ట్రస్టు ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం
పనులు నిలిపేయాలని కమిషనర్ ఆదేశం
ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఉన్న శాంతినగర్ కాలనీలో ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను సోమవారం బీఆర్‌ఎస్ నాయకుడు నాగిళ్ల జగన్ ప్రారంభించారు. రెండు రోజుల క్రితం బస్తీబాటలో భాగంగా కాలనీలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో రూ.10 లక్షలు సొంత నిధులతో నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, సైదులు, అహ్మద్, అప్రోజ్, శ్రీరామ్, అలీం, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అనుమతి లేకుండా సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడంతో మున్సిపల్ కమిషనర్ శంకర్ నిలిపివేయాలని ఆదేశించారు. శాంతినగర్ కాలనీలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్‌లైన్ డ్రైనేజీ పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన చెప్పారు. దీంతో పనులు ఆపివేయాలని సూచించారు. ఆపకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.


