TSRTC Strike
-
‘సమ్మె’ శాలరీ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. గతేడాది జరిగిన ఆర్టీసీ సమ్మె కాలానికి సంబంధించి వేతనానికి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీకి రూ.235 కోట్ల మొత్తాన్ని ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25 వరకు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. తొలుత సమ్మెను ప్రభుత్వం పట్టించు కోకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేప ట్టింది. అదే సమయంలో కొందరు ఉద్యోగులు ఆత్మహత్య చేసు కోగా, దాదాపు 30 మంది గుండెపోటుతో చనిపోయారు. చివరకు కార్మిక సంఘాలు సమ్మెను విరమించాయి. అప్పటివరకు సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. అదే సమయంలో సమ్మె కాలానికి వేతనం కూడా ఇవ్వనున్నట్టు, ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆమేరకు ప్రభుత్వం సమ్మె కాలానికి వేతనాల కోసం తాజాగా రూ.235 కోట్లు విడుదల చేసింది. -
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ స్థితిని గాడిలో పెట్టడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనే విషయం మరోమారు రుజువైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చెప్పిన విధంగా సమ్మె కాలానికి సంబంధించిన జీతాల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం శుభపరిణామం అన్నారు. (ఒక్క కార్మికుడిని సస్పెండ్ చేయలేదు) కాగా.. సమ్మె కాలానికి జీతాల చెల్లింపుల కోసం రూ. 235 కోట్లు విడుదల చేసి ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని పువ్వాడ తెలిపారు. ఇది ఆయన పెద్ద మనసుకు నిదర్శనమన్నారు. ఒకే దఫాలో నిధులను విడుదల చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. మార్చి 31వ తేదీలోగా సమ్మె కాలం జీతభత్యాలు ఉద్యోగులకు చెల్లించనున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ అభ్యున్నతి కోసం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల బాగోగుల కోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, సంస్థ ఆర్థిక స్థితిని మరింత మెరుగు పరచడానికి సమిష్టిగా ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో చెప్పినట్లుగానే బడ్జేట్‌లో ఆర్టీసీకి రూ. 1000 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. సంస్థ పురోగతికై అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేసి సీఎం ఆశించిన ఫలితాలు తీసుకురావాలని మంత్రి సూచించారు. -
‘సమ్మె’లో కుమ్మేశారు!
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పుడు బస్సుల్లో టిక్కెట్ తీసుకొనే బాధ్యత ప్రయాణికుడిదే కావడం వల్ల కండక్టర్లకు కొద్దిగా ఊరట లభించింది. కానీ గతంలో లెక్కల్లో ఒక్క రూపాయి తేడా వచ్చినా..ఉద్యోగంఊడిపోవలసిందే. ప్రతినిత్యం ఎంతోమంది కండక్టర్లు అభద్రతతో పనిచేసేవారు. కానీ అలాంటి ఆర్టీసీలో కొందరు అధికారులే తమ చేతివాటాన్ని ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆర్టీసీ ఆడిట్ విభాగం చేపట్టిన గణాంకాల్లో నగరంలోని పలు డిపోల్లో లక్షలాదిరూపాయలు లెక్కల్లో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సమ్మె కాలంలో డిపో స్థాయి అధికారులే అక్రమాలకు పాల్పడి ఉండవచ్చుననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె మొదలైన కొద్ది రోజుల పాటు ఎలాంటి టిక్కెట్లులేకుండానే బస్సులుసడిపారు. ఆ తరువాత ప్రింటెడ్ టిక్కెట్లు ముద్రించినప్పటికీ వాటిపైన వచ్చిన ఆదాయాన్ని పూర్తిస్థాయిలో జమ చేయకుండా కొందరు డిపోమేనేజర్లు తమ జేబుల్లోవేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అద్దె బస్సుల యజమానులు సైతం ఆర్టీసీ డిపోల్లో ట్యాంకుల కొద్దీ డీజిల్ నింపుకొని ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తమకు నచ్చిన రూట్లలో బస్సులు నడుపుకొన్నారు. వచ్చిన సొమ్మును ఆర్టీసీకి అద్దె చెల్లించకుండానే ఎగురేసుకెళ్లారు. తీవ్ర నష్టాల్లో కూరుకొనిపోయి ఉన్న ఆర్టీసీలో కొంతకాలంగా ప్రక్షాళన పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆడిట్ విభాగం చేపట్టిన డిపోస్థాయి తనిఖీల్లో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ‘ఆర్టీసీలో అవినీతి, అక్రమాలకు తావు లేదు. ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది. కానీ సమ్మె కాలంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది.’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షల్లోనే కాజేశారు.... నగర శివార్లోని ఒక డిపోలో రూ.5 లక్షలు తక్కువ ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు బస్సులు నడిపే మరో డిపోలోనూ సుమారు రూ.7 లక్షల వరకు సొమ్ముకు సరైన లెక్కలు లేవు. అలాగే నగరంలోని మరో కీలకమైన డిపోలోనూ ఇదే పరిస్థితి. సుమారు 56 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మె కాలంలో బస్సులు నడపడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ డిపో స్థాయి నిర్వహణ కొరవడింది. ప్రింటెడ్ టిక్కెట్లపైన లెక్కాపత్రం లేకుండాపోయింది. ఏ రోజుకు ఆ రోజు నడిపిన బస్సులు, వాటిపైన వచ్చిన ఆదాయం పైన కూడా జవాబుదారీతనం లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఇప్పుడు ఆడిటింగ్‌లో తలలు పట్టుకుంటున్నారు. నిజానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు నగరంలోని అన్ని డిపోల్లో ప్రతి రోజు 1500 నుంచి 2000కు పైగా బస్సులు నడిచాయి. ప్రయాణికులు సైతం ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. ఆ సమయంలో అక్రమాలకు పాల్పడకుండా తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లపైన పోలీసులు, ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించడం సత్ఫలితాలను ఇచ్చింది. కానీ సాధారణ రోజుల్లో ప్రతిరోజు కనీసం రూ.కోటి ఆదాయం వచ్చే ఆర్టీసీలో సమ్మె రోజుల్లో రూ.25 లక్షల కంటే ఎక్కువ రాలేదు. నిజానికి అద్దె బస్సుల యజమానుల నుంచి రావలసిన సొమ్ము రాకపోవడం కూడా ఇందుకు కారణమే. అదే సమయంలో కొందరు అధికారుల చేతివాటం కూడా అక్రమాల పర్వానికి ఆజ్యం పోసినట్లయిందనే ఆరోపణలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. నిద్రపోయిన నిఘా వ్యవస్థ... ఆర్టీసీ స్వీయ నిఘా వ్యవస్థ విజిలెన్స్ విభాగంసమ్మె కాలంలో నిస్తేజంగా ఉండడం కూడా ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు డిపోలపైన సరైన నిఘా ఉంచకపోవడం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో పట్టించుకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా మారింది. సాధారణంగా విజిలెన్స్ విభాగం ఇచ్చే నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు చేపడుతారు. కానీ సమ్మె కాలంలో అలాంటి పారదర్శకమైన వ్యవస్థ ఏ స్థాయిలోనూ పని చేయకపోవడం గమనార్హం. -
ఆర్టీసీ ప్రక్షాళన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రక్షాళనకు కసరత్తు మొదలైంది. ఎవరెక్కడ పనిచేస్తున్నారో, వారికిచ్చే వేత నానికి తగ్గ పని జరుగుతోందో లేదో, ఏ విభాగంలో ఎందరున్నారో వంటి విషయాలపై ఇప్పటివరకు లోపించిన జవాబుదారీతనాన్ని తిరిగి తీసు కొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీ సమ్మె అనంతరం టికెట్ ధరల పెంపుతో ఇప్పటికే సంస్థ ఆదాయం పెరగ్గా మరిన్ని చర్యలతో సంస్థకు మరింత ఊపు తెప్పించనుంది. కొన్ని విభాగాల్లో సిబ్బందికి సరైన పనే లేదు. కొన్ని చోట్ల తీవ్ర పని ఒత్తిడి ఉంది. ఇప్పుడు 800 బస్సులను తగ్గిం చడం, కొత్తగా సరుకు రవాణా విభాగాన్ని ప్రారంభిస్తుం డటం, త్వరలో 1,334 అద్దె బస్సులు కొత్తగా ఆర్టీసీ లోకి వస్తుండటం.. వెరసి మొత్తం సంస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణ యించింది. దశల వారీగా అమలు చేయనుంది. తొలుత డిపో స్థాయిలో సిబ్బందిని సర్దుబాటు చేయడంతో ప్రారంభించి అనంతరం ఆర్టీసీలో అనుబంధంగా ఉన్న విభాగాల్లో అవసరం లేని వాటిని తొలగించనుంది. సిబ్బంది పంపకాలు...: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీకి 97 డిపోలు ఉండగా వాటిల్లో కొన్ని డిపోలకు అవసరానికి మించి ఎక్కువ బస్సులు కేటాయించారు. దీంతో అవి నష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 800 బస్సులను సంస్థ తగ్గిస్తోంది. తొలుత వెయ్యి బస్సులు అనుకున్నా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటిని 800కు తగ్గించాలని భావిస్తోంది. బస్సుల సంఖ్య తగ్గడంతోపాటు కండిషన్లో లేని దాదాపు మరో 400 డొక్కు బస్సులను తొలగించనుంది. అప్పుడు డిపోల్లో సిబ్బంది అవసరం కూడా తగ్గుతుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న డిపోలకు ఎక్కువ బస్సులు కేటాయించి తక్కువ డిమాండ్ ఉన్న డిపోలకు తక్కువ బస్సులు ఉండేలా అధికారులు హేతుబద్ధీకరించనున్నారు. అంతగా పనిలేని సిబ్బందిని వేరే చోటకు పంపనున్నారు. మరో 15 రోజుల్లో 1,334 అద్దె బస్సులు కొత్తగా రాబోతున్నాయి. వాటి డ్రైవర్లు, మెకానిక్‌లను వాటి యజమానులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున ఆర్టీసీపై అంతమేర భారం తగ్గనుంది. గతంలో ఇలా మిగిలిపోయే సిబ్బందిని సర్దుబాటు చేయకపోవడంతో వారు పనిలేకుండా డిపోల్లో మిగిలిపోయారు. అలా ఉన్న పాత వారితోపాటు ఇప్పుడు కొత్తగా పని తగ్గే వారిని వేరే డిపోలకు సర్దుబాటు చేయనున్నారు. అప్పటికీ సిబ్బంది మిగిలితే సరుకు రవాణా విభాగం లాంటి వాటికి పంపనున్నారు. బస్ బాడీ యూనిట్ ఉండదా? ప్రస్తుతం ఆర్టీసీకి సొంతంగా మియాపూర్‌లో బస్ బాడీ వర్క్‌షాప్ ఉంది. అందులోనే బస్సుల నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ వర్క్‌షాప్ వల్ల ఉపయోగంకన్నా ఖర్చే ఎక్కువగా ఉంటోందని ఆర్టీసీ గుర్తించింది. దాని బదులు ప్రైవేటు కంపెనీలకు వర్క్‌షాప్ అప్పగిస్తే ఖర్చు తక్కువగా ఉంటుందని గుర్తించింది. దీంతో క్రమంగా బస్‌బాడీ వర్క్‌షాపును వదిలించుకునే ఆలోచనలో ఉంది. అలాగే హైదరాబాద్ శివార్లలోని హకీంపేట, వరంగల్‌లో ఆర్టీసీకి సొంత శిక్షణ కేంద్రాలు ఉండగా వాటి అవసరం లేదని సంస్థ భావిస్తోంది. వరంగల్‌లోని కేంద్రాన్ని మూసేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో ఉంది. ప్రక్షాళన అవసరం... ఆర్టీసీలో ఉన్న గందరగోళాన్ని వెంటనే నివారించేందుకు వీలుగా దిద్దుబాటు చర్యలు అవసరమని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన సంస్థ ఈడీలతో భేటీ అయ్యారు. డిపోలవారీగా ఉన్న సిబ్బంది, వారిపై ఉన్న పని ఒత్తిడిని గుర్తించి వెంటనే హేతుబద్ధీకరించాలని ఆదేశించారు. ఇతర అనుబంద యూనిట్ల అవసరం, వాటిని తొలగిస్తే ఎదురయ్యే సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి హామీల అమల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు. జనవరి మొదటి వారంలో అందుబాటులో ఉన్న వాహనాలతో సరుకు రవాణా విభాగాన్ని ప్రారంభించాల్సిందేనని స్పష్టం చేశారు. -
పైసలొచ్చే రూట్లలోనే ఆర్టీసీ బస్సులు
ఆదాయం లేదంటూ అకస్మాత్తుగా వందల రూట్లలో ఆర్టీసీ సర్వీసుల్ని రద్దు చేశారు. సామాన్యుల కష్టాలు పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బస్సులురద్దు చేయడంతో గత వారం పది రోజులుగాప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా నిరుపేద కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, చిరుద్యోగులు ఆర్టీసీ బస్సులు రాక..ఎక్కువ చార్జీలు చెల్లించి మెట్రో రైలు, క్యాబ్‌లు, ఆటోలు ఎక్కలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట దాదాపు 6 వేల ట్రిప్పులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ‘సాక్షి’ మంగళవారంపరిశీలన జరపగా...సామాన్య ప్రయాణికుల వెతలెన్నో వెలుగుచూశాయి. ఇప్పటికైనా అధికారులు పునరాలోచన చేసి ట్రిప్పుల సంఖ్య పెంచాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. సాక్షి,సిటీబ్యూరో/నెట్వర్క్: తెల్లవారుజామున 5 గంటలకు మేడిపల్లి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సును రద్దు చేశారు. ఆ సమయంలో చెంగిచర్ల, మేడిపల్లి, బోడుప్పల్, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఇప్పుడు సిటీ బస్సు సదుపాయం లేదు. సికింద్రాబాద్ నుంచి నాంపల్లి మీదుగా మెహిదీపట్నం వరకు నడిచే (49ఎం) బస్సు కూడా రద్దయింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అడ్డగుట్ట, మహేంద్ర హిల్స్, గౌతమ్‌నగర్ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకొనే (సికింద్రాబాద్– సికింద్రాబాద్ 38 ఈఎక్స్) బస్సును ఆదాయం రావడం లేదనే కారణంతో రద్దు చేశారు. దీంతో ఉదయాన్నే సికింద్రాబాద్‌కు చేరుకొనే కూలీలు, చిరువ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు. రాత్రి వేళల్లోనూ ఇప్పుడు బస్సులు అందుబాటులో ఉండడం లేదు. సికింద్రాబాద్ నుంచి కోఠి మీదుగా శాలిబండకు వెళ్లే (8ఏ), సికింద్రాబాద్– బోయిన్పల్లి (26ఎన్), తదితర రూట్లలోనూ ట్రిప్పుల సంఖ్యను తగ్గించారు. చిలుకానగర్, హేమానగర్, ఉప్పల్, తార్నాక మీదుగా నాంపల్లికి వెళ్లే (136), హేమానగర్– కోఠికి రాకపోకలు సాగించే (3ఎన్) రూట్లోనూ ఉదయం, రాత్రి బస్సుల సంఖ్యను తగ్గించారు. కేవలం ఈ రూట్లలోనే కాదు నగరంలోని 1100కుపైగా రూట్లలో ట్రిప్పుల రద్దుకు ఆర్టీసీ భారీ కసరత్తు చేపట్టింది. ఇప్పటికే పలు డిపోల్లో 100 నుంచి 200కుపైగా ట్రిప్పులను రద్దు చేశారు. మరిన్ని డిపోల్లో ట్రిప్పుల రద్దుపైన ప్రణాళికలను రూపొందిస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోల పరిధిలో సుమారు 6వేలకుపైగా ట్రిప్పులు రద్దు కానున్నట్లు అంచనా. అతితక్కువ మంది ఉన్న మార్గాల్లోనే బస్సులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ ఉదయం, రాత్రి వేళల్లో బస్సులు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకుఉదయం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు రద్దీ ఉంటుంది. సికింద్రాబాద్– అఫ్జల్‌గంజ్ మధ్య బస్సులు ప్రయాణికుల రద్దీకిఅనుగుణంగా ఉన్నాయి. కానీ సికింద్రాబాద్ నుంచి రీసాలాబజార్కు, అఫ్జల్‌గంజ్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నడిచే బస్సులను తగ్గించారు. పలు డిపోల్లో ట్రిప్పుల రద్దు ఇలా.. ♦ కుషాయిగూడ డిపోలో 240 ట్రిప్పులు రద్దు చేశారు. కుషాయిగూడ నుంచి అఫ్జల్‌గంజ్ (3కే) ఏకంగా రూట్లో 16 ట్రిప్పులు రద్దయ్యాయి. దీంతో ఈ రూట్లో దీంతో కుషాయిగూడ, ఈసీఐఎల్, హబ్సిగూడ మీదుగా కోఠికి వెళ్లే ప్రయాణికులు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ మీదుగా సికింద్రాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి కోఠికి వెళ్లాల్సివస్తోంది. లేదా సెవెన్ సీటర్ ఆటోలు, షేరింగ్ ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ♦ 16సీ రూట్లో రెండు ట్రిప్పులు, 16ఏ రూట్లో మరో 2 ట్రిప్పులను రద్దు చేశారు. 16ఏకే రూట్లో 3 ట్రిప్పులు రద్దయ్యాయి. ♦ 24ఎస్ రూట్లో 4 బస్సులను రెండింటికి తగ్గించారు. ♦ 17ఎస్ రూట్లో తిరిగే 10 బస్సులలో 5 తగ్గాయి. 117 రూట్లో 2 బస్సులను కుదించారు. ♦ కుషాయిగూడ నుంచి అఫ్జల్‌గంజ్‌కు ఉదయం 4:30 గంటలకు వెళ్లే బస్సు ప్రస్తుతం ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. ♦ ఉప్పల్ డిపోలో మొత్తం 150 బస్సులు ఉన్నాయి. 1,553 ట్రిప్పులు నడుస్తాయి. ఇందులో 168 ట్రిప్పులు రద్దు చేశారు. ♦ ఉప్పల్– కోఠి (115 రూట్), ఉప్పల్– మెహిదీపట్నం (113 ఎం), ఉప్పల్– కూకట్పల్లి, ఉప్పల్–వేవ్‌రాక్, ఉప్పల్–కొండాపూర్ తదితర రూట్లలో ట్రిప్పులను రద్దు చేసినట్లు డిపో మేనేజర్ వెంకారెడ్డి తెలిపారు. ♦ హయత్‌నగర్– 1, 2 డిపోలలో 30 ట్రిప్పులు రద్దు చేశారు. త్వరలో మరిన్ని ట్రిప్పులను రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ♦ కంటోన్మెంట్ డిపోలో మొత్తం 137 బస్సులు ఉండగా, సుమారు 30 బస్సుల వరకు తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ♦ కాచిగూడ డిపో పరిధిలో 27 సర్వీసులను రద్దు చేశారు. అందులో ఉదయం 3:30 గంటలకు బయలుదేరే బస్సులన్నింటినీ గంట ఆలస్యంగా ఉదయం 4:30 గంటలకు నడుపుతున్నారు. ప్రతి రోజు కనీసం 50 ట్రిప్పులు రద్దు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఎం శ్రీనివాస్తెలిపారు. ♦ బర్కత్‌పురా డిపో పరిధిలో ప్రస్తుతం 7 బస్సు సర్వీసులను నిలిపివేశారు. ♦ కూకట్పల్లి డిపో పరిధిలో 12 బస్సులు, 18 సర్వీసులను రద్దు చేశారు. జగద్గిరిగుట్ట నుంచి 10కె, 19కె, 158 రూట్లలో కొన్ని సర్వీసులను తగ్గించినట్లు డిపో సిబ్బంది చెప్పారు. డిపోలకే పరిమితమైన 500 బస్సులు.. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రస్తుతం 3,550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ట్రిప్పుల రద్దుతో ఇప్పటికే 500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దశలవారీగా మరిన్ని బస్సులను తగ్గించనున్నారు. లాభాలు లేని రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గించి లాభాలు వచ్చే మార్గాల్లో పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఆక్యుపెన్సీ సైతం 72 శాతం వరకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కి.మీపై రూ.16 చొప్పున రోజుకు సుమారు రూ.96 లక్షల నష్టాలను చవిచూస్తోంది. ఆదాయం లేని మార్గాల్లో, సమయాల్లో బస్సులు నడపడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఉదయం 4 నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు రాత్రి 10 నుంచి 11 గంటల వరకు పలు రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారు. బస్సుల్ని తగ్గిస్తున్నారు.. డిపోలవారీగా బస్సులను తగ్గిస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రతి డిపోలో పది నుంచి 50 వరకు బస్సులను తగ్గిస్తున్నారు. కార్గోకు ఈ బస్సులను వాడే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. ఈ విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. డ్యూటీలు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రవాణా వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమవుతుంది. – నగేష్ పటేల్, డ్రైవర్, కంటోన్మెంట్ -
నగరంలో కనీస బస్సు చార్జీ రూ.10
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల పిడుగు పడింది. ఆర్డినరీ కనీస చార్జీలను ఏకంగా రూ.5 నుంచి రూ.10కి పెంచారు. ఆ తర్వాత మూడో స్టేజీ నుంచి ఒక టికెట్‌పై రూ.5 పెంచేశారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ కనీస చార్జీలను యథావిధిగా రూ.10 కొనసాగిస్తూనే... మూడో స్టేజీ నుంచి రూ.5 చొప్పున పెంచారు. ఎక్కువ దూరమున్న రూట్లలో కిలోమీటర్లు పెరుగుతున్న కొద్దీ చార్జీల పెంపు రూ.5 నుంచి రూ.10 వరకు ఉంటుంది. మెట్రో డీలక్స్ బస్సుల్లో కనీస చార్జీలను రూ.10 నుంచి రూ.15కు పెంచారు. ఆ తర్వాత మెట్రో ఎక్స్‌ప్రెస్ తరహాలోనే చార్జీల పెంపు వర్తిస్తుంది. మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల చార్జీలను కొంతమేరకు తగ్గించనున్నారు. ఈ చార్జీల తగ్గింపుపై మరో వారం రోజుల్లో స్పష్టత రానుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. చార్జీల పెంపు వల్ల గ్రేటర్‌లోని 32లక్షల మంది ప్రయాణికులపై రోజుకు రూ.71 లక్షల భారం పడనుంది. ప్రతినెలా రూ.21.3 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ.255.6 కోట్ల వరకు ఈ భారం ఉంటుంది. ప్రస్తుత చార్జీలపై 23.5 శాతం చొప్పున పెంచినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. చిల్లర సమస్యలను అధిగమించేందుకు వీలుగా హేతుబద్ధీకరించినట్లు పేర్కొన్నారు. చార్జీల పెంపు వల్ల ప్రతిరోజు రూ.76లక్షల ఆదాయం లభించినప్పటికీ.. నష్టాలను పూర్తిస్థాయిలో అధిగమించడం సాధ్యం కాబోదని ఈడీ తెలిపారు. ప్రస్తుతం ప్రతినెలా రూ.45 కోట్ల నష్టం వస్తోంది. చార్జీల పెంపు వల్ల రూ.21.3 కోట్లు అదనంగా లభిస్తుంది. అయినా మరో రూ.23.7 కోట్ల లోటు ఉంటుంది. నష్టాలను పూర్తిగా తగ్గించుకునేందుకు ట్రిప్పులను తగ్గించడంతో పాటు ఉదయం, రాత్రి ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేని సమయాల్లో షటిల్ సర్వీసులను తగ్గించనున్నట్లు ఈడీ పేర్కొన్నారు. అవసరం లేని ట్రిప్పులను తగ్గించడంతో పాటు, అవసరమైన మార్గాల్లో పెంచడం వల్ల ఆక్యుపెన్సీ రేషియోను 69 శాతం నుంచి 73శాతానికి పెంచుకునేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబర్ జీతం విడుదల
సాక్షి, హైదరాబాద్: సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబర్ జీతం సోమవారం విడుదలైంది. సమ్మె నేపథ్యంలో 49,700 మం దికి డబ్బులు లేవనే కారణంతో జీతాన్ని జమ చేయలేదు. అలాగే సమ్మె సమయంలో అందు లో పాల్గొనని వారికి కూడా ఆ జీతాన్ని ఇవ్వలేదు. కొద్ది రోజుల కిందట సమ్మెలో లేనివారి కి మాత్రం చెల్లించారు. ఆదివారం ఉద్యోగుల తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వెం టనే అందరికీ జీతాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే రూ.100 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మొత్తానికి మరికొంత కలిపి సోమవారం ఉద్యోగుల ఖాతాల్లోకి జీతం జమైంది. -
మరోసారి చార్జీలు పెంచే అవకాశం
సాక్షి, హైదరాబాద్ : గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ దాదాపు రూ.928 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈసారి అది రూ. వేయి కోట్లకు మించుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. తాజాగా 52 రోజుల పాటు జరిగిన సమ్మె వల్ల పరిస్థితి అంతా అస్తవ్యస్తమై ఆ నష్టం రూ.1,200 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అధికారులు ఇదే విషయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్‌కు కూడా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నష్టాలు ఈస్థాయిలో నమోదు కాలేదు. అప్పట్లో గరిష్టంగా రూ.718 కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పుడు ఒక్క టీఆఎస్ఆర్టీసీ నష్టాలే రూ.1200 కోట్లకు చేరుకునే స్థితి ఉత్పన్నం కావటం ఆందోళన పరుస్తున్న విషయం. పెరిగిన టికెట్ల ధరలతో రూ.850 కోట్ల మేర ఆదాయం పెరగనుంది. సమ్మె వల్ల అదనపు నష్టం నమోదై ఉండకపోతే ఆర్టీసీ స్థితి మెరుగ్గా ఉండేది. ఇప్పుడు ఆశించిన అదనపు ఆదాయం వచ్చినా నష్టాలదే పైచేయి కానుంది. మరోసారి పెంచే యోచన ప్రస్తుత టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులపై భారం పడనున్నప్పటికీ, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరోసారి కూడా చార్జీలు పెంచే అవకాశం ఉందనిపిస్తోంది. మరో 10 % మేర ధరలను సవరిస్తే నష్టాలను వీలైనంత మేర తగ్గించుకుని బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని అధికారుల అంచనా. మరో ఏడాది తర్వాత ప్రభుత్వానికి చార్జీలు పెంపుపై ప్రతిపాదించాలని యోచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితిపై అంచనాకు వచ్చినందునే... సాధారణంగా ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు అనగానే ఇటు ప్రజలతోపాటు అటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భగ్గుమనటం సహజం. ఈసారి ఆ స్థాయిలో నిరసనలు లేవు. సమ్మె వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డ జనం, నిరసనల్లో ఆర్టీసీ కార్మికులు చెప్పిన మాటలతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై ఓ అంచనాకొచ్చినట్టు కనిపిస్తోంది. బస్సు చార్జీలు పెంచితే తప్ప పరిస్థితి చక్కబడదన్న మాటలు ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. ఇక రాజకీయ పార్టీలు కొన్ని విమర్శలు చేసినా .. నిరసనల వరకు వెళ్లకపోవటం గమనార్హం. బస్సు చార్జీల పెంపు వల్ల ఇతర వస్తువుల ధరలు కూడా భగ్గుమంటాయన్న ఆందోళన జనంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూరగాయలను బస్సుల్లో తరలిస్తుంటారు. చార్జీల మోతతో వాటి ధరలు కూడా పెంచుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఆర్టీసీ సమ్మెపై పిల్ డిస్మిస్
సాక్షి, హైదరాబాద్: ‘లంక దహనం తర్వాత వి భీషణుడిని రాజ్యాధిపతిని చేశారు. ఏదేమైనా ఆర్టీసీ సమస్యకు ముగింపు రావడం ఆనందం గా ఉంది’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీకి రూ.100 కోట్లు ఇస్తామని, రూట్లను ప్రైవేటీకరణ చేయబోమని, ఈ వ్యవహారాన్ని లేబర్ కోర్టుకు తీసుకుపోబోమని ప్రభుత్వం ప్రకటించడంపై ధర్మాసనం ప్రస్తావించింది. సిబ్బందిని విధుల్లో చేర్చుకునేందుకు ప్రభు త్వం సమ్మతి తెలిపినందున పిల్‌పై విచారణ అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం, సమ్మె విరమించినా విధుల్లోకి చేర్చుకోవట్లేద ని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు దాఖలు చేసిన వ్యక్తిగత వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం మరోసారి విచారించింది. ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాల్లోని ఒకరికి ఉద్యో గం ఇస్తామని, సెప్టెంబర్ నెలకే కాకుండా సమ్మె కాలానికి కూడా జీతాలు ఇస్తామని ప్ర భుత్వం ప్రకటించడాన్ని ధర్మాసనం గుర్తు చే సింది. ఇలాంటి అంశాలపై పిటిషనర్లు పిల్స్ ద్వారా పోరాటం చేయాల్సిన అవసరం రా కుండా యూనియన్లు తమ విధులు నిర్వ హిం చుకోవాలని ధర్మాసనం హితవు పలికింది. పి టిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై స్పం దించని ధర్మాసనం పిల్‌ను డిస్మిస్ చేసింది. -
బస్సు చార్జీలు పెరిగాయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడున్నరేళ్ల తర్వాత బస్సు చార్జీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనడం, ఇదే సమయంలో రాష్ట్రంలో ఆర్టీసీ ఆదాయం తగ్గిపోవడం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) భారం కావడంతో ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచక తప్పలేదు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రస్తుతానికి బస్సు చార్జీల పెంపు మినహా గత్యంతరం లేదంటూ ఆర్టీసీ అధికారులు రెండేళ్లుగా చేస్తున్న విన్నపాలకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో టికెట్ ధరలను ఆర్టీసీ సవరించింది. 2016 జూన్‌లో 10 శాతం మేర టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ... ఇప్పుడు కి.మీ.కు 20 పైసలు చొప్పున పెంచింది. అంటే 18.80 శాతం మేర చార్జీల మోత మోగినట్టయింది. పెరిగిన చార్జీలు మంగళవారం తెల్లవారుజామున తొలి షిఫ్ట్ నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చార్జీలు పెరగడం ఇది రెండోసారి. తాజా పెంపుతో ప్రజలపై సాలీనా దాదాపు రూ. 850 కోట్ల మేర భారం పడనుంది. ఆర్టీసీకి అంతేమొత్తం ఆదాయం పెరగనుంది. కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచితే వార్షిక భారం రూ. 752 కోట్ల మేర ఉంటుందని తొలుత లెక్కలేశారు. గత నెల 28న జరిగిన మంత్రివర్గ సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ సిటీ సర్వీసులు, పల్లె వెలుగు బస్సుల కనీస చార్జీని రెట్టింపు చేస్తూ రూ. 10కి సవరించడం, చిల్లర సమస్య ఉత్పన్నం కాకుండా స్టేజీలవారీగా మొత్తాన్ని రౌండ్ ఆఫ్ చేయడంతో కి.మీ.కు 20 పైసల కంటే ఎక్కువ మొత్తం పెరిగినట్టయింది. ఫలితంగా ప్రజలపై కనీసం రూ. 100 కోట్ల అదనపు భారం పడనుంది. దీంతో తాజా పెంపు భారం రూ. 850 కోట్లకు చేరుతుందని అంచనా. సుదీర్ఘకాలం సమ్మె తర్వాత బేషరతుగా ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతో వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీనికితోడు ముఖ్యమంత్రి ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయడంతో పనితీరులో గణనీయ మార్పు వస్తుందన్న అంచనా ఉంది. దీనివల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని అధికారులు నమ్ముతున్నారు. ఇదే జరిగితే టికెట్ల పెంపుతో వచ్చే అదనపు ఆదాయం రూ. వెయ్యి కోట్లకు చేరుతుందన్న భావన వ్యక్తమవుతోంది. వై.ఎస్. హయాంలో పెరగని చార్జీలు... ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బస్సు చార్జీలు పెరగలేదు. చార్జీల పెంపుతో జనంపై భారం మోపడం కంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయం పెంచుకోవడంతోపాటు సిబ్బంది పనితీరు మెరుగుపరచడం, ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే పద్ధతులను అవలంబించారు. దీంతో ఆర్టీసీకి పెద్ద ఇబ్బంది లేకుండా పోయింది. అయితే ఆయన మరణానంతరం వరుసగా ఏటా టికెట్ చార్జీలు పెంచుతూ పోయారు. 2010లో ఏకంగా 28.41 శాతం పెంచి జనంపై రూ. 196 కోట్ల భారం మోపారు. 2011లో 10 శాతం పెంచారు. ఫలితంగా ప్రజల జేబుకు రూ. 221 కోట్ల మేర చిల్లు పడింది. 2012లో 12.50 శాతం, 2013లో 9.50 శాతం మేర టికెట్ చార్జీలు పెంచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి రెండున్నరేళ్లలో సర్కారు టికెట్ చార్జీల పెంపు జోలికి వెళ్లలేదు. అయితే ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి జీతాలు చెల్లించేందుకు కూడా ఇబ్బంది పడే స్థాయికి చేరడంతో వెంటనే టికెట్ చార్జీలు పెంచుకునేందుకు అనుమతించాల్సిందిగా అధికారులు ప్రభుత్వాన్ని కోరడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు 2016లో 10 శాతం చార్జీలు పెంచారు. కానీ అది ఏమాత్రం సరిపోకపోవడంతో కనీసం 15 శాతం నుంచి 20 శాతం మేర పెంచుకునేందుకు అనుమతించాలని ఆ తర్వాత నాలుగు పర్యాయాలు ఆర్టీసీ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు మరోసారి పెంచుకునేందుకు సీఎం అనుమతించారు. దాదాపు అధికారులు కోరిన స్థాయిలోనే పెంపు జరిగింది. కనీస చార్జీలు ఇలా రూ. 10 పల్లె వెలుగు, సిటీలో రూ. 15 ఎక్స్‌ప్రెస్‌లో రూ. 20 డీలక్స్‌లో రూ. 25 సూపర్ లగ్జరీలో -
వేతన సవరణ ఏడాది తర్వాతే..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణను ఏడాది తర్వాత పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఆదివారం ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులున్నా వాటిని అధిగమించి అయినా ఏడాది త ర్వాత కొత్త వేతనాలను ఖరారు చేస్తామని వెల్లడించినట్లు సమాచారం. గతేడాది ఆర్టీసీ ఉద్యోగులకు 16 శాతం ఐఆర్ ప్రకటించారు. వేత న సవరణ గడువు పూర్తై ఏడాదిన్నర గడిచినా అది అమలు కాలేదు. ఇటీవల సమ్మె డిమాండ్లలో అదీ ఓ ప్రధాన అంశమే. అయితే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ప్రభుత్వం కూడా సాయం చే యలేదని ముఖ్యమంత్రి గతంలో పదేపదే పేర్కొనడంతో వేతన సవరణపై ఉద్యోగులు ఆశలు వదులుకున్నారు. కానీ ఆదివారం సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రే ఈ అంశాన్ని ప్రస్తావించి ఏడాది తర్వాత వేతన సవరణ ఉంటుందని ప్రకటించటంతో వారిలో ఉత్సాహం పెరిగింది. మళ్లీ సమావేశమై ఫలితాలను విశ్లేషిద్దాం తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అ మలు చేస్తే ఆర్టీసీ దశ మారుతుందని ప్రకటించిన ముఖ్యమంత్రి... ఆ ఫలితాల విశ్లేషణకు 4 నెలల తర్వాత మళ్లీ ఇదే తరహా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఈ సమావేశానికి ఎవరు హాజరయ్యారో వారినే మళ్లీ పిలిచి ఫలి తాలను తెలుసుకొని కలసి భోజనం చేస్తానని వెల్లడించారు. ఆదివారం సమావేశంలో 27 మంది కార్మికులతో సీఎం ప్రత్యేక టేబుల్‌పై భోజనం చే శారు. ఇందులో రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్, ఎండీ సునీల్‌శర్మ కూడా ఉన్నారు. వెరసి సీఎంతో కలసి 30 మంది విడిగా మాట్లాడుతూ భోజనం చేశారు. ఈ సందర్భంగా చాలా విషయాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్.. అనంతర సమావేశంలో వాటిని ఉటంకిస్తూ ప్రసంగించారు. జేఏసీలో భాగంగా ఉన్నా ఆమెకు చాన్స్ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు నేతృత్వం వహించిన ప్రధా న ప్రతినిధుల్లో సూపర్వైజర్స్ అసోసియేషన్‌కు చెందిన సుధ కూడా కీలకంగా వ్యవహరించారు. అశ్వత్థామరెడ్డి జేఏసీ కన్వీనర్‌గా ఉండగా మిగతా 3 సంఘాల నుంచి ముగ్గురు కో–కన్వీనర్లుగా ఉ న్నారు. వారిలో సుధ కూడా ఒకరు. అయితే సమ్మె కు కారణమైన జేఏసీ నేతలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీఎం వారిని పక్కన పెట్టేశారు. ఆర్టీసీలో వారి జోక్యం లేకుండా చేసే దిశగా సూచనలిచ్చా రు. కానీ సుధ విషయంలో మాత్రం మరో రకం గా వ్యవహరించారు. ఆత్మీయ సమ్మేళనంలో మా ట్లాడాల్సిన అంశాలపై కసరత్తు చేసేందుకు శనివా రం ఉన్నతాధికారులతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆయన సుధను కూడా ఆహ్వా నించారు. ఆర్టీసీలో సమస్యలు, మహిళా ఉద్యోగు ల ఇబ్బందులపై ఆమెతో మాట్లాడారు. ఆత్మీయ సమావేశంలో కూడా ఆమెను ముందు వరుసలో కూర్చోబెట్టి కేసీఆర్ ప్రసంగించడం విశేషం. -
సీఎం కేసీఆర్ వరాల విందు
ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తా. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతి నెలా ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి. అవసరమైన పక్షంలో కార్మికులు రోజుకు అరగంట నుంచి గంట సమయం ఎక్కువ పనిచేయాలి. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ మాత్రమే. ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్లు ఉంటరు. రామాయణ యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముడిని అడగ్గా కలియుగంలో అక్కడక్కడా పుట్టాలని రాముడు సూచించాడు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారు. వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్మికులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఏ ఒక్క రూటులోనూ ఒక్క ప్రైవేటు బస్సుకూ అనుమతి ఇవ్వబోమని హామీ ఇచ్చారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ఏటా రూ. వెయ్యి కోట్ల లాభం సంస్థకు రావాలని, ప్రతి ఉద్యోగీ ఏడాదికి రూ. లక్ష బోనస్ అందుకునే స్థితి రావాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం అందిస్తామని, సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్మికులతో కలసి మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఆర్టీసీ ఉద్యోగులతో భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి పువ్వాడ తదితరులు భోజన సమయంలో కూడా సీఎం కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసు కున్నారు. సీఎం చాలా ఆప్యాయంగా పలకరించడంతో మహిళా కండక్టర్లు తమ సమస్యలను వివరించారు. అత్యంత సహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబం ధించిన ప్రతి అంశం, సమస్యపై అప్పటికప్పుడు సీఎం స్పందిస్తూ వాటిని పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు, డీఎంలు, కంట్రోలర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోవడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సమష్టిగా కష్టపడి సాధించుకున్న తెలంగాణ స్పూర్తితోనే ఆర్టీసీని లాభాలబాట నడిపించాలని కోరారు. తాను రవాణాశాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసి ఆర్టీసీని లాభాల బాట పట్టించానని, నేటికీ తనకు ఆర్టీసీపై ఎంతో ప్రేమ ఉందన్నారు. ఆర్టీసీని బతికించడానికి ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తామని, ఇక అధికారులు, ఉద్యోగులు కలసి పనిచేసి ఆర్టీసీని కాపాడాలన్నారు. నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రూట్లను రీ సర్వే చేయాలని సూచించారు. ఆర్టీసీకి తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతి నెలా ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరతామన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు రెండు నెలలకోసారి డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించాలని, రవాణా మంత్రి నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. అవసరమైన పక్షంలో రోజుకు అరగంట నుంచి గంట సమయం ఎక్కువ పనిచేయాలని ముఖ్యమంత్రి కోరగా కార్మికులు హర్షధ్వానాలతో అంగీకరించారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని సీఎం ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటుకు ఇవ్వలేదని గుర్తుచేశారు. విద్యుత్ ఉద్యోగుల మాదిరిగా ఎక్కువ వేతనాలు, సింగరేణి కార్మికుల మాదిరిగా ఏటా బోనస్‌లు అందుకునే పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులకు రావాలని ఆకాంక్షించారు. ఆదివారం ప్రగతి భన్‌లో ఆర్టీసీ సిబ్బందితో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి రాక్షసులే మళ్లీ పుట్టి... ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్లు ఉంటారని చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రామాయణ యుద్ధం గురించి ప్రస్తావించి ఆర్టీసీ ఉద్యోగులను కడుపుబ్బ నవ్వించారు. ‘యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముడిని అడగ్గా కలియుగంలో అక్కడక్కడా పుట్టాలని రాముడు సూచించాడన్నారు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారని, వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరంటూ కేసీఆర్ పేర్కొనడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం.. ‘‘ఆర్టీసి కార్మికులతో సీఎం కేసిఆర్ ఆత్మీయ సమావేశం... ఆద్యంతం ఉద్వేగభరితంగా జరిగింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన సీఎం ఆత్మీయ ప్రసంగం.. అత్యంత మానవీయ కోణంలో సాగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందబాష్పాలు నింపాయి. మధ్యమధ్యలో సీఎం విసిరిన ఛలోక్తులు సందర్భోచిత సామెతలు ప్రతి ఒక్కరినీ కడుపుబ్బ నవ్వించాయి. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించిన సందర్భంలో సమావేశ మందిరం కరతాళ ధ్వనులు, హర్షాతిరేకాలతో దద్దరిల్లింది. సీఎం తమ కోసం, తమ పిల్లల కోసం, తమ కుటుంబాల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు ఉద్యోగుల హృదయాల్లో ఆనందం చప్పట్ల రూపంలో హాలులో ప్రతిధ్వనించింది’’అని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రియాంకరెడ్డి ఉదంతంపై ఆవేదన.. ఆర్టీసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ ప్రియాంకరెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి తీవ్ర ఆవేదన చెందారు. మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు వద్దని చెప్పారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని కలత చెందారు. దీన్ని దారుణమైన అమానుషమైన దుర్ఘటనగా అభివర్ణించారు. ఆర్టీసీ ఉద్యోగులతో భేటీలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు... ► కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే. ఒకే కుటుంబంలా వ్యవహరించాలి. ► యథావిధిగా ఇంక్రిమెంట్ చెల్లింపు. ► సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా. ► ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత. ► సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణికుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోం. ► కలర్ బ్లైండ్నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప ఉద్యోగం నుంచి తొలగించవద్దు. ► మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయొద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి. ► ప్రతి డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ► మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలలపాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం. ► మహిళా ఉద్యోగులకు ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రెస్ వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫారం వేసుకునే అవకాశం కల్పిస్తాం. ► మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి, తగు సూచనలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ► రెండేళ్లపాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు. ► ప్రతి డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం. ► ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో.. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి. ►ప్రతి డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పొద్దు. ► ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి. ► ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం వర్తించేలా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తాం. ► ఉద్యోగుల పీఎఫ్ బకాయిలను, సీపీఎస్‌కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం. ► డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్‌ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం. ► తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం ► కార్మికుల గృహ నిర్మాణ పథకానికి రూపకల్పన చేస్తాం. ► ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి. -
'అమాయకులను సీఎం మీటింగ్‌కు పంపిస్తున్నారు'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 53 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సహకరించిన రాజకీయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలకు ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.రేపు ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో 26 డిమాండ్లపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని కార్మికులను ఆదుకోవాలని పేర్కొన్నారు. డిపోల నుంచి అమాయకులను ఏంచుకొని సీఎం మీటింగ్‌కు పంపిస్తున్నారని ఆరోపించారు. అధికారులతో కాకుండా ప్రశాంత వాతావరణం లో ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించాలని కోరారు. రాజ్యాంగం ప్రకారమే కార్మిక సంఘాలు నడుస్తున్నాయి. సెక్షన్ 19 కింద ఎవరైనా ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరినా యాజమాన్య దమనకాండ ఇంకా కొనసాగుతోందని విమర్శించారు. ఆర్టీసీ యాజమాన్యం కోర్టు నిబంధనల ప్రకారం నడుచుకుంటే మంచిదని పేర్కొన్నారు. -
‘ఆర్టీసీని వాడుకుని రాజకీయం చేయలేదు’
సాక్షి, సంగారెడ్డి: ఆర్టీసీ కార్మికులను వాడుకుని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజకీయం చేయలేదని ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షనీయమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచిన సీఎం కేసీఆర్.. ఎక్కడ ప్రైవేటీకరణ అనే ప్రకటన చేయలేదని అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఇక ప్రైవేటీకరణ అనేదే ఉండదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ చార్జీల పెంపుపైన ప్రజలలో వ్యతిరేకత వస్తే తాము వారి పక్షాన పోరాతామని చెప్పారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ ఘటనల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే ప్రియాంక మృతిపై ఆయన స్పందిస్తూ.. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇక ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళలు, యువతులు జగ్రత్త పడాలని ఆయన సూచించారు. ఇబ్బందుల్లో వారి కోసం స్పెషల్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దాబాల వద్ద భద్రత చర్యలు పెంచాలని సీఎం, హోంమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఆర్టీసీ చార్జీల పెంపు: రోజుకు రూ. 2.98 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై నోటీసులు ఇచ్చినప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎందుకు పెద్ద బుద్ది లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలు అంటున్నారు అప్పుడే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 52 రోజుల సమ్మెకు, ఆర్టీసీ నష్టాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటూ.. చార్జీలను పెంచుతూ ప్రజల దృష్టిని కేసీఆర్ మళ్లించారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో రోజుకు రూ. 2.98 కోట్ల అదనపు ఆదాయం రాగా... సంవత్సరానికి వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఆయన వెల్లడించారు. పల్లె వెలుగు బస్సులకు 32 శాతం బస్ ఛార్జీలు పెంచుతున్నారని, 6 సంవత్సరాల నుండి ఆర్టీసీ నష్టాలకు సీఎం బాధ్యుడు కాదా అని ఆయన విమర్శించారు. ఇక ఆర్టీసీ కార్మికుల మరణాలకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని అన్నారు. మిగతా రాష్ట్రాల్లో డీజిల్ పెంపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయి కానీ తెలంగాణ పభుత్వం మాత్రం ఆర్టీసీపైనే భారం వేసిందని దుయ్యబట్టారు. నిన్నటి వరకు రూట్లు ప్రైవేట్ పర్మిట్ చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? ప్రతిపక్షాలు చెప్పాయా?.. ప్రైవేట్‌పరం చేస్తే ఆర్టీసీ తారీఫ్‌తో నడుపరని ముందే చెప్పారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేస్తుంది కదా.. ఏపీ ముఖ్యమంత్రి నీకంటే చిన్నవాడు. ఆయనకు అనుభవం తక్కువే అయినప్పటీకి అక్కడి కార్మికుల శ్రేయస్సు కోసం పని చేస్తుంటే తెలంగాణలో నువ్వు ఎందుకు చేయవు’ అని ధ్వజమెత్తారు. అలాగే ఆర్టీసీ యూనియన్లు లేవని చెప్పడానికి నువ్వు ఎవరంటూ ఆయన ప్రశ్నించారు రు. అలాగే దసరా ముందే ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కరం అయ్యేది కదా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రినని అనుకోకుండా.. ఓ రాజులా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక ఆర్టీసీ కార్మికులను తొలగిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గారని తెలిపారు. ఇక చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడం వారి హక్కు అని.. అయితే కేసీఆర్ ఏదో వారికి భిక్ష పెట్టినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఉద్యోగ సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి, దానిపై సంఘాల నేతలు హక్కుల గురించి తేల్చుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు. -
విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులు
సాక్షి, కరీంనగర్/ఆదిలాబాద్/నిజామాబాద్: ఆర్టీసీలో నవ శకం మొదలైంది. 55 రోజుల తర్వాత తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది డిపోల పరిధిలో 3,800 మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆరు డిపోల వద్ద శుక్రవారం ఉదయం 3.30 గంటల నుంచి ఇప్పటివరకు దాదాపు 15 మంది కండక్టర్లు,డ్రైవర్లు విధుల్లోకి చేరారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు 5 గంటల నుంచే డ్రైవర్లు,కండక్టర్లు తొలి షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్ కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల డిపోలో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరారు. మెదక్ జిల్లాలో 2,890, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,098 మంది కార్మికులు విధుల్లోకి చేరారు. ఖమ్మం టౌన్: ఖమ్మం డిపోలో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 2600 మంది విధులకు హాజరుకానున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కార్మికులు విధులకు హాజరయ్యారు. చదవండి: డ్యూటీలో చేరండి -
ఆ బాధ్యత అందరిదీ కాదా?
మన రాజ్యాంగం, మూడో అధ్యాయంలో ప్రాథమిక హక్కులకు భద్రత కల్పించారు. అయినా సగటు మనిషి హక్కుల్ని కోల్పోతూనే ఉన్నాడు. రోజూ ఏదో రూపంలో వంచనకు గురవుతూనే ఉన్నాడు. సర్వ వ్యవస్థల్ని చెరబట్టి, అధికారాన్ని కేంద్రీకృతం చేస్తున్న వారు పౌరులకు ఒరగబెట్టిందేమిటి? నెల రోజుల పాటు విచారణ జరుపుతూ వివిధ వ్యాఖ్యలతో ఆశలు రేపిన న్యాయస్థానం చివర్న ‘సమ్మె తప్పో ఒప్పో తేల్చడం మా పరిధిలో లేదు’ అంటే ఆర్టీసీ కార్మికులు ఎటు వెళ్లాలి? ‘సమ్మెకట్టి విధులకు రానంత మాత్రాన ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు..’ అని హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సమ్మె విరమించిన ఉద్యోగులు చాలా వేదనకు గురికావలసి వచ్చింది. పౌరుల నుంచి ఆశిస్తున్నట్టే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ తమ నిర్దేశిత విధుల్ని బాధ్యతగా నిర్వర్తిస్తే అందరం బాగుపడతాం! భారతీయ సనాతన సంస్కృతి, వారసత్వ సంపదకు సంబంధించిన సమస్త సాహి త్యంలో ఎక్కడైనా ‘హక్కు’ అనే మాట ఉందా? చెప్పండి! అని సర దాగా సవాల్ చేశారు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పుష్కర కాలం కిందట. సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ఉన్నాను నేనపుడు. అధికార వ్యవస్థ పారదర్శకంగా ఉండి, ప్రజా సమాచారం ప్రజల కివ్వడం తమ విధిగా భావిస్తే పౌరులు దాన్ని హక్కుగా డిమాండ్ చేయాల్సిన అవసరమే రాదన్నది ఆయన కవి హృదయం. నిజమే! ఈ సూక్ష్మం గ్రహించినందునే కాబోలు మన వేదాలో, వేదాంగాలో, ఉపనిషత్తులో, బ్రహ్మసూత్రాలో, పురాణాలో, ఇతిహాసాలో... భారత సనాతన ఆధ్యాత్మిక వాఙ్మయంలో ఎక్కడా హక్కు అనే మాటే కని పించదు. ఎందుకంటే, హక్కులు–విధులు ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. ఒకరి హక్కులు ఎదుటి వారి విధులవుతాయి. అలాగే ఎదుటి వారి హక్కులు వీరికి విధులవుతాయి. వ్యక్తులు, జన సమూ హాల మధ్యే కాకుండా, పరస్పరం ఆధారపడ్డ రెండు సంస్థల మధ్య, చివరకు... పౌరులు–రాజ్యం మధ్య కూడా ఇదే బంధం ఉంటుంది. ఎవరికి వారు, ఎక్కడికక్కడ తమ విధులు–బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తే, ఇక ఎదుటి వారెవరూ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరమే రాదు. మన పురాణ గాథల్లో కుటుంబంలోని వ్యక్తుల మధ్యే కాదు, అందరికీ, కుటుంబాలకు, సమాజాలకు, రాజ్యానికి కూడా విధుల్ని నిర్దేశించారు. వాటిని పాటించేలా కట్టడి చేశారు. తద్వారా ఎదుటి వారి హక్కులు నెరవేరేలా, వాటికి భంగం కలుగకుండా భద్రత కల్పించారు. డిమాండ్ చేసి హక్కులు సాధించుకోవాల్సిన పరిస్థితి ఎవరికీ రానీయవద్దనేది లక్ష్యం. సదరు భావన ఇపుడు లోపిస్తోంది. రాజ్యం, దాని అవిభాజ్య అంగాలు, వివిధ వ్యవస్థలు, సంస్థలు... తమ నిర్దేశిత విధుల్ని, బాధ్యతల్ని, కర్తవ్యాల్ని విస్మరిస్తున్నాయి. ఫలితంగా పౌరులు కడగండ్లపాలవుతున్నారు. విధుల్ని నిర్వర్తించ డంలో అప్పుడప్పుడు పౌరులూ విఫలమౌతున్నారు. మన రాజ్యాం గంలో పౌరులకు కొన్ని విధుల్ని నిర్దేశించారు. సదరు విధుల్ని పాటిం చండని పెద్దలు నొక్కి చెబుతున్నారీ రోజు. మన రాజ్యాంగాన్ని ఆమో దించి 70 ఏళ్లయిన సందర్భంగా మాట్లాడిన భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సహా పెద్దలు పౌరుల విధులు–బాధ్యతల్ని నొక్కి చెప్పారు. విధులు నిర్వ ర్తించకుంటే హక్కులకు రక్షణ ఉండదనీ ధ్వనించారు. బాధ్యతలు లేనిదెవరికి? నిజమే! పౌరులకు నిర్దిష్ట విధులున్నాయని భారత రాజ్యాంగం చెబు తోంది. ఎవరికి లేవు? శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో సహా ముఖ్యమైన ప్రజాస్వామ్య విభాగాలన్నింటికీ నిర్దేశిత బాధ్యత లున్నాయి. ప్రసార మాధ్యమ (మీడియా) వ్యవస్థతో సహా! రాజ్యం నిర్వహించాల్సిన బాధ్యతల్ని రాజ్యాంగం నాలుగో అధ్యాయంలో ఆదేశిక సూత్రాలుగా పేర్కొన్నారు. శాసన–కార్యనిర్వాహక వ్యవస్థల పనితీరు సమీక్షించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యతను న్యాయ వ్యవస్థకు అప్పగించారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి మీడియా పోషించాల్సిన పాత్ర గురించి ప్రెస్ కమిషన్ నివేదికతో పాటు ప్రెస్ కౌన్సిల్ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలూ దేనికదిగా పనిచేసే క్రమంలో పౌరుల హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే న్యాయం పొందవచ్చు. మన రాజ్యాంగం, మూడో అధ్యాయం, ప్రాథమిక హక్కుల రూపంలో ఇందుకు భద్రత కల్పించారు. అయినా సగటు మనిషి హక్కుల్ని కోల్పోతూనే ఉన్నాడు. రోజూ ఏదో రూపంలో వంచనకు గురవుతూనే ఉన్నాడు. సర్వ వ్యవస్థల్ని చెరబట్టి, అధికారాన్ని కేంద్రీకృతం చేస్తున్న వారు పౌరులకు ఒరగబెట్టిందే మిటి? నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పదిహేడేళ్ల దేవేందర్ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ ఎందరికో కంటతడి పెట్టిం చింది. కారణమేదైనా ఆత్మహత్యలు గర్హనీయం, అందరం ఖండించా ల్సిందే! కానీ, ‘....ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, పేదలు ఇంకా నిరుపేదలవుతున్నారు... మా వైపు చూడండి, మా అమ్మానాన్నలు రోజూ కూలీ చేస్తున్నా మాకంటూ ఓ ఇల్లు లేదు, నే చచ్చాకయినా మాకో ఇల్లు ఇప్పించండి’ అంటూ ఆలేఖలో ప్రతి ధ్వనించిన యువకుడి ఆర్తి గురించి ఒక నిమిషమైనా ఆలోచించాలి కదా! ‘నిందితులెవరో వెంటనే తెలియదు తప్ప, ఆత్మహత్యలన్నీ హత్యలే!’ అని ఓ సామాజిక శాస్త్రవేత్త అన్నది ఇందుకేనేమో! నెల రోజుల పాటు విచారణ జరుపుతూ వివిధ వ్యాఖ్యలతో ఆశలు రేపిన న్యాయస్థానం చివర్న ‘సమ్మె తప్పో ఒప్పో తేల్చడం మా పరిధిలో లేదు’ అంటే ఆర్టీసీ కార్మికులు ఎటు వెళ్లాలి? ‘సమ్మెకట్టి విధులకు రానంత మాత్రాన ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు...’ అని హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సమ్మె విరమించిన ఉద్యోగులు చాలా వేదనకు గురికావలసి వచ్చింది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం, ‘పిల్’ (అమరావతి రాజధాని భూములు–ఏబీకే ప్రసాద్ కేసు) విచారిస్తూ, బాధ్యత కలిగిన ఓ సంపాదకుడిని, ‘... మీకేమి సంబంధం? మీ భూములు లాక్కొన్నప్పుడు వద్దురు పొండి!’ అని సాక్షాత్తు సుప్రీంకోర్టే అంటే ఇక సాధారణ పౌరులకు దిక్కేది? పౌర విధులు స్వీయ బాధ్యత పౌరుల ప్రాథమిక విధులు రాజ్యాంగంలో మొదట్నుంచి లేవు. 42వ రాజ్యాంగ సవరణతో, అధికరణం 51ఎ ద్వారా 1976 నుంచి అమ ల్లోకి వచ్చాయి. రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం, స్వాతంత్య్ర పోరా టాన్ని ప్రభావితం చేసిన విలువల పరిరక్షణ. దేశ సమైక్యత, సమ గ్రత, సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం వంటివన్నీ ఈ ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. అవసరం ఏర్పడ్డపుడు దేశ రక్షణకు సేవలందిం చాలి. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, ప్రాంత, భాషా భేదాలకతీతంగా మనుషుల్లో సోదర భావం పెంచాలి, మహిళల్ని గౌరవించాలి. మన వైవిధ్య సంస్కృతి, వారసత్వ సంపదకు విలువిచ్చి పరిరక్షించాలి. అడవులు, నదులు, కుంటలు, జీవవైవిధ్యంతో పాటు సర్వ సహజ వనరుల్ని కాపాడుతూ, జీవకారుణ్యంతో ఉండాలి. హింసను నిలువ రించి, ప్రజా ఆస్తుల్ని పరిరక్షించాలి. శాస్త్రీయ దృక్ప«థం, మానవ విలు వల వృద్ధితో అన్వేషణ–సంస్కరణ పంథాలో సాగాలి. అన్ని రంగాల్లో వ్యక్తిగత, సామూహిక సామర్థ్యాల ద్వారా దేశం ప్రగతి పథంలో సాగేందుకు తోడ్పడాలి. ఆరు–పద్నాలుగేళ్ల మధ్య వయసు పిల్లల తలిదండ్రులుగానో, సంరక్షకులుగానో వారికి విద్యావకాశాలు కల్పిం చాలి. ఇవన్నీ నిర్వర్తించడం దేశ పౌరుల ప్రాథమిక విధి అని రాజ్యాంగం చెబుతోంది. వీటి ఉల్లంఘనలకు నేరుగా న్యాయస్థా నాల్లో న్యాయ పరిష్కారం లేదు. కానీ, ఎప్పటికప్పుడు ఇవన్నీ పౌరులు పాటించేలా సంబంధిత ప్రభుత్వాలు చట్టాలు చేయవచ్చు. వీటిని రాజ్యాంగంలో చేర్చడం పట్ల కొంత వివాదం, విమర్శ కూడా ఉంది. ఇవన్నీ పౌరులు సహజంగానే చేస్తారని, పైగా ఆచరణ పరమైన స్పష్టత కొరవడిందనేది విమర్శ. నిజానికి 42వ రాజ్యాంగ సవరణే ఒక పీడకల అనే స్థూల అభిప్రాయముంది. 1975లో అర్థరాత్రి విధిం చిన ఆంతరంగిక అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) నీడలో వచ్చిన సవరణలివి. విధులు పాటించడమే హక్కులకు రక్షణ ఎవరో చెప్పారని కాదు గానీ, ఎవరికి వారు తమ విధుల్ని నిర్వర్తిం చాలి. ఫలితంగా అందరి హక్కులకు రక్షణ లభిస్తుంది. ఏ చట్టం, రాజ్యాంగపు ఏ అధికరణం నిర్దేశించనవసరం లేకుండా మన వ్యక్తిత్వ రీత్యానే ఈ ప్రాథమిక విధుల్ని పాటించవచ్చు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఒక పుస్తకంలో బాధ్యతను చక్కగా వివరించారు. ‘బాధ్యత... మూడొంతుల మంది తప్పుగా అర్థం చేసుకున్న పదమిది. అది ఎంత విస్తృతంగా, ఎంత విచక్షణారహితంగా వాడబడుతోందంటే, అది దాని ప్రబలమైన శక్తిని చాలా వరకు కోల్పోయింది. బాధ్యత అంటే ప్రపంచ బరువుని మనమీద వేసుకోవడం కాదు. మీరు చేసినదానికీ చెయ్యని దానికీ నిందని భరించడం కాదు. దానర్థం నిరంతరం అప రాధ భావనతో బ్రతకడం అంతకంటే కాదు. బాధ్యత అంటే కేవలం మీ స్పందనా సామర్థ్యమే. ‘నేను బాధ్యున్ని’ అని మీరు నిర్ణయిం చుకుంటే, స్పందించే సామర్థ్యం మీలో ఏర్పడుతుంది. ‘నేను బాధ్యున్ని కాదు’ అని నిర్ణయించుకుంటే, స్పందించే సామర్థ్యం ఉండదు. దాన్నంత తేలిగ్గా వివరించవచ్చు, అదంత సరళమైంది..... ఈ క్షణంలో, చెట్లు వదిలే గాలినే మీరు తీసుకుంటున్నారు. మీరు వదిలే శ్వాసనే అవి తీసుకుంటున్నాయి. ఈ ఉచ్ఛ్వాస–నిశ్వాసల లావాదేవీ నిరంతరం సాగుతోంది. మీకిది తెలిసినా తెలియక పోయినా మీ శ్వాసకోశంలో సగభాగం ఆ చెట్లకి వేలాడుతోంది. ఇలా పరస్పరం ఆధారపడి ఉన్నారన్న సంగతి మీరెన్నడూ అనుభూతి చెంది ఉండకపోవచ్చు. మహా అయితే మేధోపరంగా ఆలోచించి ఉంటారు. కానీ, ఈ అనుబంధాన్ని మీరు అనుభూతి చెంది ఉంటే, మీకెవరైనా ‘మొక్కలు నాటండి, అడవుల్ని రక్షించండి, ప్రపంచాన్ని కాపాడండి’ అని చెప్పాలా? అసలు అది అవసరమా?’అన్నారాయన. ఇది గ్రహిస్తే రాజ్యాంగం నిర్దేశించే విధుల్ని మనం విడువకుండా పాటిస్తాం. ఇప్పటికే పాటిస్తున్నాం కూడా! పౌరుల నుంచి ఆశిస్తు న్నట్టే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ తమ నిర్దేశిత విధుల్ని బాధ్యతగా నిర్వర్తిస్తే అందరం బాగుపడతాం! ఇది నిజం! వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మేం రాజీనామా చేస్తాం.. ఆర్టీసీని అలాగే ఉంచండి
సాక్షి, హైదరాబాద్: కార్మిక నేతలపై కోపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమాయక కార్మికులపై చూపడం సరికాదని పేర్కొంటున్న జేఏసీ నేతలు కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. తాము రాజీనామాలు చేసి తప్పుకుంటామని, అప్పుడు ఆర్టీసీని ఉన్నది ఉన్నట్లుగా నిర్వహించాలని పేర్కొననున్నట్లు తెలిసింది. దీనిపై బుధవారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ‘చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కార్మిక సంఘాల నేతలు సమస్యలు సృష్టిస్తున్నారని మాట్లాడారు. ఆయనకు మాపై అంత కోపం ఉంది. దాన్ని అమాయక కార్మికులపై చూపి వారిని విధుల్లోకి తీసుకోకుండా ఆవేదనకు గురి చేయడం సరికాదు. నేను రాజీనామా చేసి తప్పుకునేందుకు సిద్ధం. మిగతా మా జేఏసీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీని పాత పద్ధతిలోనే కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధం కావాలి. గురువారం కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోవాలి’అని జేఏసీ కో–కన్వీనర్ థామస్‌రెడ్డి అన్నారు. కార్మిక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు... సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నందున వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల జేఏసీ మరోసారి ప్రభుత్వాన్ని కోరింది. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడం చట్ట ప్రకారం సరైన చర్య కాదన్న విషయాన్ని గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తెలుసుకోవాలని సూచించింది. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్‌కు జేఏసీ ఫిర్యాదు చేసింది. మరోవైపు అదే ఫిర్యాదు కాపీలను గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయాల్లో అందజేయాలని జేఏసీ నేతలు సూచించారు. ఆ కార్యాలయాలు లేని ప్రాంతాల్లో సేవ్ ఆర్టీసీ పేరుతో ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని పేర్కొన్నారు. -
కేబినెట్ భేటీలో ఆర్టీసీపై కీలక నిర్ణయం...
సాక్షి, హైదరాబాద్: దేశంలో మెరుగైన ప్రజా రవాణా సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గురు, శుక్రవారాల్లో నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీకి కొత్త రూపు ఇవ్వనుంది. 52 రోజులపాటు కొనసాగిన సమ్మె, 30 మందికిపైగా కార్మికుల మృతి, తాత్కాలిక సిబ్బంది బస్సులు నడుపుతున్న సమయంలో జరిగిన ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించడం వంటి పరిణామాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండటం, పార్లమెంటులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్నందున వారి భవితవ్యాన్ని తేల్చకుండా పెండింగ్‌లో పెట్టడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో రెండు రోజులపాటైనా సరే మంత్రివర్గ భేటీ నిర్వహించి ఈ విషయాన్ని తేల్చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కేబినెట్ సమావేశం కొనసాగుతుందని, ఈ భేటీలో ఆర్టీసీ అంశం పూర్తిగా తేలని పక్షంలో శుక్రవారం కూడా సమావేశం కొనసాగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కార్మికులు మంచివారేనని, ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులూ కష్టపడే తత్వమున్నవారేనని, కానీ కార్మిక సంఘాల నేతలే వారిని చెడగొడుతున్నారంటూ ముఖ్యమంత్రి గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్మిక సంఘాల నేతల వల్లే ఆర్టీసీ పాడైందన్న తరహాలో మాట్లాడారు. ఇప్పుడు స్వయంగా జేఏసీ నేతలే సమ్మె విరమించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరినా అది సాధ్యం కాదంటూ ఎండీ ప్రకటించడంతో గత రెండు రోజులుగా కార్మికులు తెల్లవారక ముందే డిపోల వద్దకు చేరుకొని పడిగాపులు కాస్తున్నారు. వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీంతో వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం మంత్రివర్గ భేటీలో తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి మదిలో ఏ నిర్ణయముందనే విషయంలో మంత్రులు, అధికారులకూ స్పష్టత లేదు. కావాల్సిన సమాచారాన్ని కేబినెట్ భేటీ నాటికి సిద్ధం చేయాలంటూ ముఖ్యమంత్రి మంగళవారం అధికారులను ఆదేశించడంతో వారు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ పనిలోనే తలమునకలయ్యారు. ప్రైవేటు పర్మిట్ల కేటాయింపులో వేచి చూసే ధోరణి? ప్రస్తుతం ఉన్న రూపుతో ఆర్టీసీని నడపడం సాధ్యం కాదని, సగం బస్సులను తొలగించి వాటి స్థానంలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తామని సీఎం ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. 5,100 ప్రైవేటు బస్సులకు రూట్ల పర్మిట్లు ఇవ్వాలని గత కేబినెట్ భేటీలో చేసిన తీర్మానానికి హైకోర్టు కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో ఇక నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి అనే పరిస్థితి నెలకొంది. గురువారం దీనిపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ముందుగా అనుకున్నట్లుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయిస్తే రవాణాశాఖ వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించి రవాణాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికిప్పుడు కాకుండా కొంతకాలం తర్వాతే ముందుకు వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొందరు సీఎం ముందు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై కేబినెట్లో లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే హైకోర్టు సూచన మేరకు కార్మికుల సమ్మెకు సంబంధించిన కేసును లేబర్ కోర్టుకు బదిలీ చేసే అంశంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. వీఆర్ఎస్కు రూ. 5 వేల కోట్లు కావాలి... ఒకవేళ 5,100 ప్రైవేటు బస్సులు రంగంలోకి దిగితే ఆర్టీసీ సగానికి సగం కుంచించుకుపోనుంది. ప్రస్తుతం ఉన్న రూట్ల ప్రకారం దాని పరిధిలో 5,300 బస్సులు మాత్రమే మిగులుతాయి. 49,700 (300 మంది ఇప్పటికే చేరారు) మంది ప్రస్తుత కార్మికుల్లో కనీసం 20 వేల మంది ‘అదనం’గా మిగిలిపోతారు. వారిని కచ్చితంగా వీఆర్ఎస్ ద్వారానో, సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్) ద్వారానో తప్పించాల్సి ఉంటుంది. దీని పరిధిలోకి 50 ఏళ్లు పైబడిన వారిని తెచ్చే అవకాశం ఉంది. దీన్ని అమలు చేయాలంటే కనీసం రూ. 5 వేల కోట్లు అవసరమని అధికారులు లెక్కలేశారు. ఇంత మొత్తం భరించడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారనుంది. అయితే వచ్చే నాలుగైదేళ్లలో భారీ సంఖ్యలో కార్మికులు రిటైర్ అవుతుండటంతో ఒకవేళ అప్పటివరకు ఈ ప్రక్రియ ఆగితే ప్రభుత్వానికి వీఆర్ఎస్ బాధ ఉండదు. ఆస్తులమ్మితే తప్ప..... ఆర్టీసీ అధీనంలో పెద్ద మొత్తంలో ఖాళీ భూములున్నాయి. వాటిల్లో చాలా వరకు ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని అమ్మితేగానీ వీఆర్ఎస్ అమలుకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వానికి సమకూరవు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో చేస్తున్నది ఇలాంటి కసరత్తే. ఆర్టీసీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు పూర్తి వివరాలను సిద్ధం చేశారు. అయితే గురువారం జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక టికెట్ల ధరలను ఏటా పెంచేలా ఓ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుపైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు కార్మికులను ఒకవేళ విధుల్లోకి చేర్చుకుంటే భవిష్యత్తులో సమ్మెలు, యూనియన్ సభ్యత్వం లేకుండా పకడ్బందీ షరతులు విధించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహరాన్ని ఈ భేటీలో తేలుస్తారా లేదా సమగ్ర నివేదిక అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. అధికారులు మాత్రం ఆర్టీసీకి సంబంధించి.. కార్మికులు, వారి వయసులు, అప్పులు, ఆస్తులు, డిపోలు, వాటి పరి«ధిలో బస్సులు, వాటి కండిషన్, వేరే రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితి, ఒక్కో బస్సు ఖరీదు వంటి వివరాలతో సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేశారు. -
రెండో రోజూ అదే సీన్
సాక్షి, హైదరాబాద్: సమ్మె విరమించిన నేపథ్యంలో విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. మంగళవారం ఉదయం తొలి డ్యూటీకి వస్తే అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగిన కార్మికులు.. బుధవారం మళ్లీ వచ్చారు. పోలీసులు అడ్డుకున్నా, అరెస్టు చేసినా భయపడకుండా బుధవారం 6 గంటలకే సంబంధిత డిపోల వద్దకు చేరుకోవాలన్న జేఏసీ నేతల పిలుపుతో సూర్యోదయం కంటే ముందే వారు డిపోల వద్దకు చేరుకున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్న నేపథ్యంలో అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన పోలీసులు కార్మికులను డిపోలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సమ్మె విరమించినా తమను ఎందుకు అనుమతించడంలేదని వారితో వాగ్వాదానికి దిగారు. 97 డిపోల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఇదే పరిస్థితి పునరావృతమైతే గురువారం కార్మికశాఖ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయనున్నట్లు కార్మికులు తెలిపారు. మరోవైపు విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు డిపోల ముందు ఆందోళన చేస్తున్నా అధికారులు మాత్రం తాత్కాలిక సిబ్బందితో యథాప్రకారం బస్సులు నడిపించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 73శాతం బస్సులు తిప్పినట్లు వారు పేర్కొన్నారు. 1,907 అద్దె బస్సులు సహా మొత్తం 6,564 బస్సులు తిప్పినట్లు తెలిపారు. 4,657 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,564 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరైనట్లు పేర్కొన్నారు. 6,488 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడారని, 68 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని వెల్లడించారు. -
నేనే ఆర్టీసీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీ వైఖరితో తీవ్ర మానసిక వేదనకు గురయ్యా. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. మమ్మల్ని డిపో వద్దకు కూడా రానివ్వడం లేదు. బస్టాండ్, డిపో చుట్టూ బారికేడ్లు పెట్టారు. లోపలికి వెళ్తే మాపై కేసులు పెడుతున్నారు. దీంతో ఆవేదన చెందా. మీరు ఉద్యోగం నుంచి తీయడం కాదు.. నేనే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’ అని సోషల్ మీడియా వేదికగా సూర్యాపేట డిపోకు చెందిన కండక్టర్ లునావత్ కృష్ణానాయక్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు. కృష్ణానాయక్‌ది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్ తండా. ఇతను సోషల్ మీడియాలో పోస్టు చేసిన లేఖ బుధవారం వైరల్ అయింది. కృష్ణానాయక్ 2009 నుంచి కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై కార్మికులు, రాజకీయ వర్గాల్లో చర్చసాగింది. ఆ లేఖలో.. ‘తెలంగాణలో గౌరవంతో ఉద్యోగం చేద్దామ నుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదాం అనుకున్నా. కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టాను అనే మానసిక వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ప్రారంభించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర ఇబ్బందులను అందులో ప్రస్తావించాడు. ‘కార్మికులు ఏం తప్పుచేశారని.. మహిళలని చూడకుండా లాఠీలతో కొట్టించడం, అరెస్టులు చేయడం ఏంటి’ అని ప్రశ్నించాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని, సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరాడు. పోస్టు నిజమే: కృష్ణానాయక్ మమ్మల్ని డిపో వద్దకు రానివ్వడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. సోషల్ మీడియాతో అందరికీ తెలవాలని సీఎంకు లేఖ రాశా. మేనేజర్ కలిస్తే రాజీనామా కచ్చితంగా ఇస్తా.. వెనక్కు పోను. -
ఆర్టీసీ సమ్మె: కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల పిటిషన్లో సవరణలు చేసి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్రావు తిరిగి పిటిషన్ దాఖలు చేశాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి చేరతామన్నా తీసుకోవడం లేదని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపాడు. జీతాల్లేక కుటుంబాలను పోషించలేక ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇక ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి యాభై రోజులు దాటింది. అయితే ప్రభుత్వం ఎంతకూ మెట్టుదిగకపోవడంతో కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి వస్తామన్నారు. అయితే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించడంతో కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: వస్తామంటే.. వద్దంటారా?) -
అట్టుడికిన ఆర్టీసీ డిపోలు
ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మె ప్రారంభించి మంగళవారం నాటికి 53వ రోజుకు చేరుకుంది. సమ్మె అనేక రకాలుగా కొనసాగి చివరకు జేఏసీ పిలుపు మేరకు విధుల్లో చేరేందుకు కార్మికులు ఆర్టీసీ డిపోల వద్దకు ఉదయం చేరుకున్నారు. అయితే ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం దిగిరాలేదు. పోలీసుల సహకారంతో కార్మిక సంఘాల నాయకులను మంగళవారం తెల్లవారుజాము నుంచే అరెస్ట్‌లు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్మికులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సాక్షి, రామచంద్రాపురం(మెదక్) : ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి మంగళవారం ఉదయం విధుల్లో చేరేందుకు బెల్ ఆర్టీసీ డిపో వద్దకు రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్మికులు రాగానే వెంటనే వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్లకు కు తరలించారు. మహిళా కార్మికులు పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి ఆందోళన చేయడం లేదని, సమ్మె విరమించి విధుల్లోకి చేరుతున్నామని లిఖితపూర్వకంగా డిపో మేనేజర్‌ను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 56 మంది కార్మికులను అదుపులోకి తీసుకోవడంతో మహిళా కార్మికులు దీక్షలు చేపట్టారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. విరమించినా.. తీరని సమస్య సిద్దిపేట: రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు మంగళవారం ఉదయం విధుల్లో చేరడానికి డిపోల వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. విధుల్లో చేరడానికి కార్మికులు వస్తారనే ముందస్తు సమాచారంతో జిల్లాలోని ఆర్టీసీ డిపోల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయా స్టేషన్లకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 271 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేశారు. సిద్దిపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి వస్తున్నారనే సమాచరం మేరకు డిపో వద్ద ఏసీపీ రామేశ్వర్ ఆధ్వర్యంలో వన్ టౌన్ సీఐ సైదులు, రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, టూ టౌన్ సీఐల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనలు ఇలా.. ఉదయం డిపో వద్దకు చేరుకున్న వామపక్ష నాయకులు మంద పవన్, రేవంత్‌కుమార్‌లను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. అనంతరం సుమారు 50 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి సిద్దిపేట డిపో వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వారిని అరెస్ట్ చేసి డీసీఎం, టాటాఎస్ వాహనంలో సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిద్దిపేటలో పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు వామపక్ష నాయకులు, 15 మంది మహిళా కండక్టర్లు, 47 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారని వన్‌టౌన్ సీఐ సైదులు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసి ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్‌కుమార్, ఆర్టీసీ జేఏసీ నాయకులు శేషు, బీఎస్ గౌడ్, రాజయ్య, మల్లేశం, పరమేశ్వర్‌రెడ్డి, సీహెచ్ఆర్సీరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మంజుల, సుజాత తదితరులు ఉన్నారు. జిల్లా వ్యప్తాంగా 87శాతం బస్సు రవాణా జరిగినట్లు సిద్దిపేట జిల్లా రవాణశాఖ అదికారి రామేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఉదయం నుంచి ఉద్రిక్తత సాక్షి, సంగారెడ్డి: ఆర్టీసీ జేఏసీ సూచన మేరకు విధుల్లో చేరడానికి కార్మికులు జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణేడ్ డిపోల వద్దకు ఉదయం 5 గంటల నుంచే చేరుకోవడం ఆరంభించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు డిపో లోపలికి అనుమతించలేదు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో లోపలికి వెళ్లడానికి ప్రయత్నించినా పోలీసులు నిలువరించడంతో వెళ్లడానికి విఫలయత్నం చేశారు. జేఏసీ–1 యూనియ¯Œ చెందిన కార్మికులు మాత్రం జిల్లాలో సమ్మె విరమించకపోవడం విశేషం. జిల్లాలో పరిస్థితి ఇలా.. డిపోల లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన కార్మికులను అరెస్టు చేసి సమీప పోలీస్స్టేషన్లకు తరలించారు. సంగారెడ్డి డిపోలో పనిచేస్తున్న భీమ్లాల్ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సంగారెడ్డి డిపో పరిధిలో 100 మందిని, నారాయణఖేడ్‌లో 108 మందిని, జహీరాబాద్ 32 మంది కార్మికులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్మికులకు మద్దతు తెలపడానికి సంగారెడ్డి డిపో వద్దకు వచ్చిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిని అరెస్టుచేశారు. సెల్‌టవర్ ఎక్కిన టీజేఎస్ నేత నారాయణఖేడ్: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారిని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, విధుల్లో చేరేందుకు వెళ్లిన వారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ టీజేఎస్ నాయకులు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. నారాయణఖేడ్‌కు చెందిన తెలంగాణ జనసమితి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బోర్గి సంజీవ్ కుమార్ మంగళవారం పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణలోని టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు కావాలంటూ ఉదయం 10గంటల సమయంలో కార్యాలయం ఆవరణలోకి వెళ్లిన ఆయన సిబ్బంది కళ్లుగప్పి టవర్ ఎక్కాడు. సుమారు 200అడుగులకు పైగా ఉన్న టవర్‌పై వంద అడుగుల ఎత్తు వరకు ఎక్కి కూర్చున్నాడు. దీన్ని గమనించిన బీఎస్ఎన్ ఎల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ సందీప్‌లు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జనాలు భారీగా అక్కడికి చేరుకున్నారు. పలు డిమాండ్లతో ముద్రించిన కరపత్రాలను పైనుంచి కిందకు విసిరాడు. అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరాడు. ఆరుగంటలకు పైగా టవర్‌పైనే కూర్చున్న సంజీవ్ అనంతరం టవర్ దిగివచ్చాడు. సెల్‌టవర్ ఎక్కిన టీజేఎస్ నాయకుడు బోర్గి సంజీవ్‌కుమార్ ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలు నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లో కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్ లో ఎక్కిస్తున్న సమయంలో ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. తోపులాటలో కండక్టర్ యుమున, డ్రైవర్ బీ.ఎస్ రెడ్డిలు కిందపడిపోయి అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు నారాయణఖేడ్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి మంగళవారం విధుల్లో చేరేందుకు ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో నారాయణఖేడ్ డిపోలో మంగళవారం విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ తరలించారు. కార్మికులు సమ్మె విరమించినా కార్మిక కోర్టులో విషయం తేలేవరకు విధుల్లోకి తీసుకోమని ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు తెల్లవారుజామునే నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు డిపో వద్దకు చేరుకునే ప్రయత్నం చేయడంతో డిపోకు కొద్ది దూరంలోనే పోలీసులు కార్మికులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు దాదాపు వంద మంది కార్మికులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్మికులను అరెస్టు చేసి వ్యాన్ లో తరలిస్తున్న పోలీసులు ప్రభుత్వ తీరుపై మండిపాటు జహీరాబాద్: ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. మంగళవారం విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు డిపో లోపలకు అనుమతించలేదు. ముగ్గురు మహిళా కార్మికులను మాత్రం డిపో మేనేజర్‌ను కలిసిసేందుకు అనుమతించారు. వారు డిపో మేనేజర్‌ను కలిసి విధుల్లో చేరేందుకు అనుమతించాలని కార్మికులు డిపో మేనేజర్ రమేష్‌ను కలిశారు. రాత పూర్వకంగా పత్రాలు ఇచ్చేందుకు కార్మికులు కోరగా ఆయన నిరాకరించారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోవద్దని, విధుల్లో చేర్చుకోవద్దని ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో కార్మికులు వెనుదిరిగి వెళ్లారు. డిపో వద్ద ఆందోళన చేస్తున్న 32 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇందులో మహిళా కార్మికులే అధికంగా ఉన్నారు. అనంతరం పోలీసులు సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల విషయంలో అనుసరిస్తున్న విధానం సరైంది కాదని ఆరోపించారు. విధుల్లో చేరేందుకు సిద్ధపడ్డా నిరాకరించడం తగదన్నారు. డిపో వద్ద సీఐ సైదేశ్వర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు వెంకటేశ్, వినయ్‌కుమార్, రాము సిబ్బందితో కలిసి బందోబస్తును నిర్వహించారు. జహీరాబాద్ డిపో నుంచి బస్సుల రాక పోకలకు ఎలాంటి అంతరాయం కలుగలేదు. రోజు మాదిరిగానే బస్సులు నడిచాయి. పోలీసులు, ఆర్టీసీ కార్మికులను వ్యానులోకి ఎక్కిస్తున్న పోలీసులు రాకరణ.. నిరసన మెదక్ : ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు కార్మికులు మంగళవారం ఉదయం డిపోల వద్దకు చేరుకున్నారు. యాజమాన్యం నిరాకరించడంతో మహిళా కార్మికులు, పురుషకార్మికులు మూడు గ్రూప్‌లుగా విడిపోయి ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్నారు. ముందుగా మహిళా కండక్టర్లు పోలీసుల కళ్లుగప్పి డిపోలోని బస్సు గరేజ్లోకి చేరుకొని గేట్ ఎదుట బైఠాయించి బస్సులను బయటకు వెళ్లనివ్వలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు మహిళా కండక్టర్లను పోలీసుల వాహనాల్లో ఎక్కించే ప్రయత్నంలో స్వల్ప తోపులాట జరిగింది. ఈ నేపధ్యంలో మహిళా కండక్టర్లు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయిన పురుష కార్మికులు డిపో ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికేందుకు సిద్ధమైన సీపీఎం నాయకులను సైతం పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్‌కేరావు మాట్లాడుతూ స్వచ్ఛందంగా విధుల్లోకి చేరుతామని ఉత్తరాలు రాసి తీసుకొని వచ్చినా విధుల్లోకి తీసుకోకుండా అరెస్ట్‌లు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసుల దమనకండ రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా టీఆర్ఎస్ నాయకులకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బోస్, శ్రీనివాస్‌రెడ్డి, శాఖయ్య తదితరులు ఉన్నారు. పోలీసుల అదుపులో ఆర్టీసీ కార్మికులు, మహిళా కార్మికులను అరెస్ట్ చేస్తున్న మహిళా పోలీసులు బస్సు సర్వీసులు ఇలా.. జిల్లాలో మూడు డిపోలు ఉన్నాయి. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోలలో 1,158 కార్మికులు ఉన్నారు. సంగారెడ్డి డిపోలో 120 బస్సులకు గాను తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో 83 బస్సులు నడిపించారు. జహీరాబాద్‌లో 96 బస్సులకు గాను 65 బస్సులు నడిచాయి. నారాయణఖేడ్‌లో 63 బస్సులకు గాను 41 బస్సులు నడిచాయి. కార్మికులను చేర్చుకోవడానికి అనుమతిలేదు ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవడానికి అనుమతిలేదు. డిపోల వద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా 269 బస్సులకు గాను మంగళవారం జిల్లాలోని మూడు డిపోల పరిధిలో నుంచి 199 బస్సులు తిరిగాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పైఅధికారుల సూచనల ప్రకారం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. – రాజశేఖర్, ఆర్ఎం -
ప్రజా చక్రమే చిదిమేస్తోంది!
సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సిటీ బస్సు టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనాను చిదిమేయడంతో ఇద్దరు చిన్నారులకు తల్లి దూరమైంది. మంగళవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన నగరవాసులను కలచి వేసింది. ఇది ఒక్కటనే కాదు.. సిటీ ఆర్టీసీ టెర్రర్ జాబితాలో ఏటా వందల కేసులు చేరుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 2,225 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... వాటిలో ఆర్టీసీ బస్సులతోనే 107 చోటుచేసుకున్నాయి. కండిషన్ తప్పిన బస్సులకు తోడు ఆర్టీసీ సమ్మె కారణంగా వచ్చిన తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. నాలుగో స్థానం... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రమాదకారకాలుగా మారుతున్న వాహనాలకు సంబంధించి ప్రతిఏటా జాబితా రూపొందిస్తారు. ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి గుర్తుతెలియని వాహనాల వరకు 13 కేటగిరీలు ఉన్నాయి. ఈ పట్టికలో ఆర్టీసీ బస్సులు నాలుగో స్థానాన్ని ఆక్రమించాయి. తొలి మూడు స్థానాల్లో ద్విచక్ర, తేలికపాటి, త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. చివరకు అత్యంత ర్యాష్‌గా ప్రయాణిస్తాయని భావించే డీసీఎంల కంటే ఆర్టీసీ బస్సులే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రాత్రయిందంటే రెచ్చిపోయి ప్రయాణించే ప్రైవేట్ బస్సులతోనూ చూసినా... ప్రమాదకారకాలుగా మారే విషయంలో ఆర్టీసీ కంటే అవే మిన్నగా ఉన్నాయి. ఉల్లంఘనల్లోనూ ముందే.. సాధారణ పరిస్థితుల్లోనే సిటీలో ఆటోల తర్వాత ఆ స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేది ఆర్టీసీ బస్సులేనన్నది పోలీసు అధికారుల మాట. వీటివల్లే అనేక చోట్ల ఇబ్బందులు వస్తున్నాయన్నది ఇప్పటికే అనేకసార్లు చర్చనీయాంశమైంది. ఆర్టీసీ డ్రైవర్లు పాల్పడుతున్న ఉల్లంఘనల్లో బస్‌బేల్లో పార్క్ చేయకపోవడం, స్టాప్‌లైన్ క్రాసింగ్, సిగ్నల్ జంపింగ్, స్పీడ్ టర్నింగ్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఇవే ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడుపుతుండడం, కాలం చెల్లిన బస్సులు ఫిట్నెస్ కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. మూడేళ్లలో ఆర్టీసీ ప్రమాదాలు ఇలా... ఏడాది ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2017 120 33 98 2018 149 35 126 2019(నవంబర్25 వరకు) 107 25 104 డొక్కులు..తుక్కులు సాక్షి, సిటీబ్యూరో: అసలే లారీలు, ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లు.. ఆపై రెండు నెలలుగా ఎలాంటి మరమ్మతులు, నిర్వహణ లేని బస్సులు.. పైగా వాటిలో సగం డొక్కువే.. ఇంకేముంది యమదూతల్లా జనంపైకి దూసుకొస్తున్నాయి. ప్రమాదాలతో హడలెత్తిస్తున్నాయి. నగరంలో గత 53 రోజుల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఓవైపు డ్రైవర్ల నిర్లక్ష్యం.. మరోవైపు మరమ్మతులకు నోచని బస్సులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కార్మికుల సమ్మె కారణంగా బస్సుల నిర్వహణ పూర్తిగా స్తంభించింది. ప్రతి బస్సుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, అవసరమైన మరమ్మతులు చేయాల్సిన మెకానిక్‌లు, శ్రామికులు, ఫోర్‌మెన్ స్థాయి ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఏ బస్సులో? ఎలాంటి సమస్యలు? ఉన్నాయో గమనించేవారు లేకుండా పోయారు. ఇలాంటి బస్సులు ఇప్పుడు తాత్కాలిక డ్రైవర్ల చేతుల్లో నడుస్తున్నాయి. ప్రతిరోజు ఇసుక లారీలు, ట్రాక్టర్లు నడిపే సరకు రవాణా డ్రైవర్లు ప్రయాణికుల కోసం వినియోగించే ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సమ్మె మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 36 ప్రమాదాలు జరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా డివైడర్‌కు ఢీకొట్టడం లాం టివి కొన్నయితే, వాహనదారులను ఢీకొట్టినవి మరికొన్ని. గత నెలలో ఛే నంబర్ వద్ద, మూసారాంబాగ్ లో ఆర్టీసీ బస్సులు అదుపు తప్పి ఢీకొట్టడంతో ఇద్దరు బైక్ రైడర్లు చనిపోయారు. తాజాగా బంజారాహిల్స్ లో మరో మహిళ మృత్యువాత పడ్డారు. బస్సు ఫిట్నె స్ బాగానే ఉందని, బ్రేకులు ఫెయిల్ కాలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ... గత రెండు నెలలుగా నిలిచిపోయిన నిర్వహణపరమైన సేవల కారణంగా సిటీ బస్సులు ఎప్పుడు? ఎక్కడ? ఏ వాహనాన్ని ఢీకొంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. షెడ్యూలింగ్ సేవలు ఇలా... బస్సులకు 3 రకాలుగా తనిఖీలు, మరమ్మతులు చేస్తారు. ఆ వివరాలివీ... షెడ్యూల్–1: డ్యూటీ ముగిసి డిపోకు చేరిన బస్సును మెకానిక్‌లు ప్రతిరోజు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు. బస్సు జాయింట్స్, బోల్టులు, సౌండ్ సిస్టమ్ వంటివి పరిశీలిస్తారు. డ్రైవర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి మరమ్మతులు చేస్తారు. షెడ్యూల్–2: ఇందులో భాగంగా ప్రతి వారం/ పది రోజులకు ఒకసారి బస్సులను పూర్తిగా తనిఖీ చేస్తారు. ఐదుగురు మెకానిక్‌లు కలిసి ఈ పని చేస్తారు. ఇందులో ఇంజిన్ మెకానిక్, కోచ్ మెకానిక్, టైర్ మెకానిక్, ఎలక్ట్రికల్ మెకానిక్, కోచ్ బిల్డర్లు భాగస్వాములవుతారు. అవసరమైన విడిభాగాలను అమర్చుతారు. ఒకవేళ విడిభాగాల కొరత ఉంటే ఆ బస్సులను బయటకు తీయకుండా మెకానిక్ పనులు పూర్తయ్యే వరకు డిపో గ్యారేజీలోనే ఉంచుతారు. షెడ్యూల్–3: ప్రతి 40 రోజులకు ఒకసారి ఓవర్హాలిం గ్ పనులు జరుగుతాయి. బస్సు ఇంజిన్ సహా అన్నిం టినీ చెక్ చేసి సమూలమైన మరమ్మతులు చేస్తారు. దీంతో బస్సు అన్ని విధాలుగా ఫిట్‌గా ఉంటుంది. -
గుండెపోట్లు, ఆత్మహత్యలను హైకోర్టు ఎలా ఆపగలదు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం నిర్దయగా, మొండి వైఖరితో వ్యవహరించడం వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గుండెపోటుతో మరణిస్తున్నారని చెప్పడానికి ఆధారాలు కావాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడున్న సంక్షోభం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేందుకు ఆధారాలు చూపాలని కోరింది. అయినా గుండెపోట్లు, ఆత్మహత్యలను హైకోర్టు ఎలా ఆపగలదని ప్రశ్నించింది. గుండెపోటుతో మరణించే వాళ్ల ప్రాణాల్ని ప్రభుత్వం మాత్రం ఎలా రక్షించగలదని పేర్కొంది. అక్టోబర్ 5 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని ఆర్టీసీ యూనియన్ నిర్ణయించింది. ఈ సంక్షోభాలన్నింటికీ సమ్మే కారణమని నిందించదలిస్తే, అందుకు యూనియన్నే బాధ్యులని చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. సమ్మెపై నిర్ణయించుకోవడానికి ముందే వీటన్నింటిపై అధ్యయనం చేసుండాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం వల్లే అవన్నీ జరుగుతున్నా యని అంటే ఎలా? అని ప్రశ్నించింది. కోర్టులు కూడా రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి పనిచేస్తాయని, తమ చేతిలో మంత్రదం డం ఏమీ ఉండదని చెప్పింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు వ్యక్తిగతంగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభి షేక్‌రెడ్డి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. ఒక్క కార్మికుడినైనా డిస్మిస్ చేసిందా? విశ్వేశ్వరరావు వాదిస్తూ.. ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడం వల్లనే ఒత్తిడికి గురై పలువురు గుండెపోటు వచ్చి మరణించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాళ్ల సంఖ్య 30 వరకూ ఉంది. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళితే పోలీసులతో ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఇది అమానుషం. హైకోర్టు స్పందించి విధుల్లోకి చేరే వాళ్లని అడ్డుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హైకోర్టు స్పందిస్తూ... పీఎఫ్ నిధుల్ని తీసుకోవడమో లేదా కాంట్రాక్టు కార్మికులు విధుల్లో చేరడం వల్లో ఆత్మహత్యలు చేసుకున్నారా లేక చేయడానికి పనిలేనందున ఆత్మహత్యలు చేసుకున్నారా.. వీటికి ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. సమ్మె మొదలు పెట్టిన వెంటనే ప్రభుత్వమే ‘సెల్ఫ్ డిస్మిసల్’అని చెప్పిందని విశ్వేశ్వరరావు సమాధానమిచ్చారు. అయితే కోర్టుకు ఆధారాలే ముఖ్యమని, సూర్యోదయం అవగానే కడుపు నొప్పి వస్తోందని చెప్పి సూర్యుడినో, సూర్యోదయాన్నో కారణమని నిర్ధారించలేం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్టీసీ ఉద్యోగి ఒక్కరినైనా ప్రభుత్వం డిస్మిస్ చేసిందా అని ప్రశ్నించింది. హైకోర్టుకు కార్మికుడి సూసైడ్ నోట్ ప్రభుత్వ వైఖరి కారణంగానే భవిష్యత్ భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకునేముందు రాసిన లేఖను (సూసైడ్ నోట్) పరిశీలించాలని దాని ప్రతిని విశ్వేశ్వరరావు నివేదించారు. సమ్మె, ఆ తర్వాత ఆత్మహ త్యలకు తావిచ్చిన కారణాలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఆత్మహత్యలను, గుండెపోటులను తామెలా ఆపగలమని, సమ్మె కారణంగానే జరిగాయని ఎలా చెప్పగలరని, ఇదే వాదన సబబు అనుకుంటే సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ను నిందించాలని వ్యాఖ్యానించింది. కస్టోడియల్ డెత్‌లపై స్పందించినట్లుగానే ప్రభుత్వ తీరు అనైతికంగా ఉందని, హైకోర్టు స్పందించకపోతే జనం ఎక్కడికి వెళ్లాలని విశ్వేశ్వరరావు అన్నారు. కస్టోడియల్ డెత్‌లపై గతంలో కోర్టు స్పందించిన తీరులోనే వీటిపైన కూడా హైకోర్టు స్పందించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కార్మికులేమీ నిస్సహాయులు కాదని, అలా అనుకుంటే భ్రమేనని, అది తప్పుడు అభిప్రాయమని, కార్మికులు సరైన వేదిక (సంబంధిత కోర్టుకు)కు వెళ్లాలని, అన్నింటికీ హైకోర్టును ఆశ్రయిస్తే తమ వద్దేమీ మంత్రదండం ఉండదని చెప్పింది. రోగం ఏదో గుర్తించి దానికి వైద్యం చేయించుకోవాలేగానీ గుండె సమస్యకు కిడ్నీ డాక్టర్ దగ్గరకు వెళితే లాభం ఏముంటుందని ప్రశ్నించింది. పారిశ్రామిక వివాదాల చట్టం కింద సంబంధిత కోర్టుల్లో కార్మికుల సమస్యలపై తేల్చుకోవాలని హితవు చెప్పింది. జీతాల చెల్లింపు గురించి ఇప్పటికే సింగిల్ జడ్జి వద్ద కేసు వేశారని, మిగతా సమస్యలపై ఆయా కోర్టుల్లో న్యాయ పోరాటం చేసుకోవచ్చునని సూచించింది. రాజ్యాంగ ధర్మాసనాలకు అసాధారణ అధికారాలు ఉంటాయని, సమ్మె విరమించిన కార్మికులు విధు ల్లో చేరేందుకు అడ్డంకులు లేకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విశ్వేశ్వరరావు అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, న్యాయస్థానాలూ రాజ్యాంగ నిర్ధేశాలకు లోబడే పనిచేయాలని, అసాధారణ అధికారాల పేరుతో కోరి నవన్నీ చేసేందుకు కోర్టుల్లో మంత్రదండం ఏమీ ఉండదని గుర్తుంచుకోవాలని తేల్చిచెప్పింది. కనీసం విధుల్లో చేరేందుకు డిపోలకు వెళ్లే కార్మికుల్ని అడ్డుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని విశ్వేశ్వరరావు కోరారు. సవరణ పిటిషన్ దాఖలు చేయండి ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని, వారి క్షోభ ఊహకు అందనిదని, దయచేసి మానవీయతతో హైకోర్టు స్పందించాలని విశ్వేశ్వరరావు కోరారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని.. యూనియన్ తో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మె విరమణకు చర్యలు తీసుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిల్లో కోరారని, సమ్మె విరమించినందున ఇప్పుడు విధుల్లో చేరేందుకు అనుమతించాలని కోరుతున్నారని, ఈమేరకు చట్ట నిబంధనల మేరకు పిల్లోని అభ్యర్థనను మార్పు చేసి సవరణ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది. అందుకు అంగీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేయాలని విశ్వేశ్వరరావు కోరినప్పటికీ, దీనిపై ఏమీ స్పష్టం చేయని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీలు కోరారు. ఈ మేరకు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు యత్నించగా.. వీలుకాకపోవడంతో ప్రధాని కార్యాలయ కార్యదర్శిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. ఆర్టీసీలో కేంద్రానికి 33% వాటా ఉందని, అందువల్ల సంస్థ, ఉద్యోగులను రక్షించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. కార్మికులను బేషరతుగా తిరిగి విధుల్లో చేరడానికి అనుమతించడం లేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, ప్రయాణ వ్యయం పెరిగి ప్రజలపై భారం పడుతుందన్నారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై వీలును బట్టి గురువారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీని నిలుపుకోలేకపోగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆర్టీసీ ప్రైవేటీకరణను రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. -
ఆర్టీసీ రూట్ మ్యాప్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 5,100 బస్సులను ప్రైవేటు పర్మిట్లతో తిప్పేందుకు అనుమతించే విషయంలో కేబినెట్ ఆమోదం తెలపడంతో మిగతా సగం బస్సులను ఆర్టీసీ పరిధిలో ఎలా నిర్వహించాలన్న అంశాన్ని ఖరారు చేయనుంది. దీనికి సంబంధించి గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ అధీనంలో సగం బస్సులను ఉంచి మిగతా సగం రూట్లను ప్రైవేటు బస్సులు తిప్పుకునేలా వాటి యజ మానులకు స్టేజీ క్యారియర్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఉన్నపళంగా ప్రైవేటు పర్మిట్లు జారీ చేయాలా లేక కొంతకాలం ఆగాక ఈ ప్రక్రియ ను చేపట్టాలా అనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయానికి రాలేదు. ఆ ప్రక్రియ ఎలా ఉం డాలనే అంశంపై ఇప్పటికే ఆర్టీసీ–రవాణాశాఖ అధికారులు రూట్‌మ్యాప్ తయారు చేశారు. దీనికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేస్తే నోటిఫికేషన్ జారీ కానుంది. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై మరోసారి చర్చించనున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె విరమించిన నేపథ్యంలో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో మంత్రివర్గ భేటీలో సర్కారు దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రూ. వెయ్యి కోట్లు ఇవ్వండి...: మంత్రివర్గ భేటీ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు, జేటీసీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఆర్టీసీ నిర్వహణపై అధికారులను ఆయన ప్రశ్నించగా ప్రస్తుతానికి రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని వారు కోరినట్లు తెలిసింది. ఆర్టీసీ సహకార పరపతి సంఘం, ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను చెల్లిస్తే కొంత ఉపశమనం ఉంటుందని, యథావిధిగా బస్సులు తిప్పితే క్రమంగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రూ. వెయ్యి కోట్లు కేటాయించే పరిస్థితి లేదని సీఎం తెలిపినట్లు సమాచారం. దీంతో అంతమేర ఆర్టీసీ ఆస్తుల విక్రయం అంశాన్ని అధికారులు ప్రస్తావించగా రూ. వెయ్యి కోట్లు వచ్చే ఆస్తులెక్కడివని సీఎం వ్యాఖ్యానించినట్లు, ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలించాలని సూచించినట్లు తెలియవచ్చింది. ఇంత మంది సిబ్బందినేం చేస్తారు? సగం బస్సులను ప్రైవేటీకరిస్తే మిగతా సగం బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీకి తక్కువ మంది సబ్బందే అవసరమవుతారు. కానీ సమ్మె చేసిన 49,300 మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటే సంస్థపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. దీంతో వీఆర్ఎస్ పథకాన్ని అమలు చేసి అదనంగా ఉన్న వారిని ఇళ్లకు పంపే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ చేపట్టిన సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాలేదు. ఒకవేళ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఈ విషయం చర్చకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఈ అంశంపై కసరత్తు చేసి కేబినెట్ సమావేశమయ్యేలోగా వివరాలను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి వీఆర్ఎస్ వర్తింపజేయాలనే దిశగా సమాచారాన్ని సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. దీంతోపాటు నాలుగైదేళ్ల తర్వాత ప్రైవేటు పర్మిట్ల విధానం ప్రారంభిస్తే ఈలోగా పదవీవిరమణ రూపంలో సిబ్బంది సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాన్ని కూడా అధికారులు వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. షరతులతోనే విధుల్లోకి! సమ్మె చేసిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే కచ్చితంగా షరతుల ఆధారంగానే తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. భవిష్యత్తులో యూనియన్లు ఉండకుండా చేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలున్నట్లు తెలుస్తోంది. యూనియన్లతో సంబంధం లేకుండా పనిచేసేలా కార్మికులు అంగీకార పత్రంపై సంతకం చేసి ఇవ్వాలనే షరతు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇకపై సమ్మెల జోలికి వెళ్లబోమని కూడా కార్మికులు నిర్దిష్ట హామీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత సమ్మె కాలానికి కూడా కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి ఆర్టీసీకి లేని నేపథ్యంలో వేతన సవరణ గడువును నాలుగేళ్ల నుంచి సడలించి ఐదారేళ్ల గడువు విధించే అవకాశం కనిపిస్తోంది. ఈ షరతులను కూడా ఖరారు చేసి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రెండు రోజులు ‘మంత్రాంగం’! ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మరుసటి రోజు, అంటే శుక్రవారం కూడా కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశముందని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీ, కార్మికుల భవితవ్యంపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆర్టీసీ భవితవ్యంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలను సైతం ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశానికి సంబంధించిన ఏజెండా బుధవారం ఖరారు కానుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. -
మహిళా కండక్టర్ల కంటతడి..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమించినందున తమను విధుల్లోకి తీసుకోవాలంటూ మంగళవారం సూర్యోదయానికి ముందే వచ్చి డిపో గేట్ల వద్ద ఎదురుచూసిన కార్మికులకు చివరకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున తాము విధుల్లోకి తీసుకోబోమని డిపో మేనేజర్లు తెగేసి చెప్పటంతో వారిలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. ముఖ్యంగా మహిళా కండక్టర్లు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. 2 నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని, కుటుంబం గడవటమే కష్టంగా ఉన్నందున కనికరించాలంటూ కాళ్లావేళ్లా పడ్డా అధికారులు స్పందించని దుస్థితి ఎదురైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు డిపోల వద్దే పడిగాపులు కాశారు. కొందరు ఆవేదనతో ఆవేశానికిలోనై అధికారులతో వాదనకు దిగారు. వారు డిపోలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని చివరకు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. పిల్లలతో వచ్చిన కొందరు మహిళా సిబ్బందిని పోలీసులు అలాగే స్టేషన్లకు తరలించారు. ఇలాగే వ్యవహరిస్తే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 6గంటలకే.. రికార్డు స్థాయిలో 52 రోజులపాటు నిర్వహించిన సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మికులందరూ మంగళవారం ఉదయం 6 గంటలకే విధుల్లో చేరేందుకు డిపోలకు వెళ్లాల్సిందిగా జేఏసీ నేతలు సూచించారు. దీంతో చాలా డిపోల వద్ద ఉదయం 5 గంటలకే కార్మికుల రాక మొదలైంది. సమ్మెను విరమించినా, కోర్టులో కేసు తేలే వరకు విధుల్లోకి తీసుకోవటం సాధ్యం కాదని సోమవారం రాత్రే ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎవరినీ డిపోల్లోకి కూడా రానీయొద్దని, విధుల్లో చేరతామంటూ ఇచ్చే లేఖలు కూడా తీసుకోవద్దంటూ అధికారుల నుంచి డిపో మేనేజర్లకు రాత్రే ఆదేశాలు అందాయి. మూకుమ్మడిగా కార్మికులు వచ్చే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసు భద్రత ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు. దీంతో డిపో మేనేజర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం అర్ధరాత్రి నుంచి డిపోలు, బస్టాండ్ల వద్ద భద్రత కల్పించాల్సిందిగా కోరారు. దీంతో అన్ని చోట్లకు పోలీసులు చేరుకున్నారు. ఉదయం వచ్చే కార్మికులు డిపోల వద్దకు చేరుకోకుండా ముందే అడ్డుకున్నారు. తాము గొడవ చేయటానికి రాలేదని, తాము సమ్మెలోనే లేమని, డిపో మేనేజర్లను కలసి డ్యూటీ కేటాయించాలని కోరుతామని అడిగినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పలు డిపోల్లో మహిళా సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. కొన్ని చోట్ల పోలీసులతో కార్మికులు వాదనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేదాకా తాము చేసేదేమీ లేదని డిపో మేనేజర్లు స్పష్టం చేయటంతో వారు నిరాశతో వెనుదిరిగారు. బుధవారం ఉదయం కూడా కార్మికులంతా డిపోల వద్దకు వెళ్లి డ్యూటీలు వేయాలని కోరాల్సిందిగా జేఏసీ నేతలు మంగళవారం సూచించారు. పోలీసులు అరెస్టు చేసినా వెనుకంజ వేయొద్దని చెప్పారు. రాజధానిలో ఇలా.. బస్‌భవన్, మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లు, అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల నుంచే పోలీసులు డిపోలను తమ స్వాధీనంలోకి తీసుకొని కార్మికులు డిపోల్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ముషీరాబాద్, రాణీగంజ్, మియాపూర్, హెచ్‌సీయూ, ఫలక్‌నుమా, ఫారూక్‌నగర్, ఉప్పల్, చెంగిచెర్ల, కుషాయిగూడ, కంటోన్మెంట్, పికెట్, దిల్సుఖ్నగర్, బర్కత్‌పురా, కాచిగూడ, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, జీడిమెట్ల, తదితర అన్ని డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వందలాది మంది కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బందిని అరెస్టు చేశారు. మేడ్చల్ డిపోలో కార్మికులు పోలీసులను ప్రతిఘటించారు. మహిళా కండక్టర్లు కన్నీటి పర్యంతమయ్యారు. జూబ్లీబస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్‌లో పోలీసుల భద్రతా చర్యల వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు, ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడంతో ప్రయాణికులు బస్స్టేషన్లకు వెళ్లలేకపోయారు. కాగా, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో సుమారు 1,500 బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల్లో ఇలా.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5 గంటల నుంచి డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. డిపోల ముందుకు వచ్చిన కార్మికులతో పాటు పరిసరాల్లో గుంపులుగా ఉన్న ఆర్టీసీ కార్మికులను గుర్తించి స్టేషన్లకు తరలించారు. మహిళా కండక్టర్లను సైతం పోలీసులు వదల్లేదు. ఉదయం 6.30 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు సరైన భోజన వసతి కల్పించలేదని, దీంతో మధుమేహ వ్యాధి ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయ్యా క్షమించండి! ‘మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి అద్దే. ఇతర అవసరాలకు డబ్బులు లేక కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి.. అయ్యా కేసీఆర్ సార్ తప్పయ్యింది.. మరో సారి సమ్మె చెయ్యం.. నువ్వు చెప్పినట్టే వింటాం’అంటూ ఆర్టీసీ కార్మికులు నిజామాబాద్ డిపో మేనేజర్ కాళ్లపై పడి వేడుకున్నారు. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డిపో–1, నిజామాబాద్ డిపో–2లకు కార్మికులు ఉదయం 5 గంటలకు విధుల్లో చేరడానికి వచ్చారు. కార్మికులను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డిలో 120 మంది, బాన్సువాడలో 80, బోధన్‌లో 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ కార్యాలయంపైకి ఎక్కి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధుల్లో చేరేందుకు ఆర్టీసీ డిపోల వద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆరు డిపోల వద్ద కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో కార్మికులు, పార్టీల నేతలు ఖమ్మం బస్టాండ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు మహిళా కండక్టర్లు, కార్మికులు ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంపైకి ఎక్కి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ముగ్గురికి అస్వస్థత.. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 10 డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు మంగళవారం ఉదయం 5 గంటల నుంచే డిపోల వద్దకు చేరి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళనలు నిర్వహించారు. దీంతో జిల్లా ఆర్టీసీ జేఏసీ నేతలు, దాదాపు 300 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఆర్టీసీ కార్మికులు కిష్టయ్య, జీఎస్ రెడ్డి, పద్మలు అస్వస్థతకు గురికావడంతో పోలీసులు ప్రభుత్వ ప్రధానాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, మంథని డిపోల వద్ద కూడా కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టుల పర్వం.. మహబూబ్‌నగర్ రీజియన్, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని అన్ని డిపోల్లో ఉదయం విధుల్లో చేరడానికి యత్నించిన కార్మికులు పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ రీజియన్‌లో 835 బస్సులకుగాను 655 బస్సులు నడిచాయి. సంగారెడ్డి డిపోలో పనిచేస్తున్న భీమ్లాల్ అనే కండక్టర్ విధుల్లో చేరడానికి ఉదయమే డిపోవద్దకు వచ్చాడు. పోలీసులు అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అకస్మాత్తుగా అతను కిందపడిపోవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీపీ వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. జహీరాబాద్, సిద్దిపేట, హుస్నాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, యాదగిరిగుట్ట డిపోల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. యాదగిరిగుట్ట డిపోవద్ద 85 మంది కార్మికులను అరెస్ట్ చేశారు. కోదాడ, సూర్యాపేట డిపోలకు చెందిన సుమారు 200 మంది కార్మికులతో పాటు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి సమ్మె విరమించినా ఆర్టీసీ కార్మికులను అధికారులు విధులకు అనుమతించట్లేదని మనస్తాపం చెంది ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళపాడ్‌కు డ్రైవర్ కర్ణం రాజేందర్ (52) సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మాకు ఇవ్వండి.. ఆర్టీసీని నిలబెడతాం: జేఏసీ విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను అరెస్టు చేయటాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది. నెలన్నర ముందే సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించకుండా కాలయాపన చేసి, సమ్మెలోకి వెళ్లేలా చేసి ఇప్పుడు నెపాన్ని కార్మికులపై నెట్టడం సరికాదని జేఏసీ మండిపడింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలేవీ సరి కావని, ఆర్టీసీ నిర్వహణ కష్టమని చెప్పటం తప్పేనని పేర్కొంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన రీయింబర్స్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ, నష్టాల రూట్లలో పన్ను మినహాయింపు ప్రకటించి తమకు అప్పగిస్తే ఆర్టీసీని కాళ్లమీద నిలబడేలా చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. మంగళవారం జేఏసీ నేతలు సమావేశమై కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవటాన్ని ఖండించారు. -
కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీ కార్మికులు చనిపోయారని అనడానికి ఆధారాలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులకు గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కార్మికులను డిస్మిస్ చేసినట్టు ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు కదా అని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ తీరుతోనే కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పలు సూసైడ్ నోట్లను పిటిషన్ న్యాయస్థానం ముందు ఉంచారు. పిటిషనర్ వాదనపై స్పందించిన హైకోర్టు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ నాయకులే దీనికి బాధ్యత వహించాలని తెలిపింది. యూనియన్లు సమ్మెకు పిలుపునిస్తే.. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వ ఏవిధంగా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి తాము ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేమని తెలిపింది. అయితే ఈ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ.. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళ్లిన పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. లేకుంటే మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. కార్మికులను డిపోల్లోకి అనుమతి ఇవ్వకపోతే మరో అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీనిపై రేపు అఫిడవిట్ ఫైల్ చేస్తామని పిటిషనర్ తెలిపారు. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
ఆర్టీసీ కార్మికుల ఏడుపు మంచిది కాదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం విచిత్రంగా తయారవుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత ఎంతో మేలు జరుగుతుందన్న ఆశతో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం వద్దకు తీసుకువచ్చారన్నారు. కార్మికుల డిమాండ్లు నిజమైనప్పటికీ ప్రాణనష్టం జరుగుతోందన్న ఆలోచనతో సమ్మె విరమించారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మె విరమించి తిరిగి విధుల్లో చేరాలనుకుంటున్న ఉద్యోగులను ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ విధుల్లోకి తీసుకోమని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ‘ఆయన ఎవరు ప్రకటన చేయడానికి.. రాష్ట్రంలో ఏం జరుగుతుంది. రాష్ట్రంలో మంత్రులు లేరా’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఆకలి అవుతుందని చెప్పుకునే పరిస్థితి.. నిరసన తెలిపే హక్కు కూడా లేదు’ అని అసహనం వ్యక్తం చేశారు. గత 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి పక్షాలకు మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీని సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రైవేటు చేసినా.. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రైవేటును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు లేఖలు రాస్తున్నానని, ఈ విషయాన్ని కూడా తమ పార్టీ పెద్దలకు లేఖలో వివరిస్తానని తెలిపారు. ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమంలో పని చేసిన మేధావులంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీని ఆదుకోవాలి అలాగే ‘చక్రపాణి, అల్లం నారాయణ, కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీఓ, టీజీఓ నేతలంతా ఎక్కడున్నారు. మీ అందరికీ చీము నెత్తురు లేదా.. మీకు అసలు సిగ్గుందా.. ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారా...చరిత్ర హీనులుగా మిగిలిపోతారా’ అంటూ ధ్వజమెత్తారు. అదే విధంగా ‘సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా.. ఆర్టీసీ కార్మికుల ఏడుపు మంచిది కాదు. ఆర్టీసీని ఆదుకోవాలి. ఇవాళ మీరు అధికారంలో ఉండవచ్చు. పోలీసులు మీ చేతుల్లో ఉండవచ్చు. కానీ అన్ని రోజులు మనవి కావని గుర్తు పెట్టుకోవాలి’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో మంగళవారం ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమీక్షా సమావేశంలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికను గురువారం జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీకి సంబంధించిన తాజా పరిణామాలను సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం? అత్యంత సుదీర్ఘంగా 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం అవునన్నా.. కాదన్నా మంగళవారం నుంచి కార్మికులు విధులకు హాజరుకావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా.. విధుల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే..మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేఏసీ చెప్పడాన్ని ప్రకటనలో తప్పుబట్టారు. ఈ క్రమంలో మంగళవారం విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు పెద్దసంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆర్టీసీ కార్మికుల పోరాటం.. తీరని విషాదం
సాక్షి, నిజామాబాద్/ సంగారెడ్డి : అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించినప్పటికీ ప్రభుత్వం విధుల్లోకి చేర్చుకునేందుకు నిరాకరించడంతో తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సమస్యలు పరిష్కరించాలని సమ్మెలోకి వెళ్లినందుకు ఇప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు తమను విధుల్లోకి చేర్చుకోవాలని వేడుకుంటున్నారు. ఉద్యోగం కోసం కంటతడి పెడుతూ.. కార్మికులు పలుచోట్ల ప్రభుత్వాన్ని, అధికారులను ప్రాధేయపడుతున్నారు. డిపోల మందు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేందర్ (55) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమ్మె విరమించినా ప్రభుత్వం తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో రాజేందర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని, గుండెపోటుతో రాజేందర్ మృతి చెందారని కార్మికులు తెలిపారు. రాజేందర్‌ది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్‌పాడ్ గ్రామం. నురగలు కక్కుతూ పడిపోయిన ఆర్టీసీ కార్మికుడు సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్లోనూ విషాద ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న భీమ్లా మంగళవారం ఉదయం తిరిగి విధుల్లోకి చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చాడు. అయితే, అతన్ని విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులు భీమ్లాను అరెస్టు చేసి.. ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భీమ్లా నురగలు కక్కుతూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో ఆయనను తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో భీమ్లాకు గుండెపోటు వచ్చిందని తోటి కార్మికులు తెలిపారు. మేనేజర్ కాళ్ళు మొక్కిన కార్మికులు విధుల్లో చేరేందుకు నిజామాబాద్ డిపో 1కు ఆర్టీసీ కార్మికులు మంగళవారం భారీగా తరలివచ్చారు. తమను విధుల్లో చేర్చుకోవాలని డిపో మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అయితే, వారిని విధుల్లోకి చేర్చుకోలేమని డిపో మేనేజర్ తేల్చి చెప్పారు. దీంతో ఆందోళన చెందిన కార్మికులు మేనేజర్ కాళ్ళు మొక్కి డ్యూటీలో చేర్చుకోవాలని వేడుకున్నారు. -
ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఇక కాలగర్భంలో కలిసిపోనుందా? త్వరలోనే ఆర్టీసీని పూర్తిగా మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఆర్టీసీని పూర్తిగా మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం. గురువారం జరగబోయే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసే యోచనలో ఉందని తెలుస్తోంది. చదవండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష అత్యంత సుదీర్ఘంగా 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం అవునన్నా.. కాదన్నా మంగళవారం నుంచి కార్మికులు విధులకు హాజరుకావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా.. విధుల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే..మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేఏసీ చెప్పడాన్ని ప్రకటనలో తప్పుబట్టారు. ఈ క్రమంలో మంగళవారం విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు పెద్దసంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యం అనుమతి లేనందున విధుల్లో చేరడం కుదరంటూ కార్మికులను వెనక్కి పంపివేస్తున్నారు. ఇప్పటికే పలువురు జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు.. తాత్కాలిక కండక్టర్లను, డ్రైవర్లను అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగాయి. కరీంనగర్ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులకు మద్దతుగా వచ్చిన సీపీఐ కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో చేరుందుకు వచ్చిన సంగారెడ్డి కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి డిపోలోకి ఆర్టీసీ కార్మికులు దూసుకువచ్చారు. తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ అధికారులలో వాగ్వివాదానికి దిగారు.దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 100 మంది కార్మికులతో పాటు మహిళా కండక్టర్లను అరెస్ట్ చేశారు. నిజామాబాద్ 1 డిపో వద్ద విధుల్లో చేరేందుకు వచ్చిన ఏడుగురు ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు వేడుకున్నారు. కేసీఆర్‌కు దండం పెడుతున్నాము..దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తమ ఇళ్లల్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విధుల్లోకి చేరడానికి ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా బయలుదేరి డిపోలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. కార్మికులను పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని మహిళా కండక్టర్లు అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. విధుల్లోకి చేరేందుకు కార్మికులు అన్ని డిపోలకు వెళ్లారు. డిపో లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. 23 మంది కార్మికులను అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి డిపోల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. నారాయణ పేట డిపోవద్ద ధర్నాకు దిగిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిపోకి చేరుకున్న కార్మికులు.. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకున్నారు. దీంతో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపో వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నార్కట్‌పల్లి, దేవరకొండ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట, కోదాడ ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సంగారెడ్డి డిపో వద్ద విధుల్లోకి చేరేందుకు యత్నించిన కార్మికును పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట డిపో వద్ద పోలీసులకు, కార్మికుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ ఆర్టీసీ డిపో వద్దకు పోలీసులకు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. విధులకు హాజరవుతామంటూ కార్మికులు డిపోలోకి చొచ్చుకొచ్చారు. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ అధికారులు వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకొని కార్మికులు అదుపులోకి తీసుకున్నారు. -
‘సీఎం ఉదారంగా వ్యవహరించాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ నాయకులపై ఉన్న కోపాన్ని ఆర్టీసీ కార్మికులపై చూపొద్దని టీపీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆర్టీసీ కార్మికుల పట్ల ఉదారంగా వ్యవహరించి వారిని విధుల్లోకి చేర్చుకోవాలన్నారు. ప్రభుత్వ వైఖరితో మరింత మంది కార్మికులు ఆత్మహత్య చేసుకునే ప్రమాదముందని, హైకోర్టు తీర్పు ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవడానికి అడ్డంకి కాదన్నారు. -
న్యాయబద్ధంగా వ్యవహరించాలి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లో చేర్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలని బీజేపీ అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు డిమాండ్‌చేశారు. ఇంకా వారిని విధుల్లో చేర్చుకోకుండా లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా బెదిరింపు ధోరణితో వ్యవహరించడం అన్యాయం, అక్రమమని ఇలాంటి ధోరణిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సమ్మెను ముగించినట్లు అధికారికంగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని మండిపడ్డారు. ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ విడుదల చేసిన ప్రకటన చూస్తే ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగులను విధులకు అనుమతించవద్దని డైరెక్షన్ ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. బలహీనమైన ఆర్టీసీ కార్మికులపై సీఎం తన అధికార బలాన్ని ప్రయోగించి ఇది తన విజయంగా ఆనందిస్తున్నారని దుయ్యబట్టారు. -
సమ్మె విరమణ హర్షణీయం: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత 52 రోజులుగా కొనసాగిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం హర్షణీయమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కార్మికులు మంగళవారం నుంచి విధుల్లో చేరుతామని ప్రకటించినందున వారిని విధుల్లో చేర్చుకునే విషయంలో ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఎలాంటి ఆటంకాలు సృష్టించినా అది శాంతి భద్రతల అంశంగా మారే అవకాశం ఉందని, మానవతాదృక్పథంతో వారు విధుల్లో చేరేలా కేసీఆర్ అనుమతించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. -
సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: విధుల్లో చేరేందుకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయించినందున రాష్ట్ర ప్రభు త్వం కూడా సానుకూల దృక్పథంతో వ్యవహ రించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దాదాపు 3 నెలలుగా జీతాలు లేకున్నా ఆర్టీసీ కార్మికులు అద్భు త పోరాట పటిమ ప్రదర్శించి సమ్మెను కొనసాగించడం అభినందనీయమన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి కార్మికులు సమ్మె విరమించిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకుని ఉదారత చాటాలని కోరారు. -
ఆర్టీసీ కార్మికుని ఆత్మహత్యాయత్నం
సాక్షి, భానుపురి (సూర్యాపేట): ఆర్టీసీ జేఏసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడాన్ని నిరసిస్తూ ఓ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రవినాయక్ జేఏసీ చేసిన ప్రకటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జేఏసీ నిర్ణయం వెలువడగానే డిపోగేటు వద్దకు పెద్ద సంఖ్యలో కార్మికులు వచ్చారు. వారితో పాటు వచ్చిన రవినాయక్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. అక్కడే ఉన్న కార్మికులు, పోలీసులు వెంటనే రవినాయక్ వద్దకు చేరుకుని నిప్పంటించుకోకుండా అడ్డుకున్నారు. అతని ఒంటిపై నీళ్లు చల్లి అక్కడినుంచి తరలించారు. జేఏసీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నారని రవి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
అనుభవం లేనివారు బస్సులు నడిపారు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బందితో బస్సులు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ మంత్రి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నామని, ఈలోగా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి దాఖలు చేసిన పిల్‌ను సోమవారం ధర్మాసనం విచారించింది. వోల్వో ప్రైవేటు బస్సులు, ట్రక్కులు నడిపే వాళ్లను తాత్కాలిక ప్రాతిపదికపై నియమించడం వల్ల అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని గోపాలకృష్ణ వాదించారు. ప్రమాదాల వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్టీసీ యాజమాన్యం పరిహారం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని, గాయపడిన వారికి ఆర్థికసాయం అందజేయాలని కోరారు. ప్రైవేటు వాహనాల బ్రేక్ సిస్టమ్ ఎయిర్ వాక్యూమ్ మీద ఆధారపడి ఉంటుందని, అయితే ఆర్టీసీ బస్సులు హైడ్రాలిక్–కమ్–ఎయిర్ బ్రేక్ పద్ధతుల్లో పనిచేస్తాయని, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ వంటి సాంకేతిక విషయాలపై ప్రైవేటు డ్రైవర్లకు అవగాహన ఉండదని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. 90 రోజుల శిక్షణ తర్వాతే విధుల్లోకి తీసుకోవాలన్నారు. మోటారు వాహన చట్టంలోని 19వ సెక్షన్ ప్రకారం కండక్టర్‌గా చేసే వారికి సర్టిఫికెట్ ఉండాలని, అయితే పదోతరగతి ఉత్తీర్ణులై ఆధార్ కార్డు ఉన్న వాళ్లను నియమిం చారని చెప్పారు. సమ్మె నేపథ్యంలో కేవలం సీఎం కేసీఆర్ మెప్పు కోసమే అధికారులు ఈ తరహా నియామకాలు చేశారని చెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. జీతాల చెల్లింపు కేసు రేపటికి వాయిదా ఆర్టీసీ సిబ్బంది పనిచేసిన సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు దాఖలు చేసిన రిట్‌ను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి మరోసారి విచారించారు. ఆర్టీసీ యాజమాన్యం తరఫు వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ కోరారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా కోరారని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. ఇకపై వాయిదాలు కోరవద్దని సూచించిన హైకోర్టు, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడదాం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: కోర్టు తీర్పుపై గౌరవం ఉంచి, శాంతియుత పరిష్కారం కోసం సమ్మె విరమించి మంగళవారం ఉదయం విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులకు పార్టీ శ్రేణులు, పౌరసమాజం, ప్రజలు మద్దతుగా నిలవాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తిచేశారు. కార్మికుల కుటుంబాలకు ధైర్యం ఇచ్చేలా కార్యాచరణ ఉండాలని ఆయన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నామన్నారు. ప్రజారవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసి, కార్మికుల పొట్టలు కొట్టే దుర్మార్గానికి ఒడిగట్టిన ప్రభుత్వం నేడు కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమిస్తామన్నా ఎటూ తేల్చక మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని టీజేఎస్ నాయకులు ఎక్కడికక్కడ ఎండగట్టాలని కోరారు. -
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే వారిని విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర గవర్నర్‌గా గత సెప్టెంబర్ 8న తమిళిసై బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమెను కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి కలుసుకోవడం ఇదే తొలిసారి. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో ప్రధానంగా ఆర్టీసీ సమ్మెపై చర్చ జరిగింది. ఆర్టీసీపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని, రాష్ట్ర రవాణా శాఖ అధికారులను ఇందుకోసం ఢిల్లీకి పిలుస్తామని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమ్మెకు దిగిన కార్మికుల పట్ల ప్రభుత్వ కఠిన వైఖరికి కారణాలు, ఆర్టీసీ సంస్థ ఆర్థిక స్థితిగతులు, 5,100 రూట్లను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వస్తే పెద్ద మనస్సుతో వారిని చేర్చుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సీఎంకు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టం ఉద్దేశాలను ఈ భేటీలో సీఎం.. గవర్నర్‌కు తెలియజేసినట్లు తెలిసింది. త్వరలో శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నామని గవర్నర్‌కు తెలియజేసినట్లు సమాచారం. -
కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు: సునీల్ శర్మ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సూచించిన ప్రక్రియ ముగిసే వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ ప్రకటించారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ప్రగతి భవన్లో ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన అనంతరం సునీల్‌శర్మ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. సమ్మె చేయాలని ప్రభుత్వం చెప్పలేదు.. ‘ఓ వైపు పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూనే మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారు. ఇష్టమొచ్చినప్పు డు విధులకు గైర్హాజరై, మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలోనూ ఉండదు. ఆర్టీసీ కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం లేదా ప్రభుత్వం సమ్మె చేయాలని చెప్పలేదు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి ముఖ్య పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించా రు. కార్మికులు ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు’ అని సునీల్‌శర్మ తేల్చి చెప్పారు. అంతా చట్టప్రకారం జరుగుతుంది.. ‘హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మికశాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు చేపడు తుంది. అంతా చట్ట ప్రకారం జరుగుతుంది. అప్పటివరకు అంతా సంయమనం పాటించాలి. హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు. వారంతట వారుగా సమ్మెకు దిగి ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదు’అని సునీల్‌శర్మ పేర్కొన్నారు. తాత్కాలిక సిబ్బందిని అడ్డగిస్తే క్షమించం.. ‘కార్మికులు యూనియన్ల మాట విని నష్టపోయారు. ఇకపై కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దు. మం గళవారం డిపోలవద్దకు వెళ్లి శాంతిభద్రతల సమస్యలు సృష్టిం చొద్దు. బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకోవద్దని కోరుతున్నా. డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తాం. ఎవరైనా చట్టాన్నిఉల్లంఘిస్తే ప్రభుత్వం లేదా ఆర్టీసీ యాజమాన్యం క్షమించదు. చట్టపరమైన చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేస్తాం. హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకొనే వరకు సంయమనం పాటించాలని కోరుతున్నా’అని సునీల్ శర్మ కార్మికులకు సూచించారు. -
సమ్మె విరమించి విధుల్లో చేరుతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అత్యంత సుదీర్ఘంగా 52 రోజులపాటు చేపట్టిన సమ్మెను ఆర్టీసీ జేఏసీ ఎట్టకేలకు విరమించింది. అక్టోబర్ 5న ప్రారంభించిన సమ్మెను ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి విరమించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తొలిషిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు కార్మికులంతా డిపోలకు వెళ్లాల్సిందిగా పిలుపునిచ్చింది. సోమవారం మధ్యాహ్నం అఖిలపక్ష నేతలతో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో భేటీ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ తదితరులు ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. ‘ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు చేపట్టిన ఈ ఉద్యమంలో నైతిక విజయం కార్మికులదే. ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మెను విరమించాలని నిర్ణయించాం. కానీ ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమం మాత్రం ఆగదు. దశలవారీగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయం కార్మికులు విధులకు హాజరు కావాలి. ఇంతకాలం బస్సులు నడిపిన తాత్కాలిక సిబ్బంది ఇక విధుల నుంచి తప్పుకొని సహకరించాలి. వారిపై మాకేమీ కోపం లేదు. సమ్మెను విరమించినంత మాత్రాన కార్మికులు ఓడినట్టు కాదు.. ప్రభుత్వం గెలిచినట్టు కాదు. సంస్థలో ఉంటూ సంస్థ ప్రైవేటీకరణ కాకుండా పోరాటానికి నాంది పలుకుతున్నాం. కార్మికులు ఆందోళన చెందొద్దు... ‘52 రోజుల సుదీర్ఘ శాంతియుత పోరాటంలో భాగస్వాములైన కార్మికులు, అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయ, బ్యాంకు, ఇన్సూరెన్స్, రిటైరైన ఉద్యోగులు, మీడియా సిబ్బంది, పోలీసులు... అందరికీ ధన్యవాదాలు. లేబర్ కోర్టులో కార్మికులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. కార్మికులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమ్మెకాలంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం. సమ్మె విరమించినా పోరాటం చేయాల్సి ఉన్నందున జేఏసీ కొనసాగుతుంది. కార్మికులంతా ఇన్ని రోజులూ ఐకమత్యంతో ఉండటం ఉద్యమస్పూర్తికి పునాది. వారి పోరాటం వృథాగా పోదు. సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారమే తప్ప విధులను విడిచిపెట్టడం కాదు. కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే సమ్మెను యథావిధిగా కొనసాగిస్తాం. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తాం, విరమించగానే విధుల్లోకి వెళ్తాం. విధులకు అడ్డుచెప్పొద్దు. కొన్ని రోజులుగా పోలీసులు, రెవెన్యూ, రవాణాశాఖ అధికారులు అసలు పనులు వదిలి ఆర్టీసీపై పడ్డారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకుపోగలిగాం’అని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు థామస్‌రెడ్డి, తిరుపతి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో అఖిలపక్ష నేతలు కోదండరాం, వి.హన్మంతరావు, వినోద్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, పోటు రంగారావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, చెరుకు సుధాకర్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. విరమణ లేఖలు కార్యాలయాలకు.. సమ్మె విరమణకు సంబంధించిన లేఖలను జేఏసీ నేతలు అధికారుల కార్యాలయాలకు అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ, బస్‌భవన్.. ఇలా ప్రధాన కార్యాలయాలకు వెళ్లి అక్కడి సిబ్బందికి అందజేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 6,448 బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 1,838 అద్దె బస్సులు కూడా ఉన్నాయని వివరించారు. 4,608 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,448 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరైనట్లు చెప్పారు. 6,332 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడామని, 94 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశామని పేర్కొన్నారు. పోలీసు పహారాలో డిపోలు... అన్ని చోట్లా సీసీ కెమెరాల ఏర్పాటు సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించిన జేఏసీ, ఉదయం ఆరుకల్లా కార్మికులంతా డ్యూటీలకు వెళ్లాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని డిపోలను వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లాల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు సాయంత్రమే పోలీసు భద్రతను కోరారు. ఈ నేపథ్యంలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమ్మె ఉధృతమైన సమయంలో కొన్ని డిపోల్లో ఏర్పాటు చేయగా, మిగతావాటిలో తాజాగా ఏర్పాటు చేశారు. విధుల్లోకి తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం: అశ్వత్థామరెడ్డి ‘సమ్మె విషయంలో లేబర్ కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పుడు కేసును లేబర్ కోర్టుకు ప్రభుత్వం రిఫర్ చేయాల్సి ఉంది. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును విజయవంతంగా జనంలోకి తీసుకెళ్లగలిగాం. ఈ విషయంలో నైతిక విజయం సాధించాం. హైకోర్టు సూచనలను మేం గౌరవిస్తూ ముందుకు సాగుతున్నాం. సమ్మె విరమణ కూడా అందులో భాగమే. సమ్మె విరమించినందున మేం విధుల్లో చేరాల్సి ఉంది, ఆర్టీసీ చేర్చుకోవాలి.. కానీ ఎండీ అందుకు ఒప్పుకోనంటున్నారు. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం. గతంలో సుప్రీంకోర్టు చెప్పిన మాటలకు భిన్నమైన వ్యవహారం. ఇది ఓ రకంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. మంగళవారం ఉదయం విధుల్లోకి రాకుండా మమ్మల్ని నిరోధిస్తే మేం హైకోర్టు తలుపు తడతాం. ఇప్పటివరకు వేరే వాళ్లు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో మేం ఇంప్లీడ్ అయ్యాం. కానీ ఇప్పుడు నేరుగా మేమే కేసు దాఖలు చేస్తాం. మంగళవారం విధుల్లోకి తీసుకోకుంటే మరోసారి అఖిలపక్ష నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎవరికి చెప్పి సమ్మె చేశారన్నట్లుగా ఇన్చార్జి ఎండీ మాట్లాడుతున్నారు. సమ్మె ఎవరికో చెప్పి చేయాల్సిన అవసరం లేదు. కార్మికుల సమస్యలపై కార్మికులతో మాట్లాడి సమ్మె చేస్తాం. ఈ విషయంలో కార్మికులు అధైర్య పడాల్సిన పనిలేదు. ఆర్టీసీ ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం చేసే హడావుడిని చూసి కూడా కార్మికులు ఆందోళన చెందాల్సిన పని లేదు’’అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఐదు రోజులుగా జేఏసీ మల్లగుల్లాలు... వాస్తవానికి గత ఐదు రోజులుగా సమ్మె విరమణపై ఆర్టీసీ జేఏసీ మల్లగుల్లాలు పడుతోంది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ గత బుధవారం జేఏసీ ప్రకటించింది. అప్పట్లోనే సమ్మెను విరమించాలన్న అభిప్రాయాన్ని సింహభాగం కార్మికులు వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొంత డోలాయమానంలో ఉన్న జేఏసీ నేతలు... విరమణ అంశాన్ని తీవ్రంగానే పరిశీలించారు. అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిశ్చితాభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేశారు. సోమవారం అఖిలపక్ష భేటీలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా వారు కూడా అదే మంచి నిర్ణయమని మద్దతు తెలిపారు. సమ్మె విరమణపై జేఏసీ ప్రకటన చేసే సమయంలో సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆర్టీసీకి సంబంధించిన కీలక అంశాలపైనే చర్చ జరుగుతోందన్న వార్తలు రావడంతో జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో సమావేశమై సమ్మె విరమణ నిర్ణయం తీసుకోవడం గమానార్హం. మెట్టు దిగుతూ వచ్చిన జేఏసీ... బెట్టు వీడని ప్రభుత్వం డిమాండ్ల సాథనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తామని తొలుత భీష్మించుకొని కూర్చున్న కార్మిక సంఘాల జేఏసీ... ఆ తర్వాత పరిస్థితినిబట్టి మెట్టు దిగుతూ వచ్చింది. సమస్య జటిలమై చివరకు కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి రావొద్దన్న ఉద్దేశంతో పట్టు వీడింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమనే ప్రధాన డిమాండ్‌ను సైతం తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత గత బుధవారం ఏకంగా సమ్మె విరమణ అంశాన్ని ప్రస్తావించింది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది. సడక్ బంద్‌ను కూడా విరమించింది. ఈ రెండు సందర్భాల్లో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని జేఏసీ ఆశించింది. కానీ కార్మిక సంఘాలు మెట్టు దిగినా ప్రభుత్వం మాత్రం బెట్టు వీడలేదు. ఇప్పుడు ఏకంగా సమ్మెనే విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించినా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోగా విధుల్లోకి తీసుకోవడం సాధ్యం కాదంటూ ఎండీ పేరిట ప్రకటన విడుదల కావడం గమనార్హం. 32 మంది మృత్యువాత సమ్మె ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు సంబంధించి 32 మంది మృతి చెందారు. వారిలో 28 వరకు కార్మికులు ఉండగా మిగతావారు వారి కుటుంబ సభ్యులున్నారు. ఆర్టీసీలో ఉద్యోగం పోయిందనే ఆవేదనతో ఎక్కువ మంది గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. నలుగురు కార్మికులు మాత్రం బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో ఖమ్మంకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటికి నిప్పంటించుకొని ఇంట్లోనే మరణించడం అందరినీ కలచివేసింది. మృత్యువుతో పోరాడుతూ కూడా ఆయన... కార్మికులు బాధలో ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతితో సమ్మె ఒక్కసారిగా ఉధృతరూపం దాల్చింది. ఆ తర్వాత రాణిగంజ్ డిపో కండక్టర్ సురేందర్‌గౌడ్ ఉరేసుకుని చనిపోయారు. ఆయన అంతిమయాత్రలో కార్మికులు, విపక్ష నేతలు, కార్యకర్తలు, భారీగా పాల్గొనడంతో సమ్మె మరింత ఉధృతమైంది. ఆ తర్వాత సత్తుపల్లి డిపో కండక్టర్ నీరజ, మహబూబాబాద్ డిపో డ్రైవర్ నరేశ్‌లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. సమ్మె ప్రారంభం: అక్టోబర్ 5 సమ్మె ముగింపు: నవంబర్ 25 సమ్మె జరిగిన రోజులు: 52 సమ్మె కాలంలో మరణించిన కార్మికులు, వారి కుటుంబీకులు: 32 -
‘ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయారు’
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అశ్వత్థామరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్ఎంయూ జిల్లా నాయకుడు రవి నాయక్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయాడని ఆరోపించారు. 52 రోజుల పాటు సమ్మె పేరుతో కార్మికుల జీవితాలతో చేలగాటమాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అశ్వత్థామరెడ్డి నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన రవినాయక్.. సోమవారం సాయంత్రం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మరోవైపు ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నామని, మంగళవారం ఉదయం నుంచి ఉద్యోగులందరూ విధుల్లో పాల్గొనాలని జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి.. ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు. దీంతో ఉదయం 6.00 నుంచే అన్ని డిపోల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్..
సాక్షి, హైదరాబాద్ : సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. మంగళవారం ఉదయం విధులకు హాజరవుతామని కార్మిక సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్మిక సంఘాల ప్రకటనపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ జేఏసీ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని సునీల్ శర్మ పేర్కొన్నారు. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి.. ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. పరిస్థితులను సమీక్షిస్తామని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ కార్మికులకు సమ్మె చేయమని చెప్పలేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు సూచించిన ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునేవరకు వేచి చూడాలని కార్మికులకు సూచించారు. ఆ నిర్ణయం ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని.. అప్పటివరకు సంయమనం పాటించాలని కోరారు. కార్మికులు యూనియన్ల మాటలు విని ఇప్పటికే నష్టపోయారు.. ఇక ముందు వారి మాటలు విని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని అన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆర్టీసీ యాజమాన్యం క్షమించదని తెలిపారు. చదవండి : ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గిన జేఏసీ -
ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల జేఏసీ మరోసారి వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. కార్మికులంతా రేపు ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. అలాగే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మికులకు సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అశ్వత్థామరెడ్డి తెలిపారు. డిపోల వద్దకు వెళ్లిన కార్మికులను అడ్డుకోవద్దని యాజమాన్యాన్ని కోరారు. కార్మికులదే నైతిక విజయమని తెలిపిన ఆయన.. ఇందులో ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలువలేదని వ్యాఖ్యానించారు. అలాగే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపు విధులకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండగా ఉంటుందని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థను రక్షించడంతో పాటు, కార్మికుల హక్కుల రక్షణ కోసమే పోరాటం చేశామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెకు సహకరించిన కార్మికులకు, రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇది పోరాటానికి నాంది మాత్రమేనని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని, కార్మికుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమ్మె విరమించినట్టు వెల్లడించారు. సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారానికే తప్ప.. విధులను విడిచిపెట్టడానికి కాదని స్పష్టం చేశారు. సమ్మెకు ముందు ఉన్నటువంటి వాతావరణం కల్పించి ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధులు నిర్వర్తించేలా చూడాలని జేఏసీ నాయకులు కోరారు. కాగా, అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమైన సమ్మె.. 52 రోజుల పాటు కొనసాగింది. అయితే వారం రోజుల క్రితం ఆర్టీసీ సమ్మె చట్టబద్ధమా, వ్యతిరేకమా నిర్ణయించే అధికారం లేబర్ కోర్టుకు ఉందని తెలుపడంతో జేఏసీ సమ్మె విషయంలో వెనక్కి తగ్గింది. కానీ మరసటి రోజే సమ్మె కొనసాగిస్తున్నట్టు జేఏసీ మరో ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గత నాలుగు రోజులుగా కార్మికులు విధుల్లోకి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వారిని తిప్పి పంపిస్తున్నారు. -
గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ యాక్ట్, ఆర్టీసీ ప్రైవేటీకరణతో పాటు పలు అంశాలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించారు. ప్రధానంగా ఆర్టీసీపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా కేసీఆర్ గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. కాగా, తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్‌కు రావడం ఇదే తొలిసారి. -
ఆర్టీసీ జీతభత్యాలపై విచారణ 27కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల జీతభత్యాల పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని, కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై పిటిషనర్ స్పందిస్తూ.. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇప్పటికే 30 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 27కు హైకోర్టు వాయిదా వేసింది. ఆర్టీసీ బస్సు ప్రమాదాలపై విచారణ.. తాత్కాలిక సిబ్బందిని నియమించడంతో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదాలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అనుభవం లేని తాతాల్కిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించడంతో చాలా ప్రమాదాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెకట్రరీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది. భవిష్యత్తు కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ సమావేశం.. ఆర్టీసీ భవిష్యత్తు కార్యాచరణపై సోమవారం ఆర్టీసీ జేఏసీ సమావేశం జరిగింది. ఆర్టీసీ కార్మిక నేతలు ఆశ్వత్ధామరెడ్డి, రాజిరెడ్డిలతో పాటు కోదండరాం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె-భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. కేంద్రాన్ని కలిసే యోచనలో ఆర్టీసీ జేఏసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు ఆర్టీసీ జేఏసీ కోరింది. -
మానవ హారాలు..మహిళా కార్మికుల నిరసనలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మండల, తాలూకా, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో మానవ హారాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంజీబీఎస్, సిటీ పరిధిలోని బస్ డిపోల వద్ద మహిళా కండక్టర్లతో నిరసనలు చేపట్టి డిమాండ్లు పరిష్కరించి విధుల్లో చేర్చుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటంతో పాటు సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికులకు నివాళులర్పించారు. కాగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 6,141 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో ఆర్టీసీ బస్సులు 4,260, అద్దె బస్సులు 1,881 ఉన్నట్లు తెలిపింది. ప్రజారవాణా ఏర్పాట్లలో ప్రయాణికుల సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. 6,058 బస్సుల్లో టిమ్‌ల ద్వారా టికెట్లు ఇవ్వగా ,63 బస్సుల్లో మాన్యువల్ పద్ధతిలో టికెట్లు జారీ చేసినట్లు చెప్పింది. -
అద్దె బస్సులపై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల స్థాయిలోనే సేవలందిస్తున్న అద్దె బస్సుల భవితవ్యం గందరగోళంలో పడింది. ప్రభుత్వం 5,100 బస్సులను ఆర్టీసీ నుంచి మినహాయించి అంతమేర రూట్లను ప్రైవేటీకరించాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఆర్టీసీకి సొంత బస్సులు సగం ఉండనుండగా మిగతావి ప్రైవేటు పర్మిట్లతో నడిచే బస్సులుంటాయని సీఎం ఇప్పటికే తేల్చిచెప్పడం, దీనికి హైకోర్టు అడ్డుచెప్పకపోవటంతో ఈ ప్రక్రి య అమలు దాదాపు ఖాయమైంది. అయితే ప్రైవేటీకరించే కోటా(5,100 బస్సులు) పరిధిలోకే అద్దె బస్సులు వస్తాయని గతంలోనే సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో అద్దె బస్సుల విధానమే రద్దవుతుందన్న ప్రచారం ఆర్టీసీలో మొదలైంది. అద్దె బస్సుల యజమానులనూ ప్రైవేటు పర్మిట్ బస్సుల పరిధిలోకి తెస్తారని చర్చ జోరుగా సాగుతోంది. ఆర్టీసీ తమతో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు దానికి విరుద్ధంగా కొత్త ఒప్పందంలోకి వెళ్లమంటే ఎలా సాధ్యమని అద్దె బస్సుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. కొత్త ఒప్పందాన్ని ఒప్పుకోబోమని, అవసరమైతే న్యాయ పోరాటానికి దిగుతామని కొందరు పేర్కొంటున్నారు. ఏమిటా ఒప్పందం.. ఎందుకీ సమస్య? ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆర్టీసీ సొంతంగా బస్సులు కొనుగోలు చేయడం లేదు. ఏటా పాతవి, నడవలేని బస్సులను సర్వీసు నుంచి తప్పిస్తోంది. వాటి స్థానంలో అద్దె బస్సులను పెంచు తూ వచ్చింది. గతంలో మొత్తం బస్సుల్లో వాటి సంఖ్య 15 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 25 శాతానికి చేరింది. అద్దె బస్సులను ప్రోత్సహిం చడం వల్ల వాటి కొనుగోలు భారం లేకపోవడమే కాకుండా డ్రైవర్లను నియమించే అవసరం తప్పింది. దీంతో క్రమంగా వాటి సంఖ్య 2,100కు చేరుకుంది. ఇటీవల కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా యుద్ధప్రాతిపదికన కొత్తగా 1,200 అద్దె బస్సులను తీసుకున్నారు. వెరసి ఇప్పుడు అద్దె బస్సుల సంఖ్య 3,300కు చేరుకుంది. ఒక్కో బస్సుకు పదేళ్ల ఒప్పందం ఉంది. అయితే ఆర్టీసీ తీసుకున్న అద్దె బస్సుల్లో 2,100 బస్సుల గడువు ఇంకా తీరలేదు. ఇటీవలే కొత్తగా తీసుకున్న 1,200 బస్సులకు పదేళ్ల ఒప్పందం అలాగే ఉంది. అద్దె బదులు వాటిని ప్రైవేటు పర్మిట్ల కోటాలోకి మారాలంటూ ప్రభుత్వం సూచించనుందనే మాట అధికారుల నుంచి వినిపిస్తోందని అద్దె బస్సుల యజమాను లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అద్దె బస్సుల ఒప్పందం ప్రకారం మోటారు వాహన పన్ను, డీజిల్ ఖర్చు, కండక్టర్ వేతనం, బీమా భారం యజమానులకు లేదు. అన్ని పన్నులూ ఆర్టీసీనే చెల్లించి తిరిగి ప్రభుత్వం నుంచి దాన్ని వసూలు చేసుకుంటోంది. దీంతో ఒక్కో బస్సుపై యజమానులు ఏటా రూ.1.30 లక్షలే ఖర్చు చేస్తున్నారు. అదే ప్రైవేటు పర్మిట్ల విషయంలో ఆ ఖర్చు రూ. 3.36 లక్షలు అవుతుందని బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం తమను ప్రైవేటు పర్మిట్ల రూపంలో తిప్పాలని సూచిస్తే ఒప్పందం నుంచి వైదొలుగుతామని, బస్సులను అమ్మేసి ప్రజా రవాణా నుంచి వైదొలగుతామని చెబుతున్నారు. -
బస్సు.. భవితవ్యంపై కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ భవితవ్యంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. సంస్థ మనుగడ, రూట్ల ప్రైవేటీకరణ, సమ్మెలో ఉన్న కార్మికుల భవితవ్యంపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని అంశాలను చర్చించి ఆర్టీసీపై తుది నిర్ణయం తీసు కోవాలని గత గురువారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. 5,100 రూట్ల ప్రైవేటీ కరణకు కేబినెట్ నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రతి సోమవారం నాటికి అందు బాటులోకి రానుందని, అదే రోజు కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆర్టీసీపై కీలక నిర్ణ యాలు తీసుకుంటారని రవాణాశాఖ వర్గాలు పేర్కొం టున్నాయి. ఆర్టీసీని నడపడానికి ప్రతి నెలా రూ. 640 కోట్లు కావాలని, ఈ మొత్తాన్ని భరించే శక్తి సంస్థకు లేదా తమకు లేదని ప్రభుత్వం చేతు లెత్తేసింది. దీన్నుంచి బయట పడేందుకు బస్సు చార్జీల పెంపు ఒకటే మార్గమని, కానీ దీనివల్ల సామాన్యులు ఇబ్బంది పడ తారని అభిప్రాయ పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీని యథా విధిగా నడపడం సాధ్యం కాదని ప్రకటించింది. ఈ పరిస్థితు లను కారణంగా చూపుతూ ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. రూట్ల ప్రైవేటీకరణకు ఇప్పటికే రవాణాశాఖ ముసాయిదా విధివిధానాలను రూపొం దించింది. సోమవారం ఈ అంశంపైనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చేసిన ప్రకటనపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరి కోసం సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. దీనిపైనా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. -
ఆ ప్రాంతాల్లో రేపు ‘సేవ్ ఆర్టీసీ’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కార్మికులకు ధన్యవాదాలు చెప్పారు. గత 51 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారని అన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుందని వెల్లడించారు. జేఏసీ సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఇవాళ అన్ని బస్ డిపోల ముందు మానవహారాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. రేపు డిపోలు, బస్టాండ్ల వద్ద, ప్రధాన కూడళ్లలో ‘సేవ్ ఆర్టీసీ’పేరుతో నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. -
ప్రజా సమస్యలపై వామపక్షాల పోరాటం
సాక్షి, సంగారెడ్డి: వామపక్షాలు చాపకింద నీరులా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి. జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడం, భారతీయ జనతా పార్టీ అధికశాతం పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతున్న క్రమంలో వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటా లతో బలోపేతమయ్యేందుకు ప్రయత్ని స్తున్నాయి. వీటితోపాటు అనుబంధ సంఘా లు సైతం నిరంతరం ప్రజా సమస్యలపై, కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తూ వారికి చేరువవుతున్నాయి. వామపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు తక్కువగా ఉన్నప్పటికీ సమస్యల పోరాటంలో ఆ పార్టీ యే ముందుంటోంది. ముఖ్యంగా కార్మికులకు, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, పంచాయతీ పారిశుధ్య కార్మికులు.. ఇలా సమాజంలోని పలు వర్గాల పోరాటాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ వారి మన్నన చూరగొంటున్నారు. కార్మికులకు, ప్రజలకు అండగా.. సీపీఎం, సీపీఐ పార్టీలతోపాటు వాటి అనుబంధ సంఘాలు కార్మికులకు, ప్రజలకు అండగా ఉంటున్నాయి. కార్మికులు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నాయి. సమాజంలోని ఏ వర్గానికి అన్యాయం జరిగినా, కార్మికులు, ఉద్యోగులు సమ్మెలు, నిరసనలు తెలిపినా వారికి మద్ధతుగా నిలుస్తున్నాయి. అదే విధంగాఅంగన్వాడీ వర్కర్లు, పంచాయతీ పారిశుధ్య వర్కర్ల సమస్యల పరిష్కారానికి అనుబంధ సంఘాలు ప్రత్యక్షంగా వారితో కలిసి పోరాటం చేస్తున్నాయి. సీపీఐకి అనుబంధంగా ఏఐటీయూసీ, రైతు సంఘాలు, ఏఐఎస్ఎఫ్, మహిళా సమాఖ్య, బీకేఎం, ఏవైఎఫ్లు ఉన్నాయి. అదే విధంగా సీపీఎంకు అనుబంధంగా సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘాలు, హమాలీ వర్కర్స్, తాపీ మేస్త్రీలు, మోటార్ వెహికిల్స్ యూనియన్లు ఉండి ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ఆర్టీసీ కార్మికులు గడిచిన 50రోజులుగా చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కొత్త బస్‌స్టేషన్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమాలకు నిరంతరం హాజరవుతున్నారు. వారికి పూర్తిస్థాయి మద్దతు తెలియజేస్తున్నారు. వారి తరఫున నిరసన గళం వినిపిస్తున్నారు. అనుబంధ సంఘాల్లోని కళాకారులు పాటలు, ఆటల ద్వారా ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతున్నారు. అదే విధంగా విద్యుత్ ఉద్యోగులకు కూడా అండగా నిలుస్తున్నారు. డబుల్‌బెడ్ రూం ఇళ్ల మంజూరు, రైతుబంధు డబ్బు ఖాతాల్లో జమకాని వారికోసం అధికారులకు ప్రజల తరఫున విన్నవిస్తున్నారు. ప్రధాన సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అదే విధంగా జిల్లాలోని పటాన్చెరు, జహీరాబాద్, సదాశివపేట్, తదితర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు, ఖార్ఖానాలు అధికంగా ఉన్నాయి. వీటిలో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. కార్మికులకు ఏదైనా అన్యాయం జరిగినా, యాజమాన్యాలు వేధించినా వీరు కలుగజేసుకొని న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, అవర్ బేస్డ్ ఉద్యోగులు, పార్ట్ టైం, తదితర రెగ్యులర్ కాని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సైతం వామపక్ష, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం వీరు పోరాటాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. రోజు రోజుకూ ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటూ వామపక్ష పార్టీలు పుంజుకుంటున్నాయి. వామపక్ష, అనుబంధ పార్టీలు మాత్రం ప్రజల్లో, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, తదితర ఉద్యోగుల మన్ననలు పొందడానికి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే విషయాలు పార్టీ నిర్ణయం మేరకే ఉంటాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు. జిల్లా వేదికగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు జిల్లా వేదికగా వామపక్ష, అనుబంధ సంఘాలు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇటీవల అంగన్వాడీ రాష్ట్ర మూడవ మహాసభలు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ సభలకు అంగన్ వాడీ వర్కర్స్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి సింధు, తదితర ప్రముఖులు హాజరయ్యారు. గత నెలలో రైతు శిక్షణ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మూడు రోజులపాటు స్థానిక కేవల్‌కిషన్ (కేకే) భవన్లో సీపీఎం ఆధ్వర్యంలో రైతుసంఘం నేతృత్వంలో నిర్వహించారు. గత నెలలోనే ఏఐటీయూసీ ఆవిర్భావ ఉత్సవాలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. 50 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు హాజరవుతూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. -
ఆర్టీసీ సమ్మె: హాఫ్ సెంచరీ నాటౌట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె.. కొన్ని రోజులుగా హాట్ టాపిక్. ఆర్టీసీ చరిత్రలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద సమ్మె ఇదే. 50 రోజులకు చేరుకుని ఇంకా ‘నాట్ ఔట్’ అంటోంది. 49,300 మంది కార్మికులతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో పార్లమెంట్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. కొలిక్కి వచ్చినట్టే వచ్చి ముగింపు దొరక్క ఇంకా కొన‘సాగుతోంది’. సకల జనుల సమ్మె తర్వాత తెలంగాణలో సంచలనానికి కేంద్రబిందువు అయింది. ఇప్పుడు బంతి ముఖ్యమంత్రి కోర్టులో ఉంది. ఆయన నిర్ణయం కోసం యావత్తు రాష్ట్రం ఎదురుచూస్తోంది. వేతన సవరణ కాలపరిమితి ముగిసిన తర్వాత, తదుపరి కొత్త వేతనాల కోసం కార్మిక సంఘాలు ప్రభుత్వానికి నివేదించడం, కాలయాపన చేస్తే సమ్మె పేరుతో హెచ్చరించటం సాధారణమే. కానీ ఈసారి పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇందుకు ‘దసరా’ ముహూర్తం మూల కారణమైంది. రోజురోజుకు ఉధృతమవుతూ కార్మికులు పట్టుదలతో ముందుకు సాగినా, అనూహ్య పరిణామాలతో కార్మిక సంఘాల జేఏసీ పట్టు సడలించింది. జేఏసీ నోట సమ్మె విరమణ మాట ప్రభుత్వం దిగొచ్చేదాకా సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ తొలుత తెగేసి చెప్పింది. దీనికి కార్మిక లోకం బాసటగా నిలిచింది. అందుకే మూడు పర్యాయాలు విధుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసినా, కార్మికులు మెట్టు దిగలేదు. సకల జనుల సమ్మె సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని ఆర్టీసీ కార్మికులు 62 రోజుల పాటు నిర్వహించిన సమ్మె ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలో అతిపెద్దదిగా చరిత్ర సృష్టించింది. దాన్ని మించి తమ సమ్మె సాగుతుందని ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మిక నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. ఆ దిశగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. కానీ. అనూహ్యంగా ఈ కేసు కార్మిక శాఖ పరిధిలోకి రావటంతో సమ్మె విరమణకు జేఏసీ మొగ్గు చూపాల్సి వచ్చింది. సమ్మె చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా అని తేల్చాల్సింది కార్మిక న్యాయస్థానమే అని హైకోర్టు ఐదు రోజుల క్రితం తేల్చి చెప్పింది. దీంతో కేసు హైకోర్టు నుంచి కార్మిక శాఖ పరిధిలోకి వచ్చింది. ఇది తేలే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో కార్మికుల్లో పునరాలోచన మొదలైంది. అంతకాలం సమ్మె చేస్తూ పోతే, కుటుంబ పోషణ ఎలా అన్న సంశయం రావడంతో సమ్మె విషయంలో జేఏసీపై ఒత్తిడి పెరిగింది. దీంతో విరమణ మాటను జేఏసీ బయటపెట్టింది. 30 మంది మృత్యువాత సమ్మె మొదలైన తర్వాత దాదాపు 30 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇందులో నలుగురు ఆత్మహత్యలు చేసుకోగా, మిగిలిన వారు గుండెపోటుతో మరణించారు. సమ్మెతో బస్సులు సరిగా తిరగక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా, ఆర్టీసీ పరిరక్షణ పేరుతో కార్మికులు చేస్తున్న ఆందోళనలకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలూ మద్దతు తెలిపారు. కానీ, రెండు నెలలుగా జీతాలు అందక, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన కార్మికులు, తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉంటుందో లేదోనన్న వ్యధకు లోనయ్యారు. కార్మికులు గుండెపోటుతో చనిపోవటానికి ఈ ఆందోళనే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలా చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. వారికి ఆర్థిక సాయం చేయడానికంటూ కొంతమంది విరాళాల సేకరణ కూడా ప్రారంభించారు. ప్రైవేటుకు బాటలు టీఎస్ఆర్టీసీలో అనూహ్య పరిణామం. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ ప్రపంచంలోనే ఉన్నత రవాణా సంస్థగా వెలుగొందింది. ఇందుకు గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి విడిపడిన తెలంగాణ ఆర్టీసీలో ఇప్పుడు ప్రైవేటుకు చోటు దక్కబోతోంది. సగం ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చే ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో తొలిసారి ప్రైవేటు స్టేజీ క్యారియర్ పర్మిట్లతో బస్సులు తిరిగేందుకు రంగం సిద్ధమైంది. -
సమ్మె కొనసాగిస్తాం..
అఫ్జల్‌గంజ్: ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. శనివారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని, ఈ విషయంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మరోసారి జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎంజీబీఎస్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నేడు ఆర్టీసీ మహిళా ఉద్యోగులతో మానవహారం, మౌన దీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అన్ని డిపోల ముందు ప్రొఫెస ర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించి మానవహారాలుగా ఏర్పడి నిరస న తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు. -
సభ్యత్వం కోసమైతే వస్తావా? చావుకు రావా?
సాక్షి, హైదరాబాద్ : మూడు వేల కోట్ల అప్పు ఉన్న ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తానంటే మరి 30 వేల కోట్ల అప్పు ఉన్న మెట్రోను ఏం చేస్తవని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె శనివారానికి 50 రోజులకు చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యత్వం కోసం తెలంగాణకు వచ్చే అమిత్ షా, కార్మికులు చనిపోయినా స్పందించడం లేదన్నారు. ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందంటున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల చావులను మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. వారి చావులను కూడా 66 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 33 శాతం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరి ఒక్కటేనంటూ, ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన : అశ్వత్థామ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రైవేటీకరణ సాధ్యం కాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి శనివారం స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడవద్దని, ప్రైవేటీకరణ అనేది చట్టంలో లేదని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని, సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. మరోవైపు ఆదివారం ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతారని వెల్లడించారు. అన్ని డిపోల కార్మికులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించి డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలిన పిలుపునిచ్చారు. తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరోవైపు కార్మికుల దీక్ష 50వ రోజుకు చేరింది. వివిధ జిల్లాల్లో కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మంలో బస్‌డిపో నుంచి బస్టాండ్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌లోకి కార్మికులు, అఖిల పక్ష నాయకులు చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. డిపోకి వస్తున్న బస్సులను మహిళా కండక్టర్లు ఆపేసి వాటి టైర్లలోని గాలి తీశేసారు. కొత్తగూడెం పట్టణంలో సీపీఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల కోసం నాయకులు విరాళాలు సేకరించారు. నిజామాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీని ధర్నాచౌక్ నుంచి ప్రారంభించగా బస్టాండ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, రైల్వే స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు. బోధన్‌లో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లాలో ప్రైవేటీకరణకు నిరసనగా బస్టాండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలో బస్టాండ్ ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ నుంచి ఐబీ వరకు దాదాపు 200 మంది కార్మికులు ర్యాలీ తీశారు. కరీంనగర్ జిల్లాలో బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఖనిలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో కార్మికులు మానవ హారం నిర్మించారు. -
నక్సలైట్లమా.. దేశద్రోహులమా?
సాక్షి, పూడూరు: ‘గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ కార్మికుడు వీరభద్రప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం తప్పా.. మేమేమైనా నక్సలైట్లమా.. దేశద్రోహులమా..? ఇలా రోడ్లపై అరెస్టులు చేయడం ఏమిటి’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిందుకు హైదరాబాద్ నుంచి పరిగి వెళ్తున్న వీరిని చన్గోముల్ పీఎస్ ఎదుట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్ నియంతృత్వ పోకడవల్లే ఆర్టీసీ కార్మికుల బలిదానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. భేషరతుగా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దేవుళ్లుగా కనిపించిన ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు దెయ్యాలయ్యారా అని ప్రశ్నించారు. సంస్థ ఆస్తులను కొల్లగొట్టేందుకు పెద్దఎత్తున కుట్ర సాగుతోందని ఆరోపించారు. ఆర్టీసీ కారణంగా 82 ఏళ్ల చరిత్రలో పడని భారం ఇప్పుడే పడుతోందా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేందర్, ఆర్టీఐ మండల కన్వీనర్ వెంకటయ్య, యువజన నాయకులు సల్మాన్‌ఖాన్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, హమ్మద్, శ్రీనివాస్, అజీంపటేల్, నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
సాక్షి,ఆదిలాబాద్: బేషరతుగా సమ్మె విరమించుకున్న ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన యూనియన్ జిల్లా కౌన్సెలింగ్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమ్మె విరమించిన కార్మికులను డ్యూటీలోకి తీసుకోకుండా కాలయాపన చేయడం సమజసం కాదన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. అలాగే రిమ్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు సమానపనికి సమాన వేతనం అందించాలన్నారు. సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, ఆశా, కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాన్ని నిలిపివేయాలన్నారు. వీఆర్ఎస్ పేరిట లక్షలాది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని మానుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు సిర్ర దేవేందర్, కుంటాల రాములు, రాజు, రఘునాథ్, ఉస్మాన్, నాందేవ్, ఆశన్న, కాంతరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన ఆసిఫాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 49వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా స్థానిక బస్టాండు సమీపంలోని శిబిరంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలన్నారు. సీఎం సూచన మేరకే కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు ప్రకటిస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ వల్లనే ఆర్టీసీకి లాభాలు వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పే విషయంలో వాస్తవం లేదన్నారు. దీక్షల్లో కార్మికులు ఉమేశ్, రాజేశ్వర్, లక్ష్మణ్, సురేశ్, జహూర్, తులసీరాం, రమేశ్, డేవిడ్‌తో పాటు పలువురు కూర్చున్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బూసి బాపు, దివాకర్, దేవపాల, శ్రీరాం వెంకటేశ్వర్ పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు -
నేడు డిపోల వద్ద ర్యాలీలు: జేఏసీ
సాక్షి, హైదరాబాద్: బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ప్రతిపాదించినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటం సరికాదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం సీఎం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించినా, విధుల్లోకి తీసుకునే విషయంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవటం దారుణమని పేర్కొంది. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో కొందరు నేతలు శుక్రవారం సమావేశమై దీనిపై చర్చించారు. తర్వాత శనివా రం నుంచి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయనున్నట్టు చెప్పారు. అన్ని డిపోల వద్ద నిరసన ర్యాలీలు నిర్వహించాలని కార్మికులకు సూచించా రు. మరోవైపు శుక్రవారం కూడా చాలామంది కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు వచ్చారు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అధికారులనే కలిసి మాట్లాడుకోవాలంటూ డిపో మేనేజర్లు తిప్పి పంపారు. -
డ్రైవర్ మృతితో అట్టుడికిన పరిగి
సాక్షి, పరిగి: ఆర్టీసీ డ్రైవర్ మృతితో వికారాబాద్ జిల్లా లోని పరిగి పట్టణం అట్టుడికింది. పరిగి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తోన్న వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని మందిపల్ గ్రామానికి చెందిన సంగంశెట్టి వీరభద్రప్ప శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వీరభద్రప్ప తన భార్య నందిని, పిల్లలు వైష్ణవి(6), బుజ్జి(3) తో కలసి పరిగిలో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మూడు నెలలుగా వేతనాలు అందకపోవడం, ఇతడికి మరే ఆధారం లేకపోవడంతో ఆర్థికంగా చితికిపోయాడు. ఈక్రమంలో రెండ్రోజుల క్రితం అస్వస్థతకు లోనయ్యాడు. శుక్రవారం ఉదయం గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు అతన్ని వికారాబాద్‌లోని మహవీర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు వీరభద్రప్ప మృతదేహంతో పరిగి డిపో వద్ద ధర్నా నిర్వహించారు. హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నిరసనకారులు బారికేడ్ల ను తొలగించే ప్రయత్నం చేయడంతో పోలీసులతో వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు డీఆర్వో వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తా మని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. -
రూట్ల ప్రైవేటీకరణ నోటిఫికేషన్‌కు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ నిర్వహిస్తున్న రూట్ల ను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. రూట్ల ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో, ప్రైవేటు బస్సులకు ఆర్టీసీ రూట్ పర్మిట్ల జారీకి రంగం సిద్ధం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ, రవాణా శాఖలు సంయుక్తంగా కొంత కసరత్తు చేశాయి. పలు దఫాలు ముఖ్యమంత్రి వాటిపై సమీక్షించి సానుకూలత వ్యక్తం చేశారు. శనివారం సీఎం వద్ద జరిగే సమీక్షలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఆయన అంగీకారం తెలపగానే నోటిఫికేషన్ జారీ అవుతుంది. సమ్మెకు ముందు ఆర్టీసీ 3,700 రూట్లలో 10,400 బస్సులు తిప్పు తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ మినహా స్టేజ్ క్యారియర్లుగా ప్రైవే టు బస్సులకు అనుమతి లేదు. కేవలం టూరిస్టు పర్మిట్ల తోనే ప్రైవేటు బస్సులు తిరగాల్సి ఉంది. కానీ చట్టంలో ఉన్న లొసుగులు, అధికారుల అవినీతి వల్ల చాలాకాలం గా ప్రైవేటు బస్సులు ఆర్టీసీ బస్సుల తరహాలో దూర ప్రాంతాలకు తిరుగుతున్నాయి. ఇప్పు డు ఆర్టీసీ బస్సుల సంఖ్యను సగానికి తగ్గించి అంతమేర ప్రైవేటు బస్సులు పర్మిట్లు పొంది స్టేజ్ క్యారియర్లుగా తిరుగుతాయి. ప్రస్తుతానికి 5,100 బస్సులకు పర్మిట్లు జారీ చేస్తారు. వీటికి సరిపోయేలా దాదాపు 1,800 వరకు రూట్లను అప్పగించే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌తో షురూ.. రాష్ట్రంలో ఉన్న 3,700 రూట్లలో ప్రైవేటుకు అప్పగించే వాటిని తొలుత గుర్తిస్తారు. ఆ రూట్లలో ఎన్ని బస్సులు తిరగాల్సి ఉంటుంది, ఏ కేటగిరీ బస్సులు నడపాలి తదితర వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలను చెప్పేందుకు నెల రోజుల గడువు ఉం టుంది. అభ్యంతరాల పరిశీలన, మార్పుచేర్పుల అనంతరం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం ప్రైవేటు సంస్థలు దరఖాస్తు చేసుకుంటాయి. వాటిని పరిశీలించాక అర్హమైన వాటిని గుర్తించి ఎంపిక చేస్తారు. ఆర్టీసీ కార్మికులను ఏం చేస్తారు? ప్రభుత్వం చెబుతున్నట్టుగా 5,100 బస్సులను ప్రైవేటుకు కేటాయిస్తే, ఆర్టీసీలో మిగిలేవి 5,300 బస్సులు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం సగటున ఒక బస్సుకు ఆరుగురు సిబ్బంది అవసరమవుతారు. ఆ లెక్కన 5,300 బస్సులకు 31,800 మంది కావాలి. సమ్మెలో 49,300 మంది ఉన్నా రు. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకో వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, అవసరమైనవారు కాకుండా మిగిలిన 17,500 మందిని ఏం చేస్తారన్న ప్రశ్న ఉత్పన్న మవుతోంది. దీనిపై త్వరలో సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. లాభాల రూట్లకే డిమాండ్ ప్రస్తుతం ఆర్టీసీ నగరంలో తిప్పే సిటీ బస్సులు, గ్రామీణ ప్రాంతాలకు తిప్పే పల్లెవెలుగు బస్సులతో నష్టాలు మూటగట్టుకుంటోంది. ఎక్స్‌ప్రెస్ బస్సులు, దూర ప్రాంతాలకు తిరిగే ఇతర బస్సులు మాత్రం లాభాల్లో ఉన్నాయి. సాధారణంగా ప్రైవేటు ఆపరేటర్లు లాభాల్లో ఉన్న రూట్లనే ఎంచుకుంటారు. కానీ వాటితోపాటు నష్టాల రూట్లను కూడా వాటికి అప్పగిస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ రూట్లు ఏవేవి ఉంటాయనే విషయంలో కసరత్తు జరగాల్సి ఉంది. ఆదాయం ఎలా? ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లలోనే ప్రైవేటు బస్సులు తిప్పాల్సి ఉంటుంది. అందుకు చార్జీలను కూడా ఆర్టీసీ రూపొందించిన వాటినే అమలు చేయాలి. ఆర్టీసీ బస్సులు, ఈ ప్రైవేటు బస్సుల చార్జీలు ఒకే రకంగా ఉండాలి. చార్జీల రూపంలో వచ్చే ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలే తీసుకుంటాయి. పర్మిట్లు పొందేందుకు ప్రైవేటు బస్సుల నిర్వాహకులు చెల్లించే మొత్తం ప్రభుత్వానికి ఆదాయంగా ఉంటుంది. ప్రస్తుతం టూరిస్టు పర్మిట్లకు ఒక్కో బస్సుకు ప్రతి సీటుకు నిర్ధారిత మొత్తాన్ని రవాణాశాఖ వసూలు చేస్తోంది. ప్రతి మూడు నెలలకోమారు ఆ మొత్తాన్ని చెల్లించాలి. అది ఒక్కో బస్సుకు దాదాపు రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో స్టేజ్ క్యారియర్ పర్మిట్లకు కూడా రవాణాశాఖ వసూలు చేస్తుంది. అయితే ఆ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటు త్రైమాసికంగా కాకుండా ప్రతి నెలా చెల్లించేలా మార్చాలని భావిస్తోంది. ఈ విషయం ఇంకా ఖరారు కాలేదు. నెలకోమారు ఉండాలా లేక సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలా అన్న విషయంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో జరిగే సమీక్షలో దీనిపై స్పష్టత రానుంది. -
ఆర్టీసీపై నేడు సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ అంశంపై సీఎం కేసీఆర్ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆర్టీసీకి ఉన్న అప్పులు, బకాయిలు తదితరాలపై గురువారం సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో సంస్థను నడపాలంటే ప్రతినెలా రూ. 640 కోట్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం జరిగే సమీక్షలో రూట్ల ప్రైవేటీకరణ విధివిధానాలపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రూట్ల ప్రైవేటీకరణకు వీలుగా ప్రైవేటు బస్సులకు పర్మిట్ల జారీకి టెండర్లు పిలవడంపై ఈ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బేషరతుగా విధుల్లో చేర్చుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ అంశం కూడా చర్చకు వస్తుందని భావిస్తున్నారు. -
రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు రైట్ రైట్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రైవేటు, పెట్టుబడిదారీ విధానాలకు అనుగుణంగా ప్రపంచం పయనిస్తున్న తరుణంలో ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు గ్యారేజీలకు అనుమతి ఇవ్వాలనే నిర్ణయం సముచితమేనని పేర్కొంది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ తీర్మానాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాజ్యంపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. కోర్టు సమయం ముగిసిన తర్వాత 45 నిమిషాలపాటు తీర్పును వెలువరించింది. ‘దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు రవాణా వ్యవస్థ కూడా వాటిలోకి వస్తోంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వం బాగా ఉంటుంది. పోటీ విధానాన్ని స్వాగతించాలి. తిరస్కరించడం సరికాదు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 67 (3)కు కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీన చేసిన సవర ణల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల రోడ్డు రవాణాకు సమాంతరంగా 50 శాతం మించకుండా ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సర్వాధికారాలు రాష్ట్రాలకు సిద్ధించాయి. సెక్షన్ 102, 67లను కలిపి బేరీజు వేస్తే రాష్ట్రా నికి అధికారాలు ఉన్నాయని తేటతెల్లం అవుతోంది. ఇలా చేయడం ఆర్టీసీకి పోటీగా ప్రైవేటు బస్సు రూట్లను ప్రవేశపెట్టినట్లు కాదు. ఆ రెండూ సమాంతరంగా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలన్నదే చట్ట సవరణ ఉద్ధేశం. అందుకు లోబడే కేబినెట్ నిర్ణయం ఉంది’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. కేంద్రమే రాష్ట్రాలకు సర్వాధికారం ఇచ్చింది.. ‘మోటారు వాహనాల చట్టం–1988లోని 67 (3), 102 సెక్షన్ల ప్రకారం రవాణా రూట్లను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. ఆర్టీసీ గుత్తాధిపత్యం లేకుండా చేసేందుకు, ఆ రవాణా వ్యవస్థకు సమాంతరంగా ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రైవేటు గ్యారేజీలకు అనుమతి ఇచ్చే అధికారం కేంద్రం చేసిన చట్ట సవరణ ద్వారా రాష్ట్రానికి వచ్చింది. అయితే, రూట్ల ప్రైవేటీకరణ 50 శాతానికి మించకూడదు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉంది. సమ్మె వల్ల రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా రూట్ల ప్రైవేటీకరణకు వీలుగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆపరేటర్లకు ఆస్కారం ఇవ్వడం వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది. దురుద్ధేశాలు ఉన్నాయని భావించలేం. అడ్వొకేట్ జనరల్ వాదించినట్లుగా రాజ్యాంగం ప్రకారమే, సార్వభౌమత్వ విధానాలకు లోబడి న్యాయబద్ధమైన నిర్ణయంగానే దీనిని పరిగణించాలి. కేబినెట్ నిర్ణయం గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినందున అందులోని విషయాల్ని తీర్పులో ప్రస్తావించడం లేదు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పలు సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తారు. చట్టంలోని సెక్షన్లను వేర్వేరుగా విశ్లేషించకుండా అన్ని సెక్షన్లను క్రోడీకరించితే కేబినెట్ నిర్ణయం న్యాయబద్ధంగానే ఉంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన కాలంలో రవాణా ఏర్పాట్లు లేక ఆర్టీసీలు ఏర్పాటు జరిగి నేటికీ గుత్తాధిపత్యంతో కొనసాగుతోంది. ఇప్పుడు ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు ఆపరేటర్లకు కూడా అవకాశం ఇవ్వాలనే నిర్ణయం అమల్లోకి వస్తే కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల శ్రీకారం చుట్టినట్లు అవుతుంది’అని హైకోర్టు అభిప్రాయపడింది. కేబినెట్ తప్పుగా సిఫార్సు చేసింది.. మోటార్ వాహన చట్టంలోని 102(1)(2) ప్రకారం ఆర్టీసీ గుత్తాధిపత్యాన్ని సరిచేసే అధికారం రాష్ట్రానికి ఉందని.. అయితే ఈ నిర్ణయం ప్రభావం ఉండే ఆర్టీసీ, ఇతర రవాణా సంస్థలకు నోటీసులు ఇచ్చి వాళ్ల వాదనలు తెలుసుకోవాలని ధర్మాసనం సూచించింది. ‘గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, 30 రోజుల గడువు ఇవ్వాలి. ఎంపిక చేసిన తేదీ/ప్రదేశాల్లో అభ్యంతరాలు స్వీకరించి వాటిపై విచారణ జరిపి పరిష్కరించాలి. అయితే మంత్రివర్గం ప్రైవేటు రూట్ల అంశాన్ని పరిశీలించాలని ఆర్టీసీ కార్పొరేషన్‌ను కోరుతూ తీర్మానం చేసింది. ఇలా చేయడం చట్ట వ్యతిరేకం. కేబినెట్ ఆ ప్రతిపాదనను రవాణా శాఖ ముఖ్యకార్యదర్శికి చేయాలి. ఆర్టీసీ ప్రభుత్వం కాదు.. అది క్వాజీ జ్యుడీషియరీ అథారిటీ మాత్రమే. ప్రభుత్వమే చేయాలంటే ఆ అధికారిని ఉద్ధేశించి కేబినెట్ సిఫార్సు చేయాలి. అయితే, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారానే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన హామీని నమోదు చేశాం. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉండాలి. సెక్షన్ 102 ప్రకారం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది చట్టబద్ధంగానే ఉంది. కాబట్టి మేం జోక్యం చేసుకోవడం లేదు. పిల్‌ను తోసిపుచ్చుతున్నాం. గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’అని ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని, పది రోజులపాటు తీర్పు అమలును సస్పెన్షన్‌లో ఉంచాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేబినెట్ తీర్మానంపై న్యాయసమీక్ష చేయొచ్చు.. తొలుత వాదనల సమయంలో.. రాజ్యాంగంలోని 166వ అధికరణం కింద కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోరాదని ఏజీ బీఎస్ ప్రసాద్ వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కేబినెట్ నిర్ణయం తర్వాత గవర్నర్ పేరుతో లేఖ లేదా ఉత్తర్వులు వెలువడినా వాటిని న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని అధికరణం చెబుతోందని గుర్తు చేసింది. ఈ కేసులో కేబినెట్ తీర్మానాన్నే సవాల్ చేశారు కాబట్టి న్యాయసమీక్ష చేయవచ్చునని తేల్చి చెప్పింది. కేబినెట్ నిర్ణయం చట్టపరిధిలోనే జరిగిందని ఏజీ చెప్పగానే, ధర్మాసనం కల్పించుకుని.. రూట్ల ప్రైవేటీకరణ వ్యవహారంపై ముందుకు వెళ్లాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కేబినెట్ కోరడం తప్పు అని, ఈ ప్రక్రియ నిర్వహించే అధికారం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని, దీని ప్రకారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిని కేబినెట్ కోరాల్సి ఉంటుందని చెప్పింది. దీంతో ముఖ్య కార్యదర్శి ద్వారానే రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగేలా ప్రభుత్వం చర్యలు ఉంటాయని ఏజీ హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న తరుణంలో కేబినెట్ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం విశ్వాసరాహిత్యమే అవుతుందని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కాగా, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం ఇంకా విచారించాల్సి ఉంది. -
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 102 ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి, ప్రైవేటు మధ్య ఆనందకర పోటీ ఉన్నప్పుడే లాభాలు సాధ్యమవుతాయని గతంలో చెప్పిన హైకోర్టు ఆ మాటకే కట్టుబడింది. రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 5100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగించడం తప్పు కాదని స్పష్టం చేసింది. మరోవైపు రూట్ల ప్రైవేటీకరణపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ కార్మికుల నెత్తిన పిడుగులాంటి వార్తే. భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే ఉద్యమాన్ని విరమించి విధుల్లోకి చేరతామన్న ఆర్టీసీ కార్మికులకు భంగపాటు ఎదురైంది. ఇక హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఆధారపడి ఉండటంతో వారు తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె: ట్విస్ట్ ఇచ్చిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్: కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె విరమణకు తాము సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. సమ్మెకు కొనసాగింపుగా శనివారం అన్ని డిపోల వద్ద సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కార్మికులు ఎవరూ డిపోల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు. సమ్మెపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ శనివారం మరోసారిభేటీ అవుతుందని, దీనిలో భవిషత్తు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాలేదని, సమ్మెకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. (చదవండి: ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే) కాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రస్తుతం కార్మిక కోర్టులో విచారణజరుగుతోన్న విషయం తెలిసిందే. కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో సమ్మెను విరమించాలని జేఏసీ ఇటీవల నిర్ణయించింది. బేషరుతుగా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని కోరింది. కానీ కార్మికుల విజ్ఞప్తికి ప్రభుత్వనుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా ఉద్యోగాల్లో చేరేందుకు అనేక మంది కార్మికులు గురువారం ఉదయం నుంచి డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వారి చేరికపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకుఎవరిని ఉద్యోగాల్లో చేర్చుకోవద్దని డిపో మేనేజర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే
సాక్షి, హైదరాబాద్: కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తికరంగా మరాంది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ గురువారం రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా డిపోల వద్ద ఇదే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు వారికి చెప్పి పంపించేస్తున్నారు. మరోవైపు ఆర్టీసిని నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలని, అంత శక్తి ప్రభుత్వ వద్ద లేదని సీఎం చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో కలవరం రేపుతున్నాయి. దీంతో వారి ఆశలన్నీ సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తూ ఆర్టీసీ రూట్లను కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ కొనసాగనుంది. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా సమ్మె విరమణ ప్రతిపాదనపై చర్చించి తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సమ్మెకు సంబంధించిన అంశం కార్మిక న్యాయస్థానంలోనే తేల్చాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, అది తేలిన తర్వాతే వారిని విధుల్లోకి చేర్చుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె: 48 రోజులు.. రూ.30 కోట్లు
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మెను మించిపోయింది ఆర్టీసీ జేఏసీ సమ్మె. ఆర్టీసీ చరిత్రలోనే సుదీర్ఘమైన 48 రోజుల సమ్మెతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రధాన రూట్లల్లో బస్సులు నడుపుతున్నా గ్రామీణ ప్రాంతాల్లోకి బస్సులు నడుపకపోవడం వల్ల ఆర్టీసీ ఆదాయం సగానికి తగ్గిపోయిందని చెప్పవచ్చు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ మాజీ ఉద్యోగులు, అధికారులు లెక్కలు వేసి చెబుతున్నారు. అయితే అదేమిలేదంటున్న అధికారులు వాస్తవ గణాంకాలను కూడా వెల్లడించడం లేదు. మరోవైపు సమ్మెలో ఉన్న కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు అందక పడుతున్న పాట్లు వర్ణనాతీతం. తాత్కాలిక సిబ్బందితో 48 రోజులుగా బస్సులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నా.. అవి తిరిగిన రూట్లు అరకొరే. సమ్మెకు ముందు వచ్చిన ఆదాయంలో సగం కూడా ఆర్టీసీ ట్రెజరీలో జమకాలేదు, ఇక సగానికి పైగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోతున్నాయి. కరీంనగర్ రీజియన్ పరిధిలోని పది డిపోల్లో ఉన్న 651 బస్సులు సమ్మెకు ముందురోజు వరకు మూడున్నర లక్షల కిలోమీటర్లు తిరిగేవి. ప్రస్తుతం రోజు ఆర్టీసీ, ప్రైవేట్‌కు చెందిన 600 నుంచి 670 బస్సులు తిరుగుతున్నా... అవి సగటున 1.65 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. మరోవైపు రీజియన్ పరిధిలోని కార్మికులకు చెల్లించాల్సిన దాదాపు రూ.25 కోట్ల వేతనాలు నిలిచిపోయాయి. భారీగా తగ్గిన ఆదాయం... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తోపాటు మరో 22 డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ సెప్టెంబర్ 5 నుంచి సమ్మెను తలపెట్టింది. గురువారం నాటికి సమ్మె 48వ రోజుకు చేరుకుంది. గతంలో కరీంనగర్ రీజియన్‌లోని కరీంనగర్ వన్, టూ డిపోలు, హుజూరాబాద్, గోదావరిఖని, మంథని, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల బస్‌డిపోల పరిధిలో 448 ఆర్టీసీ బస్సులు, 203 అద్దె బస్సులు మొత్తం 651 బస్సులను నడిపించే వారు. ఈ బస్సులు ప్రతిరోజు 3.50 లక్షల కిలోమీటర్లు తిరిగి ప్రయాణికులను గమ్యం చేర్చి రోజుకు రూ.కోటి 10 లక్షల ఆదాయాన్ని ఆర్టీసీకి సమకూర్చిపెట్టేవి. ఇప్పుడు ప్రతిరోజు 620 నుంచి 670 వరకు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను నడిపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెరిగినా అవి ప్రయాణించే దూరం మాత్రం సగానికి పైగా తగ్గిపోయింది. గతంలో 3.50 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఇప్పుడు 1.65 లక్షల కిలోమీటర్లు మాత్రమే బస్సులు తిప్పుతున్నారు. దీంతో సగానికి సగం ఆదాయం పడిపోయి రోజుకు సగటున 55 లక్షల రూపాయల ఆదాయం మాత్రమే సమకూరుతున్నది. సమ్మెకు పూర్వం రోజుకు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు ఆదాయంగా సమకూరేది. ఈ లెక్కన గడిచిన 48 రోజుల్లో రూ.55 కోట్ల వరకు ఆదాయం సమకూరాల్సి ఉండగా... వచ్చిన రాబడి రూ.26.45 కోట్లు మాత్రమే. 48 రోజుల్లో రూ.30 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆర్టీసీ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు జవాబుదారీ తనం లేకపోవడం కూడా ఆదాయంపై ప్రభావం చూపిందని మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్టీసీ కార్మికులు ఆర్టీíసీకి వాటిల్లిన నష్టం తరహాలోనే ప్రజలు కూడా ప్రైవేటు వాహనాలకు అధిక చార్జీలు చెల్లించి నష్టపోయారు. కరీంనగర్ రీజియన్‌లో 4,130 మంది ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుండగా వారికి నెలకు రూ.10 కోట్ల వేతనాలు చెల్లించేవారు. రెండు నెలలుగా సమ్మె కారణంగా వారు వేతనాలు పొందలేకపోతున్నారు. కార్మికులకు సమ్మెకు ముందు పనిచేసిన కాలానికి కూడా వేతనాలు చెల్లించకపోవడంతో రెండు నెలలుగా జీతాలు రాక పస్తులుం డాల్సి వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకా నిక్‌లు, కార్మికులు పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంటి అద్దె చెల్లించలేక, అంతకుముందు తీసుకున్న అప్పులు, చిట్టిల కిస్తులు చెల్లించలేక, అనారోగ్యాలు ఏర్పడిన హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నా రు. డిపో మేనేజర్లకు అక్టోబర్ నెలలో అలవెన్సులు మాత్రమే చెల్లించాలని, వేతనాలు ఇవ్వద్దని ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమ్మె కారణంగా బస్‌పాసులతో నెలవారీగా వచ్చే రూ.3.85 కోట్లు కూడా రాకుండా పోయింది. సమ్మె కారణంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో వారికి అల్పాహారం, టీ, భోజనం, తాగునీరు సమకూర్చడానికే రోజుకు రూ.50 వేలు వెచ్చించాల్సి వస్తున్నదని, ఇప్పటికే సుమారు రూ.20 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. రక్షణ, నిర్వహణ ఖర్చులు అదనపు భారం.. కార్మికులు సమ్మెలో ఉండడంతో డిపోల వద్ద పోలీసు బందోబస్తుతోపాటు రెవెన్యూ, పంచా యతీరాజ్ శాఖల ఉద్యోగులను విధులకు కేటా యించారు. ఈ నిర్వహణ భారమంతా ఆర్టీసీనే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నిర్దిష్టం గా ఎంత చెల్లించారనే విషయంలో స్పష్టమైన లెక్కలు వేయలేదని, కానీ యాజమాన్యం నుంచి ఆదేశాలొచ్చిన వెంటనే ఆయా శాఖలకు నిధులివ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. డిపోల వద్ద స్పెషల్ బ్రాంచి డీఎస్పీలు, సివిల్ డీఎస్పీల పర్యవేక్షణతోపాటు రోజు ఒక సీఐ నేతృత్వంలో 20 మంది ఇతర పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తంగా ఈ నిర్వహణకు ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో డిపోల్లో రోజూ సగటున రూ.లక్ష 50 వేలు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి దాదాపు రూ.72 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. తాత్కాలిక సిబ్బంది.. సగం సేవలు... కరీంనగర్ రీజియన్ పరిధిలో 454 మంది తాత్కాలిక డ్రైవర్లు,675 మంది కండక్టర్లు, మెయింటనెన్స్ కోసం మరో 300 మంది తాత్కాలిక పద్ధతిలో రోజుకు 600 నుంచి 670 వరకు బస్సులను నడిపిస్తున్నారు. ప్రధాన రూట్లకే బస్సులు పరిమితం అయ్యాయని తెలుస్తోంది. గ్రామీణ రూట్లకు బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక కండక్టర్లకు రోజుకు రూ.1000, తాత్కాలిక డ్రైవర్లకు రూ.1500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. వీరికి ఏ రోజు వేతనం అదే రోజు అందిస్తున్నామని డిపో మేనేజర్లు తెలిపారు. అధికారులకూ అందని అక్టోబర్ వేతనం.. ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులకు కూడా అక్టోబరు వేతనం ఇంకా రాలేదు. యాజమాన్యం వేతనాలను ఇంకా విడుదల చేయలేదని, ఒకటి రెండు రోజుల్లో ఇచ్చే అవకాశముందని అధికా రులు తెలిపారు. డిపోల్లో మేనేజర్లతోపాటు ఒకరిద్దరు సిబ్బంది విధులలో ఉండడంతో షెడ్యూల్స్ నిర్వహణ, కలెక్షన్లు సరిచూసుకోవడానికే సరిపోతోందని వారు చెబుతున్నారు. -
ఆర్టీసీపై వారం రోజుల్లో సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై సమగ్రంగా చర్చించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీ, ఆ శాఖ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వారంరోజుల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారని బీజేపీ ఎంపీ లు తెలిపారు. కార్మికుల సమస్యలపై ఆ సమావేశంలో చర్చిస్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. పార్లమెంటులో గురువారం కేంద్రమంత్రి గడ్కరీని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు కలసి ఆర్టీసీ సమ్మెపై చర్చించారు. డిమాండ్ల సాధన కోసం కార్మికులు 26 మంది చనిపోయా రని చెప్పగానే గడ్కరీ చలించిపోయారని ఎంపీలు మీడియాకు తెలిపారు. సమ్మెపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌తో మాట్లా డేందుకు గడ్కరీ ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు. పాక్ పోలీసుల అదుపులో ఉన్న ప్రశాంత్‌ను స్వదేశానికి చేర్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్లకు బీజేపీ ఎంపీలు లేఖలు రాశారు. -
ఆర్టీసీ సమ్మె పరిష్కారం నేడైనా తేలేనా?
సాక్షి, హైదరాబాద్: బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రగతి భవన్లో అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించినా.. సమ్మె విరమణ ప్రతిపాదనపై మాత్రం అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమించేందుకు సిద్ధమంటూ జేఏసీ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదన వచ్చిన మరుసటిరోజే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించటంతో, దీనిపై సర్కారు స్పందించే అవకాశం ఉంటుందని కార్మికులు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ, సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ ప్రస్తావనే లేదు. అయితే, శుక్రవారం మరోసారి సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సర్కారు చెప్పేవరకు తీసుకోలేం.. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ గురువారం రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు వారికి చెప్పి పంపించేశారు. ఈ పరిణామాలు కార్మికుల్లో ఆందోళన కలిగించడంతో ఆర్టీసీ జేఏసీ గురువారం మరోసారి సమావేశమై దీనిపై చర్చించింది. తాము సమ్మె విరమణకు సిద్ధమని ప్రకటించినందున ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నేతలు కోరారు. కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, ఇప్పటికే 29 మంది కార్మికులు చనిపోయినందున మానవతా దృక్ఫథంతో వారిని విధుల్లోకి చేర్చుకునే విషయంలో నిర్ణయం తీసుకోవాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ, వాసుదేవరావు, థామస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మరోసారి సమీక్ష? ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తూ ఆర్టీసీ రూట్లను కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ కొనసాగనుంది. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా సమ్మె విరమణ ప్రతిపాదనపై చర్చించి తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సమ్మెకు సంబంధించిన అంశం కార్మిక న్యాయస్థానంలోనే తేల్చాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, అది తేలిన తర్వాతే వారిని విధుల్లోకి చేర్చుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జేఏసీపై ఎన్ఎంయూ విమర్శలు అపరిపక్వత, అహంకారం, అనుచిత వ్యాఖ్యలతో జేఏసీ నేతలు ఆర్టీసీ కార్మికుల భవితవ్యాన్ని గందరగోళంలో పడేశారంటూ ఎన్ఎంయూ తీవ్రంగా విమర్శించింది. కార్మికుల డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలతో 49వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తెచ్చిందని ఆ సంఘం నేతలు నాగేశ్వరరావు, మౌలానా, రఘురామ్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, దామోదర్‌రెడ్డి తదితరులు దుయ్యబట్టారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు సమ్మె విరమణకు సిద్ధమని జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో గురువారం కార్మికుల నిరసనలు అంతంత మాత్రంగానే సాగాయి. 48 రోజుల పాటు ఉధృతంగా సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్న కార్మికులు.. గురువారం చాలా తక్కువ సంఖ్యలోనే హాజరయ్యారు. విధుల్లో చేరాలన్న ఉద్దేశంతో చాలా మంది డిపోల వద్దకు వెళ్లారు. కొంతమంది మాత్రం తిరిగి విధుల్లో చేరాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిపోల ఎదుట నిరసనలు నిర్వహించటం విశేషం. మరోవైపు అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో బిజీగా గడిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 6,585 బస్సులు తిప్పినట్టు వెల్లడించారు. ఇందులో 4,663 ఆర్టీసీ బస్సులు కాగా, మిగతావి అద్దె బస్సులు. 4,663 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,585 మంది తాత్కాలిక కండక్టర్లు విధుల్లో పాల్గొన్నారని వివరించారు. -
ఆర్టీసీని ఇలా నడపలేం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి? సంస్థకు ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుగుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదు’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు 5,100 రూట్ల ప్రైవేటీకరణపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు అన్ని అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్లో ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అప్పుల కుప్ప.. ‘ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయి. ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీసీఎస్ రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉంది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పీఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65–70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది’ అని ఈ సమావేశంలో ప్రభుత్వం చర్చించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీని యథావిధిగా నడపం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, సునీల్ శర్మ, రామకృష్ణారావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, ఏజీ ప్రసాద్, అడిషనల్ ఏజీ రాంచందర్‌రావు, ఆర్టీసీ ఈడీలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె విరమణ పేరిట మోసం..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ బుధవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జేఏసీ ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా.. జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. సమ్మెలో ఇప్పటివరకు 29మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని ఆయన తెలిపారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని తెలిపారు. దీనికితోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం.. కార్మికులను మోసం చేయడమేనని హనుమంతు మండిపడ్డారు. ఇలా విరమించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే సమ్మె విరమిస్తే సరిపోయేదని, కార్మికులను బలి పశువులను చేస్తూ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిందని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ కేవలం మూడు కార్మిక సంఘాలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తోందన్నారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోయాయని పేర్కన్నారు. ఆర్టీసీ కార్మికులు చాలావరకు పేద వాళ్ళు అని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి కార్మికుల సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుతున్నామని అన్నారు. -
టీఎస్ఆర్టీసీ సమ్మె; స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేంద్రం స్పందించింది. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు గురువారం గడ్కరీని కలిశారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీని కోరినట్టు వెల్లడించారు. ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిని విడిచిపెట్టాలని సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుని, వారి కనీస డిమాండ్లను నెరవేర్చాలని కిషన్‌రెడ్డి కోరారు. తమ వినతిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీయిచ్చినట్టు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో ఎంపీలు అరవింద్, సంజయ్ సునీల్ శర్మ సమాలోచనలు మరోవైపు హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలి అనే అంశంపై చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు విధించాలి, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సమావేశంలో దృష్టి పెట్టనున్నారు. భేటీ తర్వాత సీఏం కేసీఆర్‌ను ప్రగతి భవన్లో అధికారులు కలవనున్నారు. (చదవండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష) -
సాయంత్రం ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ఆర్టీసీపై సమీక్ష జరపనున్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదన, హైకోర్టులో కేసు, ఇతర అంశాలపై ఆయన చర్చించనున్నారు. కాగా ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పలు అంశాలపై అక్టోబర్ 4న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కాగా న్యాయస్థానంలో కూడా కార్మికులకు ఊరట లభించలేదు. దీంతో విలీన ప్రతిపాదనను పది రోజుల క్రితమే ఆర్టీసీ జేఏసీ పక్కన పెట్టింది. తాజాగా ఎలాంటి షరతులు లేకుండా తమ సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధమని, లేనిపక్షంలో సమ్మె కొనసాగిస్తామని జేఏసీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో పలుచోట్ల కార్మికుల్లో అయోమయం నెలకొంది. సమ్మె విరమణపై కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె విరమణ..! సమ్మెపై సాయంత్రానికి స్పష్టత తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ... ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలనే అంశంపై చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు ఉండాలి, భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చించి, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనున్నారు. ఇక సమ్మె విరమిస్తే విధుల్లోకి చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఆదేశాల కోసం కార్మికులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
బస్సులు రోడ్డెక్కేనా.?
సాక్షి, హైదరాబాద్: షరతులు విధించడకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమేనని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేనా అన్న చర్చ మొదలైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 46 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ సమ్మెను ప్రభుత్వం మొదటి నుంచి చట్టవిరుద్ధంగానే భావిస్తోంది. ఈ నేపథ్యంలో కార్మికులపై అనేక ఆంక్షలు విధించింది. విధుల్లో చేరేందుకు రెండుసార్లు గడువు విధించింది. అయినా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మెను కొనసాగించారు. చివరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు లభించకుండానే తమంతట తాముగా సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి నగరంలోని అన్ని డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లతో సహా సిబ్బంది విధుల్లో చేరే అవకాశా లున్నాయి. అయితే ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకుంటుందా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం రెండుసార్లు విధించిన గడువుల్లో కొందరు విధుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గడువు తరువాత వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి కార్మికులంతా డ్యూటీలో చేరుతారా...సిటీ బస్సులన్నీ రోడ్డెక్కుతాయా అనేది స్పష్టం కావాల్సి ఉంది. అక్టోబర్ 5న మొదలైన సమ్మె నవంబర్ 20న ముగిసింది. ఆర్టీసీ చరిత్రలోనే ఇది సుదీర్ఘ సమ్మెగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమంలోనూ సకల జనుల సమ్మెలో భాగంగా కార్మికులు ఆందోళనలో పాల్గొన్నప్పటికీ ఆర్టీసీలో ఇప్పటి వరకు జరిగిన అన్ని సమ్మెల్లోకెల్లా ఇదే అతి పెద్ద సమ్మెగా నిలిచిపోయింది. సగానికి పైగా డిపోలకే పరిమితం... గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో 3750కి పైగా బస్సులు ఉన్నాయి. కార్మికుల సమ్మె కారణంగా సగానికి పైగా డిపోల్లోనే నిలిచిపోయాయి, 19 వేల మందికి పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఆత్మహత్యలు, గుండెపోటుతో ఒకరిద్దరు కన్నుమూశారు. అన్ని డిపోల్లో, బస్స్టేషన్లు, ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి వందలాది మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పలువురు కార్మికులకు గాయాలు కూడా అయ్యాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం దసరా సెలవులను సైతం పొడిగించింది. సమ్మెకాలంలో ప్రైవేట్ సిబ్బంది సహాయంతో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. కండక్టర్లకు రూ.1000, డ్రైవర్లకు రూ.1500 చొప్పున చెల్లించినా, ప్రతి రోజు 1000 నుంచి 1500 కంటే ఎక్కువ బస్సులు నడుపలేకపోయారు. దీంతో దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో పెద్ద ఎత్తున దోపిడీ కొనసాగింది. దసరా సెలవుల అనంతరం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోగా, అరకొర బస్సుల కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగర శివార్లలోని కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సమ్మె కారణంగా నరకం చవి చూడాల్సి వచ్చింది. రాత్రి 7 గంటల నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె కారణంగా మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ప్రతి రోజు సుమారు 3.5 లక్షల మంది మెట్రోల్లో రాకపోకలు సాగించగా, 1.7 లక్షల మంది ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం చేశారు. రూ.100 కోట్లకు పైగా నష్టం... కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు రూ.వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అప్పటికే పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకుపోయిన సంస్థకు సమ్మె శరాఘాతంగా మారింది. రోజుకు రూ.1.5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు ప్రైవేట్ సిబ్బంది చేతివాటంతో కూడా ఆదాయానికి గండిపడింది. సమ్మె తొలిరోజుల్లో రోజుకు రూ.20 లక్షలు కూడా రాకపోవడం గమనార్హం. కొన్ని రూట్లలో ప్రైవేట్ సిబ్బంది వేతనాలు కూడా ఆర్టీసీయే చెల్లించాల్సి వచ్చింది. గ్రేటర్‌వాసులకు ఊరట.. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ఆంక్షలు లేకుండా తిరిగి యధావిధిగా విధుల్లో చేరితే ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు 32 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు బస్‌పాస్‌లను కలిగి ఉన్నారు. రెండు ప్రధాన మార్గాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నప్పటికీ నగరంలోని అన్ని ప్రాంతాలకు సిటీ బస్సే ప్రధాన రవాణా సదుపాయం. నగరంలో రోజుకు 9.5 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు 42 వేల ట్రిప్పులతో రాకపోకలు సాగిస్తున్నాయి. -
సునీల్ శర్మ టీఆర్ఎస్ ఏజెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులను ప్రభావితం చేస్తున్నాయని సునీల్ శర్మ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విపక్ష పార్టీల నేతలు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాయి. గవర్నర్‌ను కలిసిన అనంతరం విపక్ష పార్టీల నేతలతో కలిసి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికులు ఎప్పుడొచ్చినా విధుల్లో చేర్చుకోవాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరేందుకు త్వరలో అఖిలపక్ష పార్టీల నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేపట్టబోమని గతంలో సీఎం కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గుర్తు చేశారు. సునీల్ శర్మను ఆర్టీసీ ఎండీ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి మండిపడ్డారు. ప్రజాసమస్యలను చర్చించేందుకు గవర్నర్ తమకు సమయం ఇస్తున్నారు కానీ, సీఎం కేసీఆర్ ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై గవర్నర్‌కు ఉన్న శ్రద్ధ సీఎంకు లేదన్నారు. ఇప్పటివరకు 28 మంది కార్మికులు గుండెపోటుతో మృతి చెందినా కేసీఆర్‌కు కనికరం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. -
‘రూట్ల ప్రైవేటీకరణ’పై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 5,100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలని మంత్రివర్గం చేసిన తీర్మానంపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని, మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తేయాలని ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. స్టే ఉత్తర్వుల వల్ల కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తర్వాత ప్రక్రియ చేపట్టేందుకు వీలు లేకుండా పోయిందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. స్టే రద్దు చేయాలన్న వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం తిరస్కరించింది. మోటారు వాహ న చట్టంలోని 102 సెక్షన్ ప్రకారం ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుం దని, ఇప్పటికిప్పుడే సులభంగా చేసేది కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ తీర్మానం చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా హిత వ్యాజ్యంపై విచారణను 22వ తేదీ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించిం ది. అప్పటివరకు స్టే ఉత్తర్వులు అమలును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఆర్టీసీకి సమాతరంగా ప్రైవేటు రూట్లకు అనుమతినివ్వాలని మంత్రివర్గ తీర్మానం చేయడం ప్రాథమిక దశలోని వ్యవహారమని, ఆ నిర్ణయానికి చట్టబద్ధత తెచ్చేందుకు ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుందని, ఇప్పుడే పిల్ దాఖలు చేయడం అపరిపక్వతే అవుతుందని వ్యాఖ్యానించింది. సహజ వనరుల వ్యవహారమా? సహజ వనరులను ప్రైవేటీకరణ చేసేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు రిలయన్స్, టూజీ కేసుల్లో చెప్పిం దని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభా కర్ చేసిన వాదనలు ఈ కేసుకు వర్తించవని కోర్టు చెప్పింది. సెక్షన్ 102 ప్రకారం ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు గ్యారేజీలకు రాష్ట్రాలకు కేంద్రమే అనుమతినిచ్చిందని గుర్తుచేసింది. రోడ్ల ప్రైవేటీకరణ సహజ వనరులుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున ప్రైవేటు ఆపరేటర్లకు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయిస్తున్నట్లు ఆర్టీసీ, ప్రభుత్వం చెబుతుంటే, ఆర్టీసీ ఆస్తులనే ప్రైవేటుకు ఇచ్చేస్తారనే భయం ఏమైనా పట్టుకుందా? అనే సందేహాన్ని ధర్మాసనం లేవనెత్తింది. సమ్మెను అడ్డంపెట్టుకుని బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని విశ్వాసరాహిత్యానికి పా ల్పడే చర్యగా పరిగణించాలని న్యాయవాది కోరా రు. నేరుగా చేయలేని దానిని పరోక్షంగా కూడా చేయకూడదు.. అని ఏనాడో సుప్రీంకోర్టు చెప్పిం దని గుర్తు చేశారు. సెక్షన్ 67, 67, 102, చాప్టర్ 5, 6ల్లోని అంశాలపై సాంకేతికపర వివరాల్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చాప్టర్ 5, 6లు పరస్పర విరుద్ధంగా ఏమీ లేవని ధర్మాసనం చెప్పింది. ఈ దశలో వ్యాజ్యం చెల్లదు: ఏజీ ఏజీ వాదిస్తూ.. పిల్ దాఖలుపై ప్రాథమికంగానే ప్రభుత్వానికి తీవ్ర అభ్యంతరాలున్నాయని చెప్పా రు. బస్సు రూట్ల ప్రైవేటీకరణ విషయాన్ని ఆర్టీసీ పరిశీలించాలని మాత్రమే కేబినెట్ తీర్మానం చేసిం దని, ఈ దశలోనే పిల్ దాఖలు చేయడం చెల్లదన్నారు. ఆర్టీసీ అమలు చేసే రవాణా విధానాలను మార్పులు, చేర్పులు చేసేందుకు 102 సెక్షన్ వీలు కల్పిస్తోందని, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణల ద్వారానే రాష్ట్రాలకు ప్రైవేటు రూట్లకు అనుమతినిచ్చే సర్వాధికారాలు సిద్ధించాయని తెలిపారు. కేబినెట్ నిర్ణయం పూర్తి రూపుదాల్చలేదని, ఆ తీర్మానంపై గవర్నర్ ఆమోదముద్ర వేశాక జీవో జారీ అయితేనే చట్టబద్ధత వస్తుందని, అప్పుడు ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుంటుందని ఏజీ వాదించారు. ఇప్పుడు గవర్నర్ మాత్రమే సమీక్ష చేయాలా? దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపాకే న్యాయ సమీక్ష చేయాలని అంటున్నారా.. ఇప్పుడు గవర్నరే సమీ క్షచేయాలా.. అని ప్రశ్నించింది. ఉత్తరాంచల్ హైకో ర్టు కేసులో రెండు ప్రభుత్వ శాఖల మధ్య జరిగిన లావాదేవీలను న్యాయ సమీక్ష చేయరాదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, ఇక్కడ కేబినెట్ తీసుకున్న నిర్ణయం రెండు శాఖల మధ్య లావాదేవీలుగా ఎలా పరిగణించాలో చెప్పాలని కోరింది. తిరిగి ఏజీ వాదనలు కొనసాగిస్తూ.. కేరళలో నలుగురు జడ్జీల నియామక విషయంలో వారి పేర్లను మంత్రివర్గం గవర్నర్‌కు సిఫార్సు చేసే దశలోనే కోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని, ఈ తీర్పు ప్రకారం రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ అపోహలతో హైకోర్టును ఆశ్రయించారని, పిల్‌ను తోసిపుచ్చాలని కోరారు. స్టే ఎత్తివేసి మంత్రివర్గం తీర్మానంపై తదుపరి చర్యలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించగా, ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని, అదే రోజున ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిల్‌ను కూడా విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు: సీఎస్ ఆర్టీసీ సమ్మె వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున యూనియన్ నేతలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై న్యాయ సమీక్ష చేసేందుకు ఆస్కారం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి హైకో ర్టుకు తెలియజేశారు. ఆర్టీసీ యూనియన్‌తో ప్రభుత్వం చర్చలు జరిపేలా ఉత్తర్వులివ్వాలని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవాలని విశ్వేశ్వరరావు దాఖలు చేసిన మరో పిల్లో హైకోర్టు ఆదేశాల మేరకు సీఎస్ కౌం టర్ దాఖలు చేశారు. ఆర్టీసీ సమ్మెపై లేబర్ కోర్టు తేల్చాలని, పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 10 కింది కార్మికశాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకోవాలని ఇదే హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. వేర్వేరు కారణాలతో కార్మికులు చనిపోతే ఆర్టీసీ సమ్మె కారణంగా చనిపోయారని పిల్లో ఆరోపించా రని చెప్పారు. సమ్మె–చర్చలు వంటి అంశాలపై ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా 2 వారాల్లో కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వ స్పందన?!
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్టీసీ కార్మికులు 47 రోజులపాటు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. గత అక్టోబర్ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెలో దాదాపు 50వేలమంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధుల్లో చేరాలని రెండుసార్లు గడువు విధించినప్పటికీ.. కార్మికులు పెద్దగా చలించలేదు. కొంతమంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువశాతం దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారు నెలన్నరకుపైగా తమకు వచ్చే జీతాలను సైతం పణంగా పెట్టి సమ్మె చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం ముందుకు, సమాజం ముందుకు తీసుకురాగలిగారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల ఖర్చులు ఇలా అనేక సమస్యలు వెంటాడినా కార్మికులు మూకుమ్మడిగా నిలబడి ఉద్యమం చేశారు. ఈ సమ్మెకాలంలో పలువురు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయి.. ఆత్యహత్యలు చేసుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు తమ సమ్మెను విరమణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మళ్లీ సమ్మెకు పూర్వం ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం కల్పించాలని, విధుల్లోకి చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. సుదీర్ఘ సమ్మె నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమించి.. తిరిగి విధుల్లోకి చేరేందుకు సమ్మతించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ సమ్మె విషయంలో ఒకింత చురుగ్గా వ్యవహరించారు. పలుమార్లు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను అంగీకరించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వెంటనే విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్ గతంలో రెండుసార్లు కార్మికులకు డెడ్‌లైన్ విధించారు. ఆ డెడ్లైన్లకు పెద్దగా కార్మికుల నుంచి స్పందన రాలేదు. కానీ, హైకోర్టు ఉత్తర్వులు, మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణకు ఒప్పుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందని ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం కోరినట్టు బేషరతుగా విధుల్లోకి చేరేందుకు కార్మికులు ముందుకొచ్చారు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను సైతం కార్మికులు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో నెట్టింది. ప్రజలు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా దసరా పండుగ సమయంలో సమ్మె చేపట్టడం.. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవ్వడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే, 50వేలమంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు వారికి విధుల్లో చేరేందుకు గడువు ఇచ్చింది. తాజాగా కూడా ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కార్మికులను బేషరతుగా ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంటుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. -
రూట్ల ప్రైవేటీకరణపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ తీర్మానం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ స్టే కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ జడ్జ్మెంట్లను పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. మూడు రోజుల లోపు ఉద్యోగులు సమ్మె విరమణ చేసి ఉద్యోగంలో చేరకపోతే 5001 రూట్లను ప్రయివేటీకరణ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇందులో దురద్దేశం దాగుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ప్రైవేటీకరణ పరుగులు పెడుతుంటే ఇంకా 1947లోనే ఉందామా? ‘ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటీకరణ మన దేశంలోనూ పరుగులు పెడుతోంది. 1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. ఎయిరిండియా గుత్తాధిపత్యం పోయి ఎన్నో ఎయిర్‌లైన్స్ వచ్చాయి. రైల్వేలోనూ ప్రైవేటీకరణ జరగబోతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఆర్టీసీ గుత్తాధిపత్యం నుంచి సమాతరంగా ప్రైవేట్ రూట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్న కేబినెట్ ప్రతిపాదన చట్ట వ్యతికమని ఎక్కడ ఉందో చెప్పండి. సుప్రీంకోర్టు కూడా పెట్టుబడిదారీ విధానాలకు అనుగుణంగా వచ్చిన చట్టాలకు లోబడి తీర్పు చెబుతోంది. కాలం మారుతోంది. జనం కూడా మారుతున్నారు. అందుకు అనుగుణంగా చట్టాలు కూడా వస్తున్నాయి. రూట్ల ప్రైవేటీకరణకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ నేపథ్యంలో మనం ఇంకా 1947 నాటి సోషలిస్టు విధానాలే ఉండాలంటే ఎలా’ అని హైకోర్టు మంగళవారం విచారణ సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తోంది. అది విశ్వాసరాహిత్యమే: పిటిషనర్ తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న తరుణంలో రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం విశ్వాసరాహిత్యమే అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అధికారాలు ఉన్నా.. వాటిని అమలుచేసే సందర్భం కీలకమని, సమ్మె చేస్తున్న తరుణంలో ప్రైవేటీకరణ చేయడం వెనుక రహస్య ఒప్పందాలు ఉన్నాయని చెప్పారు. కార్మిక సంఘాలను చర్చలకు కూడా ఆహ్వానించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ దశలో ధర్మాసనం కల్పించుకుని.. సయోధ్య చర్చల నుంచి యూనియన్ నేతలు వాకౌట్ చేయడంతో చర్చలు విఫలమైనట్లు కన్సిలియేషన్ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాక ఇక చర్చలకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది. చదవండి: రూట్ల ప్రైవేటీకరణ.. తొలిదశలోనే తప్పుపట్టలేం!