3,4 తేదీల్లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు
పెదకాకాని: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రపై పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షిక సమావేశాలు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో జనవరి 3,4 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొవ్వా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు సంబంధించిన ప్రచార ప్రతులను వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రో–చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మొవ్వా శ్రీనివాసరెడి మాట్లాడుతూ వైజ్ఞానిక పద్ధతులలో చరిత్ర అధ్యయనాన్ని ప్రోత్సహించడం, ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర పరిశోధనల ప్రగతిని మూల్యాంకన చేయడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమన్నారు, అవగనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతారనీ, ఆధునిక చరిత్ర, సాంకేతికత, సామాజిక అంశాలపై పరిశోధనా పత్రాల సమర్పణ, చర్చలు జరుగుతాయని వివరించారు. పాలక సభ్యురాలు వాసిరెడ్డి ప్రత్యూష, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, ఏఎన్‌యూ హిస్టరీ ప్రొఫెసర్ ఎస్.మురళీమోహన్, డీన్ ఆఫ్ అకడమిక్స్ డాక్టర్ కె.గిరిబాబు, వీవీఐటీయూ పబ్లికేషన్ డివిజన్ సంధానకర్త మోదుగుల రవికృష్ణ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు బుధవారం పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026 జనవరి ఒకటో తేదీ నూతన ఏడాది కారణంగా ఆ రోజున పంపిణీ చేయాల్సిన పింఛన్లు బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ చేస్తారని తెలిపారు. సచివాలయ సిబ్బంది మంగళవారం బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. బుధవారం రోజే వంద శాతం పింఛన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనివార్య కారణాల చేత 31న తీసుకోని వారికి జనవరి రెండో తేదీన పంపిణీ చేస్తామన్నారు. రాజధాని నిర్మాణ పనులకు సహకారం అందించండి రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వకాల కోసం కాంట్రాక్టర్లకు అవసరమైన అనుమతులు అందించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, కాలుష్య నివారణ, మైనింగ్, సీఆర్‌డీఎ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ప్రజా సంపద దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముడిసరుకు సేకరణకు అనుమతులు ఇవ్వాలన్నారు.
వేమూరు(భట్టిప్రోలు): అతి వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఐలవరం జరిగింది. గ్రామానికి చెందిన వీరంకి సాంబశివరావు(69) ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భోజనం చేసి ఇంటి ముందున్న హైవే పైకి వచ్చాడు. ఈ సమయంలో గుర్తు తెలియని ద్విచక్ర వాహనదారుడు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎం. శివయ్య సోమవారం తెలిపారు. సాంబశివరావు కుమారుడు ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.


