ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐదు రోజుల ముందు ముంబై మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్ల నిర్వహణ బాధ్యతను మొత్తం మహిళా సిబ్బందికే అప్పగించింది. మహిళా సాధికారతను చాటిచెప్పెందుకు ఇలా చేసింది.
దీంతో ఈ రెండు మెట్రో స్టేషన్లలో పూర్తిగా మహిళా సిబ్బందే కన్పించనున్నారు. స్టేషన్ మేనేజర్ స్థాయి నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు మొత్తం 76 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించున్నారు. వీరికి మూడు షిఫ్టుల్లో డ్యూటీ ఉంటుంది. రవాణా రంగంలోలో మహిళల భాగస్వామ్యాన్ని గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మెట్రో అధికారులు పేర్కొన్నారు.
అంతేకాదు మహిళా దినోత్సవం సందర్భంగా తాత్కాలికంగా ఈ రెండు స్టేషన్లను మహిళా సిబ్బందికి అప్పగించలేదని, ఇకపై ఈ స్టేషన్ల బాధ్యత శాశ్వతంగా మహిళా ఉద్యోగులే చూసుకుంటారని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ మహిళా అనుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
కాగా.. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్లు ఈ ఏడాది జనవరిలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం గమనార్హం.నెల రోజుల్లోనే వీటి బాధ్యతలను పూర్తిగా మహిళలకు అప్పగించారు.
చదవండి: మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ..
Comments
Please login to add a commentAdd a comment