ఉరేసుకొని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
పహాడీషరీఫ్: చెట్టుకు ఉరేసుకొని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుజూసింది. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ నుంచి కొత్తపేటకు వెళ్లే రూట్‌లోని పొల్లాల్లో ఓ చెట్టుకు వ్యక్తి ఉరేసుకొని ఉన్న విషయమై గురువారం సాయంత్రం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తి తాడుతో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు హిందువు అని, వయసు 50–55 నడుమ ఉంటుందని, మృతదేహాన్ని బట్టి ఉరేసుకొని రెండు మూడు రోజులు అయి ఉంటుందని పోలీసులు తెలిపారు. గ్రీన్ కలర్ లుంగీ, తెలుపు రంగు చొక్కా ధరించాడని, మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు నిర్ధారించారు. ఇతని సంబంధీకులెవరైనా ఉంటే బాలాపూర్ పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బైక్ అదుపు తప్పి ఇద్దరు విద్యార్థుల మృతి
మణికొండ: ఒకే కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు బైక్‌పై వెలుతుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు.ఈ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. హిమాయత్‌నగర్‌లో శ్రీ చైతన్య డీమ్డ్ కళాశాలలో బీసీఏ మూడవ సంవత్సరం చదువుతున్న రామంతాపూర్‌కు చెందిన కావ్య, వికారాబాద్ జిల్లా మల్కాపూర్‌కు చెందిన టి. కౌశిక్‌రెడ్డిలు స్నేహితులు. బుధవారం బైక్‌పై కౌశిక్‌రెడ్డి నివాసానికి బయలుదేరారు. పోలీస్ అకాడమీ దాటిన తరువాత తన బైక్‌ను వేగంగా నడపటంతో అది అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న డీసీఎంను ఢీ కొట్టాడు. దాంతో తీవ్ర గాయాలై కావ్య అక్కడికక్కడే మృతి చెందింది. కౌశిక్‌రెడ్డికి సైతం తీవ్ర గాయాలు కావటంతో లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించాడు. మృతురాలి అన్న సాయి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి పోలీసులు తెలిపారు.
‘ఈ మార్కులు అప్పట్లో చాలా కష్టం’
డీజీపీ శివధర్‌రెడ్డి, కొత్వాల్ సజ్జనర్
సాక్షి, సిటీబ్యూరో: ‘మా రోజుల్లో నూటికి 40, 50 శాతం రావడమే గగనమయ్యేది. ఆ స్థాయిలో మార్కులు వస్తే చాలని పరితపించే వాళ్లం. అయితే నేటి తరం విద్యనభ్యసించడంలో పోటీ పడుతోంది. అందుకే 90 నుంచి 95 శాతం మార్కులు సాధించగలుగుతోంది’ అని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టుల పిల్లలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం స్కాలర్ షిప్స్, ప్రశంసా పత్రాలు అందిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జలవిహార్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ‘కష్టపడి ప్రతిభను చాటిన వారికి ఇచ్చే ఇలాంటి గౌరవం వారికి మరింత ప్రోత్సాహంగా నిలుస్తుందన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులోనూ ఉన్నత విజయాలు సాధించాలని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్ చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడెమీ నిర్వాహకురాలు బాల లత, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్, కోశాధికారి రమేష్ వైట్లలతో పాటు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.


