చదరంగంలో మిస్టర్‌ మేధావి.. తొలి గురువు ఎవరంటే? | Interesting Facts About-Indian Legendary Chess Player Viswanathan Anand | Sakshi
Sakshi News home page

Viswanathan Anand: చదరంగంలో మిస్టర్‌ మేధావి.. తొలి గురువు ఎవరంటే?

Published Mon, Feb 20 2023 7:40 AM | Last Updated on Mon, Feb 20 2023 7:48 AM

Interesting Facts About-Indian Legendary Chess Player Viswanathan Anand - Sakshi

ప్రతి ఆటకూ ఒకరు టార్చ్‌బేరర్‌ ఉంటారు... అతను నడిచిన బాట కొత్త తరానికి మార్గనిర్దేశనం చేస్తుంది.. అతను వేసిన దారి కొత్తవారి విజయాన్ని సులువు చేస్తుంది..ఆ ఆటగాడు ఇచ్చిన స్ఫూర్తి అందరికీ నమ్మకాన్ని కలిగిస్తుంది.. మేమూ సాధించగలమనే ధైర్యాన్ని ఇస్తుంది.. భారత్‌ చదరంగానికి సంబంధించి ఆ ఘనాపాటి విశ్వనాథన్‌ ఆనంద్‌.. మిగతా క్రీడల్లో మరో పేరు స్ఫురణకు రావచ్చేమో కానీ ఆనంద్‌ లేకుండా భారత చెస్‌ లేదు..ఇప్పుడు భారత్‌లో 79 మంది గ్రాండ్‌మాస్టర్లు.. మొదటివాడు మాత్రం మన ‘విషీ’..

‘ఆనంద్‌లాంటి వ్యక్తులు చాలా అరుదు. రోజుకు 14 గంటలు కష్టపడితే చెస్‌లో నైపుణ్యం సంపాదించవచ్చు. కొన్ని విజయాలూ అందుకోవచ్చు. కానీ అత్యుత్తమ ఆటగాడిగా ఎదగాలంటే అసాధారణ, సహజ ప్రజ్ఞ ఉండాలి. అది ఆనంద్‌లో ఉంది. అందుకే ఆయన ఆ స్థాయికి చేరారు. మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు’.. ఆనంద్‌ తర్వాత భారత రెండో గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు బారువా చేసిన వ్యాఖ్య ఇది.

దశాబ్దాలుగా చదరంగంలో సాగుతున్న రష్యా ఆధిపత్యాన్ని ఆనంద్‌ బద్దలు కొట్టగలిగాడు. గ్యారీ కాస్పరోవ్, అనతొలి కార్పొవ్, వ్లదిమిర్‌ క్రామ్నిక్‌.. మొదలైన వారికి సవాల్‌ విసురుతూ ఆనంద్‌ శిఖరానికి చేరగలిగాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. చెస్‌ ఆటకు మన దేశం నుంచి అసలైన రాయబారిగా నిలిచాడు. 

ఆమె అండగా..
అమ్మ సుశీల ఆనంద్‌కు చెస్‌లో ఆది గురువు. 80ల్లో తల్లిదండ్రులకు ఏదైనా క్రీడలో ఆసక్తి ఉండి వారు అందులో ప్రోత్సహిస్తే అదే ఆటను ఎంచుకోవడం తప్ప సొంతంగా తమ ఇష్టాయిష్టాలను ప్రదర్శించే అవకాశం తక్కువ. అందులోనూ చెస్‌ అంటే ‘ఏం భవిష్యత్‌ ఉంటుంది?’ అన్నట్లుగానే ఉండేది. ఆనంద్‌ తల్లికి చదరంగం అంటే ఇష్టం ఉన్నా.. కొడుకును బలవంతపెట్టలేదు.

కానీ ‘చైల్డ్‌ ప్రాడజీ’లాంటి తన కొడుకులో చురుకుదనాన్ని ఆమె గుర్తించింది. దానిని సరైన రీతిలో ఉపయోగించుకోవాలనే ఆనంద్‌ను చెస్‌లోకి తీసుకొచ్చింది. తానే గురువుగా మారి అన్నీ నేర్పించింది.  తండ్రి కృష్ణమూర్తి కూడా ఎంతో ప్రోత్సహించాడు. ఉద్యోగరీత్యా తాను ఫిలిప్పీన్స్‌లో ఉండాల్సి వస్తే అక్కడకు వెళ్లాక సరైన రీతిలో శిక్షణ ఇప్పించాడు.

ఆ కుర్రాడు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఊహించినదానికంటే వేగంగా ఎదుగుతూ దూసుకుపోయాడు. మద్రాసులో ఆరేళ్ల వయసులో చెస్‌లో ఓనమాలు దిద్దుకున్న ఆనంద్‌ ఐదు పదులు దాటినా విశ్వవ్యాప్తంగా ఇప్పటికీ తనదైన ముద్రను చూపించగలుగుతున్నాడంటే అతని ఘనత ఎలాంటిదో అర్థమవుతోంది. వర్ధమాన ఆటగాడిగా ఎదుగుతున్న సమయంలో ‘లైట్నింగ్‌ కిడ్‌’ అంటూ చెస్‌ ప్రముఖులతో పిలిపించుకున్న విషీ.. ఆ తర్వాత చదరంగంలో తన విజయాలతో వెలుగులు విరజిమ్మాడు. 

వరుస విజయాలతో..
14 ఏళ్ల వయసులో జాతీయ సబ్‌ జూనియర్‌ చాంపియ¯Œ  గెలవడం మొదలు ఆనంద్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆశ్చర్యకర రీతిలో అసలు అపజయాలు లేకుండా అతను పైపైకి దూసుకుపోయాడు. తర్వాతి ఏడాదే ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌, 15 ఏళ్లకే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ నార్మ్‌ సాధించిన ఆటగాడిగా గుర్తింపు, 16 ఏళ్లకే జాతీయ సీనియర్‌ చాంపియన్‌, 18 ఏళ్ల వయసులో వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌ .. ఈ జాబితా అలా సాగుతూ పోయింది.

ఆనంద్‌ ఉన్నాడంటే చాలు ప్రత్యర్థులు రెండో స్థానానికి పోటీ పడేందుకు సిద్ధమైనట్లే అన్నట్లుగా పరిస్థితి ఉండేది! తన విజయాలు గాలివాటం కాదని, ఈ అసాధారణ ప్రతిభతో మున్ముందు తానేంటో చూపించగలననే నమ్మకం ఎట్టకేలకు 19వ ఏట వచ్చింది. 1988లో సొంత రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో జరిగిన శక్తి ఇంటర్నేషనల్‌ టోర్నీని గెలవడంతో ఒక కొత్త చరిత్ర నమోదైంది. భారతదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్‌గా విశ్వనాథన్‌ ఆనంద్‌ అవతరించాడు. అక్కడ మొదలైన ఆ అగ్రస్థాయి ప్రస్థానం ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిపింది.  

అందరికీ ఇష్టుడు..
‘వై దిస్‌ నైస్‌ గై ఆల్వేస్‌ విన్‌ ’.. విశ్వనాథన్‌ ఆనంద్‌ గురించి చెస్‌ ప్రపంచంలో తరచుగా వినిపించే, అతనికి మాత్రమే వర్తించే వ్యాఖ్య! సాధారణంగానే చెస్‌ ఆటగాళ్లు బోర్డుపై మినహా బయట ఎక్కువగా దూకుడు ప్రదర్శించరు. కానీ ఆనంద్‌ వారందరికంటే మరో మెట్టు పైనుంటాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో హోరాహోరీ మ్యాచ్‌లలో ఆడినా ఏరోజూ అతను సంయమనం కోల్పోలేదు. విమర్శలు, ప్రతివిమర్శలు చేయలేదు. ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేయలేదు.

అతని ఆటలాగే మాట, వ్యవహారశైలి కూడా ప్రశాంతంగా ఉంటుంది. తాను జూనియర్‌గా ఉన్న సమయంలో ఏర్పాట్లు బాగా లేవంటూ ఆటగాళ్లంతా మూకుమ్మడిగా టోర్నీని బహిష్కరిస్తే తాను మాత్రం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమని ఆనంద్‌ స్పష్టంగా చెప్పేశాడు. అదే నాలుగుసార్లు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత కూడా విమానాలు అనూహ్యంగా రద్దయితే రెండు రోజుల పాటు 2 వేల కిలోమీటర్లు రోడ్డు ద్వారా ప్రయాణించి మరీ ఇచ్చిన మాటకు కట్టుబడి అక్కడికి చేరుకున్న వెంటనే మ్యాచ్‌ ఆడాడు.

నిర్వాహకులు కూడా అమితాశ్చర్యంతో ‘మ్యాచ్‌ను వాయిదా వేసేవాళ్లం కదా’ అన్నా వారికీ చిరునవ్వే సమాధానమైంది. రష్యా రాజకీయాల్లో కాలు పెట్టి తీవ్ర వివాదాస్పదుడిగా ముద్ర వేసుకున్న కాస్పరోవ్‌లా ఆనంద్‌ ఎప్పుడూ తన పరిధి దాటలేదు. ఇలాంటి వ్యక్తిత్వమే ఆనంద్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తెచ్చి పెట్టింది.

సాధించిన ఘనతలెన్నో..
2000, 2007, 2008, 2010, 2012లలో విశ్వనాథన్‌ ఆనంద్‌ వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచాడు. 2007లో తొలిసారి ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌గా మారిన అతను సుదీర్ఘకాలం ప్రపంచ చెస్‌ను శాసించాడు. తన సమకాలికులు ఎందరికో సాధ్యం కాని రీతిలో 48 ఏళ్ల వయసులో అత్యంత వేగంగా సాగే ‘ర్యాపిడ్‌’ ఈవెంట్‌లో సత్తా చాటాడు. తన తరంలో అత్యుత్తమ ర్యాపిడ్‌ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను 2003, 2017లలో ఈ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు.

ర్యాపిడ్‌ కంటే కూడా వేగంగా క్షణాల వ్యవధిలో సాగే బ్లిట్జ్‌లో తన ముద్ర వేయడం ఆనంద్‌కే చెల్లింది. 2000లో వరల్డ్‌ బ్లిట్జ్‌ కప్‌ విజేతగా నిలవడం అతని సామర్థ్యాన్ని చూపించింది. టోర్నమెంట్‌ ఫార్మాట్, మ్యాచ్‌ ఫార్మాట్, నాకౌట్‌ ఫార్మాట్, ర్యాపిడ్‌ ఫార్మాట్‌లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక ఆటగాడు కావడం.. ఆనంద్‌ గొప్పతనాన్ని చెబుతుంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లు మాత్రమే కాదు కోరస్‌ ఇంటర్నేషనల్, టాటా స్టీల్, తాల్‌ మెమోరియల్, లినారెస్‌ చెస్‌లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ విజయాలు అతని ఖాతాలో ఉన్నాయి.

భారత ప్రభుత్వం నుంచి తొలి ‘ఖేల్‌రత్న’ పురస్కారంతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు అతనికి కంఠాభరణంగా మారాయి. ‘మై బెస్ట్‌ గేమ్స్‌ ఆఫ్‌ చెస్‌’ అంటూ తన అనుభవాలతో భారత్‌ చెస్‌కు కొత్త పాఠాలు నేర్పించిన ఆనంద్‌ కెరీర్‌ ఆద్యంతం స్ఫూర్తిదాయకం.   
- మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement