సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత మూడు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో 5,676 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ లో ముగ్గురు చొప్పున, కేరళలో ఇద్దరు, గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,000కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 37,093 యాక్టివ్ కేసులు ఉండగా, కేరళలో 13,745, మహారాష్ట్రలో 4,667, ఢిల్లీ- 2,338, తమిళనాడు- 2,099, గుజరాత్- 1,932, హరియాణా – 1,928, కర్ణాటక – 1,673, ఉత్తర్ ప్రదేశ్‌లో 1,282 కేసులు ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర రాష్ట్రాల్లో వెయ్యికి లోపే కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్త కోవిడ్ మాక్‌డ్రిల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో సోమవారం కోవిడ్ మాక్‌డ్రిల్ జరిగింది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ సన్నద్ధతను పరిశీలించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సందర్శించారు. వివిధ విభాగాధిపతులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ‘రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాక్‌డ్రిల్‌కు భారీ స్పందన లభించింది. ఆరోగ్య శాఖల మంత్రులు ఆస్పత్రుల్లో సన్నద్ధత, సౌకర్యాలపై సమీక్షలు జరిపారు’అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వివరించింది.
చదవండి: రెండో గండం దాటేస్తారా!? 38 ఏళ్ల సంప్రదాయం.. బీజేపీ ఏం చేస్తుందో?
త్వరలో అందుబాటులోకి కోవోవ్యాక్స్
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారీ కోవిడ్ టీకా కోవోవ్యాక్స్‌ను కోవిన్ పోర్టల్‌లో చేర్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆమోదం తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవోవ్యాక్స్ ధర రూ. 225గా ఉంటుందని పేర్కొన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వేయించుకున్న పెద్దలు కోవోవ్యాక్స్‌ను బూస్టర్ డోస్‌గా తీసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవోవ్యాక్స్‌ను ఇప్పటికే డీసీజీఐ, డబ్ల్యూహెచ్‌వో, యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభించిందని గుర్తు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment