ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఒక జట్టు అన్ని విభాగాల్లో బాగా రాణించిందంటే కచ్చితంగా ఆ జట్టునే విజయం వరిస్తుంది. అయితే కొన్ని ఓటములను మాత్రం సెంటిమెంట్‌తో ముడిపడుతుంటారు. తాజాగా టీమిండియా అభిమానులకు జెర్సీ భయం పట్టుకుంది. మెగా టోర్నీలకు ముందు మార్చిన జెర్సీలు టీమిండియాకు కలిసి రావడం లేదు.
2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలిచిన అనంతరం టీమిండియా మళ్లీ ఎటువంటి మేజర్ టోర్నీ గెలవలేకపోయింది. 2016లో టి20 ప్రపంచకప్‌లో ఫైనల్, 2015 ప్రపంచకప్‌లో సెమీఫైనల్, 2019 ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే వెనుదిరిగింది. ఇక 2021 టి20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణ ప్రదర్శనను కనబరుస్తూ లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఈ ఓటములన్నీ టీమిండియా జెర్సీ మార్చినందుకే అని కొందరు అభిమానులు భావిస్తున్నారు.
ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ముగిసిన తర్వాత వార్మప్ మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు.. తీరా టోర్నీ మొదలయ్యాక అసలు మ్యాచుల్లో తేలిపోయింది. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటి సారి పాక్ చేతుల్లో పరాజయాన్ని ఎదుర్కొన్న భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది... దీంతో టీమిండియా జెర్సీపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది.
ఆ తర్వాత కొన్నిరోజులకు జెర్సీని మరోసారి మార్చింది. ప్రస్తుతం భారత జట్టు సౌండ్ వేవ్స్ లేకుండా పాత డార్క్ బ్లూ కలర్ జెర్సీనే వాడుతోంది. ఆసియా కప్ 2022 టోర్నీలోనూ భారత్ ఇదే జెర్సీతో బరిలో దిగనుంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంటూ జైత్ర యాత్ర కొనసాగిస్తోంది టీమిండియా. దీంతో ఈ జెర్సీ భారత జట్టుకి కాస్త బాగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ కొత్త జెర్సీని తీసుకువచ్చే ఆలోచనను విరమించుకోవాలని బీసీసీఐని కోరుతున్నారు అభిమానులు. జెర్సీ మారిస్తే మరోసారి భారత జట్టుకి పరాభవం తప్పదేమోనని భయపడుతున్నారు.
చదవండి: Asia Cup 2022: భారత్-పాక్ మ్యాచ్.. టికెట్స్ అమ్మకాలు ఎప్పటి నుంచి అంటే..?
Comments
Please login to add a commentAdd a comment