Shane Warne: షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..!

Shane Warne Had Been On Extreme Liquid Diet Before Death - Sakshi

Shane Warne Had Been On Extreme Liquid Diet Before Death: స్పిన్‌ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణంపై థాయ్‌ పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనలో వార్న్‌ 14 రోజుల కఠినమైన లిక్విడ్‌ డైట్‌ (ద్రవ రూపంలో ఉన్న ఆహారం) ఫాలో అయ్యాడని, ఇదే అతని మరణానికి పరోక్షంగా కారణమైందని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. 


మృతి చెందడానికి ఒక్క రోజు ముందే వార్న్‌ తన డైట్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశాడని, గతంలో కూడా అతను ఇలాంటి అర్థం పర్థం లేని డైట్‌లు ఫాలో అయ్యేవాడని వార్న్‌ మేనేజర్ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ తెలిపాడు. థాయ్‌లాండ్‌ వెకేషన్‌కు బయల్దేరే ముందు ఛాతీలో నొప్పి వస్తుందని, విపరీతంగా చమటలు పడుతున్నాయని వార్న్‌ తనతో చెప్పాడని ఎర్స్‌కిన్‌ వెల్లడించాడు. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం డాక్టర్‌ను కూడా కలిశాడని ఆయన పేర్కొన్నాడు. 


ఇదిలా ఉంటే, వార్న్‌ గుండెపోటుతోనే మరణించాడని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు థాయ్‌ పోలీసులు సోమవారం వెల్లడించారు. వార్న్‌ విల్లా గదిలో ఫ్లోర్‌తో పాటు టవల్స్‌పై రక్తపు మరకల్ని గుర్తించిన మాట వాస్తవమేనని, సీపీఆర్‌ చేసే క్రమంలో వార్న్‌ రక్తపు వాంతులు చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. వార్న్‌ మరణానికి ముందు మద్యం తీసుకోలేదని, గత కొంతకాలంగా అతను మద్యం తీసుకున్నట్లు రుజువులు లేవని స్పష్టం చేశారు. 

వార్న్‌కు గుండెపోటు రావడానికి కఠినమైన డైట్‌తో పాటు తీవ్రమైన వర్కౌట్స్‌ కారణమయ్యాయని,  ఫిబ్రవరి 28 వార్న్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తుందని వెల్లడించారు. వార్న్‌ చేసిన ట్వీట్‌లో తన ఫోటోను షేర్‌ చేసి మరికొద్ది రోజుల్లో ఇలా తయారవుతానని, ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతుందని, జూలై కంతా ఫిట్‌గా తయారవ్వడమే లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా, వెకేషన్‌ ఎంజాయ్‌ చేయడానికి థాయ్‌లాండ్‌కు వెళ్లిన వార్న్‌ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్‌ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది.

చదవండి: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top