నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఏవీ?
నరసరావుపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం నారా చంద్రబాబు నాయుడు వెంటనే నెరవేర్చాలనీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగం, యువతకు హక్కు అని, వారికి ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శి సుభాని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే పిలుపులో భాగంగా శనివారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు జిల్లా కార్యదర్శి సుభాని ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా సుభాని మాట్లాడుతూ సూపర్ సిక్స్‌లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనీ, నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల ఖాళీలను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అమరావతిని జీవనాధారంగా గుర్తించి 26 జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం యువతకు మోసం చేసిందని, మంత్రి నారా లోకేష్ యువకులను నమ్మించి నట్టేట ముంచారని, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం డీఆర్‌ఓ ఏకా మురళిని కలసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా నాయకులు వైదన వెంకట్, కె.మల్లికార్జున్, రాంబాబు నాయక్, వెంకటేష్ పాల్గొన్నారు.


