
గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె వెళ్లిపోయింది. వేసవి కాలం ముగిసింది. వర్షాలు దండిగా కురవాల్సిన సమయం.. కానీ భానుడి భగభగలు తగ్గకపోగా మరింత పెరిగాయి. ఈ సారి నైరుతి ముందుగానే పలకరించినా జూలైలో ముఖం చాటెయ్యడంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి.
గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా జూలైలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పొడిగాలుల కారణంగా శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీల అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నెల్లూరులో అత్యధికంగా 39.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. జంగమహేశ్వరపురంలో 39.2, కావలి, మచిలీపట్నంలో 38.9, తిరుపతిలో 38.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 14 వరకూ ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని, 15వ తేదీ సాయంత్రం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.