అరచేతిపై సూసైడ్‌ నోట్‌ రాసి... వైద్యురాలు బలవన్మరణం  | Maharashtra Woman Doctor Note On Hand triggered a political row | Sakshi
Sakshi News home page

అరచేతిపై సూసైడ్‌ నోట్‌ రాసి... వైద్యురాలు బలవన్మరణం 

Oct 24 2025 3:27 PM | Updated on Oct 25 2025 12:11 PM

Maharashtra Woman Doctor Note On Hand triggered a political row

ఎస్‌ఐ తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణ

మహారాష్ట్రలోని సతారాలో ఘటన 

సీరియస్‌గా స్పందించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ 

ఎస్‌ఐ సస్పెన్షన్‌.. ఘటనపై రాజకీయ దుమారం 

సతారా: మహారాష్ట్రలో ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్తన్‌ తహసీల్‌లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. 

సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గోపాల్‌ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. తాను నివాసం ఉంటున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్‌ బంకర్‌ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్‌ నోట్‌లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

రాజకీయ దుమారం 
డాక్టర్‌ ఆత్మహత్య ఘటన మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపుతోంది. హోంశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. సతారా ఎస్పీ తుషార్‌ దోషీకి ఫోన్‌చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్‌ఐని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉండటంతో వారికోసం గాలిస్తున్నట్లు తుషార్‌ దోషీ తెలిపారు. డాక్టర్‌ ఆత్మహత్య ఘటన చాలా తీవ్రమైన అంశమని మహారాష్ట్ర శాసనమండలిలో డిప్యూటీ చైర్‌పర్సన్‌ నీలమ్‌గోర్హే అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఫడ్నవీస్‌ను కోరినట్లు తెలిపారు. 

సతారా సివిల్‌ సర్జన్‌తో తాను మాట్లాడానని, వేధింపుల గురించి మృతురాలు తమకేమీ ఫిర్యాదు చేయలేదని సర్జన్‌ చెప్పినట్లు రాష్ట ఆరోగ్యశాఖ సహాయమంత్రి మేఘన బోర్డికర్‌ చెప్పారు. సతారా ఘటనపై సతారా పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రూపాలీ చకంకర్‌ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై మీడియా న్యాయ విచారణ జరపటం మానుకోవాలని మరో మంత్రి పంకజ ముండే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై ప్రతిపక్ష పార్టీలు ఫడ్నవీస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఫడ్నవీస్‌ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్‌ నేత సచిన్‌ సావంత్‌ ఆరోపించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు సిట్‌ను ఏర్పాటుచేయాలని శివసేన యూబీటీ నేత సుష్మఅంధరే డిమాండ్‌ చేశారు.  
 


తీవ్రంగా వేధించారు 
మృతురాలిని ఆమె ఉన్నతాధికారులతోపాటు నిందితులు తీవ్ర వేధింపులకు గురిచేశారని డాక్టర్‌ బంధువు ప్రయాగ ముండే ఆరోపించారు. ‘ఆమె ఎంతో తెలివైంది. గొప్ప ఆశయాలు కలిగిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆమెను మేమే పెంచి, చదివించాం. విధి నిర్వహణలో ఆమె తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంది. తప్పుడు పోస్ట్‌మార్టం నివేదికలు ఇవ్వాలని ఆమెపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. నిందితులు కఠినంగా శిక్షించాలి’అని డిమాండ్‌ చేశారు. పనిచేసే చోట సీనియర్లు వేధిస్తున్నారని రెండురోజుల క్రితమే మృతురాలు తమకు తెలిపిందని మరో బంధువు వెల్లడించారు.  

నిందితుడికి చివరి ఫోన్‌కాల్‌ 
ఆత్మహత్య చేసుకోవటానికి ముందు వైద్యురాలి నిందితుల్లో ఒకడైన ప్రశాంత్‌ బంకర్‌కు ఫోన్‌చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ ఫోన్‌లో చాటింగ్‌ చేశారని వెల్లడించారు. అయితే, ఆ సందేశాల్లో ఏముంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement