నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..! | Health Tips: What is Personality Development And How Does it Help | Sakshi
Sakshi News home page

నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!

Feb 20 2026 7:10 AM | Updated on Feb 20 2026 3:46 PM

Health Tips: What is Personality Development And How Does it Help

మనం ఒక భవనాన్ని చూసినప్పుడు దాని రంగులు, కిటికీలు కనిపిస్తాయి కానీ, భూమి లోపల ఉన్న పునాది కనిపించదు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. మీరు ఈరోజు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా, లేదా ఎంత భయపడుతున్నా.. దాని వెనుక మీ జీవితంలోని మొదటి 2,000 రోజులు (మొదటి ఐదేళ్లు) ఉన్నాయి.

సైకాలజీలో ఒక ప్రసిద్ధ మాట ఉంది: "Give me a child until he is seven, and I will show you the man." అంటే, ఏడేళ్ల లోపు ఒక బిడ్డను నాకు ఇస్తే, అతను భవిష్యత్తులో ఎలాంటి వాడో నేను చెప్పగలను అని. ఎలిజబెత్ హర్లాక్ ఈ కాలాన్ని 'పునాది దశ' (Foundational Stage) అని పిలిచారు.

నమ్మకం vs అపనమ్మకం (Trust vs Mistrust): పుట్టిన మొదటి ఏడాది బిడ్డ పుట్టిన మొదటి ఏడాదిలో నేర్చుకునే అత్యంత ముఖ్యమైన విషయం "ప్రపంచం సురక్షితమైనదా? కాదా?".

సురక్షితమైన పునాది: బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి వెంటనే పాలు పట్టడం, దగ్గరకు తీసుకోవడం, ప్రేమగా నిమరడం చేస్తే.. ఆ బిడ్డ సబ్-కాన్షియస్ మైండ్‌లో "ఈ ప్రపంచం నమ్మదగినది. ఇక్కడ నా అవసరాలు తీరుతాయి" అనే నమ్మకం కలుగుతుంది. ఇది భవిష్యత్తులో ఆ వ్యక్తి ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి పునాది అవుతుంది.

అభద్రతా భావం: అదే బిడ్డను పట్టించుకోకపోతే, ఆకలితో ఏడుస్తున్నా నిర్లక్ష్యం చేస్తే.. "ఎవరినీ నమ్మలేం, నా గురించి ఎవరూ పట్టించుకోరు" అనే అభద్రతా భావం  మొదలవుతుంది. పెద్దయ్యాక ఇలాంటి వారు ఎవరినీ త్వరగా నమ్మలేరు (Trust issues).

స్వయంప్రతిపత్తి (Autonomy): 2 నుండి 3 ఏళ్లు
ఈ దశలో బిడ్డ తన కాళ్లపై తాను నడవడం, తన చేత్తో తాను తినడం నేర్చుకుంటాడు. అంటే తనకంటూ ఒక 'ఇచ్ఛ' (Will) ఉందని గుర్తించే సమయం.

పర్యవేక్షణ vs అణచివేత: బిడ్డ తనంతట తాను ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు (ఉదాహరణకు: గ్లాసుతో నీళ్లు తాగడం), తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం (Self-confidence) పెరుగుతుంది.

"వద్దు.. నువ్వు వొంపేస్తావు, నీకు రాదు" అని ప్రతిదానికీ అరిస్తే.. వారిలో సందేహం (Doubt), సిగ్గు (Shame) మొదలవుతాయి. "నేను ఏదీ సరిగ్గా చేయలేను" అనే నెగటివ్ సెల్ఫ్-ఇమేజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది.

చొరవ (Initiative): 4 నుండి 5 ఏళ్లు
ఈ వయస్సులో పిల్లలు చాలా ప్రశ్నలు వేస్తారు. ప్రతిదీ తెలుసుకోవాలని కుతూహల పడతారు. ప్రపంచాన్ని ఒక 'ప్లే గ్రౌండ్' లా చూస్తారు.

సృజనాత్మకత: పిల్లల ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్తూ, వారి ఆటలను ప్రోత్సహిస్తే వారిలో నాయకత్వ లక్షణాలు (Leadership), సృజనాత్మకత (Creativity) పెరుగుతాయి.

అపరాధభావం (Guilt): వారి ప్రశ్నలను విసుక్కుంటే, వారి ఆటలను అల్లరిగా భావించి శిక్షిస్తే.. "నేను ఏదో తప్పు చేస్తున్నాను" అనే గిల్ట్ ఫీలింగ్ వారిలో నాటుకుపోతుంది. పెద్దయ్యాక వీరు ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా భయపడతారు.

సో-కాల్డ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్స్, మోటివేషనల్ స్పీకర్లు ఇచ్చే చిట్కాలు (ఉదాహరణకు: అద్దం ముందు నిలబడి గట్టిగా అరవడం) ఈ లోతైన పునాది గోడలను మార్చలేవు.

ఎందుకంటే...
మీరు 30 ఏళ్ల వయస్సులో "నేను కాన్ఫిడెంట్‌గా ఉండాలి" అని అనుకుంటున్నారు. కానీ మీ సబ్-కాన్షియస్ మైండ్‌లో 3 ఏళ్ల వయస్సులో పడ్డ "నువ్వు ఏదీ సరిగ్గా చేయలేవు" అనే ముద్ర అలాగే ఉంది. పైన మీరు ఎన్ని కోట్లు వేసుకున్నా, లోపల ఆ చిన్న పిల్లాడు ఇంకా భయపడుతూనే ఉంటాడు.

Real Personality Development అంటే.. ఆ చిన్ననాటి ముద్రలను గుర్తించి, వాటిని రీ-ప్రోగ్రామ్ చేయడం, మీ ఇన్నర్ చైల్డ్ ను హీల్ చేయడం. కేవలం బాడీ లాంగ్వేజ్ మార్చడం కాదు.

ఇదే నిజమైన వ్యక్తిత్వ వికాసం: Genius Matrix Way
Step 1: Break (విశ్లేషించడం)
మీరు ఇప్పుడు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా (ఉదాహరణకు: స్టేజ్ ఫియర్, రిలేషన్షిప్ సమస్యలు), దానికి మూలాలు మీ మొదటి ఐదేళ్లలో ఎక్కడ ఉన్నాయో వెతకండి.

  • "నన్ను చిన్నప్పుడు అతిగా కంట్రోల్ చేశారా?"

  • "నా అవసరాలను నా తల్లిదండ్రులు గుర్తించారా?"

  • ఈ విశ్లేషణే మీ పాత వ్యక్తిత్వాన్ని 'బ్రేక్' చేస్తుంది.

Step 2: Build (తిరిగి నిర్మించడం)
మీ చిన్నతనంలో మీకు దక్కని ప్రోత్సాహాన్ని ఇప్పుడు మీరు మీకు ఇచ్చుకోవాలి. దీనినే 'Reparenting yourself' అంటారు. మీ అంతరాత్మతో మీరు మాట్లాడే తీరును మార్చుకోవాలి.

"నీకు చేతకాదు" అనే మాటను "నువ్వు నేర్చుకోగలవు" అనే మాటతో రీప్లేస్ చేయాలి.

Step 3: Beyond (పరిమితులకు ఆవల)
ఒక్కసారి మీ మూలాలు మీకు అర్థమైతే, పాత గాయాలు మీ వ్యక్తిత్వాన్ని శాసించవు. మీరు ఒక స్వేచ్ఛా జీవిగా మారుతారు. ఎదుటివారి సర్టిఫికేట్లతో సంబంధం లేకుండా మీ లెగసీని మీరు నిర్మించుకుంటారు.

మొదటి ఐదేళ్లు మీ వ్యక్తిత్వానికి పునాది వేశాయి. అది మీ తప్పు కాదు. కానీ 25 లేదా 30 ఏళ్ల వయస్సులో కూడా అదే పాత భయాలతో బ్రతకడం మీ బాధ్యతారాహిత్యం అవుతుంది. మిమ్మల్ని మీరు రీ-డిజైన్ చేసుకోగలరు!

ఎలిజబెత్ హర్లాక్ చెప్పినట్లు, వ్యక్తిత్వం అనేది 'డైనమిక్'. అంటే దాన్ని మార్చుకోవచ్చు. మీ పునాది గోడల్లో పగుళ్లు ఉన్నాయని తెలిస్తే, వాటిని సిమెంట్ వేసి పూడ్చవచ్చు. ఆ పునాదిని అర్థం చేసుకోవడమే Real Personality Development.

Self-Reflection: ఈరోజు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మీ ఐదేళ్ల వయస్సును గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీరు ఎలా ఉండేవారు? మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎలా చూసేవారు? ఆ జ్ఞాపకాల్లోనే మీ వ్యక్తిత్వ రహస్యం దాగి ఉంది.

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: The DNA of You: 'పర్సనాలిటీ'కి పునాది ఎక్కడ పడుతుందంటే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement