చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
రూ.ఐదు లక్షల విలువైన సొత్తు స్వాధీనం
తెనాలిరూరల్: పలు చోరీ కేసులలో నిందితుడిని పట్టణ వన్ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ వి.మల్లికార్జునరావు వెల్లడించిన వివరాల ప్రకారం... గుంటూరు కాకాని రోడ్డుకు చెందిన సయ్యద్ ఖాజా ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో అతనిపై పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. పట్టణంలో ఆటో చోరీకి గురైన నేపథ్యంలో కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడింది ఖాజా అని గుర్తించి నిందితుడిని వైకుంఠపురం ఆలయం సమీపంలో ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు నుంచి తెనాలి వన్ టౌన్ పోలీస్‌స్టేషన్, పాత గుంటూరు స్టేషన్‌లలో నమోదైన కేసులకు సంబంధించి రెండు ఆటోలు, త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో మొబైల్ ఫోన్, పెదకాకాని, తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులకు సంబంధించి రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్‌ఐ కె.విజయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర 51వ కౌన్సిల్ సమావేశాలను జనవరి 10, 11 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో విద్యారంగ సమస్యలతోపాటు, ఉపాధ్యాయులపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపైన చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. 10న బహిరంగసభ, ఉపాధ్యాయుల ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఫెడరేషన్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎ.ఎన్.కుసుమ కుమారి, రాష్ట్ర ప్రచరణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి మహమ్మద్ గయా సుదౌలా, జిల్లా కార్యదర్శులు ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, రంగారావు, కామాక్షి, ప్రసాద్, కేదార్నాథ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
చిలకలూరిపేటటౌన్: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామానికి చెందిన కొలసాని శివరామప్రసాద్ (76) ద్విచక్రవాహనం మోపెడ్‌పై ఆదివారం చిలకలూరిపేట పట్టణానికి వ్యక్తిగత పనులపై వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పసుమర్రు గ్రామ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న హైవే–167/ఎ పై పసుమర్రు – గుదేవారిపాలెం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా చీరాల వైపు నుంచి వస్తున్న వాహనం మోపెడ్‌ను ఢీకొంది. ప్రమాదంలో తీవ్రగాయాలైన శివరామప్రసాద్ సంఘటన స్థలిలోనే మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ జి అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులుకు అప్పగించారు. మృతుడికి భార్య వీరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
సత్తెనపల్లి: ద్విచక్ర వాహనం ఢీకొని పశువుల కాపరి మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం బృగుబండ గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పశువుల కాపరి చిమట నాగేశ్వరావు (62) పశువులను పొలంలో మేపుకొని సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన ఇరువురు యువ కులు ద్విచక్రవాహనం పై వేగం వెళ్తుండగా గేదె అడ్డవతలడంతో ఒక్కసారిగా ద్విచక్రవాహనం పశువుల కాపరి నాగేశ్వరరావును ఢీకొట్టింది. నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడని స్ధానికులు తెలిపారు. మృతుడికి భార్య నాగేశ్వరమ్మ, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ఇరువురికి వివాహలు అయ్యాయి. సత్తెనపల్లి రూరల్ సీఐ ఎమ్.హైమారావు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్


