ఎంఎస్ ధోని.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్. ఈతరం అభిమానులకు ధోని ఒక ప్రత్యేకం. ఎందుకంటే రెండుమార్లు ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలు అందించడమే కాదు.. టీమిండియా కెప్టెన్‌గా, ఫినిషర్‌గా అతని సేవలు మరిచిపోలేనివి. టికెట్ కలెక్టర్ జాబ్ నుంచి ఫ్రొఫెషనల్ ఆటగాడిగా.. గోల్ కీపర్ నుంచి వికెట్ కీపర్‌గా టర్న్ తీసుకోవడం ఒక్క ధోనికే చెల్లింది. తన ఆటతీరు, కెప్టెన్సీతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ధోని రిటైర్ అయి రెండేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.
తాజాగా ధోని మంగళవారం తమిళనాడులోని హోసూరులో క్రికెట్ మైదానాన్ని ప్రారంభించాడు. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీతో విద్యార్థులకు క్రికెట్ శిక్షణ అందించేందుకు ఒప్పందం కుదిరింది. ఇక కార్యక్రమం అనంతరం ధోనీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో తన స్కూల్ డేస్‌ని గుర్తు చేసుకున్నాడు. ''నేను ఏడో తరగతిలో క్రికెట్ ఆడటాన్ని ప్రారంభించాను. అప్పటికి నేను ఓ యావరేజ్ స్టూడెంట్‌ని. అయితే క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసిన తర్వాత క్లాస్‌లో నా అటెండెన్స్ నెమ్మదిగా తగ్గుతూ వెళ్లింది. ఒక అటెండెన్స్ విషయం వదిలేస్తే నేను చాలా గుడ్ స్టూడెంట్. టెన్త్ క్లాస్‌కి వచ్చేసరికి ఎక్కువగా గ్రౌండ్‌లోనే ఉండేవాడ్ని. దాంతో టెన్త్ క్లాస్‌లో చాలా ఛాప్టర్స్‌పై నాకు కనీసం అవగాహన కూడా లేకపోయింది.
కానీ ఎగ్జామ్స్‌లో ఆ ఛాప్టర్స్‌కి సంబంధించిన ప్రశ్నలే వస్తే ఎంత బాధగా ఉంటుంది. ఇక మా నాన్న నేను కనీసం టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ కూడా పాసవనని అనుకున్నాడు. మళ్లీ సంప్లిమెంటరీలు రాసుకోవాల్సిందేనని కంగారుపడ్డారు. ఆయన అంచనాలకు భిన్నంగా 66శాతం మార్కులతో పదో తరగతి పాసయ్యాను. ఇది తెలుసుకున్న తర్వాత నాన్నతో పాటు నేను చాలా సంతోషపడ్డాను'' అని ధోనీ గుర్తు చేసుకున్నాడు.
ఇక ధోని కెప్టెన్‌గా భారత జట్టుకి 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్‌లు అందించాడు. ఆ తర్వాత 2013లో టీమిండియాను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలిపాడు. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనీనే. అలాగే ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment