సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బంగారు గనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా గనుల్లో తవ్వకాలు ప్రారంభించి ఆదాయాన్ని సమకూర్చుకునేలా అడుగులు వేస్తోంది. కొత్త బంగారు గనులకు టెండర్లు పిలిచి ఖరారు చేయడంతోపాటు గతంలో తవ్వకాలు నిలిచిపోయిన గనులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. బంగారు గనుల ద్వారా రూ.10 వేల కోట్ల రాబడి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది.
చిప్పగిరిలో మైనింగ్ ప్రారంభం
చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత కర్నూలు జిల్లా చిప్పగిరి బంగారు గనిలో ఇటీవలే తవ్వకాలు మొదలై ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. 2002లో ఇక్కడ తవ్వకాలకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి లీజు మంజూరు కాగా పలు కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. 20 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న ఈ గనుల్లో తవ్వకాలను సీఎం జగన్ ప్రభుత్వం పట్టుదలతో ఓ కొలిక్కి తెచ్చింది.
ఆ కంపెనీతో పలుదఫాలు సంప్రదింపులు జరిపి మైనింగ్ ఆపరేషన్స్ మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంది. చేసింది. కంపెనీ ఇటీవల ప్రభుత్వానికి రూ.2 కోట్ల రాయల్టీ చెల్లించింది. బంగారాన్ని ప్రాసెస్ చేసే మినీ స్మెల్టర్‌ని గనిలో సొంతంగా ఏర్పాటు చేసుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో బంగారం వెలికితీత ప్రారంభం కానుంది.
చిగురుకుంట, బిసనాతంలో లైన్ క్లియర్..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 118 హెక్టార్లలో ఉన్న చిగురుగుంట, బిసనాతం బ్లాకుల్లో మైనింగ్ ఆపరేషన్స్ త్వరలో మొదలు కానున్నాయి. ఈ గనిని గతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కి చెందిన భారత్ గోల్డ్ మైన్స్ లీజుకు తీసుకుంది. అయితే వివిధ కారణాల వల్ల లీజు రద్దయింది. 2018లో మళ్లీ నిర్వహించిన వేలంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) దీన్ని దక్కించుకుంది. ఇటీవలే స్టే ఆర్డర్‌ను కోర్టు ఎత్తివేయడంతో ఎన్‌ఎండీసీకి లైన్ క్లియర్ అయింది. వచ్చే ఏడాది ఈ గనిలో కూడా బంగారం ఉత్పత్తి మొదలుకానుంది.
10 గనులపై ఫోకస్
కొత్త గనులపైనా దృష్టి సారించిన ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10 బంగారు గనులకు (ఏరియాలు) కాంపోజిట్ లైసెన్సులు ఇచ్చేందుకు సిద్ధమైంది. భారత నూతన గనుల చట్టం ప్రకారం (ఎంఎండీఆర్ చట్టం) వేలం ద్వారా కాంపోజిట్ మైనింగ్ లైసెన్సులు (అన్వేషణ, ఆ తర్వాత మైనింగ్ లీజు) ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు. రామగిరి నార్త్, రామగిరి సౌత్, బొక్కసంపల్లి నార్త్, బొక్కసంపల్లి సౌత్ ఏరియాలకుగాను మూడు లీజులు ముంబై కేంద్రంగా ఉన్న ఆంధ్రా మైనింగ్ కంపెనీకి దక్కాయి.
దేశంలోనే అత్యధికంగా మినరల్ వాల్యూలో 20 శాతం షేర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఈ బిడ్లు ఖరారయ్యాయి. మరో లీజు మంజూరు ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా జవుకులలో 57 చదరపు కిలోమీటర్లను ఆరు బ్లాకులుగా విభజించి టెండర్లు పిలిచారు. మొదటిసారి సరైన స్పందన రాకపోవడంతో ఇటీవల మళ్లీ టెండర్లు ఆహ్వానించారు. ఫిబ్రవరిలో వాటికి వేలం జరగనుంది. మారిన పరిస్థితుల్లో ఆ బిడ్లు ఖరారయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ముందుచూపుతో ప్రణాళిక..
మైనింగ్ రంగంలో ఉన్న విస్తారమైన అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేలా సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన కార్యాచరణ ఇచ్చారు. అందులో భాగంగానే బంగారు గనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. రానున్న రోజుల్లో వీటి ద్వారా రాష్ట్రానికి ఊహించనంత ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో రూపొందించిన ప్రణాళిక విజయవంతమైంది.
– వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్
చదవండి: అభివృద్ధి వ్యయం పరుగులు.. ఆర్బీఐ అధ్యయన నివేదికలో వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment