ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇవ్వాలి
తుర్కయంజాల్: ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్‌లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ డిమాండ్ చేశారు. సోమవారం రాగన్నగూడలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి, రెండేళ్లు గడుస్తున్నా నేటికి దాని ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిచడంతో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అనంతరం కార్మికులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు నర్సింహ, ఆటో ట్రాలీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ధర్మారెడ్డి, కోశాధికారి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


