రహదారి భద్రత పాటించాలి
అమలాపురం టౌన్: వాహనచోదకులు రహదారి భద్రతను విధిగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలు చాలావరకూ తగ్గుతాయని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా రవాణాధికారి (డీటీఓ) దేవిశెట్టి శ్రీనివాసరావుతో కలసి ఎస్పీ రాహుల్ మీనా 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్లను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, డీటీఓలు రోడ్డు భద్రతా మాసోత్సవాల నిర్వహణపై చర్చించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ తనిఖీల్లో పోలీస్, రవాణా శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎస్పీ మీనాను డీటీఓ శ్రీనివాస్ కోరారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకూ జిల్లాలో రహదారి భద్రతా వారోత్సవాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రెండు శాఖల సమన్వయంతో నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) సురేష్‌కుమార్ కూడా పాల్గొన్నారు.
స్టాలిన్‌కు అంతర్జాతీయ అవార్డు
మలికిపురం: పూణేకు చెందిన సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో లక్కవరం గ్రామానికి చెందిన రెండో తరగతి విద్యార్థి బొంతు స్టాలిన్ బంగారు పతకం సాధించాడు. ఈ పతకాన్ని లక్కవరం సెవెంత్ డే సెక్టార్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాద్ శనివారం అందించారు. స్కూల్ ప్రిన్సిపాల్ నరసింహరాజు మాట్లాడుతూ స్టాలిన్ గతంలో తమ స్కూల్‌కు ఎన్నో అవార్డులు, మెమెంటోలు తీసుకొచ్చాడని, ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్టాలిన్‌ను సంఘ సభ్యులు సువర్ణరాజు అభినందించారు.
శనైశ్చరునికి
ప్రత్యేక పూజలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం కిక్కిరిసింది. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,60,160, పరోక్ష పూజలు, మనియార్డర్ల ద్వారా రూ.1,79,800, అన్నప్రసా దం విరాళాలు రూపంలో రూ.51,207 ఆదాయం వచ్చినట్టు ఈఓ సురేష్‌బాబు తెలిపారు.
ఉపాధి పథకంలో
రూ.215 కోట్ల చెల్లింపులు
అంబాజీపేట: ఉపాధి హామీ పథకంలో జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకూ రూ.215 కోట్ల చెల్లింపులు చేసినట్లు డ్వామా పీడీ ఎస్.మధుసూదనరావు తెలిపారు. శనివారం అంబాజీపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సామాజిక తనిఖీ ప్రజా వేదికకు హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 1.60 లక్షల మంది ఉపాధి కూలీలకు రూ.137 కోట్లు, మెటీరియల్‌కు రూ.72 కోట్లు చెల్లించామన్నారు. వంద రోజుల పని దినాలను 2,123 కూలీలకు కల్పించామన్నారు. ఎంపీడీఓ బి.మమత, ఏపీఓలు అడపా వెంకట శ్రీకృష్ణ, పేరాబత్తుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
రహదారి భద్రత పాటించాలి
రహదారి భద్రత పాటించాలి


