రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్‌టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! | Sakshi
Sakshi News home page

Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్‌టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!

Published Wed, May 17 2023 4:38 PM

Aditi Avasthi founder and CEO of Embibe - Sakshi

Aditi Avasthi founder and CEO of Embibe: మహిళలు అనుకుంటే సాధించలేనది ఏదీ లేదు. ఏ రంగంలోనైనా తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. అలాంటి విజయవంతమైన మహిళల్లో ఒకరే అదితి అవస్తీ. బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఎంబైబ్‌ వ్యవస్థాపకురాలు, సీఈవో. టాప్‌ ఎడ్‌టెక్ కంపెనీల్లో ఒకటిగా నిలిచి బైజూస్, ఫిజిక్స్ వాలా, అనకాడెమీ వంటి పెద్ద ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీ ఇస్తోంది ఎంబైబ్‌.

ఇదీ చదవండి: Divis Laboratories: ఎవరీ నీలిమ మోటపర్తి? ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

అదితి అవస్తీ నేపథ్యం
అదితి అవస్తీ పంజాబ్‌లోని లూథియానాలో జన్మించించారు. 2003లో థాపర్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేశారు. చికాగో యూనివర్సటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఫైనాన్స్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేసిన అదితి అవస్తి తర్వాత బార్క్లేస్‌లో ఆఫ్రికాలోని మొబైల్ బ్యాంకింగ్ విభాగానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ప్రొడక్ట్ స్ట్రాటజీ హెడ్‌గా పనిచేశారు. ఏంజల్‌ ఇన్వెస్టర్స్‌ సహాయంతో  7 లక్షల డాలర్ల నిధులతో 2012లో ఎంబైబ్‌ సంస్థను స్థాపించారు.  తర్వాత కలారి క్యాపిటల్,  లైట్‌బాక్స్ వెంచర్స్ నుంచి కూడా పెట్టుబడులను సాధించారు.

రిలయన్స్‌ పెట్టుబడులు
ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను మెప్పించి తన ఎంబైబ్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించింది. 2018లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 
180 మిలియన్ డాలర్లను ఎంబైబ్‌లో ఇన్వెస్ట్‌ చేసింది.  తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంబైబ్‌లో 73 శాతం వాటాను కొనుగోలు చేయింది. అలాగే 2020లోనూ అదనంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది.

గుర్తింపులు, అవార్డులు
అదితి అవస్తి 2021లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపికయ్యారు. 2017లో బీబీసీ టాప్ 100 మంది మహిళలలో స్థానం సాధించారు. 2018లో వోగ్ ఆమెను 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేసింది.

 

రూ.1600 కోట్లకుపైగా నిధులు
నివేదికల ప్రకారం..  ఎంబైబ్ నాలుగు రౌండ్లలో మొత్తం  196.7 మిలియన్‌ డాలర్లు( రూ.1600 కోట్లకుపైగా)  నిధులను సేకరించింది. కంపెనీ చివరి సారిగా  2020 ఫిబ్రవరిలో నిధులు సమీకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్నోవెన్ క్యాపిటల్‌తో సహా  నాలుగు సంస్థలు ఎంబైబ్‌కు నిధులు సమకూరుస్తున్నాయి. 

గోవా ప్రభుత్వంతో భాగస్వామ్యం 
గోవా ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ , ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఎంబైబ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఉన్న 594 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల‍్లోని సుమారు లక్ష మంది విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందించనుంది ఎంబైబ్‌.

బిజినెస్‌ రంగంలో ఇలాంటి విజయగాథలు, స్పూర్తివంతమైన కథనాల కోసం సాక్షి బిజినెస్‌ పేజీని చూస్తూ ఉండండి.

Advertisement
Advertisement