ఒడిశా కూలీ అదృశ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: కూరగాయల మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి ఓ ఒడిశా కూలీ అదృశ్యమైన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. మమ్మరాజుగూడ సమీపంలో ఎల్‌బీ బ్రిక్స్‌లో కూలీగా పని చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన జయంతి పహారియా గత నెల 28న కూరగాయల మార్కెట్‌కు వెళ్తున్నాని చెప్పి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబీకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియచేయాలని కోరారు. 99592 26287 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు.
అనుమతి లేని వెంచర్ తొలగింపు
కొందుర్గు: అనుమతులు తీసుకోకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని డీఎల్‌పీఓ మల్లారెడ్డి హెచ్చరించారు. సోమవారం కొందుర్గు శివారులో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్‌లో నిర్మించిన ప్రహరీని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా వెంచర్ ఏర్పాటు చేస్తే విధిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రైలుకింద పడి
యువకుడి మృతి
షాద్‌నగర్‌రూరల్: రైలుకింద పడి యువకుడు మృతి చెందిన సంఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వర్ కథనం ప్రకారం.. కొందుర్గు మండలం చిన్న ఉమ్మెంత్యాల గ్రామానికి చెందిన పద్మారం నరేందర్(28) గత ఏడేళ్లక్రితం అదే గ్రామానికి చెందిన స్వప్నను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత నరేందర్ ప్లంబర్ పనిచేస్తూ మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. కొంత కాలం సాఫీగా సాగిన వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరిగేవి. దీంతో మనస్తాపం చెందిన నరేందర్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని తెలుసుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
ఒడిశా కూలీ అదృశ్యం
ఒడిశా కూలీ అదృశ్యం


