ఐక్యంగా రాజ్యాధికారం సాధించాలి
ఆమనగల్లు: బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం దిశగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కడ్తాల్‌లో ఆదివారం తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక, వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు సభ్యులు ఆత్మీయ సత్కారం కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ అట్రాసిటీయాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీలకు దక్కాల్సిన హక్కులు, వాటాల కోసం బీసీ సంక్షేమ సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ప్రభుత్వం రిజర్వేషన్ల పేరిట బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఐకమత్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలుగుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
బీసీలను మోసం చేస్తే ఊరుకోం
యాచారం: రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను మోసం చేస్తే ఊరుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మండల పరిధిలోని నానక్‌నగర్‌లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం క్రికెట్, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం బీసీ సంఘం నేతలతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసిందన్నారు. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షుడు సంగెం రాజు, నానక్‌నగర్ సర్పంచ్ సంగెం చైతన్య పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య


