సీఎం కేసీఆర్‌తో ముచ్చటిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
మహబూబ్‌నగర్: పొట్ట కూటి కోసం వలస వెళ్లే ఉమ్మడి పాలమూరులో కేఎల్‌ఐ ప్రాజెక్టుతో సాగునీరు తీసుకువచ్చి వలసలను ఆపి.. వరిని పెంచామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, వనపర్తి జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఎన్నికల వేళ అవాక్కులు.. చవాక్కులు పేల్చుతున్న కాంగ్రెస్ నాయకుల పాలనలో గంజి, అంబలి కేంద్రాలతో పాపగ్రస్తమైన పాలమూరును అన్నపూర్ణగా మార్చింది తెలంగాణ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. పాలమూరులో మంత్రులుగా పనిచేసిన వారెవరూ చేయలేనిది.. ఐదు జిల్లాలకు ఐదు మెడికల్ కళాశాలలు సాధించింది ప్రస్తుత మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డిలే అని కొనియాడారు.
జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు నాతో కొట్లాడి లిఫ్టులు మంజూరు చేయించుకున్న నిరంజన్‌రెడ్డి ఇటీవల ప్రారంభించుకున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి వనపర్తి జిల్లాకు సాగునీరు తీసుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని, కాల్వలు త్వరలో వస్తాయని పేర్కొన్నారు. దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలు, దళితులు, రైతులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం అమలు చేయడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ముస్లింల కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రతి పైసాను జాగ్రత్తగా వెచ్చించి.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. చేసిన అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.
రాయేదో.. రత్నమేదో చూసి ఓటేయండి
దశాబ్దాలుగా చేయలేని అభివృద్ధిని.. పదేళ్ల కాలంలో చేసి చూపించిన వారిలో రాయేదో.. రత్నమేదో గుర్తించి రానున్న ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలి. అడ్డం.. పొడవు ఎక్కువ ఉన్నోళ్లు ఎన్నికల సమయంలో ఇళ్ల ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలకు ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేయాలని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. ప్రస్తుత గురుకులాల్లో వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారని వివరించారు.
జీవనదిగా దుందుభీ
వచ్చే దారిలో డిండి ప్రాజెక్టు చూశా.. చాలాదూరం దుందుభీ నది, బాలరాజు కట్టించిన చెక్‌డ్యాంలు కనిపించాయని.. ఒకప్పుడు దుందుభీ దుమ్ములేచి పోయేదని.. గోరటి వెంకన్న సైతం వాగు ఎండిపోయెరా అనే పాట పాడారని, ఇప్పుడు దుందుభీ జీవనదిగా మారిందని కేసీఆర్ అన్నారు.
దుమ్ము దులపాలి..
అమ్రాబాద్‌కు నీళ్లు పోతాయని ఎవరూ ఊహించలేదని, అధికారులు 650 మీటర్ల ఉందని చెబితే 1,200 ఉన్నా సరే నీళ్లు ఇవ్వాలని గట్టిగా చెప్పానని పేర్కొన్నారు. కేసీఆర్ దమ్ము సంగతి దేశం మొత్తం చూసిందని, ఈ జనం అంతా కేసీఆర్ దమ్ము కాదా అన్నారు.
మీ బలం అంతా ఉపయోగిస్తే అచ్చంపేట దుమ్ము లేస్తోందని, నవంబరు 30న మీరు రేపే దుమ్ము, బాలరాజును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మనిషి అన్నప్పుడు మంచి, చెడు ఉంటుందని, మీ బలం ఓటుతో చూపించాలని కోరారు.
ఆశీర్వదించండి: నిరంజన్‌రెడ్డి
‘నాకు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చిన ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నియోజకవర్గాన్ని గర్వించేలా అభివృద్ధి చేశాను. చేసిన పనులను చూసి ఆశీర్వదించండి. అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. నియోజకవర్గానికి భవిష్యత్‌తో సాగు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా తలపై నిండుకుండలా పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఏదుల వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్నామన్నారు.
వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా బాసిల్లనున్న వనపర్తి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ఇప్పటికే 400 ఎకరాల భూమిని కేటాయించామని, పంటల సాగుకు అనుకూలంగా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. సాగునీటి విషయంలో సాధించిన పురోగతికి సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహమే ప్రధాన కారణం అన్నారు.
అచ్చంపేట ప్రజలే నన్ను కాపాడాలి: గువ్వల
‘నాపై ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. .అచ్చంపేట ప్రజలే నాకు సర్వస్వం.. మీరే ఊపిరి, శ్వాసగా బతుకుతా.. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ మధ్యనే ఉండి అచ్చంపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా.. మీరే నన్ను కాపాడాలి’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భావోద్వేగంతో మాట్లాడారు.
నా రాజకీయ భవిష్యత్ సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉందని, తాను అడిగే హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. అచ్చంపేట అన్ని రంగాల్లో వెనకబడిందని, సీఎం కేసీఆర్ దీవెనలతో అభివృద్ధి పథంలో నడిపించానన్నారు. పాలిటెక్నిక్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాలను మంజూరు చేయాలని కోరారు. నక్కలగండి ప్రాజెక్టు, మన్నెవారిపల్లి రైతులను ఆదుకోవాలని, నియోజకవర్గం మొత్తం దళితబంధు ప్రకటించాలని, మద్దిమడుగు సమీపంలో కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు.
3 రిజర్వాయర్లు.. 2 లక్షల ఎకరాలకు సాగునీరు
తెలంగాణ ప్రజలకు అచ్చంపేట సభ నుంచి మనవి చేస్తున్నా.. మంచి సమాజం నిర్మాణం జరగాలి.. సాగునీటి వనరులు పెరగాలి. గువ్వల బాలరాజు నా దగ్గరకు వచ్చి అందరికీ పాలమూరు ప్రాజెక్టు వస్తోంది. నాకు అప్పర్ ప్లాట్ ఉందని, 60 వేల ఎకరాలకే సాగునీరు వస్తుందని చెబితే... ఆలోచించి ఉమామహేశ్వర లిఫ్టు మంజూరు చేసుకున్నాం.. మూడు రిజర్వాయర్ల నిర్మించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ అన్నారు.
కేసీఆర్‌కు భగీరథుడు అన్న పేరు ఉందని, అప్పర్ ప్లాట్‌కు కూడా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాదే అన్నారు. పాలమూరు– రంగారెడ్డి పథకం ద్వారా నల్లగొండ జిల్లాకు సైతం నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. వెనకబడిన అచ్చంపేటలో నర్సింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నికల్ కళాశాలు కావాలని గువ్వల బాలరాజు కోరారని, న్యాయమైన వాటిని తీరుస్తామని, ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లో జీఓలు ఇచ్చి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు వర్తింపజేశామని, గిరిజనులపై ఉన్న ఎత్తివేశామని, మిగిలిన వారికి సైతం త్వరలోనే పోడు పట్టాలు ఇస్తామన్నారు. ఎన్నికల తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలోని ఉమామహేశ్వరం, సలేశ్వరం ప్రాంతాలకు ఇంకో టూరిజం వచ్చే అవకాశం ఉందని, ఒకరోజు రాష్ట్రస్థాయి అధికారులను తీసుకుని నేను ఇక్కడే ఉండి ఆ పనులు పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment