Sakshi News home page

Mallika Srinivasan: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ

Published Tue, May 23 2023 2:02 PM

TAFE chairman tractor queen mallika srinivasan success story and net worth details - Sakshi

Mallika Srinivasan Success Story: ప్రపంచం అభివృద్ధి పైపు పరుగులు పెడుతున్న సమయంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ మేము సైతం అంటున్నారు. పని ఏదైనా మనసు పెట్టి చేస్తే తప్పక విజయం సాధిస్తావన్నది లోకోక్తి. అలాంటి కోవకు చెందిన 'ట్రాక్టర్ క్వీన్' గా పిలువబడే 'మల్లిక శ్రీనివాసన్' (Mallika Srinivasa) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న కొంత మంది మహిళల్లో మల్లిక శ్రీనివాసన్ ఒకరు. 1959 నవంబర్ 19న జన్మించిన మల్లికకు చిన్నప్పటి నుంచి బిజినెస్ స్టడీస్‌పై ఉన్న ఆసక్తి కారణంగా మద్రాస్ యూనివర్సిటీలో ఎమ్ఏ పూర్తి చేసి, ఆ తరువాత ఉన్నత చదువులు కోసం విదేశాలకు పయనమైంది. వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఇండియాకు తిరిగి వచ్చింది.

చదువు పూర్తయిన తరువాత 1986లో, చెన్నైని 'డెట్రాయిట్ ఆఫ్ ఇండియా'గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ అనంతరామకృష్ణన్ స్థాపించిన కుటుంబ వ్యాపారంలో మల్లిక జనరల్ మేనేజర్‌గా చేరింది. రోజు రోజుకి TAFE కంపెనీని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి మల్లిక చాలా కృషి చేసింది. అతి తక్కువ కాలంలోనే కంపెనీ మంచి లాభాలను ఆర్జించగలిగింది.

TAFE (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్) కంపెనీ ఆదాయం & అమ్మకాల పరిమాణంలో మహీంద్రా ట్రాక్టర్‌ల తర్వాత భారతదేశపు రెండవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీ. మల్లిక నాయకత్వంలో, టాఫె సంస్థ 2022లో ఫ్రెంచ్ సంస్థ ఫౌరేసియా (Faurecia) ఇండియా వ్యాపారాన్ని రూ. 400 కోట్ల డీల్‌తో, 2018లో IMT వంటి కంపెనీలను కొనుగోలు చేసింది. 

(ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!)

మల్లికా శ్రీనివాసన్ గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) చెన్నై, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) హైదరాబాద్, AGCO, టాటా స్టీల్ అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్ వంటి పెద్ద సంస్థలలో ఉన్నారు. ఆమె ఇటీవల బిలియన్ డాలర్ల స్టార్టప్ స్విగ్గీ బోర్డులో కూడా అడుగుపెట్టడం గమనార్హం.

(ఇదీ చదవండి: సత్య నాదెళ్ల కంటే ఎక్కువ ఆస్తులున్న మహిళ గురించి తెలుసా?)

మల్లిక శ్రీనివాసన్ ఒక వైపు కంపెనీ విషయాలను చూసుకుంటూనే.. తిరునెల్వేలిలోని అనేక ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాలకు కూడా మద్దతు ఇస్తున్నారు. అంతే కాకుండా ఆమె ఇందిరా శివశైలం ఎండోమెంట్ ఫండ్ ద్వారా చెన్నై శంకర నేత్రాలయలోని క్యాన్సర్ ఆసుపత్రికి మద్దతు ఇస్తుంది. కర్ణాటక సంగీతం సంగీత సంప్రదాయాన్ని కూడా ప్రోత్సహించడంలో తన వంతు కృషి చేస్తోంది.

ట్రాక్టర్‌ ఇండస్ట్రీ పురుషుల ఆధిపత్యంలోనే ఉంటుందని భావిస్తారు. అలాంటి భావనకు చరమగీతం పాడి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ట్రాక్టర్‌ కంపెనీగా, భారతదేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్‌ కంపెనీగా తీర్చిదిద్ది 'ట్రాక్టర్ క్వీన్' పేరు పొందింది. మల్లిక శ్రీనివాసన్ మొత్తం ఆస్తుల విలువ రూ. 200 కోట్లకంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈమె భర్త టీవీఎస్ మోటార్స్ సీఎండీ వేణు శ్రీనివాసన్. పారిశ్రామిక రంగంలో ఈమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రధానం చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Advertisement

తప్పక చదవండి

Advertisement