IPL 2023 Qualifier 2,GT Vs MI: Sai Sudharsan Becomes Third Batsman To Be Retired Out In IPL - Sakshi
Sakshi News home page

#SaiSudharsan: రిటైర్డ్‌ ఔట్‌.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా

Published Sat, May 27 2023 12:17 AM

Sai Sudharsan-1st Player-Play-Offs-Over-All-3rd-Retired-Out IPL History - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరగడం ఆసక్తి కలిగించింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 31 బంతుల్లో 43 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌ స్కోరును పెంచేందుకు వేరే బ్యాటర్‌కు అవకాశం ఇ‍వ్వాలని తనంతట తానే రిటౌర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్‌ చరిత్రలో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగిన మూడో ఆటగాడిగా.. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌ చరిత్రకెక్కాడు.


Photo: IPL Twitter

రిటైర్డ్‌ ఔట్‌ అంటే ఏంటి? 
రిటైర్డ్‌ ఔట్‌ అంటే అంపైర్‌ అనుమతి లేకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోవచ్చు.. అయితే తిరిగి బ్యాటింగ్‌ చేసే అవకాశం మాత్రం ఉండదు. అదే రిటైర్డ్‌ హర్ట్‌(గాయపడిన సమయంలో) అయితే సదరు బ్యాట్స్‌మన్‌ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చివరి బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. రిటైర్డ్‌ ఔట్‌ అయితే మాత్రం మళ్లీ బ్యాటింగ్‌ చేసే అవకాశం రాదు. ఈ రెండింటి మధ్య ఇదే ప్రధాన వ్యత్యాసం.


Photo: IPL Twitter

ఇంతకముందు ఇదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ అథర్వ టైడే 42 బంతుల్లో 55 పరుగులు చేసి రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. జితేశ్‌ శర్మ, షారుక్‌ ఖాన్‌, సామ్‌ కరన్‌ లాంటి హిట్టర్లకు బ్యాటింగ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో అథర్వ తనంతట తాను రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడు. కాగా ఐపీఎల్‌ చరిత్రలో రిటైర్డ్‌ ఔట్‌ అయిన తొలి ఆటగాడు రాజస్తాన్‌రాయల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. 

ఐపీఎల్‌ 2022లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్‌ రిటైర్డ్‌ఔట్‌గా వెనుదిరిగాడు. 23 బంతుల్లో 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్‌ అనూహ్యంగా రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడు. రియాన్‌ పరాగ్‌కు అవకాశం ఇవ్వడం కోసం అశ్విన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.


Photo: IPL Twitter

కాగా టి20 క్రికెట్‌లో రిటైర్డ్‌ ఔట్‌ అయిన ఆరో బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌ నిలిచాడు. ఇంతకముందు ఐపీఎల్‌లో అశ్విన్‌, అథఱ్వ టైడేలతో పాటు పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది, బుటాన్‌కు చెందిన ఎస్‌ తోగ్బే, కుమిల్లా వారియర్స్‌కు చెందిన సంజాముల్‌ ఇస్లామ్‌లు రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగారు.

Advertisement
Advertisement