హ్యాపీ న్యూ ఇయర్ర్‌ర్ర్‌ర్ర్
● రూ.19.2 కోట్ల మద్యం తాగించేశారు
● కొత్త సంవత్సర వేడుకల్లో పొంగిన బీర్లు
● రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు
● ముగింపు సేల్‌తో తాగి ఊగిన యువత
చాగల్లు: సంపద సృష్టిస్తా అంటూ గొప్పగా చెప్పే సీఎం చంద్రబాబు తాను సృష్టిస్తున్న సంపద ఏమిటో కొత్త సంవత్సర వేడుకల పేరిట చూపించారు. జిల్లాలో మందుబాబులతో ఫుల్‌గా తాగించారు. ఏడాది చివరి మూడు రోజుల్లో ఏకంగా రూ.19.26 కోట్ల విలువైన మద్యం డిపో నుంచి లిక్కర్ షాపులకు, బార్లకు తరలిపోయి మందుబాబులకు చేరింది. వారం రోజుల్లో అమ్మాల్సిన సరకు కేవలం మూడు రోజుల్లో విక్రయించారు. ’సంవత్సరం ముగింపు సేల్’ పేరుతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు వారం రోజుల ముందు నుంచే వ్యాపారులను అప్రమత్తం చేసి ’ఇండెంట్’ మేరకు సరకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. చాగల్లులో ఉన్న ఐఎంఎల్ డిపో పరిధిలో సగటున రోజుకు రూ.3 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయి. చాగల్లు ఐఎంఎల్ డిపో పరిధిలో జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలుతో పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరు జిల్లాల్లోని 126 షాపులు,10 బార్లకు మద్యం సరఫరా అవుతోంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 29న రూ.7.30 కోట్లు, 30న రూ.8.36 కోట్లు, 31న రూ.3.60 కోట్లు చొప్పున మొత్తం రూ.19.26 కోట్ల విలువైన మద్యం తాగేశారు.
మద్యం వ్యాపారులకు డబ్బే డబ్బు!
మద్యం వ్యాపారులకు ఈ ఏడాది డబ్బుల పంట పండింది. కొత్త సంవత్సర వేడుకల పేరిట భారీగా విక్ర యాలు జరపటానికి ప్రభుత్వం ముందుగానే డిస్టిలరీల నుంచి మద్యాన్ని డిపోలకు, అక్కడి నుంచి ప్రైవేటు దుకాణాలకు తరలించింది. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ఏడాది పొడవునా అడ్డూ అదుపు లేకుండా మద్యం విక్రయాలు సాగించారు. అర్ధరాత్రి వరకు వ్యాపారులు మద్యం విక్రయాలు జరుపుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
ఎకై ్సజ్ లెక్కల ప్రకారం
ఎకై ్సజ్ శాఖల లెక్కల ప్రకారం గత సంవత్సరం కంటే ఈసారి మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఏడాదంతా సుమారు రూ.700 కోట్ల మద్యం, బీరు విక్రయాలు జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన తరుణంలో మందుబాబులు రెచ్చిపోయారు. పాత ఏడాదికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అర్ధరాత్రి వరకు మద్యం ప్రియులంతా పెద్ద ఎత్తున పార్టీలు చేసుకున్నారు. మామూలు రోజుల్లో ప్రతిరోజూ రూ.3 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 29, 30 తేదీలలో రూ.15.66 కోట్ల విలువ చేసే స్టాకు దుకాణాలు, బార్లలో నిల్వ చేసి మద్యం ప్రియులకు తనివి తీరా అందించి వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. చాగల్లు డిపో నుంచి మూడు రోజుల్లో రూ.19.26 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. ఇక్కడి నుంచి 25,381 లిక్కర్ కేసులు, 9,470 బీరు కేసులు మద్యం దుకాణాలకు తరలించారు.
బీర్లు పొంగాయి... మద్యం పారింది
ఆదాయాన్ని పెంచుకునేందుకు బార్లకు అర్ధరాత్రి వరకు ప్రభుత్వం అనుమతివ్వడంతో అమ్మకాలు జోరుగా సాగాయి. లిక్కర్ షాపులు కూడా మద్యం ప్రియులతో చివరి రోజు కిక్కిరిసిపోయాయి. గడిచిన ఏడాదికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకున్న వేడుక సాయంత్రం నుంచే ప్రారంభం కావడంతో బీర్లు పొంగాయి, మద్యం ఏరులై పారింది.
కొత్త సంవత్సరం వేడుకల పేరిట మద్యం విక్రయాలు ఇలా...
తేదీ లిక్కర్ కేసులు బీరు కేసులు విలువ (రూ.లలో)
డిసెంబర్ 29 9,994 2,679 7,30,88,709
డిసెంబర్ 30 10,688 4,272 8,36,16.437
డిసెంబర్ 31 4,699 2,519 3,60,35,551
జనవరి 01 1,625 1,356 1,38,36,548
జనవరి 02 2,338 1,061 1,64,70, 666


