తల్లిప్రేమకు దూరమైన చిన్నారులు
పన్నెండేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొంది. తాగుడుకు బానిసైన భర్తలో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అంతలోనే పిల్లలు పుట్టడంతో వారి భవిష్యత్ కోసమైనా బతకాలని భరిస్తూ వచ్చిన ఆమె శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన కర్నూలులోని కౌతాళం మండల పరిధిలోని లింగాలదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది.
సాక్షి, కౌతాళం రూరల్: కౌతాళం మండల కేంద్రానికి చెందిన హరిజన గౌరప్ప, పెద్ద బోడెమ్మ కూతురు బుజ్జమ్మ(30)ను సమీప బంధువు లింగాలదిన్నె గ్రామానికి చెందిన హరిజన అబ్రహం, యమిలమ్మ కుమారుడు జాన్‌కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరి సంసారం నాలుగేళ్లు అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత భర్త జాన్ తాగుడుకు బానిసై భార్యను వేధించడం మొదలు పెట్టాడు. వీరికి నలుగురు మగ పిల్లలు. అయినా భర్తతో పాటు అత్త, మామ, ఆడపడచు భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండటంతో తల్లిదండ్రులకు చెప్పుకుని విలపించేది. సంసారం ఆగం చేసుకోవద్దని వారు చెప్పే మాటలు, నలుగురు పిల్లల భవిష్యత్‌ను తలచుకుని భరిస్తూ వచ్చేది. (ఆదోనీలో పరువు హత్య కలకలం)
బుజ్జమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
ఈ క్రమంలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో భర్త తాగి వచ్చి కొడుతుండటంతో తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా.. కొడుతున్నాడు’ అంటూ చెప్పింది. అవే ఆఖరి మాటలయ్యాయి. వెంటనే ఫోన్ కట్ కావడంతో తండ్రి తిరిగి కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇలాంటి వేధింపులు గతంలోనే చూసిన అతను మిన్నకుండిపోయాడు. అర్ధరాత్రి కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పక్కింటి వాళ్ల నుంచి ఫోన్ ద్వారా సమారాచారం తెలుసుకుని గుండెలు బాదుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన లింగాలదిన్నె చేరుకుని బోరున విలపించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో భర్త, అత్తమామలే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, హత్యనా, ఆత్మహత్మనా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్‌ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. కాగా అమ్మ కావాలంటూ ఏడుస్తున్న చిన్నారులను చూసి పలువురు కన్నీరు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment