ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల వేతన సమస్యకు చెక్‌.. 411 మందికి గుడ్‌న్యూస్‌ | Sakshi
Sakshi News home page

ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల వేతన సమస్యకు పరిష్కారం.. 411 మందికి గుడ్‌న్యూస్‌

Published Wed, Mar 1 2023 1:44 PM

Good News To Employees Working In Post Matric SC Hostels At AP - Sakshi

సాక్షి, అమరావతి: పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు ఏళ్ల తరబడిగా ఎదుర్కొంటున్న వేతన సమస్యను రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పరిష్కరించారు. ఇకపై వారు వేతనాలు సకాలంలో అందుకొనేలా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్(ఆప్కాస్)కు వారి సేవలను అనుసంధానం చేసారు.

వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న 160 పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో వంటపని, పారిశుద్ధ్యం ఉద్యోగులుగా పని చేస్తున్న వారిలో 411 మందికి ప్రైవేటు సంస్థల ద్వారా వేతనాలను చెల్లించేవారు. అయితే, ఈ విధానంలో ఆ ఉద్యోగులకు వేతనాలు అందడం ఆలస్యం అవుతుండటంతో ఉద్యోగులు విధుల నుంచి తప్పుకుంటున్న కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందుకే తమ వేతనాలు అందరితో పాటుగా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు తెలిపారు. 

కాగా, ఈ సమస్య మంత్రి మేరుగు నాగార్జున దృష్టికి రావడంతో వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం థర్డ్ పార్టీ విధానంలో పని చేస్తున్న ఈ ఉద్యోగుల సేవలను ప్రీ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకే మంజూరైన పోస్టుల స్థానంలో ఉపయోగించుకోవాలన్నారు. అలాగే, వారి వేతనాలను ఆప్కాస్ ద్వారా ఆలస్యం లేకుండా ప్రతినెలా అందరితో పాటుగా చెల్లించాలిని అధికారులు ప్రతిపాదించగా మంత్రి.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహన్‌రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. 

అనంతరం, ఈ ప్రతిపాదనపై సీఎం జగన్‌ ఆమోదముద్ర వేసారు. దీంతో, ఈ ఉద్యోగులు ఇప్పటి వరకూ వేతనాల కోసం పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. అదే విధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఉద్యోగులు లేని కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడే దుస్థితికి కూడా తెరపడింది. ప్రస్తుతం ఆప్కాస్‌కు అనుసంధానం చేసిన 411 మంది పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టల్ ఉద్యోగులలో 37 మందిని శ్రీకాకుళం, 52 మందిని విజయనగరం, 17 మందిని విశాఖపట్నం, 120 మందిని తూర్పుగోదావరి, 82 మందిని కృష్ణా,62 మందిని ప్రకాశం, 41 మందిని అనంతపురం జిల్లాలకు చెందిన హాస్టళ్లకు కేటాయిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తమ సమస్యను పరిష్కరించడంలో తమ కష్టాలు తీర్చిన సీఎం జగన్‌కు, చొరవ చూపిన మంత్రి మేరుగు నాగార్జునకు ఉద్యోగులు తమ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement