ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్: అనురాగ్ ఠాకూర్‌

Anurag Thakur Questions Priyanka Gandhi Over FATF Painting Row - Sakshi

న్యూఢిల్లీ: రూ.2కోట్ల పెయింటింగ్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ప్రియాంక గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.  యస్ బ్యాంక్ కో-ఫౌండర్ రాణా కపూర్‌ను ప్రియాంక వద్ద ఉన్న పెయింటింగ్‌ను రూ.2 కోట్లు పెట్టి కొనాలని ఎవరు బలవంతం చేశారని నిలదీశారు. ఇలా ఎన్ని పెయింటింగ్‌లను అమ్మారు? ఈ డబ్బు తీసుకుని ప్రతిఫలంగా పద్మభూషణ్ అవార్డులు ఇచ్చారా? ఇలా ఎంత డబ్బు సేకరించారు, ఎన్ని అవార్డులు ఇచ్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రపంచవ్యాప్తంగా జరిగే మనీలాండరింగ్, ఉగ్ర నిధులపై నిఘా వహించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్‌లో ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి పెయింటింగ్‌ను రూ.2కోట్లు పెట్టి ఓ బ్యాంక్ సీఈఓ కొనుగోలు చేశారని, మనీ లాండరింగ్ ద్వారా ఈ లావాదేవీ జరిగిందని నివేదిక చెప్పింది. ఈ సమయంలో కేంద్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంది.

అయితే పార్టీ పేరును గానీ, పెయింటింగ్ కొనుగోలు చేసిన వ్యక్తి పేరును గానీ నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు. అతని పేరు 'మిస్టర్ ఏ' అని మాత్రమే పేర్కొంది. అతను బ్యాంక్ సీఈఓగా ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీలకు కూడా రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చాడని తెలిపింది.

అయితే ఎస్‌ బ్యాంకు మాజీ సీఈఓ రానా కపూర్ రూ.2 కోట్లు పెట్టి ఎంఎఫ్‌ హుస్సేన్‌ పెయింటింగ్‌ను ప్రియాంక గాంధీ నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ డబ్బును గాంధీ కుటుంబం సోనియా గాంధీకి న్యూయార్క్‌లో చికిత్స కోసం ఉపయోగించిందని ఆయన చెప్పినట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ఎఫ్‌ఏటీఎఫ్‌ నివేదిక అనంతరం అనురాగ్ ఠాగూర్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కుటుంబం అవినీతిలో రోజుకో కొత్త మోడల్ బయటపడుతోందని, ఇది సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్, వాద్రా ల్యాండ్ స్కామ్, ఇప్పుడు పెయింటింగ్ వ్యవహారం బయటపడిందని విమర్శించారు. గాంధీ కుటుంబం అవినీతి కథను ఓ కేస్ స్టడీగా ప్రపంచానికి తెలియజేశారని ఎద్దేవా చేశారు.

చదవండి: భారత ప్రజాస్వామ్యం గురించి లండన్‌లో ప్రశ్నలా? రాహుల్‌కు మోదీ చురకలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top