New Zealand vs Pakistan, 1st Semi-Final- Pak Enters Final: గతేడాది రన్నరప్ న్యూజిలాండ్‌కు టీ20 ప్రపంచకప్-2022లో నిరాశే ఎదురైంది. ఈసారి కనీసం ఫైనల్ కూడా చేరుకుండానే కేన్ విలియమ్సన్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక కివీస్‌పై విజయంతో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో మెగా టోర్నీ తుది పోరుకు అర్హత సాధించింది.
మిచెల్, విలియమ్సన్ మాత్రమే
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆరంభంలోనే ఓపెనర్ ఫిన్ అలెన్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో డెవాన్ కాన్వే, కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు.
అయితే, దురదృష్టవశాత్తూ కాన్వేను షాదాబ్ ఖాన్ రనౌట్ చేయడంతో రెండో వికెట్ పడింది. విలియమ్సన్ 46 పరుగులు చేసిన షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ 6 పరుగులు మాత్రమే చేయగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 152 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం అదిరిపోయే ఆరంభం అందించారు. బాబర్ ఆజం 42 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఇక రిజ్వాన్ 57 పరుగులతో అదరగొట్టాడు. మహ్మద్ హారీస్ 30 పరుగులతో రాణించాడు. అయితే మ్యాచ్‌ను ఆఖరి ఓవర్ వరకు లాక్కొచ్చిన కివీస్ బౌలర్లు ఒత్తిడిలో చిత్తయ్యారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. మహ్మద్ రిజ్వాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మ్యాచ్ స్కోర్లు:
న్యూజిలాండ్: 152/4 (20)
పాకిస్తాన్: 153/3 (19.1)
చదవండి: ఫామ్ కోల్పోయిన బాబర్‌తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్ ప్రత్యేకత
Comments
Please login to add a commentAdd a comment