మహనీయుని పేరుతో రాజకీయాలు వద్దు
రావులపాలెంలో విగ్రహ వివాదంపై
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
రావులపాలెం: శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహా చరిత్ర కలిగిన మహనీయుల పేరుతో రాజకీయాలు చేయడం తగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం గ్రామంలో ఇటీవల శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు వివాదంపై శనివారం వైఎస్సార్ సీపీ క్యాంప్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల నాయకుల విగ్రహాల ఏర్పాటుకు తానెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రమాదాలు జరిగే చోట్ల విగ్రహాలు పెట్టకూడదని, అందరికీ ఆమోదయోగ్యమయ్యే చోట విగ్రహాలు పెట్టినా కోనసీమ వ్యాప్తంగా సహకరించే కుటుంబం తనదని అన్నారు. కాపులతో తన కుటుంబానికి తన తండ్రి కాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని, వంగవీటి మోహనరంగా లాంటి నాయకుడు తన ఇంట్లో బస చేశారని గుర్తు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటాన్ని అవమానించామని కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందన్నారు. ఆ ప్రచారంలో నిజం లేదని, ఒకవేళ నిరూపిస్తే ఎంతటి శిక్షకై నా తాను సిద్ధమన్నారు. అర్ధరాత్రి ఎంకేఆర్ జంక్షన్‌లో విగ్రహం ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏముందని, అందరితో చర్చించి అనుకూలమైన స్థలంలో ప్రతిష్ఠిస్తే దానికి తమ పూర్తి సహకారం అందిస్తామని జగ్గిరెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వివిధ విగ్రహాలు పెట్టాలని అభ్యర్థన వచ్చినా, అక్కడ తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతం కాబట్టి తిరస్కరించామన్నారు. ఇప్పుడూ అదే మాటపై ఉన్నామని, అది పూర్తిగా యాక్సిడెంట్ జోన్ అని అన్నారు. అదే రోడ్లో నాలుగు కల్యాణ మండపాలు, పాఠశాలలు, ఆస్పత్రులు ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఎటువంటి విగ్రహాలు పెట్టకూడదని పంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే అక్రమంగా అర్ధరాత్రి పూట దిమ్మకట్టి శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటాన్ని అక్కడ ఉంచడం వెనుక కులాల చిచ్చు పెట్టాలనే భావనతో కూటమి నాయకులు ఉన్నారన్నది స్పష్టం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడంతో తమపై బురద జల్లే కార్యక్రమాన్ని కావాలని కొంత మంది ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని, దీనిని కాపులు, మరే ఇతర సామాజిక వర్గీయులు నమ్మరన్నారు. సమావేశంలో అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, వైఎస్సార్ సీపీ నేత, కాపు సంఘ నాయకుడు చల్లా ప్రభాకరరావు, ఆలమూరు, కొత్తపేట మండల కన్వీనర్లు తమ్మన శ్రీను, ముత్యాల వీరభద్రరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, వార్డు సభ్యుడు సఖినేటి వాకుల రాజు, నాయకులు నాండ్ర నాగమోహనరెడ్డి, చల్లా నానాజీ, చల్లా భూషణం తదితరులు పాల్గొన్నారు.


