ఇదేం శిక్షణ బాబూ!
● మెషీన్ల పంపిణీ ఏదీ?
● 8 నెలలుగా ఎదురుచూపులు
● ఉమ్మడి జిల్లాలో
11,014 మందికి మొండిచేయి
కొత్తపేట: మహిళల స్వయం ఉపాధి కల్పనలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చింది. శిక్షణ అనంతరం ఇవ్వాల్సిన ఉచిత కుట్టు మెషీన్లను మాత్రం ఇవ్వలేదు. అసలు ఇస్తారా? ఇవ్వరా? అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి నుంచి ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించారు. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన కులాల వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖల ద్వారా మండల కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. ఎంపీడీవోలు ఈ కేంద్రాల్లో వసతులను పర్యవేక్షించారు. మూడు నెలల చొప్పున దశల వారీగా అన్ని మండలాల్లో శిక్షణ పూర్తి చేశారు కానీ. శిక్షణ పొందిన మహిళలకు ఇవ్వాల్సిన కుట్టు మెషీన్లను ఆరేడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇవ్వలేదు.
హాజరు బాగుంటేనే మెషీన్
మహిళలకు ఉచిత కుట్టు మెషీన్ల పంపిణీ పథకానికి ఆయా గ్రామ సచివాలయాల ద్వారా మూడు వేలకుపైగా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారులు 3 నెలల పాటు కుట్టు శిక్షణ పొందితేనే ధ్రువీకరణ పత్రంతో పాటు, ఉచిత కుట్టు మెషీన్ అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం మెలిక పెట్టింది. ప్రజా ప్రతినిధుల సిఫారసుల నేపథ్యంలో మహిళలకు ఈ శిక్షణ ఇచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంపికై న వారి హాజరు 75 శాతం కచ్చితంగా ఉండాలనడంతో 445 మంది మాత్రమే ఉచిత కుట్టు మెషీన్ పొందేందుకు అర్హత సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇంతవరకు ఏమీ లేదు
ఉచిత కుట్టు శిక్షణకు మూడు నెలల పాటు హాజరై, 75 శాతం హాజరు పొంది అర్హత సాధించి 6, 7 నెలలు గడుస్తున్నా ధ్రువీకరణ పత్రాలు, ఉచిత కుట్టు మెషీన్ల పంపిణీపై ప్రభుత్వం నేటి వరకూ ఎటువంటి స్పందనా లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా కుట్టు యంత్రాలు ఆందకపోవడంతో రోజూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. ఉచిత కుట్టు మెషీన్లతో పాటు నేరుగా దర్జీ దుకాణాల ఏర్పాటుకు అవసరమైన బ్యాంక్ రుణాలు ఇస్తామని శిక్షణ సమయంలో అధికారులు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న స్వయం ఊపాధి సోపానం రుణాల పైనా చంద్రబాబు సర్కారు నేటీకీ ఏ విధమైన ప్రకటన చేయడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి పాలకులు నాడు ఎన్నికల్లో అన్ని వర్గాలను ముఖ్యంగా మహిళాలోకాన్ని ఉద్దరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు చేసిందేమీ లేదని మహిళలు పెదవి విరుస్తున్నారు.
కుట్టు మెషీన్లకు అర్హత పొందిన
లబ్ధిదారుల వివరాలు ఇలా..
జిల్లా శిక్షణకు వచ్చిన శిక్షణ
దరఖాస్తులు పొందినవారు
కోనసీమ 21,908 3,190
తూర్పు గోదావరి 12,118 2,904
కాకినాడ 27,722 4,920
మొత్తం 61,718 11,014
ఇదేం శిక్షణ బాబూ!


