5 వేల మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం
ఘనంగా కేఎల్‌యూ స్నాతకోత్సవం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె. సింగ్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిజాయతీగా జీవించడానికి, దేశ అభ్యున్నతి కోసం పనిచేయడానికి ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. టాటా మెమోరియల్ సెంటర్ – ముంబై ఎండీ, ఐఏపీ పీడియాట్రిక్ హిమాటో ఆంకాలజీ విభాగ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి గౌరవ అతిథిగా విచ్చేసి విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. వర్సిటీ చాన్సలర్ కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులందరికీ ప్లేస్‌మెంట్ సాధించామన్నారు. వైస్ చాన్సలర్ డాక్టర్ జి. పార్థసారథి వర్మ మాట్లాడుతూ విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న 5 వేల మందికి వేడుకలో డిగ్రీలను ప్రదానం చేశామన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు మాట్లాడుతూ గత విద్యాసంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 44 మందికి బంగారు, 40 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎల్‌ఈఎఫ్ కార్యదర్శి కోనేరు శివకాంచనలత, ఉపాధ్యక్షులు కోనేరు రాజా హరీన్, బోర్డు సభ్యురాలు కోనేరు నిఖిల, ప్రో చాన్సలర్, వైస్ చాన్సలర్, ప్రో వైస్ చాన్సలర్లు, అన్ని విభాగాల డీన్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ రైతులకు అవార్డులు
కొరిటెపాడు: ప్రకృతి వ్యవసాయంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రైతులకు గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో శనివారం అవార్డులను అందజేశారు. రీజినల్ కౌన్సిల్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ (ఆర్‌సీఓఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. గుంటూరు జిల్లా నుంచి 28 మంది రైతులు, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. ఎన్.ధనుంజయరావుకు ఉత్తమ రైతు, షేక్ మస్తాన్‌బీకి బీఆర్సీ అవార్డును ప్రదానం చేశారు. రెండు సంవత్సరాల క్రితం జిల్లాకు చెందిన మహిళా రైతు కె.జయకు ఈ అవార్డు ప్రదానం చేశారు.
5 వేల మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం


