Tamil Nadu: పెత్తనం.. పళనిదే! | Palaniswami Elected As AIADMK Legislature Party leader In Tamil nadu | Sakshi
Sakshi News home page

Tamil Nadu: పెత్తనం.. పళనిదే!

Published Tue, May 11 2021 6:54 AM | Last Updated on Tue, May 11 2021 2:09 PM

Palaniswami Elected As AIADMK Legislature Party leader In Tamil nadu - Sakshi

అడ్డొచ్చిన పన్నీరుకు కన్నీరు తెప్పిస్తూ పార్టీపై పట్టు నిలుపుకుంటూ.. అన్నాడీఎంకేలో తొలి స్థానం తనదేనని.. మాజీ సీఎం పళనిస్వామి నిరూపించారు. పన్నీర్‌ వద్దు.. పళనే ముద్దు అంటూ ఎమ్మెల్యేల ఆమోదం పొంది.. ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు. ఫలితంగా అన్నా ద్రవిడ మున్నే ట్ర కలగంలో నాయకత్వ స్థానంపై ఇన్నాళ్లూ నెలకొన్న ఊగిసలాటకి తెరపడినట్లయ్యింది. 

సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం హోరాహోరీగా నడిచిన రాజకీయ పోరులో చివరికి ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించారు. అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వల్ల తలెత్తిన అడ్డంకిని ఆయన విజయవంతంగా అధిగమించారు.  

తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించి అధికారంలోకి రాగా, అన్నాడీఎంకే 65 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే శాసనసభపక్ష నేత (ప్రధాన ప్రతిపక్ష నేత)ను ఎన్నుకునే నిమిత్తం ఈనెల 7న  ఎమ్మెల్యేలు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమయంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మధ్య వివాదం నెలకొంది. అగ్రనేతల అనుచరులు సైతం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో వాగ్యుద్దానికి దిగారు.

పన్నీర్‌సెల్వం మద్దతుదారులు కనీసం ఎడపాడి కారును కూడా పార్టీ కార్యాలయంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో కొందరు సీనియర్‌ నేతలు కలుగజేసుకుని ఇద్దరి కార్లను ఒకవైపు పెట్టించారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష హోదా తనకంటే తనకని.. పోటీపడి వాగ్వాదానికి దిగడంతో సమావేశం 10వ తేదీకి వాయిదాపడింది. అయితే 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ సమావేశాలు మినహా మరేమీ జరుపుకునేందుకు వీలులేదు.

అయితే షెడ్యూలు ప్రకారం  సమావేశం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరుతూ పార్టీ మాజీ ఎంపీ, జిల్లా కార్యదర్శి ఎన్‌. బాలగంగ డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. కరోనా ఆంక్షలు అను సరించి కార్యకర్తలకు ప్రవేశం లేకుండా కేవలం ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించుకునేందుకు  అనుమతి కోరినట్లు బాలగంగ మీడియాకు తెలిపా రు. పోలీస్‌శాఖ సైతం అనుమతివ్వడంతోపాటూ పార్టీ కార్యాలయం వద్ద 50 మందితో బందోబస్తు కల్పించింది. వీరుగాక సాధారణ పోలీసులు లాఠీలతో పహారాకాశారు.

దీంతో పార్టీ కార్యాలయ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి.  సోమవారం ఉదయం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యా లయం ఎడపాడి, పన్నీర్‌సెల్వంలతోపాటూ వారి ద్దరి మద్దతుదారులు, ఎమ్మెల్యేలు చేరుకోగా 9.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. మొత్తం 65 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది ఎడపాడికి మద్దతు పలికారు. కొంగుమండలం, మధ్యమండలం, దక్షిణ జిల్లాల ఎమ్మెల్యేలతోపాటూ ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ఎడపాడినే సమర్థించారు. అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపుకోసం అన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన ఏకైక వ్యక్తి ఎడపాడి అని.. ప్రధాన  ప్రతిపక్ష నేత పదవికి ఆయనే అర్హుడని సీనియర్‌ నేతలు పేర్కొన్నారు.

అయితే బీజేపీ అధిష్టానం మద్దతుతోపాటూ పార్టీ సమన్వయకర్తగా ఉన్న పన్నీర్‌సెల్వమే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండటం సమంజసమని ఆయన మద్దతుదారులు వాదనకు దిగారు. 61 మంది ఎమ్మెల్యేలు ఎడపాడిని కోరుకున్నందున ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయనకేనని మరో వర్గం వాదించింది. పార్టీని సమర్థంగా నడిపించే బాధ్యతలను కొనసాగించాలని ఎడపాడి మద్దతుదారులు చేసిన సూచనకు పన్నీర్‌సెల్వం సమ్మతించినట్లు సమాచారం.

అనేక తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ వెంటనే ఎడపాడి మద్దతుదారు లు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అసంతృప్తికి లోనైన పన్నీర్‌సెల్వం సమావేశం నుంచి అందరికంటే ముందుగా  బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎడపాడి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పన్నీ ర్, ఎడపాడి సంతకాలతో కూడిన ప్రకటనను  పార్టీ కార్యాలయం విడుదల చేసింది. బీజేపీ శానసభా పక్షనేతగా నైనార్‌ నాగేంద్రన్‌ ఎంపికయ్యారు. 

పుదుచ్చేరి ప్రధాన ప్రతిపక్ష నేతగా శివ.. 
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలో డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే శివ ఎంపికయ్యారు. ఆయనే ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌–బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి 16 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది.

డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి 6 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉండిన కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో గెలవడంతో ఆపార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా అందుకోలేక పోయింది.
చదవండి: కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement