పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో
సీబీఎస్‌ఈ తరహాలో ..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు 49 వేల మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు సిలబస్ పూర్తి చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనలో వేగం పెంచారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గంట పాటు అదనపు తరగతులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు పాఠ్యాంశాలను బోధిస్తూనే మరోవైపు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. సబ్జెక్టులు/పాఠ్యాంశాల వారీగా వీక్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులను రెగ్యులర్‌గా స్కూలుకు రప్పించడంతో పాటు చదువులో వెనుకబడిన వారిని గుర్తించి, అర్థం కాని అంశాలను మళ్లీ వివరించనున్నారు. సబ్జెక్టులను బట్టిపట్టించే కంటే.. వారికి అవగాహన కల్పించడంపైనే దృష్టి పెట్టనున్నారు.
మెరుగైన ఫలితాల కోసం..
గత ఏడాది జిల్లా నుంచి 51,792 మంది వార్షిక పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 121 మంది వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 3,732 మంది బాలురు, 2,552 మంది బాలికలు ఫెయిల్ అయ్యారు. మెజార్టీ విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. 2024లో సాధించిన ఉత్తీర్ణతతో (91.01శాతం) పోలిస్తే.. 2025లో (87.84 శాతం) 3.17 శాతం తగ్గింది. ఫలితంగా రాష్ట్రస్థాయిలో జిల్లా ర్యాంకు 31వ స్థానానికి దిగజారాల్సి వచ్చింది. 18 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే వందశాతం ఫలితాలు వచ్చాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో 4,950 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. హాజరు శాతాన్ని పెంచేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉపాధ్యాయుడు ఉదయం పాఠశాలలో అడుగు పెట్టింది మొదలు సాయంత్రం విడిచి వెళ్లే సమయం వరకు ఆన్‌లైన్‌లో పక్కాగా రికార్డు చేస్తోంది. ఫలితంగా ఉపాధ్యాయుల హాజరుశాతం గణనీయంగా మెరుగుపడి, విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అం దేలా చూస్తోంది. తనిఖీల విషయంలో మండల విద్యాధికారుల పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది. శంకర్‌పల్లి, తలకొండపల్లి, మంచాల ఎంఈఓలు ఈ విషయంలో కొంత వెనుకబడినట్లు గుర్తించి, వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
16 నుంచి పదో తరగతి పునశ్చరణ తరగతులు
ఆ లోపే సిలబస్ పూర్తి చేసేలా కసరత్తు
సబ్జెక్టుల వారీగా వీకెండ్ పరీక్షలు
చదువులో వెనుకబడిన విద్యార్థుల గుర్తింపు
ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు
జిల్లా విద్యాశాఖ ప్రణాళికలు
గతంలో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టు పరీక్షకు మధ్య ఒక రోజు గ్యాప్ మాత్రమే ఉండేది. వెంటనే పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ఒక సబ్జెక్టులో చేసిన పొరపాట్లను మరో సబ్జెక్టులో దొర్లకుండా జాగ్రత్తపడే అవకాశం ఉండేది కాదు. ఏడాదంతా చదివిన అంశాలను ఒక్క రోజులోనే ఎలా తిరగేస్తారు? ప్లానింగ్ ప్రకారం చదువుకునే అవకాశం ఉండేది కాదు. చదివిన అంశాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. ఈ ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఎస్‌ఎస్‌ఈ బోర్డు వార్షిక పరీక్షల తేదీల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. ఒక సబ్జెక్టుకు, మరో సబ్జెక్టుకు మధ్య కనీసం నాలుగు రోజుల సమయం ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఒకసారి చదివిన అంశాలను మళ్లీ పునశ్చరణ చేసుకునేందుకు విద్యార్థులకు ఇది మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సుశీందర్‌రావు, డీఈఓ
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో


