
సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడాలన్నారు. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, వరదల సమయంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తుపాను, వరదల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై సీఎం విద్యుత్ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మీడియాకు వెల్లడించారు.
ముందస్తు వ్యూహంతో తప్పిన ముప్పు
► విద్యుత్ పునరుద్ధరణ పనులపై సమగ్ర సమాచారాన్ని అధికారులు సీఎం ముందుంచారు. రాష్ట్రంలో 13,648 ఫీడర్లున్నాయి. తుపాను కారణంగా 170 ఫీడర్ల పరిధిలో బ్రేక్ డౌన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 165 ఫీడర్లలో విద్యుత్‌ను పునరుద్ధరించారు.
► పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. వీటిని కూడా చాలా వరకు పరిష్కరించారు. మొత్తం 1,263 ఫీడర్లలో 23 బ్రేక్ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 22 ఫీడర్లు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి.
► తాత్కాలిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకున్నామని, అత్యవసర పరిస్థితుల్లో జనరేటర్ల ద్వారా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టే ఏర్పాట్లు చేశామని ఇంధనశాఖ ఉన్నతాధికారి శ్రీకాంత్ తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి, బ్రేక్‌డౌన్స్ రాకుండా చూడగలిగామని ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి తెలిపారు.