తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

Jan 6 2026 7:10 AM | Updated on Jan 6 2026 7:10 AM

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

కరప: పనికి వెళ్లడం లేదని తల్లి మందలించిందనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామానికి చెందిన సంగాని సూర్యనారాయణ, వీరవేణి దంపతులకు ముగ్గురు కుమారులు. ఇందులో చిన్న కుమారుడైన సంగాని సింహాద్రి (16)తో కలసి తల్లి వీరవేణి హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకునేవారు. సింహాద్రి హైదరాబాద్‌లో ఉంటుండగా సరిగా పనికి వెళ్లడం లేదని తల్లీ, కొడుకులిద్దరూ తిరిగి తమ స్వగ్రామం మొండికి నెలరోజుల క్రితం వచ్చేశారు. ఈ నెల 2న వీరవేణి తన కుమారుడు సింహాద్రిని పనికి వెళ్లడం లేదని మందలించి, తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయింది. తల్లి మందలించిందన్న కోపం, హైదరాబాద్‌ వెళ్లిపోయిందనే బెంగతో మనస్థాపం చెంది సోమవారం సింహాద్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప ఎస్‌ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

నల్లజర్ల: మినీ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు సోమవారం పట్టుకున్నారు. అనంతపల్లి గ్రామంలో జనసేనకు చెందిన ఆలపాటి అఖిల్‌ 4,670 కిలోల రేషన్‌ బియ్యాన్ని నల్లజర్ల నుంచి సింగరాజుపాలెం వైపునకు మినీ వ్యాన్‌లో తరలిస్తుండగా, విజిలెన్స్‌ సీఐ నాగవెంకటరాజు తమ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గోపాలపురం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు సివిల్‌ సప్లయిస్‌ డీటీ సత్యనారాయణ తెలిపారు. ఈ దాడిలో వీఆర్వో టి.సురేష్‌, వీఆర్‌ఏ సర్ధార్‌ పాల్గొన్నారు.

ముగ్గురికి 15 నెలల జైలు

గండేపల్లి: ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్‌ తీగలను చోరీ చేస్తున్న ముగ్గురికి కోర్టు 15 నెలల జైలు శిక్ష విధించినట్టు సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గండేపల్లి మండలం మురారిలోని వ్యవసాయ భూముల్లో ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి వాటిలో కాపర్‌ను చోరీ చేస్తున్న నరసింహ, తేజ, మహీంద్రలపై కేసు నమోదు చేసిన ఎస్సై యూవీ శివ నాగబాబు దర్యాప్తు ముమ్మరం చేసి ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచారు. వారి నేరం రుజువు కావడంతో పెద్దాపురం జూనియర్‌ సివిల్‌ జడ్డి, జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఐ.దేవి రత్నకుమారి తీర్పు వెలువరించినట్లు సీఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో..

ప్రత్తిపాడు/ శంఖవరం: బైక్‌తో ఢీకొని ఓ వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి ప్రత్తిపాడు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి ఎల్‌.గోపీనాథ్‌ ఆరు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. స్థానిక సీఐ బి.సూర్య అప్పారావు కథనం ప్రకారం.. ప్రత్తిపాడు జాతీయ రహదారిపై శంఖవరం మండలం సీతంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొయ్యా సత్యనారాయణ (56) గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాకినాడ రూరల్‌ మండలం గంగనాపల్లికి చెందిన శీలం ఉమా మహేశ్వరరావు 2017 అక్టోబర్‌ 11న బైక్‌తో సత్యనారాయణను ఢీకొనడంతో మృతి చెందాడు. దీనిపై అప్పటి అన్నవరం ఎస్సై కె.పార్థసారధి కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఉమా మహేశ్వరరావుకు పైవిధంగా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

రైలు నుంచి జారిపడి

వ్యక్తి మృతి

తుని: మండలంలోని హంసవరం రైల్వే గేటు సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి (45) మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన పరిశీలించారు. మృతుడి ఒంటిపై బూడిద రంగు టీర్ట్‌, చిన్న పూలు కలిగిన నీలం రంగు ఆఫ్‌ ఫ్యాంట్‌, అమ్మా నాన్న అనే పేరుతో పచ్చబొట్టు ఉంది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై వివరించారు.

యంగెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిడే

చెస్‌ రేటెడ్‌ ప్లేయర్‌గా శాన్వీ

అమలాపురం రూరల్‌: కామనగరువులోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న ఏడేళ్ల శాన్వీ యంగెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిడే చెస్‌ రేటెడ్‌ ప్లేయర్‌గా నిలిచింది. చెస్‌లో అతి ప్రధానమైన అంతర్జాతీయ ఫిడె చెస్‌లో 1436వ రేటింగ్‌ సాధించింది. 2025లో అండర్‌– 7 బాలికల విభాగంలో భారత్‌ మొత్తం 24 మంది రేటింగ్‌ సాధించగా, ఆంధ్ర నుంచి శాన్వి ఒక్కరే కావడం విశేషమని కోచ్‌ వి.శ్రీనుబాబు తెలిపారు. 2025లో రాష్ట్ర స్థాయి అండర్‌ –7 చెస్‌ చాంపియన్‌ షిప్‌లో రెండో స్థానం సాధించి ఆంధ్ర యంగెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిడే చెస్‌ రేటెడ్‌ ప్లేయర్‌గా నిలవడం గర్వించదగ్గ విషయమని స్కూల్‌ చైర్మన్‌ నంద్యాల నాయుడు, డైరెక్టర్‌ స్నేహ ప్రియ, ప్రిన్సిపాల్‌ నంద్యాల మనోవిహార్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement