‘పుర’ పోరుకు సన్నద్ధం
మొయినాబాద్: పల్లెపోరు ముగియడంతో రాజకీయ పార్టీలు పట్టణ పోరుకు సమాయత్తమవుతున్నాయి. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులంతా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై పార్టీల నాయకులు, ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాయి. మరోవైపు రిజర్వేషన్లపై స్థానికంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. గత ఏడాది 28న మొయినాబాద్ మండలంలోని 9 పంచాయతీల విలీనంతో మొయినాబాద్ మున్సిపాలిటీ ఏర్పడింది. ఇందులో మొయినాబాద్, సురంగల్, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ గ్రామాలను విలీనం చేశారు. అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల్లో ఉన్న హేమాహేమీ నాయకులంతా మున్సిపాలిటీ పరిధిలోనే ఉండటంతో వారంతా ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వార్డుల విభజన జరగడంతో రిజర్వేషన్లకోసం ఎదురుచూస్తున్నారు.
రాజకీయ పార్టీల సమావేశాలు
మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సమాయత్తమయ్యాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ మున్సిపల్ పరిధిలోని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల వివరాలు సేకరించాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. పార్టీలో రెండు గ్రూపులు ఉండటంతో టికెట్ల విషయంలో ఏ గ్రూపునకు ప్రాధాన్యత దక్కుతుందోననే చర్చ జరుగుతోంది.
ఎవరికివారు ఊహాగానాలు
కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఎలా ఉంటాయనేదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 26 వార్డులు ఉండగా ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఎవరికి వారు ఊహాగానాల్లో మునిగిపోయారు. పెద్దమంగళారం, చిలుకూరు, హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్ వంటి పెద్ద గ్రామాల్లో 4–6 వార్డులు ఉండటంతో రిజర్వేషన్లు తమకు కలిసి వస్తాయని ఆయా గ్రామాల నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీల నాయకులు ఏ వార్డులో రిజర్వేషన్ కలిసొస్తే ఆ వార్డులో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు నాయకులు ఇప్పటి నుంచే ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వార్డుల్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తూ వెళ్తున్నారు. రిజర్వేషన్లు ఎవరికి కలిసొస్తాయో.. ఎవరికి రిక్తహస్తం చూపుతాయో ఎన్నికల షెడ్యూల్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే.
సమాయత్తమవుతున్న రాజకీయ పార్టీలు
నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
రిజర్వేషన్లపై చర్చోపచర్చలు
ఎదురు చూస్తున్న ఆశావహులు


