నటరాజన్) (1925-1955), ప్రముఖ తెలుగు కథారచయిత, నవలారచయిత గురిచి - శ్రీ కొత్తపల్లి రవిబాబు, “ప్రజాసాహితి” మాసపత్రిక ప్రధానసంపాదకులు; ఆచార్య డా. బిరుదురాజు రామరాజు (1925-2010), జానపద గేయసాహిత్యంలో దిట్ట, ప్రముఖరచయిత గురించి డా. సగిలి సుధారాణి, పరిశోధకురాలు-‘తమిళనాట స్త్రీల జానపద కథనాలు”, రచయిత్రి; డా. దాశరథి కృష్ణమాచార్యులు (1925–1987), ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ విముక్తి సాయుధ పోరాటయోధుడు గురించి - డా. పి. విజయకుమార్, సహాచార్యులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం; కళాప్రపూర్ణ ఆరుద్ర (భాగవతుల సదాశివశంకర శాస్త్రి) (1925-1998), అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు గురించి - ఆచార్య డా. మేడిపల్లి రవికుమార్, ప్రముఖ సాహిత్యవిమర్శకులు, పూర్వ తెలుగువిభాగాధిపతి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి; శ్రీ కొడాలి గోపాలరావు (1925-1993), ప్రముఖ శతాథిక నాటకాల రచయిత గురించి - డా. కందిమళ్ళ సాంబశివరావు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ నాటకఅకాడమీ పూర్వ ఉపాధ్యక్షులు; శ్రీ ఆలూరి బైరాగి (1925-1978), ప్రముఖ కవి, కథా రచయిత, మానవతావాది గురించి – శ్రీ బండ్ల మాధవరావు, ప్రముఖ కవి, రచయిత, ‘సాహితీమిత్రులు’; శ్రీమతి బొమ్మరాజు భానుమతి (1926-20005), ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, ఫిల్మ్ స్టూడియో అధినేత్రి గురించి - శ్రీ భరద్వాజ రంగావఝుల, ప్రముఖ పాత్రికేయులు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను స్పృశించి సభను రంజింపజేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును: https://youtube.com/live/gf2INE_lbpk -
తానా ఆధ్వర్యంలో అమెరికాలో రహదారుల దత్తత
-
TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు
సౌతెండ్, యునైటెడ్ కింగ్డమ్లో TCUK ఆధ్వర్యంలొ ప్రప్రధముగా తెలంగాణ బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎస్సెక్స్ లోని సౌతెండ్, బాసిల్డ్న్ , చెల్మ్సఫోర్డ్ , తుర్రోక్ కౌన్సిల్ ఉంచి దాదాపు 450 మన తెలుగు వాళ్ళు అందరు ఒక్కదగ్గర చేరి బతుకమ్మ దసరా సంతోషంగా జరుపుకున్నారు. గుర్రం మల్లారెడ్డి, గుర్రం లావణ్య నేతృత్వంలో ఈ ఈవెంట్ స్వచ్చందంగా నిర్వహించారు.తెలంగాణ ఆడపడుచులు అందమైన బతుకమ్మ పేర్చికొని వచ్చారు. దసరా జమ్మి ఆకూ మొగవాళ్ళు ఇచ్చుకొని అలాయి బలయ్ చెప్పుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ కి సౌత్జెండ్ కౌన్సిలర్స్ క్రిస్ వెబ్‌స్టర్ , పమేలా కిన్సేల్ల, సామ్ అల్లెన్, షాహిద్ నదీమ్, జేమ్స్ మొరిషన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. చివరగా తెలంగాణ వంటకాలతో విందు ఆరగించి, దసరా, బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలాంటి వేడుకలు భవిష్యత్తులోమరెన్నో జరగాలని అందరూ ఆకాంక్షించారు. -
తానా ఆధ్వర్యంలో అమెరికాలో రహదారుల దత్తత
అమెరికా, పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హ్యారిస్ బర్గ్ నగరంలో మిడ్ అట్లాంటిక్ తానా విభాగం వారు సామాజిక భాద్యత పై అవగాహన కల్పిస్తూ "అడాప్ట్ ఏ హైవే" కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా, అత్యంత రద్దీ గల రహదారిని తానా ఆధ్వర్యంలో దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిడ్-అట్లాంటిక్ తానా బృందం రహదారి పరిసరాలు పరిశుభ్రం చేయడమే కాకుండా పచ్చదనాన్ని పరిరక్షించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. హ్యారిస్ బర్గ్ తానా టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దలు, పలువురు విద్యార్థులు చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అమెరికా సమాజంతో మమేకమై సమాజ సేవ చేయాలనే సంకల్పం కలిగించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ కార్యక్రమం చేపట్టిందని మిడ్ అట్లాంటిక్ తానా రీజినల్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు తెలిపారు. ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన హ్యారిస్ బర్గ్ తానా బృందానికి తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ధన్యవాదాలు తెలిపారు.ఈ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు సమాజానికి ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమం ప్రకృతి పట్ల చక్కటి అవగాహన కలిగించి, ప్రకృతిని, పచ్చదనాన్ని ఎలా సంరక్షించుకోవాలో నేర్చుకున్నామని తెలిపారు. తానా ఆధ్వర్యంలో విద్యార్థులలో సేవా భావం పెంపొందించేలా సమాజానికి మేలు చేసే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ఆకాంక్షించారు. -
ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీవాసులు మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాండాల్ఫ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రవాస భారతీయులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు ఏపీలోకి చెందినవారు ఉన్నారు.వివరాల ప్రకారం.. దక్షిణ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రాండాల్ఫ్ సమీపంలో హైవేపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా ఐదుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారిని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరిత, తిరుమూరు గోపిగా అధికారులు ధృవీకరించారు. ఇక, హరిత భర్త సాయి చెన్ను ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.ఇది కూడా చదవండి: ట్రంప్‌పై కుట్ర.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్