విగ్రహానికి కాదు.. పెట్టే ప్రాంతానికి వ్యతిరేకం | - | Sakshi
Sakshi News home page

విగ్రహానికి కాదు.. పెట్టే ప్రాంతానికి వ్యతిరేకం

Jan 5 2026 7:38 AM | Updated on Jan 5 2026 7:38 AM

విగ్రహానికి కాదు.. పెట్టే ప్రాంతానికి వ్యతిరేకం

విగ్రహానికి కాదు.. పెట్టే ప్రాంతానికి వ్యతిరేకం

కావాలనే బురద జల్లుతున్నారు

గూగుల్‌ మ్యాప్‌ ద్వారా వివరించిన

చిర్ల జగ్గిరెడ్డి

రావులపాలెం: శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని, ప్రమాదాలు జరిగే ప్రాంతంలో పెట్టడంతోనే వ్యతిరేకించామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. రావులపాలెంలో విగ్రహ ఏర్పాటు ఘటనలో కులాల మధ్య చిచ్చుపెట్టాలని కూటమి నాయకులు చూస్తున్నారని, అలాగే ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారని అన్నారు. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతంలో విగ్రహం పెట్టారని, అయితే దానిని శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపం వద్ద పెడితే తాను అడ్డుకున్నానని సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. దీనిని ఖండిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ముందుకు వచ్చామన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌ సీపీ క్యాంప్‌ కార్యాలయం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. మహనీయులు శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటాన్ని అవమానించామని కూటమి అసత్య ప్రచారం చేస్తుందన్నారు. కుట్ర లేకపోతే, అర్ధరాత్రి అంతటి మహనీయుని విగ్రహం ఎంకేఆర్‌ జంక్షన్‌లో ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏముందన్నారు. అందరితో చర్చించి అనుకూలమైన, రోడ్డు ప్రమాదాలు జరగని స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే దానికి తన తరఫున పూర్తి సహకారం అందిస్తానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వివిధ వర్గాల నుంచి సర్‌ ఆర్ధర్‌ కాటన్‌, అల్లూరి సీతారామరాజు, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్‌, హనుమాన్‌ విగ్రహాలు పెట్టాలని అభ్యర్థన వచ్చినా అక్కడ తరచూ ప్రమాదాలు జరగడంతో తిరస్కరించామన్నారు. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నామన్నారు. పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా విగ్రహం పెట్టడంలో కూటమి నాయకుల ఆంతర్యం ఏంటన్నారు. ఆ రోడ్‌లో నాలుగు కల్యాణ మండపాలు, స్కూళ్లు, ఆసుపత్రులు ఉండడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయని విగ్రహం పెట్టకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ఉన్నా సరే, అక్రమంగా అర్ధరాత్రి పూట దిమ్మకట్టి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సరికాదన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తని చోట విగ్రహం ఏర్పాటు చేస్తే తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాయుల వారి విగ్రహాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో పెట్టి, దానిని శ్రీకృష్ణదేవరాయల కాపు కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేస్తుంటే తాను అడ్డుకున్నానని కావాలనే కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారన్నారు. దీని గూగుల్‌ మ్యాప్‌ ద్వారా జగ్గిరెడ్డి వివరించారు. కాపు కల్యాణ మండపం వద్ద రోడ్డు పక్కన ప్రదేశంలో నాలుగు విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, అయినా అక్కడ నుంచి మూడు రోడ్లు దాటి దూరంగా ఉన్న ప్రమాదాల జోన్‌లోని సమస్యాత్మక ప్రాంతంలో కూటమి నేతలు విగ్రహాన్ని పెట్టించారని అన్నారు. ఇప్పటికైనా శ్రీకృష్ణదేవరాయలుపై కూటమి నాయకులకు గౌరవం ఉంటే, సమస్య లేని, ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతంలో విగ్రహం పెట్టడానికి ముందుకు రావాలన్నారు. దానికి తన సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో అమ్ముడా మాజీ చైర్మన్‌ గొల్లపల్లి డేవిడ్‌రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, కాపు సంఘం నాయకుడు చల్లా ప్రభాకరరావు, సర్చంచ్‌ తమ్మన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement