‘కోల్డ్’వార్!
● 80% కేసుల్లో దగ్గు, జలుబు లక్షణాలు
● వాతావరణ ప్రభావంతో ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు
● ఫ్లూ, ఆర్‌ఎస్‌వీ, అడినో వైరస్ ప్రభావం
● యాంటీబయాటిక్ సిరప్‌లు వాడొద్దంటున్న వైద్యులు
సాక్షి, సిటీబ్యూరో: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిలోనూ ఒకే రకమైన సమస్య. దగ్గు, జలుబు, గొంతు, ఒళ్లునొప్పులు, జ్వరం లక్షణాలతో ఆస్పత్రుల దారి పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దగ్గుకు ప్రధానంగా ఇన్ఫెక్షన్, ఎలర్జీ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, గాలి కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పరిసరాల అపరిశుభ్రత వంటి అంశాలు అనారోగ్య సమస్యలకు కారణాలుగా కనిపిస్తున్నాయంటున్నారు. గత 20 రోజుల్లో వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు ప్రధానంగా ఫ్లూ, ఆర్‌ఎస్‌వీ, అడినో వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఆస్పత్రుల ఓపీలో సుమారు 80 శాతం మందికిపైగా పిల్లలు దగ్గు, జ్వరం, జలుబు బాధితులే ఉంటున్నారంటున్నారు. నెల రోజులుగా జలుబు, దగ్గు ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
తీవ్ర ఇబ్బందుల్లో పిల్లలు, వృద్ధులు..
నవంబర్, డిసెంబర్‌లలో వణికించిన న్యుమోనియా వ్యాప్తి అదుపులోకి వచ్చిందనుకుంటుండగా.. తాజాగా పిల్లలు, వృద్ధులను దగ్గు, గొంతునొప్పి, జలుబు, జ్వరం, తలనొప్పి వంటివి వేధిస్తున్నాయి. పిల్లల ఆసుపత్రుల్లో అత్యధిక శాతం మంది ఇన్ఫెక్షన్, అలర్జీలతో వచ్చే రుగ్మతలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులంటున్నారు. ఫ్లూతో వచ్చే వ్యాధులకు యాంటీబయాటిక్స్ వినియోగించవద్దని, దీని వల్ల రోగం తగ్గదని చెబుతున్నారు. ఆక్సిజన్‌తో కూడిన నెబ్యులైజర్, జ్వరం సిరప్ వంటివి వైద్యుల సూచనల మేరకు వినియోగించాలని, కేవలం బ్యాక్టీరియాతో వచ్చిన ఇన్ఫెక్షన్లకు మాత్రమే యాంటీబయాటిక్స్ పని చేస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పెర్ఫ్యూమ్, స్మోకింగ్, ఫేస్ పౌడర్‌తో..
ఎక్కువగా డస్ట్, పెర్ఫ్యూమ్, ముఖానికి రాసుకునే పౌడర్, దోమల నివారణకు వినియోగించే వివిధ రకాల లిక్విడ్లు, రూం స్ప్రే, స్మోకింగ్ వంటివి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఇంట్లో ఫ్యాన్, కూర్చునే ఫర్నిచర్, తిరిగే గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గదిలో తేమ వాతావరణం లేకుండా వెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి. రహదారి పక్కగా ఉన్న ఇళ్లలో వాయు కాలుష్యం ప్రభావం చూపిస్తుంది. ఐస్‌క్రీం, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వేడి ఆహారం, మరిగించిన నీరు తీసుకోవడం ఉత్తమం.


