Pragati Bhavan
-
ప్రజా భవన్ ఇక డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసం
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, ప్రజాదర్బార్‌ను కొత్త ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కాగా, రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అసలు ఆట ఇప్పుడుంది: కేటీఆర్ -
తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఎంసీఆర్హెచ్ఆర్డీ?
సాక్షి, హైదరాబాద్: ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనం త్వరలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారనున్నట్లు సమాచారం. ఎంసీఆర్హెచ్ఆర్డీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. సీఎం అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. ప్రగతి భవన్నుప్రజాభవన్గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. -
ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు వినేందుకే ప్రజాదర్బార్ ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరలోనే వారి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వినేందుకే ప్రగతిభవన్‌కు ఉండే అడ్డుగోడలను తొలగించి ప్రజాభవన్‌గా మార్చామని పొన్నం తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కె.సత్యనారాయణతో పాటు సీపీఐ నాయకులను కలిసేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూమ్‌భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మతో సమావేశమయ్యారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు, ప్రతిపక్ష నేతలు కలిసేందుకు కూడా అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో సీపీఐ సంపూర్ణ సహకారం, మద్దతు ఉందని, భవిష్యత్‌లో కూడా తాము కలిసే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయంతో రాష్ట్రంలో ప్రజాస్వామిక పునాది పడిందన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురవరం వారికి అభినందనలు తెలిపారు. -
ఇనుప కంచె తొలగింది
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు గురువారం తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. సిటీ ట్రాఫిక్ చీఫ్ జి.సుదీర్‌బాబు సైతం ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒకట్రెండు రోజుల్లో ఆ రోడ్డును పూర్తిస్థాయిలో వాహన చోదకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మొదలు.. బేగంపేటలోని గ్రీన్లాండ్స్ చౌరస్తా సమీపంలో చాలా ఏళ్లుగా ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ ఆఫీస్ కొనసాగుతున్నాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో అక్కడ ముఖ్యమంత్రి నివాసం నిర్మితమైంది. ఆయన అందులో బస చేసినప్పుడు రహదారిపై ఎలాంటి అడ్డంకులు ఉండేవి కాదు. కేవలం సీఎం నివాసంలోకి ప్రవేశించడానికే అనుమతులు అవసరమయ్యేవి. అయితే నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా ఆ రహదారిలో బారికేడ్లు వెలిశాయి. తొలినాళ్లలో తాత్కాలికంగా 8 అడుగుల ఎత్తున వాటిని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ప్రగతి భవన్ నిర్మించిన తర్వాత రోడ్డుపైకి ఇనుప గ్రిల్స్ వచ్చాయి. వాటి ప్రభావంతో బేగంపేట మార్గంలో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడేవి. సీఎం రేవంత్ ఆదేశంతో... మంగళవారం తనను ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే మాట్లాడిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి ప్రజాదర్బార్ ప్రారంభం కానుండటంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అడ్డంకులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు గురువారం ఉదయం నుంచి అవసరమైన చర్యలు ప్రారంభించారు. -
కోట గేట్లు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్న జీహెచ్ ఎంసీ కార్మికులు
-
ప్రగతిభవన్ నుంచి కేసీఆర్‌ను సాగనంపాలి
మెట్పల్లి(కోరుట్ల)/జగిత్యాలటౌన్: తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతిభవన్ నుంచి సాగనంపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో బహుజన రాజ్యాధికార గర్జన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో ఒక్కశాతం ఉన్న వర్గానికి అధికారం అప్పగిస్తే బహుజనులకు న్యాయం జరగదన్నారు.టీఎస్పీఎస్సీని మంత్రి కేటీఆర్ తన దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారని, ఒక్కో పరీక్ష పేపర్‌ను ఆయన రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. పరీక్షలు వాయిదా పడటం వల్ల మనస్తాపం చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే, కేటీఆర్ దానిని వక్రీకరిస్తూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే రూ.5 వేల కోట్లతో గల్ఫ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. బహుజనులు ఎక్కువగా ఉన్న కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా దొరలు గెలవడం సమంజసం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న పూదరి నిషాంత్ కార్తికేయను గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ పూదరి అరుణ, జిల్లా ఇన్చార్జి పుప్పాల లింబాద్రి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ రద్దుకు తొలి సంతకం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తూ తొలి సంతకం చేయడంతో పాటు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన బీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ఏక్ నంబర్ అయితే బేటా కేటీఆర్ దస్ నంబర్ అని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు అంబులెన్సుల్లో డబ్బులు పంపిణీ చేస్తారని అనుమానంగా ఉందని అన్నారు. -
ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు కమిషన్ కాకమ్మ కథలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు.. ఎవరూ ఉద్యోగాలే ఇవ్వనట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కాకమ్మ కథలు చెబుతోందని శుక్రవారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నచ్చినోళ్లకు పదవులు, కావాల్సినోళ్లకు ఉద్యోగాలు.. ఇదే దొర తెచ్చిన బంగారు తెలంగాణ అని విమర్శించారు. చెప్పాలంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను కాస్త.. దొరలు ప్రగతిభవన్ సర్విస్ కమిషన్ గా మార్చారన్నారు. ‘గ్రూప్ 1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్క.. ఓఎంఆర్ షీట్స్ లెక్కిస్తే మరో లెక్క.. ఇది చాలా కామన్ అట. ప్రశ్నపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓఎంఆర్ షీట్స్ తారుమారుచేయడం ఒక లెక్కనా’అని అన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే కమిషన్‌కు వచ్చిన నష్టం ఏంటని షర్మిల సూటిగా ప్రశ్నించారు. -
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ
-
ప్రగతిభవన్ వద్ద ధర్నాకు సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో 33% మహిళలకు టికెట్ల కేటాయింపు కోసం ప్రగతిభవన్ వద్ద ధర్నా చేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత సిద్ధమేనా అని టీపీసీసీ అధికార ప్రతినిధి, మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి సవాల్ విసిరారు. కల్వకుంట్ల కవితకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన తండ్రిపై పోరాటానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ మహిళా నేతలు కోరారు. ఒక పార్టీ అధినేతగా తన తండ్రి కేసీఆర్ చేతిలో ఉన్న టికెట్ల కేటాయింపు అవకాశాన్ని వదిలిపెట్టి ఎక్కడో పార్లమెంటులో బిల్లులు గురించి కవిత మాట్లాడటం, జంతర్‌మంతర్ దగ్గర బూటకపు పోరాటాలు చేయడం సరికాదని హితవు పలికారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ...బీఆర్ఎస్ తరఫున మొత్తం 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో కేవలం ఏడుగురు మహిళలకే టికెట్లు కేటాయించారని, ఆ పార్టీ మహిళాసాధికారిత గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. ప్రధాని పదవితో సహా రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఏఐసీసీ అధ్యక్షురాలి పదవులను మహిళలకు ఇచి్చన ఘనత కాంగ్రెస్ పారీ్టదని గుర్తుంచుకోవాలని కోరారు. -
నేతల పనితీరుపై ఆరా.. కారెలా నడుస్తోంది?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. తన కేబినెట్ సహచరులతో వరుస భేటీలు జరుపుతున్నారు. ప్రగతి భవన్ వేదికగా ఉమ్మడి జిల్లాల వారీగా జరుపుతున్న సమావేశాల్లో నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై లోతుగా చర్చిస్తున్నారు. ఇప్పటివరకు నల్లగొండ, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన సమీక్షలు పూర్తయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వివిధ సర్వే సంస్థలు, నిఘావర్గాల ద్వారా అందిన నివేదికలు, ఏప్రిల్, మే నెలల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలపై పార్టీ ఇన్చార్జిలు ఇచ్చిన రిపోర్టుల్లోని అంశాలు ఈ భేటీల్లో ప్రస్తావనకు వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర కీలక నేతల పనితీరు, నియోజకవర్గ స్థాయిలో వారి నడుమ సమన్వయ లోపం వంటి అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సీఎం తెలుసుకుంటున్నారు. మంత్రులు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను తెలియజేయడంతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యేల ఏకపక్ష ధోరణి కారణంగా చాలాచోట్ల పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందనే అభిప్రాయం ఈ భేటీల్లో వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల పార్టీ నేతలు గ్రూపులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేలకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని కేసీఆర్‌కు మంత్రులు తెలిపారు. కాగా పార్టీకి నష్టం చేస్తున్న నేతల వివరాలను సేకరిస్తున్న ముఖ్యమంత్రి, వారి విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై దిశా నిర్దేశం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నియోజకవర్గాల వారీగా విపక్ష పార్టీల బలాలు, బలహీనతలపై కూడా ఈ భేటీల్లో చర్చిస్తున్నట్లు తెలిసింది. అవసరమైన చోట చేరికలకు గ్రీన్ సిగ్నల్ సర్వే సంస్థల నివేదికలు, వివిధ నిఘా సంస్థల రిపోర్టుల ఆధారంగా, నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్, విపక్షాల బలాలు, బలహీనతలపై కేసీఆర్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల ద్వారా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాల్సిందిగా మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు విఫలమైన చోట ఇతరులకు టికెట్ కేటాయించే అంశంపై మాత్రం ఈ భేటీల్లో సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. పార్టీకి ఉపయోగపడతారని భావించే అసంతృప్త నేతలతో మాట్లాడి వారు పార్టీలోనే ఉండేట్టుగా చూడటంతో పాటు ఇతర పార్టీల్లో ప్రజాదరణ కలిగిన నేతలతో సంప్రదింపులు జరపాలనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కేవలం క్షేత్ర స్థాయి పరిస్థితులకే పరిమితం కాకుండా ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పార్టీ మేనిఫెస్టో, ప్రచార వ్యూహం ఖరారు వంటి అంశాలపై కూడా కేసీఆర్ దృష్టి సారించారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై మంత్రుల నుంచి సీఎం అభిప్రాయాలు కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వాటి ప్రభావం, చేపట్టాల్సిన మార్పులు చేర్పులు తదితర అంశాలపై తన అభిప్రాయాలను కూడా ఈ భేటీల్లో కేసీఆర్ వెల్లడిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు, కీలక నేతలకు కేటీఆర్ క్లాస్ సీఎం కేసీఆర్ ఇలా మంత్రులతో వరుస భేటీలు జరుపుతుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు.. పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సమావేశమవుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందుతుండటం, టికెట్‌ను ఆశిస్తున్న నేతల నడుమ ఆధిపత్య పోరుపై ఆయన దృష్టి సారించారు. వివాదాస్పద ప్రకటనలు, పనులతో తరచూ వార్తలకెక్కుతున్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు కేటీఆర్ తరఫున ఫోన్లు వెళ్తున్నాయి. ఈ మేరకు ప్రగతిభవన్‌కు వస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కేటీఆర్ సీరియస్‌గా క్లాస్ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు రాజయ్య, శంకర్ నాయక్, రెడ్యా నాయక్, రోహిత్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్ తదితరులు ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. టికెట్ల కేటాయింపు అంశం అధినేత కేసీఆర్ చూసుకుంటారని, వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు కేసీఆర్ మంగళవారం లేదా బుధవారం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. -
రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్ దూరం.. స్టేట్ చీఫ్‌ను కలిసే అవకాశమే లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘దేశ, విదేశాల అధిపతులనైనా కలవగలం.. దురదృష్టవశాత్తు ఇక్కడి స్టేట్ చీఫ్‌ను మాత్రం కలవలేం.. కనీసం దగ్గరగా వెళ్లడానికి కూడా అవకాశం ఉండదు..రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్ దూరంగా ఉంది. ఇది మంచి ధోరణి కాదు..’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న తనను నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సేవా ఇంటర్నేషనల్, సీ–20 వర్కింగ్ గ్రూప్, సేవా భారతి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గచ్చిబౌలిలో నిర్వహించిన సీ–20 సమావేశాల కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అభివృద్ధి అంటే ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు.. ‘ప్రజా ప్రతినిధులు సమాజ సేవకులు. ఎల్లప్పుడూ ప్రజల అభివృద్ధికి పాటు పడాలి. అభివృద్ధి అంటే ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు. అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాలి. ఐదు వేల సంవత్సరాల క్రితమే ఆనాటి ప్రముఖుడు కనియన్ పుంగనాన ప్రజలంతా ఒక్కటేనని నినదించారు. ప్రస్తుత ప్రధానమంత్రి అదే నియమాన్ని పాటిస్తూ ప్రజలందరినీ సమానంగా చూస్తున్నారు. యావత్ ప్రపంచానికి భారత్ పరిష్కార మార్గాలను చూపిస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో 150 దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసి ఆదుకుంది. మన దేశంలోని వసుదైక కుటుంబానికి ఇది నిదర్శనం’అని తమిళిసై తెలిపారు. ‘తొలిసారిగా జీ20 ఫోరమ్‌కు 2023లో భారత్ అధ్యక్షత వహించడం గర్వకారణం. మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. స్వాతంత్య్ర శతాబ్ది వైపు పయనించే ‘అమృత్కాల్’దిశగా ఇదో ముందడుగు. నిరాక్షరాస్యత, అనారోగ్యం, నిరుద్యోగం లేని దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే అభివృద్ధి దిశగా చేసే పనిని కొందరు వ్యతిరేకిస్తారు కానీ పని చేయరు. నాయకులు అధికారులు, రాజ్‌భవన్ అందరూ ప్రజల కోసమే ఉన్నాం..’అని గవర్నర్ స్పష్టం చేశారు. జీ20 సౌస్ షెర్పా డీఎం కిరణ్, రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద, సేవా ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్వాతి రామ్ తదితరులు పాల్గొన్నారు. -
భయపడాల్సింది ఏమీ లేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఏడాదిలో కేంద్రం మరింత కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, వాటిని ధైర్యంగా ఎదుర్కొందామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గానికి సూచించారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ముందుగా ఊహించినవేనని అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్దామని, భయపడాల్సిన పనేమీ లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసుల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. కాగా నోటీసులు, వేధింపులు ఇక్కడితో ఆగవని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురిపై దాడులు నిర్వహించిన దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసిన అంశం కూడా చర్చకు వచ్చింది. బీజేపీ అరాచకాలను క్షేత్రస్థాయిలోనూ ఎండగట్టాలని, అందుకు సంబంధించి శుక్రవారం జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వివరంగా మాట్లాడుకుందామని సీఎం చెప్పినట్లు తెలిసింది. తదుపరి భేటీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు! గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని కేబినెట్ సమర్ధించింది. మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే ఇంకా సమయం ఉన్నందున తదుపరి కేబినెట్ భేటీలో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. ఎన్నికల ఏడాది కావడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విమర్శలకు, ఆరోపణలకు తావివ్వకుండా మసలుకోవాలని, బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. -
Telangana: నేడు కీలక కేబినెట్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. సమావేశంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన ఇద్దరిని ఖరారు చేయడంతోపాటు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపైనా చర్చించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీచేసిన అంశంపైనా భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈడీ విచారణ సందర్భంగా ఒకవేళ కవితను అరెస్టుచేస్తే ఎలా స్పందించాలన్న విషయమై సమావేశంలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్రంపై వ్యవహరిస్తున్న కక్షసాధింపు చర్యలపై మున్ముందు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపైనా చర్చ జరగనుంది. పలు అంశాలపై నిర్ణయాలు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, స్థలాలున్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున నిధుల మంజూరుపై నిర్ణయం, మూడు పారిశ్రామికవాడల్లోని భూముల క్రమబద్ధీకరణ అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో అమలవుతున్న కంటివెలుగు కార్యక్రమం, మంగళవారం ప్రారంభమైన ‘మహిళా ఆరోగ్య’కార్యక్రమాలను కూడా సమీక్షించే అవకాశం ఉంది. నేడు నామినేషన్ల దాఖలు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నవీన్‌కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వారి వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెళ్లనున్నారు. కాగా, గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. -
ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టాలి
సాక్షి, మహబూబాబాద్: ‘రాష్ట్రంలోని నాలుకోట్ల మంది ప్రజలు రక్తమాంసాలు కరిగించి, శ్రమించి పన్నులు చెల్లిస్తే రూ.2వేల కోట్లతో ప్రగతిభవన్ కట్టారు. దీనిలోకి రైతులు, కూలీలు, ఉద్యమకారులు, విద్యార్థులు, చివరకు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులకు కూడా ప్రవేశం లేదు. ప్రజలకు ఉపయోగపడని ఆ భవనం గేట్లు బద్దలు కొట్టాలి. పునాదులతో సహా కూల్చేయాలి. ప్రజల సమస్యలను వినే భవన్ కావాలి..’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. హాథ్‌సే హాథ్ జోడో యాత్ర బుధవారం మహబూబాబాద్ జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో, బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ద్రోహుల కేంద్రంగా ప్రగతిభవన్ ‘గతంలో పనిచేసిన సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల కార్యాలయాలు ప్రజల సమస్యలు, వినతులు తీసుకునే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు తెలంగాణ ద్రోహులు, దగాకోర్లు, మాఫియా, చీకటి ఒప్పందాలకు కేంద్రంగా ప్రగతిభవన్ ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైంది. 2014లో రాష్ట్రాన్ని సాధించింది. ఇప్పుడు 2023లో తెలంగాణలో నియంత పాలన అంతానికి మరో ఉద్యమం వచి్చంది. నాటి ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్‌ను వంద మీటర్ల లోతుకు పాతేందుకు కాంగ్రెస్ దండు కదలాలి..’ అని రేవంత్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌పై కూడా కేసు పెట్టాలి ‘ప్రగతిభవన్‌ను నేలమట్టం చేయాలని చెప్పినందుకు తనపై కేసు పెట్టాలని పోలీసులను ఆశ్రయించిన దద్దమ్మ నాయకులు గతాన్ని తెలుసుకోవాలి. నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్‌పై కూడా కేసు పెట్టాలి. చట్టం అందరికీ సమానమే. నాకో నీతి.. కేసీఆర్‌కో నీతా?..’ అని ప్రశ్నించారు. ప్రజలు చెప్పిందే మేనిఫెస్టోలో.. ‘గతంలో మాదిరిగా ఈసారి కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో ఉత్కంఠ ఉండదు. ఇప్పటికే 50 శాతం అభ్యర్థుల జాబితా తయారు చేశాం. ఇతర పారీ్టల నాయకులు తమకు నచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారు. మేం మాత్రం ప్రజలు చెప్పిందే పెడతాం. వారి సమస్యలు తీర్చేలా మేనిఫెస్టో ఉంటుంది. పోడు భూములకు పట్టాలు, పేదలకు ఇళ్లు, పంటలకు గిట్టుబాటు ధర, 317 జీఓ సవరణ తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తాం. అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధులు కేటాయిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. మానుకోటలో దుశ్శాసన పాలన ‘మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఒక రాక్షసుడు. దుశ్శాసన పాలన చేస్తున్నాడు. కలెక్టర్‌ను అవమానపర్చడం, పేదలకు అన్యాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఒక వైపు ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మరోవైపు ఎంపీ కవిత వందల ఎకరాలు పంచుకుంటున్నారు..’ అని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సీతక్క, మల్లురవి, సుదర్శన్‌రెడ్డి, బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా మహబూబాబాద్ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ‘జై బీఆర్ఎస్, జై శంకరన్న’ అంటూ నినాదాలు చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు. వారు రేవంత్‌పై చెప్పులు విసిరేసేందుకు యతి్నస్తుండగా అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జరిగినా, అలాంటిదేమీ లేదని పోలీసులు అన్నారు. -
తెలంగాణ నమూనా దేశవ్యాప్తం కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న ప్రగతి నమూనా మహారాష్ట్ర సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహరాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు అయిన శంభాజీ రాజె గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేసీఆర్ మధ్యాహ్న భోజనంతో శంభాజీ రాజెకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో అమల వుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పట్ల ప్రభుత్వ విధానాలను రాజె ఆరా తీశారు. వినూత్న ఎజెండాతో ప్రజల ముందుకు అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్, శంభాజీ రాజె నడుమ చర్చ జరిగింది. దేశ అభివృద్ధి, సమగ్రత, ప్రజా సంక్షేమం లక్ష్యంగా వినూత్న ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. సందర్భాన్ని బట్టి మరోమారు కలిసి మరిన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. శంభాజీ రాజె పూర్వీకులు శివాజీ మహరాజ్ నుంచి సాహూ మహరాజ్ దాకా దేశానికి అందించిన సేవలను ఇరువురు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారందించిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని కేసీఆర్‌కు శంభాజీ రాజె అందించారు. ఈ భేటీలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు శంభాజీ రాజెతో పాటు వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘చలో ప్రగతి భవన్’లో ఉద్రిక్తత
పంజగుట్ట/ సాక్షి, హైదరాబాద్: జీవో నెంబర్ 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం వివిధ బీజేపీ మోర్చా నాయకులు చేపట్టిన చలో ప్రగతిభవన్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో మోర్చా నాయకులు ప్రగతిభవన్ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దూషించుకునే స్థాయికి వెళ్లింది. తోపులాటలో బీజేపీ నాయకులతో పాటు పోలీసులు కూడా కిందపడటంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బీజేవైఎం నేత రవికుమార్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషా, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలె భాస్కర్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు బాషాతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఉద్యోగులు, టీచర్లకు సీఎం క్షమాపణలు చెప్పాలి.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల అరెస్ట్‌ల సందర్భంగా పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై సీఎం కేసీఆర్ బేషరతుగా ఆయా వర్గాలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.. 317 జీవోను సవరించి వారికి న్యాయం చేయాలని, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను లంచాల కోసమే నిలిపేశారని ఆరోపించారు. జిల్లా కేంద్రాల్లో ఖాళీలు చూపకుండా పోస్టులన్నీ బ్లాక్ చేశారని ఆరోపించారు. సోమవారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలు మెరబెట్టుకునేందుకు ప్రగతిభవన్‌కు వెళితే మహిళా టీచర్లు, చిన్న పిల్లలపై కేసీఆర్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించిందని సంజయ్ మండిపడ్డారు. పసిపిల్లలు ధర్నాలో రోదిస్తుండడాన్ని చూసి అందరి మనసు ద్రవించినా కేసీఆర్ మనసు మాత్రం కరగలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సకల జనుల సమ్మె నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయన్నారు. కష్టపడి తెలంగాణ సాధించుకున్నాక స్థానికత కోసం మళ్లీ ఉద్యమించే దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువకులు ఉద్యమించకపోతే, 42 రోజులు సకల జనుల సమ్మె చేయకపోతే ఇయాళ తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ సీఎం అయ్యేవారా? అని ప్రశ్నించారు. (చదవండి: రైలును అపరిశుభ్రంగా మార్చేసిన ప్రయాణికులు) -
DYFI అధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి
-
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎస్ఎల్పీఆర్బీ పోలీసు నియామకాల్లో కొత్త నిబంధనల వల్ల లక్షల మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ నిరసిస్తూ ప్రగతి భవన్‌ను ముట్టడించారు బీజేవైఎం కార్యకర్తలు. పోలీసు నియామకాల్లో గతంలో ఉన్న శారీరక పరీక్షల్లో మార్పులు చేయడంపై నిరసనలకు దిగారు. నిబంధనలను మార్చి, ఎవరైతే ఫిజికల్ టెస్టుల్లో నష్టపోయారో వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రగతి భవన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు బీజేవైఎం కార్యకర్తలు. దీంతో ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఆందోళనకారులను అరెస్టులు చేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇదీ చదవండి: ‘కేసీఆర్ సర్కార్ సర్పంచ్ల గొంతులు నొక్కేస్తున్నది’ -
కేంద్రం తీరును ఎండగట్టండి
సాక్షి, హైదరాబాద్: రేపటి(బుధవారం) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలకు హాజరై రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలను ఆదేశించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో ఆయన సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలు రాజకీయ, పాలనపరమైన అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని, తద్వారా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పార్టీ ఎంపీలకు సుదీర్ఘంగా వివరించినట్లు తెలిసింది. పార్లమెంటులో లోపలా, బయటా చోటు చేసుకునే పరిస్థితులను బట్టి వ్యూహరచన చేసుకోవాలని సూచించారు. సీబీఐ, ఐటీ, ఈడీ సోదాలు, కేసుల విషయంలో విపక్షాలతో కలిసి ఆందోళనలు చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే ఇతర ధర్నాలు, ఆందోళనలకు అంశాల వారీగా టీఆర్ఎస్ మద్దతునిస్తుందని తెలిపారు. అవసరమైతే సమావేశాల బహిష్కరణ! ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిన కుట్రలను పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలను అడ్డుకున్న తీరుతో పాటు అందులో బీజేపీ పాత్ర, విచారణను అడ్డుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా ఎంపీలకు వివరించారు. విభజన హామీల అమలులో తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, నిధుల విడుదలలో చూపుతున్న వివక్షను గణాంకాలతో సహా వివరించారు. గవర్నర్ వ్యవస్థతో పాటు, సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడం ద్వారా విపక్ష రాజకీయ పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణను ప్రజలకు వివరించేందుకు ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిన తర్వాత జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా ఉంటాయని చెప్పినట్లు సమాచారం. -
ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆందోళన
పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 317 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆదివారం ప్రగతిభవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. దీంతో పోలీసులు 88 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. 317 జీవో వల్ల సుమారు 20 వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగులు స్థానికత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది సొంత జిల్లాలు వదిలి సుదూర ప్రాంత జిల్లాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మనోవేదనకు గురై ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, తాము కూడా శాశ్వతంగా తమ స్థానికత కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీవోను రద్దు చేసి తమను సొంత జిల్లాకు పంపాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఆద్యంతం ఉద్రిక్తత, ఉత్కంఠ.. షర్మిల అరెస్ట్.. బెయిల్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేటలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా సోమవారం టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడం, ఫ్లెక్సీలు తగులబెట్టడం, ఆమె కారవాన్‌కు నిప్పంటించడం తదితర సంఘటనల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం..హైదరాబాద్ వేదికగా మంగళవారం కూడా కొనసాగింది. దాడికి నిరసన వ్యక్తం చేస్తూ, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ షర్మిల ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఆమెకు మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. అయితే షర్మిలను అడ్డుకున్న పోలీసులు..ఆమె లోపల ఉండగానే కారును క్రేన్ సాయంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం, ఇతర ఆరోపణలతో మరో పీఎస్‌లో షర్మిల సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం, నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, షర్మిల విడుదల కోరుతూ వైఎస్ విజయమ్మ నిరాహార దీక్షకు దిగడం వంటి పరిణామాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే షర్మిలతో పాటు ఐదుగురికి న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. షర్మిలను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసులు... బందోబస్తు తప్పించుకుని.. నర్సంపేటలో ఉద్రిక్తత నేపథ్యంలో షర్మిలను అదుపులోకితీసుకున్న పోలీసులు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసానికి తరలించిన సంగతి తెలిసిందే. కాగా నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం వైఎస్సార్ విగ్రహానికీ నిప్పుపెట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల మంగళవారం పంజగుట్ట కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు ఉదయం 10 గంటల నుంచే లోటస్ పాండ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ షర్మిల తొలుత సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంచిన ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎంను కలుస్తానంటూ ప్రగతి భవన్‌కు బయలుదేరారు. అయితే పోలీసులు షర్మిల వాహనాన్ని అడ్డుకుని కిందకు దిగాలని కోరగా ఆమె నిరాకరించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పోలీసులు డ్రైవింగ్ సీటులో ఉన్న ఆమెతో సహా కారును క్రేన్ సాయంతో ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో కూర్చున్న షర్మిల... బలవంతంగా కారు డోర్ తెరిచి.. ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ వద్ద కూడా కారు దిగేందుకు షర్మిల అంగీకరించలేదు. దీంతో పోలీసులు మారు తాళాలు తయారు చేసే వ్యక్తిని తెచ్చి కారు డోర్‌ను తెరిచేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు అధికారులు కారు ఎడమ వైపు ముందు డోర్‌ను ప్లాస్టిక్ లాఠీల సాయంతో తెరిచారు. కారులో ఉన్న నలుగురు పార్టీ నేతలను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహిళా పోలీసులు షర్మిలను బలవంతంగా కిందకు దింపి ఠాణా లోపలకు తీసుకువెళ్లారు. ఈలోగా షర్మిలకు సంఘీభావం తెలపడానికి వైఎస్ విజయమ్మ బయలుదేరారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆమెను లోటస్ పాండ్‌లోనే గృహ నిర్భంధం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ, షర్మిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ నిరాహార దీక్ష చేపట్టారు. నాంపల్లి కోర్టు నుంచి బయటకు వస్తున్న షర్మిల పలు సెక్షన్ల కింద కేసు షర్మిలపై 143, (గుమిగూడటం) 341 (అక్రమ నిర్బంధం), 506 (బెదిరింపులు), 509 (మహిళ లను దూషించడం), 336 (ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించడం), 353 (పోలీసు విధులకు ఆటంకం కలిగించడం), 382 (దొంగతనం), 149 (అక్రమ సమావేశం), 290 (పబ్లిక్ న్యూసెన్స్, దూషించడం) సెక్షన్ల కింద పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలతో పాటు 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె పీఆర్ఓ శ్రీనివాస్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్సార్‌నగర్ ఠాణాకు వచ్చిన ప్రభుత్వ వైద్యులు షర్మిలకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను నాంపల్లిలోని 14వ ఏసీఎంఎం ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ విధించాలని కోరారు. అయితే షర్మిలపై తప్పుడు కేసులు పెట్టారని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. న్యాయమే గెలిచింది: విజయమ్మ షర్మిలకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసిన తర్వాత వైఎస్ విజయమ్మ దీక్ష విరమించారు. న్యాయమే గెలిచిందని, తాము చట్టాన్ని గౌరవిస్తామని ఆమె పేర్కొన్నారు. ఎస్సార్‌నగర్ పీఎస్‌కు బ్రదర్ అనిల్ షర్మిలను పరామర్శించేందుకు ఆమె భర్త అనిల్ ఎస్సార్‌నగర్ పీఎస్‌కు వచ్చారు. సమస్యలపై పాదయాత్ర చేస్తున్న షర్మిలపై దుర్మార్గంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కార్యకర్తలపై లాఠీచార్జి షర్మిల అరెస్టు వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కొందరు యువకులు స్టేషన్ ఎదురుగా ఉన్న భవ నంపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు కార్యకర్తలు స్టేషన్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా లాఠీచార్జి చేశారు. షర్మిల అరెస్టును ఖండించిన కిషన్‌రెడ్డి షర్మిల అరెస్టును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. ఒక మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన వాహనంలో ఉండగానే క్రేన్‌తో లాక్కెళ్లడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రధాన అజెండాగా టీఆఎస్ఆర్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కారవాన్‌కు నిప్పంటించిన వారిపై కేసు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా శివారులో షర్మిల కారవాన్‌ను అడ్డుకుని పెట్రోల్ పోసి నిప్పంటించిన వారిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జల్లీ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు తొగరు చెన్నారెడ్డితో పాటు మరికొంత మందిపై 427, 435 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది: షర్మిల అంతకుముందు ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ వద్ద షర్మిల మాట్లాడుతూ టీఆర్ఎస్పై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులు గూండాల్లా మారారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలా పని చేస్తుందో టీఆర్ఎస్కు పోలీసులు అదే విధంగా పని చేస్తున్నారు. టీఆర్ఎస్ బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఒక ఆడ పిల్లను ఈ విధంగా అరెస్టు చేయించడం సీఎం కేసీఆర్‌కు తగునా? నన్ను బలవంతంగా ఎందుకు అరెస్టు చేశారో ప్రజలకు చెప్పాలి. అసలు నాపై ఎందుకు దాడి చేస్తున్నారు. పాదయాత్రను కావాలనే అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకూడదా? అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?’ అంటూ షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల అరెస్టు తీరుపై గవర్నర్ ఆందోళన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్, అందుకు దారి తీసిన పరిణామాల పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల అరెస్టు తీరు పట్ల, ఆమె భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల లోపల ఉండగా, కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు తెలిపారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు.. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరముందని గవర్నర్ పేర్కొన్నారు. -
8 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్యవిద్యా రంగ చరిత్రలో మంగళవారం అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్లో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రారంభించనున్నారు. తద్వారా సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం పట్టణాల్లోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్ తొలి విద్యాసంవత్సరం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం దేశ చరిత్రలోనే అత్యంత అరుదైన సందర్భమని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో ఉస్మానియా (1946), గాంధీ(1954) దవాఖానాలు ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఆవిర్భవించే నాటికే ఉన్నాయి. గత ప్రభుత్వాలు 57 ఏళ్లలో కాకతీయ(1959), ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశాయి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు రోగులకు అందనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వీటిల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను కలుపుకొని మొత్తం 35 వైద్య విభాగాలు సేవలందించనున్నాయి. 449 మంది డాక్టర్లు, 600 మందికిపైగా పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. పెద్ద వ్యాధి వచ్చినా రోగులు హైదరాబాద్ వరకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా సమీపంలోనే నాణ్యమైన వైద్యం అందే అవకాశం ఉంది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గత ఎనిమిదేళ్లలో మూడు రెట్లకుపైగా పెరిగాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు పెరిగాయి. పెద్దమొత్తం ఖర్చుతో వైద్య విద్యను విదేశాల్లో అభ్యసించే పరిస్థితులు తప్పనున్నాయి. -
అనుమానం వద్దు.. భేటీ 5నే!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ఈ నెల 5న పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో యథావిధిగా జరుగుతుందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దసరా రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌కు చేరుకోవాలని ఆహ్వాని తుల జాబితాలోని వారికి సూచించారు. మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దసరా రోజు జరిగే టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంపై దాని ప్రభావం ఉండదని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశానికి ఆహ్వానాలు అందినవారు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిర్దేశిత సమయానికి రావాలని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణభవన్‌లో ఈ నెల 5న జరిగే ఈ భేటీకి రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా పరిషత్, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, టీఆర్ఎస్ 33 జిల్లాల అధ్యక్షులు హాజరుకావాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు. 5న మధ్యాహ్నం 2.30లోగా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ముగించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలంగాణభవన్ వర్గాలు వెల్లడించాయి. కొత్త జాతీయ పార్టీపై టీఆర్ఎస్లో ఉత్కంఠ కొత్త జాతీయపార్టీ ఏర్పాటుపై ఈ నెల 5న కీలక ప్రకటన చేసేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనుండటంతో కొత్తపార్టీ రూపురేఖలు, తీరుతెన్నులపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కొత్తపార్టీ పేరు, జెండా, ఎన్నికల చిహ్నం మొదలుకుని ఎజెండా తదితరాలపై ఆసక్తి కనిపిస్తోంది. అదే సమయంలో కొత్త జాతీయపార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కేసీఆర్ వేసే అడుగులు, ఎత్తుగడలు, పార్టీ భవిష్యత్తు తదితరాలపై పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ లాంఛనంగా ప్రకటన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న వివిధ పార్టీల నాయకులకు ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే అతిథుల జాబితాపై మంగళవారం ఉదయానికి స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేత చరిత్ర సృష్టించారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జాతీయ రాజకీయాలు చర్చించేందుకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆదివారం కేసీఆర్‌తో కుమారస్వామి ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. వీరిద్దరూ దాదాపు 3 గంటల పాటు నేషనల్ పాలిటిక్స్‌పై చర్చించారు. ఇక, భేటీ అనంతరం మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. ప్రస్తుతం దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను. దేశానికి తెలంగాణ మోడల్ కానుంది. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక అవసరం. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను సైతం తప్పుపడుతున్నారు. నిరుదోగ్యం పెరిగిపోయిందని, రూపాయి విలువ పతనమైందని, ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ అమ్మేస్తోందని ఆరోపించారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ కావాలని దేశ ప్రజలను కోరారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల సీఎంలు, కీలక నేతలను కలుస్తున్నారు. -
Telangana CM: ప్రగతిభవన్ నిర్మాణ ఖర్చెంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధికార నివాసం ‘ప్రగతిభవన్’ నిర్మాణానికి రూ.45.91 కోట్లు వ్యయమైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. 2016 మార్చిలో ప్రగతిభవన్ నిర్మాణాన్ని ప్రారంభించి అదే ఏడాది నవంబర్‌లో పూర్తి చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ తెలిపింది. ప్రగతిభవన్ నిర్మాణ వ్యయం వివరాలు తెలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. ఆర్ అండ్ బీ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.