సాక్షి, న్యూఢిల్లీ: బాజా భజంత్రీలు, బంధుమిత్రులు, అతిథులు, పసందైన డీజేతో పెళ్లి మండపం సందడిగా ఉంది. అందంగా ముస్తాబైన వధువు పెళ్లి పీటలపై వేచి ఉంది. వరుడు రాక కోసం అంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో నచ్చిన కారు ఇవ్వలేదంటూ అలిగిన పెళ్లి కొడుకు అసలు రంగు బయటపెట్టాడు. సుమారు ఆరు నెలల క్రితమే ఖాయమైన వివాహాన్ని ఒక్క క్షణంలో రద్దు చేసుకున్నాడు. ఆ తరువాత ఏమైంది?
ఏం జరిగిందంటే?
వధువు తండ్రి సుభాష్ కుమార్ సోనిపట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న మామ్‌చంద్ వాటికలో వీరి వివాహం నవంబర్ 20న జరగాల్సి ఉంది. వరుడి కోసం ఆయన రూ. 9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేశారు. అయితే, ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వరుడు కుల్దీప్, తనకు ఆ కారు నచ్చలేదని, రూ. 13 లక్షల విలువైన మారుతి బ్రెజా కారు మాత్రమే కావాలని పట్టుబట్టాడు. దీంతో సుభాష్ కుమార్ ఆరా కారు బుకింగ్‌ను రద్దు చేసి, బ్రెజా కారు కోసం షోరూమ్‌లలో ప్రయత్నించారు. కానీ, కొన్ని షోరూమ్‌లలో కారు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఏర్పాటు చేయలేకపోయారు. తాను డిమాండ్ చేసిన 'మారుతి బ్రెజా' (Maruti Brezza) కారుకు బదులుగా 'హ్యుందాయ్ ఆరా' (Hyundai Aura) కారును బుక్ చేశారనే కారణంతో ఆ వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.
పెళ్లి రోజున రచ్చ
నవంబర్ 20న రాత్రి 7:15 గంటల ప్రాంతంలో వరుడు కుల్దీప్, అతని తల్లి పెళ్లి దుస్తుల్లో కాకుండా సాధారణ దుస్తుల్లో వేదిక వద్దకు రావడంతో వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది. అక్కడ బ్రెజా కారులేదని, వరుడు తనను, తమ కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించాడని వధువు తండ్రి సుభాష్ కుమార్ ఆరోపించారు. ఎంతగా బతిమాలినా, సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వినకుండా వరుడు, అతని తల్లి పెళ్లి మండపం నుండి వెళ్లిపోయారని వాపోయారు.
భారీ కట్నకానుకల డిమాండ్
నిజానికి తమ బిడ్డ వివాహం సందర్భంగా వరుడు, అతని కుటుంబం కోసం ఖరీదైన గిఫ్ట్‌లే ఇచ్చారు. ఇంటికోసం సోఫాలు, అల్మారా వంటి ఫర్నిచర్ కొనుగోలు చేశారు. వరుడికి రెండు తులాల బంగారు గొలుసు, తల్లికి నాలుగు తులాల బంగారు చెవి దిద్దులు, వెండి పట్టీలు సిద్ధం చేశారు. వరుడి సోదరుడు, వదినకు కూడా నగలు కావాలని డిమాండ్ చేయడంతో బంగారు వ్యాపారికి ఆర్డర్ ఇచ్చారు. అంతేకాకుండా, సాధారణంగా వరుడి తరపు వారు భరించాల్సిన రూ. 11,000 విలువైన అలంకరించిన గుర్రం, రూ. 13,500 డీజే ఖర్చులను కూడా వరుడి కుటుంబం ఒత్తిడి మేరకు తామే భరించామని వధువు తండ్రి తెలిపారు. అయినా కూడా వరుడి కుటుంబం ఇంకా కోరికలు కోరారంటూ వధువు తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సస్పెన్షన్ వేటు
వరకట్న వేధింపులు, నచ్చిన కారు ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీ పోలీసు శాఖ సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది. ఢిల్లీ పోలీస్ అవుటర్ నార్త్ జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ కుల్దీప్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతని ప్రవర్తనను అత్యంత తీవ్రంగా పరిగణించామని, నిబంధనల ప్రకారం శాఖాపరమైన విచారణకు ఆదేశించామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి : 24 ఏళ్ల సర్వీసు, ఒక్క ఈమెయిల్‌తో..ఉద్యోగినికి ఊహించని షాక్
మరోవైపు, ఈ విషయాన్ని కుల పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవడానికి ఒక రోజు సమయం కావాలని వధువు కుటుంబం కోరినట్లు సోనిపట్ డీసీపీ జితేందర్ గహ్లావత్ తెలిపారు. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను అభ్యర్థించారు.


