కూల్చివేతల వెనక మాఫియా
● సమగ్ర విచారణ జరిపి,
బాధితులకు న్యాయం చేయాలి
● మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం డిమాండ్
మొయినాబాద్: పైసా పైసా కూడబెట్టి గిరిజనులు కట్టుకున్న కలల ఇళ్లను, వారి కళ్ల ముందే కూల్చివేయడం వెనక రాజకీయ, రియల్ ఎస్టేట్ మాఫియాలు ఉన్నాయని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలో గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై శనివారం హిమాయత్‌నగర్ చౌరస్తాలోని కంజర్ల మాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. గిరిజనుల ఇళ్లను కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. గిరిజనుల ప్లాట్లపై పొలిటికల్, రియల్ మాఫియా కన్ను పడిందని మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెబుతున్న అధికారులు, కూల్చివేతల వద్ద బౌన్సర్లు ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బౌన్సర్లు వచ్చి.. గిరిజనులను ఇళ్లలోనుంచి బయటకు లాగేసి భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. మున్సిపల్ అధికారులు ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, బాకారం సర్పంచ్ వెంకటేశ్, నాయకులు శ్రీనివాస్, సుధీంద్ర ఉన్నారు.
పేదలపైనే ప్రతాపమా..
గిరిజనులు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసిన మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వే నంబర్ 210, 211, 212లో మున్సిపల్ అధికారులు కూల్చివేసిన గిరిజనుల ఇళ్లను శనివారం పలువురు సీపీఎం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 111 జీవో సాకుతో మున్సిపల్ అధికారులు పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెద్దల ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు, కమర్షియల్ బిల్డింగ్‌ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రాజుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాసరాజు, సరేష్‌రెడ్డిలకు తొత్తుగా మారారని మండిపడ్డారు. రియల్ బ్రోకర్లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని.. మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, నాయకులు మహేందర్, ప్రభుదాస్, రాజేందర్, చెన్నయ్య, నర్సింహ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కూల్చివేతల వెనక మాఫియా


