‘ది రన్నర్‌’ రివ్యూ: కొడుకు కోసం అమ్మ పరుగు..క్షణం క్షణం ఉత్కంఠ | The Runner OTT Review In Telugu, A Gripping British Action Thriller On Amazon Prime Video That Keeps You On The Edge Of Your Seat | Sakshi
Sakshi News home page

‘ది రన్నర్‌’ రివ్యూ: కొడుకు కోసం అమ్మ పరుగు..క్షణం క్షణం ఉత్కంఠ

Nov 21 2026 11:38 AM | Updated on Nov 21 2026 12:40 PM

Hollywood Film The Runner Review In Telugu

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో ‘ది రన్నర్‌’ ఒకటి.  ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

పరుగు.. పరుగు.. రోజంతా పరుగు అయినా రాజీ పడని బతుకు.... ఇలా ఎవరో కవి అన్నట్టు కాలంతో పోటీ పడుతూ బతుకు పోరాటం కోసం అనునిత్యం అలుపెరుగని పరుగు పరిగెడుతూనే ఉంటాం. కానీ అదే పరుగు ఓ ప్రాణం కోసం అయితే ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో వచ్చిన సినిమా ‘ది రన్నర్‌’.  కెవిన్‌ దర్శకత్వంలో రూపొందిన బ్రిటిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. సినిమా వేగంతో కదులుతున్నా ప్రేక్షకుణ్ణి మాత్రం కదలనీయదు, కన్నార్పనీయదు. అంతలా ఈ కథలో ఏముందో ఓసారి చూద్దాం. 

(ఇదీ చదవండి: 'ఆకాశంలో ఒక తార' మూవీ రివ్యూ)

మాయా మార్టిన్‌ లండన్‌లో ఓ విచారణాధికారిగా పని చేస్తుంటుంది. మాయాకు నోవా ఒక్కగానొక్క కొడుకు. నోవా డయాబెటిక్‌. ప్రతి గంటకోసారి ఇన్సులిన్‌ ఇవ్వకపోతే ప్రమాదం. అందుకే కొడుకు స్కూల్‌ బాగులో ఇన్సులిన్‌ పెట్టడంతోపాటు దానికి సంబంధించి రిమైండర్‌ కూడా తన ఫోన్‌లో ఉంచుకుంటుంది మాయ. ఓ రోజు ఓ కేసు విషయంలో టామి అనే సాక్షిని విచారించడానికి ప్లాన్‌ చేసుకుంటుంది మాయ. అదే రోజు నోవాను స్కూల్‌ దగ్గర దింపి, తాను రన్నింగ్‌కు వెళుతుంది. ఓ పార్క్‌ దగ్గరకు చేరుకున్న మాయకు తన కొడుకు నోవా నుండి ఫోన్‌ వస్తుంది. 

(ఇదీ చదవండి: ఓటీటీకి దృశ్యం-3.. అఫీషియల్ ప్రకటన)

మాయ ఫోనెత్తగా అవతల నుండి ఓ అపరిచిత వ్యక్తి తాను నోవాని కిడ్నాప్‌ చేశానని అంటాడు. అంతేకాదు... కొడుకుని దక్కించుకోవాలంటే సాక్షి టామిని స్వయంగా మాయనే ఒక్క గంటలో చంపేయాలని బెదిరిస్తాడు. అలాగే ఎక్కడా ఆగకుండా తన రన్నింగ్‌తో విచారణ కార్యాలయం వరకూ వెళ్లాలని, దారి మొత్తం బ్లూటూత్‌లో తన ఫోన్‌లో టచ్‌లోనే ఉండాలని సూచిస్తాడు. కొడుకు విషయం తెలిసి కంగారు పడ్డ మాయ క్షణం కూడా ఆగకుండా తన పరుగు మొదలు పెడుతుంది. మరి ఇంత రన్నింగ్‌లో తన సాక్షినే చంపి, కొడుకుని మాయ కాపాడుకోగలదా? లేదా అన్నది మాత్రం ‘ది రన్నర్‌’నే చూడాలి. 

సినిమా మొత్తం రన్నింగ్‌లో ఉన్నా స్క్రీన్‌ప్లేని మాత్రం చాలా కూల్‌గా తీసుకువెళతాడు దర్శకుడు. ఓ రకంగా చెప్పాలంటే మాయతో పాటు ప్రేక్షకుడు కూడా మానసికంగా పరుగెడుతూనే ఉంటాడు. థ్రిల్లింగ్‌ జోనర్‌ ఇష్టపడే వాళ్లకి ఈ సినిమా ఓ కన్నులపండుగే అని చెప్పాలి. సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్ట్‌ ప్రేక్షకుల మతి పోగొడుతుంది. ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. సో... గ్రాబ్‌ యువర్‌ రిమోట్‌ ఫర్‌ ‘ది రన్నర్‌’. 
– హరికృష్ణ ఇంటూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement