ఇక మున్సిపల్ పోరు!
ఆమనగల్లు: మున్సిపల్ పోరుకు రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. పురపాలక సంఘం ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగా ఈనెల 10న మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. అలాగే 11న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు జరుగుతుండటంతో అభ్యర్థుల ఎంపిక కీలకం కానుంది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఆమనగల్లు మున్సిపాలిటీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
మున్సిపాలిటీగా ఏర్పాటు
ఆమనగల్లు మేజర్ గ్రామ పంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. దీంతో పాటు విఠాయిపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపారు. ఆమనగల్లు, జంగారెడ్డిపల్లి, విఠాయిపల్లి, ముర్తుజపల్లి, సంకటోనిపల్లి, సాకిబండతండా, నుచ్చుగుట్టతండా, చంద్రాయణపల్లి తండాలతో మున్సిపాలిటీ విస్తరించింది. 2020లో 14,785 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 16,984 మందికి పెరిగారు. గత ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది.
రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు
మున్సిపాలిటీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై నాయకుల్లో టెన్షన్ పెరిగింది. గత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా.. లేదా మారుస్తారా అనే సందిగ్ధం నెలకొంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా పోటీ చేయాలని కొంతమంది ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు అవకాశం వస్తే పోటీ చేయాలని లేదా తమ సతీమణులను రంగంలోకి దింపాలని కొందరు చూస్తున్నారు. ప్రస్తుతం పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు పావులు కదుపుతున్నారు.
పార్టీల ఎన్నికల బాట
మున్సిపల్ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. మెజార్టీ కౌన్సిలర్‌లు గెలుపొంది చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ ఎన్నికలలో ఆమనగల్లు మున్సిపాలిటీలో త్రిముఖ పోరు కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పోరులో నిలవనున్నాయి. ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించి వార్డుల వారీగా కొందరు నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. వారు ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా బీఆర్‌ఎస్ నాయకులు బస్తీబాట పేరుతో మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో తిరుగుతూ ప్రజలను కలుసుకుంటున్నారు. అయితే అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌లో మాత్రం ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. ఈ సారి ఆమనగల్లు మున్సిపాలిటీని దక్కించుకుని తీరుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చైర్మన్ పదవి కోసం పెద్ద నాయకులు పోటీ పడుతుండటంతో ఈసారి పోరు రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.
ఓటర్ల వివరాలు
ఆమనగల్లు మున్సిపాలిటీలో
పార్టీల సన్నద్ధం
పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు
క్షేత్రస్థాయిలో
పావులు కదుపుతున్న నేతలు
ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు


