Father Killed His Daughter In Telangana Peddapalli District - Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై సైకోగా మారి.. కూతుర్ని గొడ్డలితో నరికిచంపిన తండ్రి..

May 11 2023 2:11 PM | Updated on May 12 2023 8:24 AM

Father killed Daughter Telangana Peddapalli District - Sakshi

సాక్షి, పెద్దపల్లి:  తండ్రి మద్యం మత్తు, రాక్షసత్వానికి పదేళ్ల చిన్నారి బలైపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదానందం భార్య పదినెలల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి కొడుకు అంజి, కూతురు రజిత(10) ఉన్నారు. రజిత ప్రస్తుతం ఐదోతరగతి చదువుతోంది. సదానందం కొన్నాళ్లుగా మద్యానికి బానిసై,  గ్రామంలో సైకోగా ప్రవర్తిస్తున్నాడు. పలువురిపై దాడికి సైతం దిగాడు.

గురువారం ఉదయం మద్యంమత్తులో ఇంటికి వచ్చిన సదానందం కూతురు రజితపై దాడి చేశాడు. గొడ్డలితో చిన్నారి మెడపై వేటువేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. రక్తపు మరకలతో ఉన్న గొడ్డలిని తీసుకుని సమీపంలోని కిరాణాదుకాణానికి వెళ్లాడు. దుకాణ యజమాని దూపం శ్రీనివాస్‌పై దాడి చేయగా తీవ్రగాయమైంది. అనంతరం సదానందం ఇంటికి వెళ్లిపోయాడు. కొడుకు అంజి ఇంటికి రాగా.. రక్తపుమడుగులో ఉన్న తన సోదరి మృతదేహాన్ని చూసి కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పోలీసువాహనంలో స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.
నిందితుడు

బండరాళ్లు అడ్డుపెట్టి.. కారంతో దాడిచేసి
పోలీస్‌వాహనం ముందుకెళ్లకుండా కర్రలు, బండరాళ్లు అడ్డుపెట్టారు. వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. హంతకుడిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. మంథని సీఐ సతీశ్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఎంత చెప్పినా వినలేదు. ఈ క్రమంలో కొందరు పోలీసులపై కారంపొడి చల్లి దాడికి దిగారు. మూడుగంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదనపు బలగాలను దింపారు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ అక్కడికి చేరుకొని నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు శాంతించారు. బాలిక మేనమామ కొత్తపల్లి సుమన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. 

చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement